Menu

Work Culture: ఫేవరటిజం, పక్షపాతం, కార్పొరేట్‌ ఆఫీసుల్లో టాక్సిక్‌ వర్క్ కల్చర్..! పెద్దల అహంకారానికి హద్దే లేదా?

Praja Dhwani Desk 3 months ago
toxic work culture in india

ఒక ప్రైవేట్ ఆఫీస్‌.. ఉదయం 10 గంటలు. ఆఫీస్‌లోకి సైలెంట్‌గా వచ్చి తన డెస్క్ దగ్గర కూర్చుంది అనిత. నోటీస్ పీరియడ్‌లో ఉంది. ఇంకో రెండు వారాల్లో వెళ్లిపోతుంది. ఆమె పని ఎప్పుడూ క్లీన్ అండ్ నీట్‌గా ఉంటుంది. తనకు కేటాయించిన పనిని తను చేసుకుపోయేది..ఎవరితోనూ గొడవ పడాలి అనుకునే మనస్తత్వం కాదు. అందరితో కలిసిపోవడం, సైలెంట్‌గా తన పని తాను చేసుకోవటం వల్ల తనంటే అందరికీ ఇష్టం. కానీ అదే విషయమై కొంతమందికి మాత్రం అసహనం. అక్కడ ఆమె అంటే పడనివారు ఆమె మీద ఏదో ఒక నింద వేస్తూనే వున్నారు. ‘ఆమె మా పనికి సరికాదు..‘ అంటూ వాళ్ళంతట వాళ్ళే ఒక నిర్ణయం తీసుకుని కొన్ని పనులకు ఆమెను దూరం పెట్టారు. అయినా ఆమె ఎవరి జోలికీ పోలేదు. పైస్థాయిలో ఉన్న వ్యక్తులే బ్యాక్‌డోర్‌ పాలిటిక్స్‌ ప్లే చేస్తున్నా ఎప్పుడూ ఎవర్నీ అడగలేదు. పెద్దరికం హోదాలో ఉంటూ చిన్నతనంగా ప్రవర్తించేవారు కొందరుంటారు. అందులో ఒకరే..రమేష్.

అతనికి ‘అధికారం‘ అంటే వ్యామోహం ఎక్కువ. తాను చెప్పిందే రూల్… అతని మాటే చివరి మాట. ఆ రోజు కూడా అతను ఆమె దగ్గరకు వచ్చి, ఒక పెద్ద ఫైళ్ల బండిల్ పెట్టి ఒక మాట అన్నాడు.

ఈ ఫైల్‌లో మిగిలిన టాస్క్ నువ్వు ఫినీష్‌ చేయాలి. నేను చెప్పానంటే చేయాలంతే అనే విధంగా మాట్లాడాడు.

అనిత ఒక క్షణం ఆగింది. నేను ఏ పనీ చేయనని HR వాళ్ళకి కంప్లైంట్ చేసిన వ్యక్తి.. మళ్ళీ తనకు తన రోల్‌లో లేని పనిని చేయమని చెబితే ఎందుకు చెయ్యాలి? ఇక ఆలోచించలేదు…

సర్, ఇవి నా రోల్ ఉండే పనులు కావు. నేను ఇప్పటివరకు ఇవి చేయలేదు. నోటీస్ పిరియడ్‌లో కొత్త పనులు అసైన్ చేయడం సరైంది కాదు..‘ అని తెగేసి చెప్పింది.

అతనికి ఇది పెద్ద దెబ్బగా అనిపించింది. తన మాటకు ఎవరో ‘లేదు పో‘ అన్నట్టు. అతని కళ్లల్లో అహంకారం ఒక్కసారిగా మంట లాగా ఎగిసింది.

అంటే… నేను చెప్పినా చేయవా?సరే… ఇక నువ్వు కొత్త రూల్స్‌కి ప్రిపేర్ అవ్వు.

అతను వెంటనే ఒక మెయిల్ డ్రాఫ్ట్ చేశాడు. ఆమెకు వెంటనే కొత్త రూల్స్ పాస్ చేశాడు. అన్నీ కూడా అనవసరమైన, మెంటల్లీ హ్యారెసింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్.
ఆమె ఆలోచించింది. అతని గురించి HR వాళ్లకు చెప్పిన వేస్ట్. గతంలో జరిగిన తంతు గుర్తు చేసుకుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఇలాగే ప్రవర్తిస్తే ఆమె వాళ్ళ సహాయం కోరింది. వాళ్ళు ‘మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి అని ధైర్యం చెప్పి..’ వెనుక వాళ్ళకే వత్తాసు పలికారట.

‘రమేష్ గారు చెప్పిందల్లా ఫాలో అవ్వాలి. టీమ్‌ డెసిషన్స్ అలానే ఉంటాయి. కంపెనీ పాలసీస్‌ కూడా అంతే ఉంటాయి.’ అనగానే అనిత షాక్ అయింది.
ఆ నిమిషం ఆఫీసు లోపల అన్ని తలుపులు మూసుకున్నట్టే అనిపించింది. ఎవరూ సహాయం చేయరు. ఎవరూ వినరు. ఇక్కడ సిస్టమ్‌ ఒక్క మంత్రం మీద నడుస్తుంది.

అధికారి నిర్ణయమే ఆఖరు..

రోజులు గడిచాయి.. పని పేరుతో పీడించడం, ఒత్తిడి పెట్టడం, అవమానించడం పెరిగాయి. అనిత ముఖం మీద అలసట, మనసులో విసుగు, కళ్లలో ఆవేదన. అతన్ని ఏమీ చేయలేరు. ఏమీ అడగలేరని అతనే గర్వంగా చెప్పుకున్నాడు. అప్పుడే ఆమె తనకు న్యాయం జరగని చోట ఒక ఫేవరిటిజమ్ ఉన్న చోట తాను పని చేయలేనని నిర్ణయించుకుని ఉద్యోగానికి రాజీనామా చేసింది. వెంటనే వాళ్ళు దాన్ని అంగీకరించారు. అప్పుడే అర్ధమైంది అనితకు. వీళ్ళు తనను ఎప్పుడు నెట్టేద్దామా అనే ఆలోచనలో వున్నారని. ఆ నోటీసు పీరియడ్‌లో ఉండగానే ఆమెను మరింత వేధించాలని వాళ్ళు నిర్ణయించుకున్నట్టున్నారు. అతని అహంకారం పెరిగింది.. ఆమె సహనం తగ్గిపోయింది. చివరకు ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. తన టేబుల్‌పై ఉన్న ఫైళ్లను సర్దుకొని బ్యాగ్‌లో వేసుకుంది. మరుసటి ఉదయం ఆఫీస్‌కు వచ్చి ల్యాప్‌టాప్‌ ఓపెన్ చేసి, ఒక చిన్న, స్పష్టమైన, ధైర్యమైన మెయిల్ టైప్ చేసింది.

‘Due to the continuous misuse of authority, toxic work environment, and lack of support from HR, I am proceeding with self-relieving with immediate effect. This is for my dignity, health, and peace..’

మెయిల్ పంపింది.
Laptop మూసేసింది.
ID కార్డ్ టేబుల్ మీద పెట్టింది.
ఎవరూ అడ్డుకోలేదు.
ఎవరూ ‘అలా చేయొద్దు’ అనలేదు.
ఎవరూ మిస్ కాలేదు.
ఆఫీస్ గేట్ బయటకు వచ్చినప్పుడు..
అనితకు ఒక్కసారి గాలి పీల్చినట్టు అనిపించింది.
ఈ కంపెనీ ఆమెను కోల్పోయింది.
కానీ ఆమె కోల్పోయింది మానసిక ఒత్తిడి, అవమానం, అహంకారం.

చివరికి గెలిచింది ఎవరో తెలుసా?
పదవి కాదు.
అధికారం కాదు.
HR కాదు.
అనిత తీసుకున్న నిర్ణయం.. ఆ నిర్ణయం వెనుకున్న ఆమె ధైర్యం..!
———————
ఇది కేవలం అనిత కథ కాదు.. అనిత లాంటి ఎందరో మహిళలు వర్క్‌ ప్లేస్‌లో అనుభవిస్తున్న వివక్ష..!

ALSO READ: ‘నాకేం నేను బాగానే ఉన్నాను’ అనే మాయలోనే బ్రతికేస్తున్నారా? అసలు నిజం తెలుసుకుంటే ఫ్యూజులౌట్!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *