Menu

New Labour Codes: శాలరీలో చేతికి సగమే ఇస్తారా? మీ జేబుకు ప్రభుత్వం పెద్ద సైజు చిల్లు పెట్టిందా?

Praja Dhwani Desk 3 months ago
new labour codes

ఉద్యోగాలుండవ్‌.. ఒకవేళ ఉద్యోగం వచ్చినా మంచిగా జీతముండదు.. ఒకవేళ మంచి జీతమే అనుకోని జాబ్‌లో చేరినా ఇప్పుడు మీకొచ్చే శాలరీలో సగం ప్రభుత్వానికి దానం చేయాలట. ఉద్యోగి రిటైర్ అయ్యాక మిగిలిన డబ్బులు తీసుకోవాలట..! ఇక్కడే అసలు ప్రశ్న..! 60ఏళ్ల తర్వాత ఎలా బతకాలన్నది పక్కన పెడితే.. వచ్చే జీతంతో నెల రోజులు ఎలా నెట్టుకురావలన్నది అసలైన సమస్య. ఈ నవంబర్ 21,2025 నుంచే కొత్త లేబర్ కోడ్స్‌(New Labour Codes) అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధనలతో కార్మికులకు భవిష్యత్ భద్రత పెరుగుతుందని కేంద్రప్రభుత్వం చెబుతోంది కానీ.. ఉద్యోగులు మాత్రం కొత్త రూల్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అప్పులు పాలవుతామని ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ కొత్త లేబర్‌ కొడ్స్‌లో ఏముంది? ఇన్‌-హ్యాండ్‌ శాలరీ తక్కువగా వస్తుందా?

చేతికి వచ్చే జీతమెంత?

భవిష్యత్ భద్రత, గ్రాచ్యుటీ, పీఎఫ్ లాంటి పెద్ద పెద్ద మాటలను ప్రభుత్వం చెబుతోంది కానీ.. వాటి వెనక దాగి ఉన్న అసలు దెబ్బ మాత్రం సామాన్య ఉద్యోగికే తెలుస్తుంది. ముఖ్యంగా CTCలో 50 శాతం బేసిక్ తప్పనిసరి చేసే నిబంధన ఉద్యోగుల నెలనెలా జీవనాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఉద్యోగం వచ్చినా శాలరీ సరిపోదనుకునే ఈ కాలంలో, చేతికి రావాల్సిన డబ్బు సగం రాకుండా పోతే కుటుంబం ఎలా బతుకుతుందన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్లిపోయింది. రిటైర్మెంట్ సమయంలో కొంచెం డబ్బు అందులో పడితే ఉపయోగం ఉండొచ్చు కానీ 60 ఏళ్లలో వచ్చే డబ్బు కోసం ఈరోజు పిల్లలకు పాలు కొనడానికైనా ఇబ్బంది పడడం ఎంతవరకు కరెక్ట్?

ఈ నెల ఎలా బతకాలి?

50 శాతం బేసిక్ పెంచడం అంటే ఉద్యోగిపై పడే భారాన్ని ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదనే అర్థం. బెసిక్ పెరగగానే పీఎఫ్ కట్ పెరుగుతుంది, గ్రాచ్యుటీ లెక్క పెద్దదవుతుంది, కంపెనీలు మరిన్ని అలవెన్సులు తగ్గిస్తాయి. ఫలితం ఒక్కటే. చేతికి వచ్చే జీతం క్షణాల్లో తగ్గిపోతుంది. ఉద్యోగి మాటల్లో చెప్పాలి అంటే ప్రభుత్వం నేరుగా జేబులో చిల్లు పెట్టినట్టే. రిటైర్మెంట్‌లో నువ్వు డబ్బు తీసుకో లాంటి మాటలు చెప్పడం ఈజీనే కానీ ఈ నెల గడవాలంటే ఏం చేయాలన్న టెన్షన్ మాత్రం అలానే ఉంటుంది.

ఇంటి అద్దె, స్కూల్ ఫీజులు, మెడిసిన్ ఖర్చులు, రవాణా, కూరగాయల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. అసలు మధ్యతరగతి కుటుంబం నెల ఖర్చులు ఎలా ఉంటాయో ప్రభుత్వం ఎప్పుడైనా కూర్చొని లెక్క పెట్టిందా ? జీతంలో ఒక్క రూపాయి తగ్గినా ఇబ్బంది పడే రోజులు ఇవి. అలాంటి సమయంలో ప్రభుత్వం నేరుగా ఇన్‌-హ్యాండ్ శాలరీ కట్ అయ్యేలా నిర్ణయం తీసుకోవడం సామాన్యుడిని ఈజీగా అప్పుల బారిన పడేసే పని. ఎక్కడ చూసినా EMIలు, హోమ్ లోన్స్, చదువు కోసం తీసుకున్న లోన్స్, క్రెడిట్ కార్డు బిల్లులతో ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ప్రత్యేకంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసే యువత, మధ్యతరగతి, చిన్న స్థాయి ఉద్యోగులు ఇటువంటి మార్పులతోనే ఎక్కువగా దెబ్బ తింటారు. ఇవాళ యువతలో ఎంతమంది EMI లేకుండా ఉన్నారు?ఎవరి జీతమూ చేతిలో నిలిచేది లేదు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం చేతికి వచ్చే శాలరీ తగ్గిస్తే ఈ వర్గం ఎలా బతకాలి? ఈ కోడ్స్ గిగ్ వర్కర్లు, డెలివరీ ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు కూడా పెద్దగా ప్రయోజనం ఇవ్వనట్లు కనిపిస్తోంది. వాళ్లకే ఏదో ఇవ్వబోతున్నట్టు ప్రకటించినా జీతం తగ్గడం, కంపెనీల ఒత్తిడి పెరగడం, అస్థిరత మరింత పెరగడం మాత్రమే కనిపిస్తోంది.

చివరికి ప్రజలు ఒక మాట మాత్రమే అంటున్నారు. ప్రభుత్వం భవిష్యత్ కోసం అని చెబితే నమ్మడానికి ముందు ఈరోజు జీవితం ఎలా నడుస్తుందో అది కూడా చూడాలి. ప్రజల చేతికి వచ్చే శాలరీ తగ్గిపోతే దేశంలో ఏ కుటుంబం సుఖంగా బతకదు. పెరుగుతున్న ఖర్చులు, ఆగని ధరలు, నిలబడని జీతాలతో బతకడం భారం అవుతుంది.

ALSO READ: గ్రేడ్-A పోస్టులకు నోటిఫికేషన్ జీతం రూ.89000.. ఛాన్స్ మిస్‌ చేసుకోవద్దు!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *