Menu

Indian Coach Gautam Gambhir: ఇల్లు అలకగానే పండగ కాదు.. కోచ్ అవ్వగానే విజయాలు రావు! సొంతగడ్డపైనే చెత్త పర్ఫామెన్స్!!

Sumanth Thummala 2 months ago
gautam gambhir worst performance as coach

ఐపీఎల్ 2024 లో కేకేఆర్ గెలవగానే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ క్రెడిట్ లు గంభీర్ కు ఇచ్చేసింది మీడియా. తన కోసం కోచ్ స్థానానికి లాబియింగ్ ముందే జరిగిపోయింది. తను కోచ్ అయ్యాక, న్యూ ఎరా న్యూ కోచ్ (New Era New Coach) అంటూ ఆకాశానికి ఎత్తేశారు. తన హయాంలో టీమిండియా కొత్త చరిత్ర సృష్టిస్తుందని ఊదరగొట్టారు. కోచ్ గా భారతీయులు గర్వపడేలా చేస్తా అన్న తను, ఇవాళ సిగ్గుపడేలా చేస్తున్నాడు. 

Gambir as Indian coach

అన్నవన్ని జరగకపోగా, చెత్త రికార్డుల నమోదులో మాత్రం భారత జట్టు చరిత్ర సృష్టిస్తుంది. 93 ఏళ్ల భారత జట్టు చరిత్రలో సొంత గడ్డపై ఇంతవరకు 3 టెస్ట్ సిరీస్ లు క్లీన్ స్వీప్ తో ఓడిపోయారు. మొదటిది 1999-2000 సౌత్ ఆఫ్రికా సిరీస్ 2-0 తో క్లీన్ స్వీప్ అవ్వగా, కోచ్ గంభీర్ ఆధ్వర్యంలో 2024 లో న్యూజిలాండ్ చేతిలో 3-0 ఘోర అవమానం చూశాక ఇప్పుడు మళ్లీ సంవత్సరం తిరిగేసరికి భారత సొంత గడ్డపై మూడో క్లీన్ స్లీప్ సౌత్ ఆఫ్రికా తో సిరీస్ ను 2-0 కోల్పోయింది. దీనిపై అభిమానులు గంభీర్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసలు గంభీర్ కోచయ్యకనే టీం కు దరిద్రాలు పట్టుకున్నాయని, కొందరు గో బ్యాక్ గంభీర్ అని ట్రోల్స్ పెద్ద ఎత్తున చేస్తున్నారు. 

    ‌ఓటముల్లో రికార్డు:
2000- 2025 వరకు ఈ 25 ఏళ్ళలో సొంత గడ్డపై రికార్డు చూస్తే, గౌతమ్ గంభీర్ అందరికంటే ఎక్కువ ఓటములను చూశాడు.

India's men's team coach record from 2000-01 to 2025 in Tests at home. Gambhir has the worst record.

2000-01 2025 వరకు స్వదేశీ టెస్ట్ లో కోచ్ ల రికార్డు

టీంలో చివరి ముగ్గురు కోచ్ ల ఓటముల కంటే కూడా గంభీర్ హయాంలో ఎక్కువ మ్యాచులు ఓడిపోయారు. 

 

అసలు కోచ్ గా గంభీర్ బాధ్యతలు చేపట్టాక ఇండియన్ టీం ఎన్నో చెప్పుకోలేని రికార్డులు నెలకొల్పింది. అవి ఏంటంటే…

 

27 ఏళ్ల తర్వాత, శ్రీలంకతో ద్వైపాక్షిక ODI సిరీస్‌ను భారత్ కోల్పోయింది.

మొదటిసారి, 3 మ్యాచ్‌ల ODI సిరీస్‌లో భారత్ మొత్తం 30 వికెట్లు కోల్పోయింది.

45 ఏళ్ల తర్వాత, భారత్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో ODIల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా నిలిచింది.

36 ఏళ్ల తర్వాత, భారత్ హోంలో న్యూజిలాండ్‌కు టెస్ట్ మ్యాచ్‌లో ఓడింది.

19 ఏళ్ల తర్వాత, భారత జట్టు చిన్న స్వామి స్టేడియంలో టెస్ట్‌ను కోల్పోయింది.

మొదటిసారి, భారత్ హోంలో 50 పరుగుల లోపే ఆలౌట్ అయింది.

మొదటిసారి, హోంలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ లో భారత్ ఓడింది.

12 ఏళ్ల తర్వాత, భారత్ హోమ్ టెస్ట్ సిరీస్‌లో ఓడిపోయారు.

12 ఏళ్ల తర్వాత, వరుసగా రెండు హోమ్ టెస్ట్‌లు భారత్ ఓడిపోయింది.

12 ఏళ్ల తర్వాత, వాంఖడేలో భారత్ టెస్ట్ మ్యాచ్‌ను ఓడిపోయింది.

47 ఏళ్ల తర్వాత, మూడు వరుస హోమ్ టెస్ట్‌లలో భారత్ ఓడిపోయింది.

మొదటిసారి, భారత్ హోంలో 200 కన్నా తక్కువ లక్ష్యాన్ని చేదించడంలో విఫలమైంది (లక్ష్యం 147, వాంఖడే).

మొదటిసారి, భారత్ హోమ్ టెస్ట్ సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్ అయింది(1999-00 లో 2-0 అయ్యింది).

13 ఏళ్ల తర్వాత, మెల్‌బోర్న్‌లో భారత్ టెస్ట్ మ్యాచ్‌ను కోల్పోయింది.

10 ఏళ్ల తర్వాత, భారత్ వరుసగా రెండు టెస్ట్ సిరీస్‌లను కోల్పోయింది.

10 ఏళ్ల తర్వాత, బోర్డర్-గావస్కర్ ట్రోఫీని భారత్ కోల్పోయింది.

12 ఏళ్ల తర్వాత, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో భారత్ 3 మ్యాచ్‌లను కోల్పోయింది.

మొదటిసారి, భారత్ WTC ఫైనల్‌కు అర్హత సాధించలేదు.

భారత్ ఒక మ్యాచ్ లో ఐదు సెంచరీలు చేసినప్పటికీ ఓడిన తొలి జట్టు అయింది (లీడ్స్).

92 ఏళ్లలో కేవలం రెండోసారి, భారత్ 350+ స్కోరును డిఫెండ్ చేయడంలో విఫలమైంది (లీడ్స్).

టీం చరిత్రలో రెండోసారి, భారత్ ఇంగ్లాండ్‌పై 200 కంటే తక్కువ లక్ష్యాన్ని చేదించడంలో విఫలమైంది (లక్ష్యం 190, లార్డ్స్).

11 ఏళ్ల తర్వాత, టెస్ట్ లో భారత్ 600+ పరుగులు ఇచ్చింది (మాంచెస్టర్).

17 ఏళ్ల తర్వాత, అడిలైడ్‌లో భారత్ ODI ఓడింది.

15 ఏళ్ల తర్వాత, భారత్ దక్షిణాఫ్రికాతో హోంలో టెస్ట్ మ్యాచ్‌లో ఓడింది.

8 ఏళ్ల తర్వాత, భారత్ ఈడెన్ గార్డెన్స్‌లో అంతర్జాతీయ మ్యాచ్ కోల్పోయింది (9 వరుస విజయాల తర్వాత).

భారత్ 124 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో విఫలమైంది

(సొంతగడ్డపై ఓటముల్లో చేసింగ్ లో లోయెస్ట్ టార్గెట్).

టెస్టుల్లో పరుగుల పరంగా (408 రన్స్) అతి పెద్ద ఓటమి. 

ఇది కోచ్ గా గంభీర్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా మూట కట్టుకున్న గుర్తుండిపోయే చెత్త రికార్డులు. 

ప్రయోగాల పేరుతో గందరగోళాలు

కోచ్ అవడానికి ముందు ఎన్నో ప్రగల్బాలు పలికి టీం అలా ఉండాలి, ఇలా ఉండాలి.. అని అన్నాడు. తీరా కోచ్ అయ్యాక చూస్తే, ప్రయోగాల పేరుతో గందరగోళాలు జరుగుతున్నాయి.‌ పర్ఫామెన్స్ ఇచ్చిన కూడా టీంలో స్థానం ఉంటుందో లేదో తెలియదు. మరికొందరు గొప్ప స్థాయిలో ఆడకపోయినా ఆడే అవకాశాలు వస్తూనే ఉన్నాయి. టీంలో ఉన్న ప్లేయర్లను కూడా వాళ్ల బ్యాటింగ్ ఆర్డర్ ను ఎక్కడికి బడితే అక్కడికి మారుస్తూ వస్తున్నాడు. దాంతో ప్లేయర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. 

ఉదాహరణకు వాషింగ్టన్ సుందర్ ని తీసుకుంటే; మూడో స్థానం నుంచి ఎనిమిదవ స్థానం వరకు బ్యాటింగ్ చేశాడు. మరి ఇది ఎలాంటి స్థిరమైన నిర్ణయమో, ప్రయోగమో కోచ్ ఏ చెప్పాలి. 

 

7-8 ఏళ్ల క్రితం అప్పటి కోచ్ రవి శాస్త్రి ఇది పెద్ద 15 20 ఏళ్లలో ద బెస్ట్ ఇండియన్ టెస్ట్ టీం అని అంటే, గంభీర్ కోచ్ శాస్త్రి పై తీవ్ర విమర్శలు చేశాడు.

“ఏమీ గెలవని వారు ఇలాంటి స్టేట్‌మెంట్‌లు ఇస్తారని నాకు నమ్మకం ఉంది. శాస్త్రి తన కెరీర్‌లో ఏమి సాధించాడు నాకు తెలియదు.” అని అన్నాడు. తీరా తన కోచింగ్ లో సొంత గడ్డపైనే 2 సిరీస్ లు ఓడి అది కూడా క్లీన్ స్వీప్ లు జరిగాయి.

Coach Gautam Gambhir and cheif selector Ajit Agarkar

ప్లేయర్ల సెలక్షన్ లో విమర్శలు:

టీం సెలెక్షన్ లో కమిటీ పాత్ర చాలా ఉన్నా, కెప్టెన్ – కోచ్ నిర్ణయం కూడా చాలా ప్రధానం. చీఫ్ సెలెక్టర్ గా అజిత్ అగర్కర్ సెలక్షన్ పైన కూడా చాలా ప్రశ్నలు,విమర్శలు ఉన్నాయి. కానీ కోచ్ గా గంభీర్ ఎవరి ప్రదర్శనలు ఎంటో తెలీనంత స్థితి లో లేకపోవచ్చు. 

లిమిటెడ్ ఓవర్స్ తరహాలో టెస్ట్ టీంలో ఆల్ రౌండర్స్ తో నింపేశాడు. కానీ వాళ్ళు ఆ ఆల్రౌండర్ పాత్రను నిర్వర్తించరు.‌ ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ కేవలం ఒకే ఓవర్ వేశాడు. దీనిపై మాజీ ప్లేయర్స్ రహానే, అశ్విన్ కూడా విస్మయం వ్యక్తం చేశారు.

 ఇక చివరి మ్యాచ్ లో నితీష్ కుమార్ 10 ఓవర్లే వేశాడు. నితీష్ కుడా మెల్బోర్న్ టెస్ట్ తర్వాత ఎటువంటి ప్రదర్శన చెయ్యలేదు. ఓవైపు వెటరన్ పేసర్ షమీ రంజీల్లో వికెట్లు తీస్తుంటే తన ఫిట్ నెస్ మీద అనుమానాలు ఉన్నాయి అంటారు. 

ఇదే గంభీర్ టీం లో రావాలి అంటే దేశవాళీ టోర్నీల్లో పెర్ఫార్మ్ చెయ్యాలి అని, చేసిన వాళ్ళకి మాత్రం మొండి చెయ్యి చూపిస్తున్నారు.‌ న్యుజిలాండ్ పైన 150 కొట్టి నిరూపించిన సర్ఫరాజ్ ఖాన్ ను తర్వాత సిరీస్ లోనే పక్కన పెట్టారు.

 యష్ రాథోడ్, బాబా ఇంద్రజిత్, ధ్రువ్ షోరే, అభిమన్యు ఈశ్వరన్, జగదీషన్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి ప్లేయర్స్ టీం లో స్ధానం కోసం ఎదురుచూస్తున్నారు.‌ వీళ్ళలో అతి తక్కువ ఆవరేజ్ 45.5(రుతురాజ్). మరోవైపు సాయి సుదర్శన్ 39 ఫస్ట్ క్లాస్ ఆవరేజ్; 27.4 టెస్ట్ ఆవరేజ్ తో 11 ఇన్నింగ్స్ ఆడాడు. 

టీం లో గజిబిజి 

ఆస్ట్రేలియా తో సిరీస్ లో కూడా T20I చరిత్రలోనే ఇండియా తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అర్శదీప్ ను పక్కన పెట్టి, హర్షిత్ రానా ఆడాడు. హిట్టర్ అయిన దూబే ని కాదని రానా ను ముందు పంపాడు. అసలు టీ20 టీం లో అంతవరకు చోటే‌ లేని గిల్ ను ఓపెనర్ గా తీసుకొచ్చి వైస్ కెప్టెన్ ని చేశారు.‌ అదే స్థానంలో ఉన్న సంజూ ని మిడిల్ ఆర్డర్ కు పంపి మొత్తానికి తన ఫామ్ ను కోల్పోయేలా చేస్తున్నారు. గిల్ కంటే కూడా గొప్ప స్ట్రైక్ రేట్ ఉన్న యశస్వి జైస్వాల్ ను t20 లో మొత్తానికే పక్కన పెట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే‌ గంభీర్ పంతం వల్లే రోహిత్, కోహ్లీ టెస్ట్ నుండి రిటైర్ అయ్యారు అని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.

క్రికెట్ లో ప్రయోగాలు సహజమే. కానీ అందుబాటులో స్థిరమైన ఆప్షన్లు,ప్రత్యామ్నాయాలు ఉన్నాక కూడా చేస్తూ పోతే ఇలానే బెడిసి కొడ్తాయి.

 

తన హయాంలో ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ని టీం గెలుచుకున్న విషయం మర్చిపోకూడదు అని చెప్పుకున్నాడు. దాంట్లో కోచ్ గా గౌతమ్ గంభీర్ పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. దాని కోసం ఇప్పుడు కొత్తగా క్రెడిట్ లు ఇచ్చుకోవక్కర్లేదు. గెలుస్తూ ఉంటే జనాలే ఇస్తారు. కానీ ఇలా సొంత గడ్డపైనే ఇంత ఘోరమైన పరాభావాలు ఎదురవటం అస్సలు మంచిది కాదు. ప్రస్తుతం గంభీర్ కు కోచ్ గా 2027 వరల్డ్ కప్ వరకు సమయం ఉన్నా, ప్రదర్శనలు ఇలానే ఉంటే అప్పటిదాకా తనను ఉండనిస్తారా! లేకపోతే ప్రత్యామ్నాయాలు వెతుకుతారా అనేది వేచి చూడాల్సిందే…


Written By

Sumanth Thummala is aContent Writer and the co-founder of Prajadhwani news. He works passionately toward creating positive change in the world through meaningful, responsible writing.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *