Menu

Mental Health: ‘నాకేం నేను బాగానే ఉన్నాను’ అనే మాయలోనే బ్రతికేస్తున్నారా? అసలు నిజం తెలుసుకుంటే ఫ్యూజులౌట్!

Lakshmi Aruna 3 months ago
mental health

సమాజం ఎంత వేగంగా ముందుకు పరుగెడుతుందో.. మన మనస్సు కూడా అంతే వేగంగా పరుగెత్తాల్సి వస్తోంది. టెక్నాలజీ, సోషల్ మీడియా, ఉద్యోగాల్లో పెరుగుతున్న ఒత్తిడి, వ్యక్తిగత జీవితంలో వస్తున్న మార్పులతో మెంటల్ హెల్త్ ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది. ఒకప్పుడు మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటానికి ప్రజలు సిగ్గుపడేవారు. కానీ ఇప్పుడు అది శారీరక ఆరోగ్యంతో సమానంగా కాకపోయినా, దానికన్నా ఎక్కువ ప్రాధాన్యం పొందుతోంది.

‘నాకేం నేను బాగానే ఉన్నాను’ అనే మాయలోనే బ్రతికేస్తున్నామా?:

మనలో చాలా మంది రోజువారీ జీవనంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ‘నేను బాగానే ఉన్నాను’ అని చెప్పడం అలవాటుగా మారింది. కానీ లోలోపల మాత్రం పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు భయం, సంబంధాల్లో సమస్యలు లాంటివి మన మనసును నెమ్మదిగా..అత్యంత బలంగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. మెంటల్ హెల్త్ అంటే కేవలం డిప్రెషన్ లేదా ఆందోళన మాత్రమే కాదు. మనం ఎలా ఆలోచిస్తున్నాం? ఏ విధంగా ఫీల్ అవుతున్నాం? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామనేది చాలా ముఖ్యం.

యువతకు పెరుగుతున్న భారం:

ఇటీవలి సంవత్సరాల్లో మానసిక సమస్యలు యుక్తవయస్కుల్లో అధికంగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా పోలికలు, అన్‌-రియలిస్టిక్ స్టాండర్డ్స్, ఆన్‌లైన్ బుల్లీయింగ్ యువతలో ఆందోళనను పెంచుతున్నాయి. ఈ పరిస్థితి వారి మానసిక స్థితిపై పెద్ద ప్రభావాన్ని చూపుతోంది. వారికి అవసరమైన సపోర్ట్ లభించక ప్రతి విషయంలోనూ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. వారి బాధను పేరెంట్స్‌తో చెప్తే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియక సతమతమై చివరికి బాధాకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఉద్యోగాల్లో బర్నౌట్… కొత్త సాధారణం:

ఉద్యోగ రంగంలోనూ ‘బర్నౌట్’ అనే పదం సాధారణంగా మారింది. కంటిన్యూస్ వర్క్, టార్గెట్‌లు, పవర్ ప్రెజర్ లాంటివి మనసును అలసటకు గురి చేస్తూ, దినచర్యపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. తోటి సహచరుల పాలిటిక్స్..తన పైన పనిచేసే వారివల్ల వర్క్ ప్రెషర్.. అలాగే ఫేవరిటిజం లాంటివి ఒక ఉద్యోగిని మానసికంగా కుంగదీస్తాయి. ఆ ఉద్యోగం నుంచి తప్పుకోలేక అక్కడ పని చేయలేక తమలో తామే బాధపడేవారు చాలామంది ఉన్నారు.

నిద్ర.. మనసుకి లభించని ఔషధం

స్క్రీన్ టైమ్ పెరగడం, నైట్ షిఫ్ట్స్, అస్తవ్యస్తమైన రోజువారీ జీవితం నిద్రనాణ్యతను దెబ్బతీస్తున్నాయి. నిద్ర లేకపోవడం ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలకు ప్రధాన కారణం అవుతోంది. నిద్ర మనసును శాంతంగా ఉంచే ముఖ్యమైన సహజ ఔషధం. మనం రోజంతా కష్టపడినా దాని నుండి రిలాక్స్ అవ్వటానికి నిద్రే ఒక దివ్యాయుధం..కానీ ఎంత ప్రయత్నించినా కొంతమందికి టెన్షన్స్ వల్ల నిద్ర పట్టదు. ఆలా నిద్రపోకపోవటం వలన వారి మెంటల్ హెల్త్ దెబ్బతినే అవకాశముంది.

చిన్న అలవాట్ల.. పెద్ద మార్పులు

ఈ పరిస్థితుల్లో మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్, యోగా, స్వీయ సంరక్షణ వంటి పద్ధతులు ప్రజల్లో వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. మూడు నిమిషాల శ్వాస వ్యాయామం లేదా పది నిమిషాల ధ్యానం కూడా మనస్సుకు భారీ ఉపశమనం ఇస్తాయి. ఎవరి వద్ద ఉండాలో, ఎవరి దగ్గర దూరంగా ఉండాలో నిర్ణయించుకోవడం కూడా మెంటల్ వెల్‌నెస్‌లో భాగమే. అలా నిర్ణయం తీసుకోవటం అంటే.. మీరు సగానికి పైగా ఒత్తిడిని జయించినట్టే లెక్క.

మాట్లాడటం కూడా ఒక థెరపీ

మనసును బాధించే విషయాలు ఉంటే నమ్మకమైన వ్యక్తితో పంచుకోవడం ఎంతో అవసరం. అవసరమైతే కౌన్సిలర్ లేదా థెరపిస్ట్‌ను సంప్రదించడం కూడా ఆరోగ్యకరం. ఇవి ఒకప్పుడు అవమానంగా భావించబడేవి. కానీ ఇవాళ ఇవి తెలివైన, బాధ్యతాయుత నిర్ణయాలు. కాబట్టి ఆలోచించకుండా మీ మనసులోని భావాలను మీ పట్ల నమ్మకంగా వుండే వ్యక్తితో పంచుకోండి. అలాంటి వారు లేకపోయినా పర్వాలేదు ఒక థెరపిస్ట్‌తో మీ విషయాలను పంచుకోవచ్చు..వారు మీ విషయాలను గోప్యంగా ఉంచుతారు.

మానసిక ఆరోగ్యం.. అందరి హక్కు

మానసిక ఆరోగ్యం కేవలం సమస్యలతో ఉన్నవారికే అవసరమని అనుకోవడం పొరపాటు. మనసు ఆరోగ్యంగా ఉంటేనే పని, సంబంధాలు, జీవితం..అన్నీ సమంగా ఉంటాయి. మన మానసిక బలమే జీవనానికి పునాది. ఆ పునాదిని బలంగా నిర్మించుకుంటే అదే మన గెలుపుకి తొలి మెట్టు అవుతుంది.

మెంటల్ హెల్త్: ట్రెండ్ కాదు, అవసరం

మెంటల్ హెల్త్ ఒక ట్రెండ్ లేదా ఫ్యాషన్ కాదు. ఇది ప్రతి మనిషి జీవితంలో తప్పనిసరి భాగం కావాలి. ఎందుకంటే మనసు బాగుంటేనే జీవితం అందంగా ఉంటుంది. జీవితం బాగుంటేనే అందంగా ఉండగలం. కాబట్టి జీవితాన్ని డిప్రెషన్ లో కాకుండా హ్యాపీనెస్‌తో అలకరించుకోండి.


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *