Menu

Relationships: బాధలో కలిసి కన్నీరు కార్చేదే నిజమైన ప్రేమ.. నీ మౌనాన్ని వినగలిగే ఆ ఒక్క మనసు ఎక్కడ దొరుకుతుంది?

Lakshmi Aruna 2 months ago
marriage tips relationship

ప్రేమ అంటే ఏంటో మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం.. సినిమాలలో చూస్తాం.. పూలు, బహుమతులు, బర్త్‌డే సర్ప్‌రైజులు.. అదే ప్రేమ అని నమ్ముతుంటాం. ఆప్యాయంగా మాట్లాడే వాడే ప్రేమికుడు… మనకోసం ఏదైనా కొని ఇచ్చే వాడే లవర్‌… ఆ వయసులో అలానే అనిపిస్తుంది.
కానీ పెద్దవాళ్ల మాటలు అప్పట్లో అర్థం కావు. వాళ్ళు చెబుతుంటారు.. ‘నీతో కష్టసుఖాలను పంచుకునే మనిషిని పెళ్లి చేసుకో’ అని. ఆ మాట అప్పుడు చాలా దుఃఖంగా, చాలా నిస్సారంగా అనిపిస్తుంది. బాధను ఎందుకు పంచుకోవాలి? ఎందుకు బాధే ప్రేమకు ప్రమాణం కావాలి?అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం.

ఆ భారాన్ని మోయగలగాలి:

కానీ మన జీవితం ముందుకు సాగుతున్న కొద్దీ… సమస్యలు కొట్టుకొచ్చిన కొద్దీ.. మన చుట్టూ ఉన్నవాళ్లను కోల్పోతున్న కొద్దీ.. మన హృదయానికి కొన్నిపాట్లు పడిన కొద్దీ.. ఆ మాట ఒక్కసారిగా అర్థం అవుతుంది. ప్రేమ అంటే ఆనందాల్లో మనతో నవ్వే వ్యక్తి కాదు..కష్టాల్లో మనతో కలిసి ఏడ్చేందుకు కూడా వెనకడుగు వేయని వ్యక్తి. మనల్ని మించిన సంతోషం ఇవ్వటమే ప్రేమ కాదు.. మనకు మించిన భారం మోయగలిగే మనిషే ప్రేమ.

ఎంపతి-సింపతి:

ఆలోచించటానికి కష్టంగా ఉన్నా…ఒక దెబ్బ పడితేనే అర్థమవుతుంది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ‘నువ్వు మునుగుతున్నప్పుడు నీ చెయ్యిని పట్టుకుని కాపాడేదే నిజమైన ప్రేమ, అంతకంటే గొప్ప ప్రేమ..నీ కోసం ఒక పడవను కూడా నిర్మిస్తుంది..’ అంటే,మన జీవితంలో ఎక్కడో ఒక సమయంలో మనం నిజంగానే మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. పని ఒత్తిడి, కుటుంబసమస్యలు, మనసులోని నిశ్శబ్ద పోరాటాలు.. ఎవరితోనూ చెప్పలేని బాధలు.. ఇవి మనల్ని పీకల్లోతు నీళ్లలోకి లాగుతాయి. అప్పుడు మన పక్కన ఉన్న మనిషి రెండు రకాలుగా ఉండవచ్చు. ఒకరు..మన పరిస్థితిని చూస్తారు.. బాధపడతారు.. ‘చాలా దురదృష్టం’ అంటారు…అదే సింపతి..!

మరొకరు…మాటలు లేకుండా మన చేతిని పట్టుకుంటారు.. మనతో పాటు ఆ ఆందోళనలోకి దిగిపోతారు.. ‘నువ్వు పడిపోతున్నావా? సరే… నేను నీతోనే ఉంటా’ అంటారు.అదే ఎంపతి(Empathy). ఇంకా ఒక అరుదైన వాడు ఉంటాడు…నిన్ను బయటికి తీసుకురావడానికి మార్గం కడతాడు. నీ కోసం ఒక పడవ కడతాడు. అంటే నిన్ను కేవలం ఆదుకోవడం మాత్రమే కాదు.. నీ బలహీనతను బలం చేసే ప్రయత్నం చేస్తాడు. నువ్వు మునగకుండా, భవిష్యత్తు ప్రయాణం కూడా భద్రంగా ఉండేలా చూస్తాడు.అదే నిజమైన ప్రేమ.

ALSO READ: వాతావరణ మార్పులతో ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలం..ఈ రాష్ట్రానికి ఏమైంది?

దీని అందం ఏంటంటే.. ప్రేమను అర్థం చేసుకునే మన దృష్టి మారుతుంది.చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న కోపాలు, చిన్న చిన్న అప్రతిష్టలు..క్రమంగా వాటి విలువ తగ్గిపోతుంది. ఎందుకంటే మన హృదయం ఒక పెద్ద నిజాన్ని గ్రహిస్తుంది. మన కోసం ఎవరో ఓ పడవ కడతారని నమ్మకం..అది జీవితంలో దొరికే అతిపెద్ద బహుమతి. మనిషి వృద్ధి చేసేది మాటలు కాదు.. మనసును మళ్లీ నమ్మేలా చేసేది పెద్ద పెద్ద పనులు కాదు.. కష్ట సమయాల్లో ఇచ్చే చిన్న చిన్న చర్యలు. ఒక గ్లాస్ నీళ్లు పట్టివ్వడం..నీ నిశ్శబ్దాన్ని గౌరవించడం.. నువ్వు ఏడ్చే వరకు కూర్చోవడం.. లేదా ‘ఏమైనా సమస్య ఉందా?’ అని అడిగే నెమ్మది స్వరం. ఈ చిన్న చిన్న చర్యలే..ఒక పడవ..అదీ నీ కోసం కట్టిన పడవ.

మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక గొప్ప మనిషి అవసరం కాదు… మనల్ని అర్థం చేసుకునే ఒక్క మనసే చాలు. పూలు, విందులు, సర్ప్‌రైజులు…ఇవి ఉంటే బాగానే ఉంటాయి.. కానీ ఇవి ప్రేమను నిలబెట్టవు. ప్రేమను నిలబెట్టేది మనతో కలిసి బాధను పంచుకునే హృదయం. అందుకే చివరికి ప్రేమను నిర్వచించాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ప్రేమ అనుభవమే నిర్వచనమవుతుంది. నువ్వు పడిపోతున్నప్పుడు ఎవరు నీ చెయ్యిని పట్టుకున్నారు?నీ మౌనాన్ని ఎవరు విన్నారు? నీ లోపాలను చూసి కూడా నిన్ను విలువైనవాడిగా చూసింది ఎవరు?అదే నీ మనిషి.. అదే నీ ప్రేమ…అదే నీ పడవ. కొన్ని సార్లు ప్రేమ నీకు చెబుతుంది..’పడిపో… నేను ఉన్నాను.’అని..అదే ప్రేమలో ఉన్న అత్యంత అందమైన మాట. ప్రేమను అనుభవించటం కన్నా మనం ప్రేమించేవాళ్లకు ఆ ప్రేమ అర్థమయ్యేలా చేయటం గొప్ప..!

ALSO READ: వన్డే క్రికెట్ కే ఈ తరం టార్చ్ బేరర్స్! ఈ ఫార్మాట్ లో రారాజులు కోహ్లీ, రోహిత్!!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *