ప్రేమ అంటే బాధ్యతా… లేక భారమా?
ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేని వాళ్లు చాలామందే ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమ అనే పదం కూడా భారంగా మారిపోయింది. ఒకప్పుడు మనసు నిండా నిండిన భావం, ఇప్పుడు ఒక ఒత్తిడిలా అనిపిస్తోంది. ఎందుకంటే.. మనం ప్రేమను అర్థం చేసుకునే విధానం మారిపోయింది.
సొంత ప్రయోజనాల కోసం ఇచ్చే ప్రేమ భారంగా అనిపిస్తుంది.. మనసు నుంచి ఇచ్చే ప్రేమ మాత్రమే బాధ్యతగా మారుతుంది!
ప్రేమకి అర్థం ఎలా మారిపోయిందంటే?
నిజానికి ప్రేమ అంటే..’మనం ఇష్టపడిన వాళ్లని సంతోషంగా ఉంచడం‘. కానీ నేటి ప్రేమల్లో అర్థమే మారిపోయిది. ‘నన్ను సంతోషంగా ఉంచే వాళ్లను మాత్రమే ప్రేమించడం’లా మారిపోయింది. ఇక్కడే అసలైన గందరగోళం మొదలవుతుంది. మనసులో నుంచి ఇచ్చే ప్రేమలో బాధ్యత ఉంటుంది. కానీ, మన లాభం కోసం ఇచ్చే ప్రేమలో మాత్రం భారమే మిగలుతుంది.
ప్రేమ అంటే ఇష్టపడిన వాళ్లని కట్టిపడేయడం కాదు
నిజమైన ప్రేమలో మనసు పతంగి రెక్కలా తేలికగా ఉంటుంది.. అయినా, మనసు మూలల్లో ఓ మృదువైన జాగ్రత్త మాత్రం చిక్కుకుంటుంది.. ‘ఆయన ఎలా ఉన్నాడో? ఆమె ఎక్కడ బాధపడుతుందో?‘ అని. ఈ ఆలోచనలు భారాలు కావు.. మనసు ప్రేమతో నిండినప్పుడు పుట్టే మధురమైన బాధ్యతలు మాత్రమే
ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే, ఆ వ్యక్తిని చూస్తే నవ్వించాలన్న కోరిక వస్తుంది. నవ్వితే చూడాలి అనిపిస్తుంది. వారిని రక్షించాలి, సాంత్వన ఇవ్వాలి, ఎదగడానికి తోడుగా ఉండాలి. అది బాధ్యత. కానీ అదే విషయాన్ని ఎవరో బలవంతంగా మన మీద వేస్తే, లేదా మనం ‘నేనే అందరిని చూసుకోవాలి’ అనే భావనలో పడితే అది భారం. లేదా నా వల్లే వాళ్ళు బ్రతుకుతున్నారు కాబట్టి నేను చెప్పిందే చేయాలి అనుకుంటే అది అహంకారం.
ప్రేమలో ఉండటం అంటే బంధనంలో పడటం కాదు.. ఒకరికొకరు ఆత్మ విశ్వాసం, నేనున్నాను అనే నమ్మకం ఇవ్వటం. ప్రేమ అనేది మనసుని బంధించే దారం కాదు, మనసుని నిలబెట్టే ఆధారం.
ప్రేమ ఎందుకు భారంగా అనిపిస్తోంది?
సోషల్ మీడియా యుగంలో ప్రేమ అంటే..కేవలం చాటింగ్, స్టేటస్, ఫోన్ కాల్స్ అనుకుంటున్నారు. అనిపించినప్పుడు కాల్ చేయకపోతే,లేదా కలవకపోతే ప్రేమ తగ్గిందనుకుంటున్నారు. కానీ నిజమైన ప్రేమలో సమయం కాదు.. సానుభూతి ముఖ్యం. ఎవరో నిన్ను అర్థం చేసుకోవడం కంటే, నీ మూడ్ అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నాడు అంటే.. అదే ప్రేమలో బాధ్యత. ఎవరో ‘నువ్వు నా దానివి’ అంటారు, కానీ ‘నువ్వు సంతోషంగా ఉండాలి‘ అని ఆలోచించే వాళ్లే నిన్ను నిజంగా ప్రేమిస్తారు. ప్రేమ ఎప్పుడూ భారం కాదు. నిజమైన ప్రేమ మనసుని కరిగిస్తుంది కాని కుంగదీసేది కాదు. అది మనల్ని బలహీనులుగా కాదు, బలమైనవారిగా మారుస్తుంది.
ప్రేమ మనసును కట్టేసే బంధనం కాదు
అందుకే.. ప్రేమ అంటే బాధ్యత, కానీ ఆ బాధ్యతలో సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే, వారిని చూసి మనం నవ్వుతాం.. వారిని గమనించి మనం ఎదుగుతాం.. వారిని కాపాడుతూ మనం మనసును శాంతింపజేస్తాం. అందుకే చివరికి చెప్పాల్సిన మాట ఒక్కటే…
“ప్రేమ భారం కాదు… అది మనసు మీద వేసుకున్న తీయని బాధ్యత.” ❤️

రక్త సంబంధం గొప్పదా? లేదా అవసరానికి అండగా ఉండే స్నేహం గొప్పదా? ఆమె జీవితం చెప్పిన సమాధానం
Adenoids: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!
Marriages: స్వర్గమని నమ్మాం.. నరకంలో జీవిస్తున్నాం..! ఆత్మాభిమానాన్ని చంపే పెళ్లి ఎప్పటికైనా కూలిపోతుంది! పెద్దల దగ్గర దీనికి సమాధానం ఉందా?
Middle Class Dreams: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!
Life Lessons: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?
Relationships: మనల్ని మనమే మరిచిపోయిన కథ.. బతుకుతున్నామా లేదా నటిస్తున్నామా?