Menu

Emotional Intelligence: ప్రపంచాన్ని నడిపించే ఒక్కే ఒక్క శక్తి ఎంపతి.. బండరాళ్ల లాంటి మనసులను కూడా కరిగించగలదు!

Lakshmi Aruna 2 months ago
what is emotional intelligence and difference between empathy and sympathy

ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్(Emotional Intelligence) అంటే మనలో ఏ భావం వస్తోంది? మన ఎదుటి వ్యక్తి మనసులో ఏ భావం నడుస్తోంది? ఇవన్నీ గుర్తించి, అర్థం చేసుకుని, వాటికి సరైన రీతిలో స్పందించే సామర్థ్యం. ఈ రోజుల్లో ఇది ఒక ప్రతిభ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికీ అవసరమైన జీవన నైపుణ్యం. మనకు కోపం వచ్చినప్పుడు దాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారితో ఎలా మాట్లాడాలి, ఒక సమూహంలో ఎలా కలిసి పనిచేయాలి..? ఇలాంటి ప్రతిదీ ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌లో భాగమే. మన భావాలను మనమే తెలుసుకోవడం నుంచి మొదలై, ఎదుటివారి హృదయంలో ఏం జరుగుతోందన్నది గ్రహించేవరకు ఈ గుణం విస్తరించి ఉంటుంది.

ఎంపతి-సింపతి తేడా ఏంటి?

ఇదే సమయంలో ఎంపతి(Empathy), సింపతి(Sympathy) మధ్య ఉన్న తేడా చాలా ముఖ్యం. సింపతి అంటే సానుభూతి..! ఎవరి బాధనైనా దూరం నుంచే గమనిస్తూ ‘చాలా దురదృష్టం’ అని అనడం. మనం వారిని చూస్తాం.. మనసు తడుతుంది… కానీ స్పందన అక్కడే ఆగిపోతుంది. ఆ బాధ మన కళ్లకు కనిపిస్తుంది గానీ, మన హృదయానికి చేరదు. కానీ ఎంపతి పూర్తిగా భిన్నం. అది మనల్ని వారి స్థానంలో నిలబెడుతుంది. వారు అనుభవిస్తున్న భావాన్ని మనం మన హృదయంలోకి తీసుకుంటాం. ఒకసారి అయినా ‘ఈ పరిస్థితి నాకే వస్తే ఎలా ఉండేది?’ అని నిజాయితీగా ఆలోచిస్తాం. ఆ ఆలోచన వల్ల మన నుంచి వచ్చే మాటలు కేవలం ఓదార్పు కోసం కాదు.. నిజమైన అర్థం కోసం ఉంటాయి. మన ఉనికి వాళ్లకు ఆధారంలా అనిపిస్తుంది.

empathy sympathy

ప్రతీకాత్మక చిత్రం

సింపతిలో మనం ఒక వైపు.. వాళ్లు మరో వైపు. చిన్న దూరం ఎప్పటికీ ఉంటుంది. ఎంపతిలో ఆ దూరం పూర్తిగా కరుగుతుంది. ఇద్దరి మధ్య కనిపించని ఓ బంధం ఏర్పడుతుంది. అదే మనసుల కలయిక. ఇదే కారణంగా ఎంపతితో చెప్పిన మాటలు నేరుగా హృదయానికి తాకుతాయి. ఇటు సింపతి అనేది తాత్కాలిక స్పందన మాత్రమే.

ALSO READ: బాధలో కలిసి కన్నీరు కార్చేదే నిజమైన ప్రేమ.. నీ మౌనాన్ని వినగలిగే ఆ ఒక్క మనసు ఎక్కడ దొరుకుతుంది?

ఎంపతికి మనిషిని మార్చగలిగే శక్తి ఉంటుంది. అది మన నిర్ణయాలు, మన సంబంధాలు, మన ఆలోచనా విధానాన్ని కూడా మార్చగలదు. ఒక నాయకుడికి ఎంపతి ఉంటే, అతని కింద పనిచేసేవారికి తమ విలువ తెలుస్తుంది. ఒక తల్లిదండ్రికి ఎంపతి ఉంటే, పిల్లలు నిజంగా అర్థం చేసుకున్నారనే భరోసా పొందుతారు. ఒక మిత్రుడికి ఎంపతి ఉంటే, ఆ స్నేహ బంధం మరింత బలపడుతుంది. సింపతి చెవులకు వినిపిస్తుంది.. ఎంపతి హృదయానికి అనిపిస్తుంది.

empathy sympathy difference

ప్రతీకాత్మక చిత్రం

అందుకే ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌లో ఎంపతికి ఉన్న స్థానం చాలా విలువైనది. ఇది మనిషిని మనిషితో కలిపే నిజమైన శక్తి. ఇది ‘నిన్ను చూస్తే బాధేస్తోంది’ అని కాదు… ‘నీ మనసు నాకు అర్ధమైంది’ అని చెబుతుంది. అంతే.. ఆ ఒక్క వాక్యమే ఒకరి జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. అందుకే చివరికి మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఒకటే… మనిషి మాటలను కాదు, మనసును అర్థం చేసుకోవాలని. సింపతి ఏ క్షణానికో ఓదార్పు ఇస్తుంది కానీ ఎంపతి మాత్రం మన జీవితాంతం నిలిచే బంధాన్ని ఇస్తుంది.

ఎవరితో అయినా మాట్లాడడానికి మాటలు లేకపోయినా, వారిని అర్థం చేసుకోవడానికి మనసు ఉంటే చాలు.కొన్ని సందర్భాల్లో మనం ఇచ్చే పెద్ద సాయం..సలహా కాదు.. డబ్బు కాదు… మాటలూ కాదు.. ఒక్క మౌనం. అది వాళ్లకు నేరుగా చెప్పకుండానే అర్థమవుతుంది. ‘నీ బాధలో నువ్వు ఒంటరివి కాదు… నేను నీతో ఉన్నాను’ అని. మన చుట్టూ ఉన్న వాళ్లంతా ఇదే అనుభూతి పొందితే.. ప్రపంచం పెద్దగా మారకపోయినా, మన చుట్టూ ఉన్న చిన్న ప్రపంచం మాత్రం తప్పక అందంగా మారుతుంది. ఎందుకంటే చివరికి మనిషిని మార్చేది సింపతి కాదు… మనసులను కలిపే ఎంపతినే.

ALSO READ: వాతావరణ మార్పులతో ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలం..ఈ రాష్ట్రానికి ఏమైంది?


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *