క్రికెట్లో మనం ఎన్నో రసవత్తరమైన పోటీలను చూశాం. ఇండియా – ఆస్ట్రేలియా, చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ లాంటి టీమ్స్ మధ్య చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ లు జరిగాయి. వీళ్ళు ఆడుతున్నారంటే క్రికెట్ ప్రపంచం అంతా అదే చూస్తుంది. కానీ వీటికి మించి క్రికెట్ చరిత్రలోనే అత్యంత చారిత్రాత్మకమైన పోరు “ఆషెస్ సిరీస్”. క్రికెట్లో ఏ టెస్ట్ సిరీస్ కి దీనికి ఉన్నంత చరిత్ర ప్రాధాన్యత లేవు.
ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ ఆషెస్ టెస్ట్ సిరీస్ కోసం ఎందరో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తారు. కొందరు ప్లేయర్స్ ఓ అడుగు ముందుకేసి “వరల్డ్ కప్ కంటే కూడా ఆషెస్ ఏ ప్రతిష్టాత్మకమైనది” అని ప్రకటించారు. ఇది దేశాల్లోని మీడియా, ప్రేక్షకులు ఈ సమయంలో భావోద్వేగాలతో ఉంటారు. స్టేడియంలో ఆటగాళ్ళను పరిహాసం చేయడం మామూలే. మీడియా సంస్థలు ఓడిపోయిన టీం పైన చాలా కఠినంగా విమర్శనాస్త్రాలను సందిస్తాయి.
రేపు మొదలవుతున్న ఈ సిరీస్ అసలు చరిత్ర ఏంటంటే…
క్రికెట్ లో మొదటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మ్యాచ్ 1877 లో ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) లో జరిగింది. వాస్తవానికి ఆ టీంలు కంబైన్డ్ ఆస్ట్రేలియా 11, జేమ్స్ లిల్లీ వైట్ 11 పేరుతో ఆడారు. ఆ తర్వాత దీనికి మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ గా గుర్తింపునిచ్చి ఆ టీమ్ లను జాతీయ టీములుగా పరిగణించారు.
అప్పటినుండి ఇరుదేశాల మధ్య టెస్ట్ మ్యాచ్ లు నడుస్తూ ఉన్నాయి.
ఆషెస్ కు బీజం పడిన వేళ :
1882లో ఇంగ్లాండ్ఓ లోని ఓవల్ మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొట్టమొదటిసారి సొంత గ్రౌండ్లో ఓడిపోయారు. దాన్ని ఇంగ్లాండ్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆ ఓటమి తర్వాత బ్రిటిష్ పత్రిక The Sporting Times ఇలా రాసింది:
“ఇంగ్లీష్ క్రికెట్ చనిపోయింది…
దేహాన్ని దహనం చేసి, దాని బూడిదలను ఆస్ట్రేలియాకు తీసుకెళ్తారు.”
“English cricket has died… The Body will be Cremated and the ashes will be taken to Australia.”
పంతం నెగ్గిన ఇంగ్లాండ్:
దీనికి అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ ఇవో బ్లైహ్ ఆ బూడిదను తిరిగి తీసుకొస్తానని శపధం చేశాడు. అన్నట్టుగానే ఆరు నెలలకు 1882-83 ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్ ను 1-2 తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది.
1882 క్రిస్మస్ రోజున, మెల్ బోర్న్ బయట ఉన్న ఓ ఎస్టేట్‌లో జరిగిన ఒక సోషల్ మ్యాచ్ తరువాత, ఇంగ్లండ్ కెప్టెన్ బ్లైగ్కి చిన్న టెర్రకోటా కలశాన్ని “ఆషెస్” ప్రతీకగా ఆ ఎస్టేట్ ఓనర్ భార్య ఇచ్చారు. ఒక చిన్న చెక్క కలశం తీసుకుని ఒక వికెట్ బేల్‌ను కాల్చి వచ్చిన బూడిదను అందులో పెట్టింది. దాన్ని ఎర్ర వెల్వెట్ సంచిలో చుట్టి ఇచ్చింది. ఆయన ఆ కలశాన్ని ఎంతో విలువైన నిధిగా భావిస్తూ కాపాడుకున్నారు. దాన్ని బ్లైగ్ వ్యక్తిగత బహుమతిగా భావించి ఇంగ్లాండ్‌కి తీసుకెళ్లాడు.
(ఆ కలశ ప్రతిమ బ్లైగ్ ఇంట్లోనే 43 ఏళ్లు ఉంది. బ్లైగ్ మరణించిన తర్వాత, అతని కోరిక ప్రకారం, ఆయన భార్య ఫ్లోరెన్స్ ఆ కలశాన్ని MCCకి అప్పగించింది).
ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు ఆషెస్ గురించి ప్రస్తావన రాలేదు. మళ్ళీ 1903-04 సిరీస్ ను ఇంగ్లాండ్ జట్టు గెలిచాక, ఆ టీం కెప్టెన్ పెల్హం వార్నర్ ‘How We Recovered The Ashes’ పేరుతో పుస్తకం రాశాడు. అప్పటినుండి ఈ రెండు జట్ల మధ్య సిరీస్ ను ద ఆషెస్ గా పిలవడం ప్రారంభించారు.
1921 ద ఇల్లుస్ట్రేటెడ్ లండన్ న్యూస్ ఈ యాషెస్ కలశాన్ని ఫోటోలో మొదటిసారి ప్రచురించింది. MCC ముందు ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లోని లాంగ్ రూమ్‌లో ఆ కలశాన్ని ప్రదర్శించింది. అనంతరం 1953 నుంచి లార్డ్స్‌లోని MCC క్రికెట్ మ్యూజియంలో దాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఇంతకీ అందులో ఏం ఉంది?
ఆ కలశంలో ఏముంది అన్నది చాలాకాలంగా స్పష్టంగా లేదు.అది స్టంప్ బూడిదనా, బేల్ బూడిదనా, లేక బంతి లెదర్ కవర్ అవశేషాలా అన్న విషయంపై వేర్వేరు కథనాలు ఉన్నాయి.
2006–07 సిరీస్ సమయంలో, urnతో వచ్చిన MCC అధికారిక ప్రతినిధి “95% ఇది క్రికెట్ బేల్ బూడిదే” అని చెప్పాడు.
ఈ కలశం టెర్రకోటాతో తయారై, సుమారు 6 అంగుళాలు (150 mm) ఎత్తు ఉంటుంది. అది మొదట పెర్ఫ్యూమ్ సీసాగా ఉపయోగించి ఉండొచ్చని అంచనా.
1990లలో సిరీస్ విజయం సాధించిన జట్టుకే ఆ అసలుది ట్రోఫీగా ఇచ్చి, వచ్చే సిరీస్ వరకు వారి వద్దే ఉంచాలని ఒక ఆలోచన ముందుకు వచ్చింది. అయితే లార్డ్స్ క్రికెట్ మ్యూజియంలో ఉన్న ఆ కలశం పరిస్థితి సరిగ్గా లేకపోవడం, అలాగే అది అత్యంత విలువైన ప్రదర్శన వస్తువు కావడంతో MCC దీనిని అంగీకరించలేదు. అందుకే MCC, వాటర్‌ఫోర్డ్ క్రిస్టల్‌తో తయారు చేసిన పెద్ద రెప్లికా—‘Ashes Trophy’—ను తయారు చేయించింది. ఈ ట్రోఫీని 1998–99 యాషెస్ సిరీస్ నుంచి ప్రతి సిరీస్ విజేత జట్టుకు అందించడం ప్రారంభించారు.”
ఆ అసలు ఆషెస్ కలశాన్ని ఆస్ట్రేలియాకు ఇప్పటివరకు మూడుసార్లు మాత్రమే తీసుకెళ్లారు.
మొదటిసారి – 1988లో ఆస్ట్రేలియా 200వ వార్షికోత్సవ సందర్భంగా మ్యూజియం టూర్ కోసం. 2006–07 ఆషెస్ సిరీస్ సందర్భంగా చివరగా 2019–20 సమయంలో తీసుకెళ్లారు.
ప్రతిష్టాత్మక సిరీస్ గెలుపు ఓటముల చరిత్ర:
మొత్తం 73 సిరీస్ లు జరిగాయి. దాంట్లో ఆస్ట్రేలియా 34 గెలిస్తే, ఇంగ్లాండ్ 32 గెలిచింది. 7 సిరీస్ లు డ్రా అయ్యాయి. మ్యాచ్ ల పరంగా చూస్తే ఆసీస్ 152 గెలిస్తే, ఇంగ్లాండ్ 111 మ్యాచ్‌లు గెలిచింది. 98 మ్యాచ్ లు డ్రా అయ్యాయి.
మొదట్లో సిరిస్ మధ్యలో గ్యాప్ అనేది అస్థిరంగా ఉండేది. ఓసారి సంవత్సరం గ్యాప్ ఉంటే కొన్నిసార్లు రెండు మూడు సంవత్సరాలు ఇంకొన్నిసార్లు ఒకే సంవత్సరంలో రెండు టూర్లు జరిగేవి. 40వ దశకం నుండి మరీ ముఖ్యంగా 90s నుండి ప్రతి రెండేళ్లకోసారి ఆషెస్ టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నారు. (2013 లో రెండు టూర్స్ జరిగాయి. 2015 వరల్డ్ కప్ కారణంగా ముందే నిర్వహించారు.)
సిరీస్‌లలో మ్యాచ్‌ల సంఖ్య కూడా స్థిరంగా ఉండేది కాదు. టూరింగ్ షెడ్యూల్‌ను బట్టి కొన్ని సిరీస్‌లు 2 టెస్టులు, కొన్ని 3 లేదా 4, మరికొన్ని 5 టెస్టులతో జరిగాయి.
ఆ తరువాత కొన్ని ప్రత్యేక సందర్భాల్లో యాషెస్ సిరీస్‌లు ఆరు టెస్టులతో కూడా 1970–71, 1974–75, 1978–79, 1981, 1985 సంవత్సరాల్లో నిర్వహించారు.
1985 తర్వాత యాషెస్‌ను శాశ్వతంగా 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌గా నిర్ణయించారు.
క్రికెట్ లో ఎన్నో కీలక ఘట్టాలకు కూడా ఆషెస్ వేదికైంది. మొదటి వన్డే మ్యాచ్ పుట్టింది కూడా ఈ సిరీస్ లోనే! 1970-71 సిరీస్ లో ఒక మ్యాచ్ వర్షం వల్ల ఒకే రోజు 60 ఓవర్స్ తో ఆడారు. అక్కడి నుండి వన్డే క్రికెట్ ఎదిగింది. షేన్ వార్న్ 700వ వికెట్ తో పాటు, బాల్ ఆఫ్ ది సెంచరీ గా చెప్పే సందర్భం కూడా ఆషెస్ లోనే. క్రికెట్ లో మొదటి కంకషన్ సబ్‌స్టిట్యూట్ 2019లో జరిగింది. అలాగే ఎన్నో గొప్ప మ్యాచ్ లు జరిగాయి.
“ఇప్పటివరకు ఆషెస్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా డొనాల్డ్ బ్రాడ్ మన్ (5028) ఉన్నాడు. అత్యధిక వికెట్ల జాబితాలో షేన్ వార్న్ (195) ఉన్నాడు.”
కెప్టెన్ గా స్టీవ్ స్మిత్! మరోసారి బాజ్ బాల్ తో స్టోక్స్!!
ప్రస్తుత ఆషెస్ సిరీస్ విషయానికి వస్తే, ఆసిస్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గాయంతో దూరం అవడంతో ఆ టీం సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ను కెప్టెన్ గా నియమించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలో ఇంగ్లాండ్ మరోసారి బరిలోకి దిగుతున్నారు.
ఆస్ట్రేలియాకు సిరీస్ కు ముందే కెప్టెన్ కమ్మిన్స్, స్టార్ బౌలర్ హాజిల్ వుడ్ దూరం అవ్వటం పెద్ద దెబ్బే.
కెప్టెన్ స్టీవ్ స్మిత్, టీం లోకి మళ్లీ తిరిగి వచ్చిన మార్నస్ లబుస్కాగ్నే, స్కాట్ బోలండ్, స్టార్క్ పై ఆ టీం ఆధారపడి ఉంది.
ఇంగ్లాండ్ జట్టు నుండి స్టార్ ఆటగాడు జో రూట్, హారీ బ్రూక్, బెన్ స్టోక్స్ జోఫ్రా ఆర్చర్ ప్రదర్శన కీలకం కానున్నాయి.
ఏదిఏమైనా వీక్షకులకి 45 రోజుల గొప్ప క్రికెట్ విందు ఖాయం!




Indian Coach Gautam Gambhir: ఇల్లు అలకగానే పండగ కాదు.. కోచ్ అవ్వగానే విజయాలు రావు! సొంతగడ్డపైనే చెత్త పర్ఫామెన్స్!!
WTC Finals 2025 : ఇక చోకర్స్ కాదు ఛాంపియన్స్! ఎన్నో ఏళ్ల ‘ఆశ ‘ను నిజం చేసిన బవూమా!!
ముచ్చటగా మూడో సమరం! పైచేయి కోసం ఇరు జట్ల ప్రయత్నాలు.
IND vs ENG: బాజ్ బాల్ వర్సెస్ స్పిన్ బాల్ పోటీలో బాస్ ఎవరు? తుది జట్టు ఇవే!