Menu

Layoffs: ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలు కట్‌.. ఎంతమందిని తొలగించారంటే?

Lakshmi Aruna 2 months ago
HP layoffs telugu news explainers

కొన్ని సంవత్సరాల నుంచి టెక్ రంగంలో ఉద్యోగాల పరిస్థితి చాలా వేగంగా మారుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు(AI) అభివృద్ధి పెద్ద సంస్థల పనితీరును మార్చడంతో పాటు అనేక ఉద్యోగాల స్వరూపాన్ని కూడా మార్చుతోంది. ఒకప్పుడు పెద్ద బృందాలతో చేయాల్సిన పనులు ఇప్పుడు ఆటోమేషన్, AI సహాయంతో వేగంగా పూర్తవడం కంపెనీలను వ్యయాలను తగ్గించాలనే ఆలోచనవైపు నెడుతోంది. ఈ మార్పులు ఉద్యోగులపై పెద్ద ప్రభావం చూపుతున్నాయి. ఈ వారం HP, యాపిల్(Apple) వంటి పెద్ద కంపెనీలు కొత్తగా ప్రకటించిన ఉద్యోగ కోతలు ఈ ధోరణికి మరో ఉదాహరణగా నిలిచాయి.

హెచ్‌పీలో ఉద్యోగాల కోత:

HP సంస్థ తాజాగా ప్రకటించిన సమాచారం ప్రకారం 2028 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4,000 నుంచి 6,000 ఉద్యోగాలు కోతకు గురయ్యే అవకాశం ఉంది. ఈ సంస్థ ఇప్పటికే ఈ సంవత్సరం 2,000 మంది ఉద్యోగులను తగ్గించింది. కొత్త కోతలు ఉత్పత్తుల అభివృద్ధి, ఆపరేషన్స్, కస్టమర్ సపోర్ట్ లాంటి విభాగాలను ప్రభావితం చేయనున్నాయి. HP నాయకత్వం ఈ మార్పులు పూర్తిగా AI ఆధారిత వ్యూహంలో భాగమని చెబుతోంది. ఉత్పత్తుల అభివృద్ధిని వేగవంతం చేయడం, సంస్థను మరింత సులభంగా నడిపించే లక్ష్యంతో తీసుకున్న నిర్ణయంగా వీటిని కంపెనీ చూపిస్తోంది. వచ్చే మూడు సంవత్సరాల్లో ఒక బిలియన్ డాలర్ల వరకు ఖర్చులు తగ్గించాలనే కంపెనీ లక్ష్యం ఈ చర్యల వెనుక ఉన్న ప్రధాన కారణం.

హెచ్‌పీ దారిలోనే యాపిల్:

యాపిల్‌ కూడా ఉద్యోగ కోతల దిశగా కొన్ని అంతర్గత మార్పులు చేసింది. ఈసారి పెద్ద సంఖ్యలో కాకపోయినా సేల్స్ విభాగంలో పనిచేసే డజన్ల ఉద్యోగాలను కంపెనీ రద్దు చేసింది. వ్యాపార సంస్థలు విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థల కోసం నిర్వహించే ఉత్పత్తి వివరణ సమావేశాలతో పాటు బ్రీఫింగ్ సెంటర్లలో పనిచేసే పలువురు ఉద్యోగులు ఈ మార్పులతో ప్రభావితం అయ్యారు. యాపిల్ ఈ నిర్ణయాలను తాము కస్టమర్లతో మరింత సమర్థవంతమైన సంబంధం ఏర్పరచుకునేందుకు తీసుకున్న చర్యలుగా చెప్పింది. ప్రభావిత ఉద్యోగులకు కంపెనీ లోపలే ఇతర పనులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా 20కి పైగా ఉద్యోగాలు తగ్గించిన విషయం తెలిసిందే.

వచ్చే ఏడాది మరిన్ని కోతలు:

ఇతర టెక్ కంపెనీల్లో కూడా ఉద్యోగ కోతలు పెరుగుతున్నాయి. అమెజాన్‌(Amazon) పెద్ద సంఖ్యలో తన కార్పొరేట్ ఉద్యోగులను తగ్గించేందుకు సిద్ధమవుతోంది. Synopsys వంటి కంపెనీలు పనితీరు మెరుగుపర్చడం, పెట్టుబడులను కొత్త వృద్ధి అవకాశాల్లో పెట్టాలనే ప్రయత్నంలో వేలాది మంది ఉద్యోగులను తగ్గించాయి. మొత్తం చూసుకుంటే 2025 సంవత్సరంలో ఉద్యోగ కోతల సంఖ్య గత సంవత్సరాలతో పోలిస్తే మరింత పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కంపెనీలు AI ఆధారిత విధానాలవైపు దూసుకుపోతుండటం ఈ మార్పుల ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. AI వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ పరిస్థితిలో నైపుణ్యాలను మార్చుకోవడం, కొత్త రంగాల్లో అవకాశం వెతకడం ఉద్యోగుల కోసం తప్పనిసరి అవుతోంది.

ALSO READ: AI జమానాలోనూ ఈ డిగ్రీలు సేఫ్‌.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *