రాత్రికి రెప్ప మూస్తే ఉదయానికి ఆ రెప్ప తెరుస్తామో లేదో తెలియని జీవితాలు మనవి..శాశ్వతంగా కన్ను మూయడానికి క్షణకాలం పట్టదు. ఎక్కడో ఒక ఇంట్లోకి అగ్ని ప్రవేశిస్తుంది.. ఎక్కడో ఒక స్కూల్లో మంటలు పుడతాయి.. ఎప్పుడో ఒక థియేటర్లో జీవితం ఆగిపోయింది. ఎక్కడో ఒక ఆఫీస్‌లో కలలు కరిగిపోతాయి.. మరో చోట బస్సులో నిద్రిస్తుండగా శాశ్వత నిద్రలోకి జారిపోతాం.. కర్నూలు బస్సు ప్రమాద ఘటన అయినా.. కేరళ టెంపుల్ ఫైర్ ఘటన అయినా ఇదే విషయాన్ని కళ్లకు కడుతోంది. నిజానికి అగ్ని ఎక్కడైనా వస్తుంది. ఎప్పుడైనా వస్తుంది. మనం ఊహించని క్షణంలో వస్తుంది. ఆ క్షణంలో నవ్వులు మౌనమవుతాయి.. ఆశలు బూడిదవుతాయి.. జీవితం ఒక్క క్షణంలో మారిపోతుంది. మనం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా, ఎన్ని భవనాలు ఎత్తుగా ఎగసినా, ఒక చిన్న మంట వాటిని దహించివేయగలదు. అగ్ని మనిషి సృష్టించిన శక్తే అయినా, దానిపై ఆధిపత్యం మాత్రం మానవుడికి లేదు. అందుకే ప్రతీ మంట వెనక ఒక కథ ఉంటుంది.. అది కన్నీటి కథ.. అది బాధితుల మౌన గాథ..! ఇలా మన దేశాన్ని కన్నీళ్లలో ముంచేసిన కొన్ని అగ్నిప్రమాద కథల గురించి ఓసారి రివైండ్ చేసుకుందాం!
మన దేశం ఎన్నో అగ్నిప్రమాదాలను చూసింది. వాటిలో కొన్ని ఘటనలు కాలం గడిచినా మనసులో మిగిలిపోయిన గాయాల్లా ఉంటాయి. అందులో మొదటగా గుర్తుకొచ్చేది హర్యానాలోని డబ్వాలి పట్టణం. 1995 డిసెంబర్‌లో ఒక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువులు అందరూ ఆనందంగా పాల్గొన్నారు. కానీ ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో వేడుక స్థలం మంటల్లో చిక్కుకుంది. ఒకే మార్గం ఉండటంతో బయటకు రావడం సాధ్యం కాలేదు. క్షణాల్లో పిల్లల కేరింతలు కేకలుగా మారాయి. ఈ ఘటనలో 446మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారు. ఆ మంటలతో కేవలం ఒక స్కూల్ భవనం కాదు.. వందల కుటుంబాల జీవితాలు కూడా బూడిదయ్యాయి.
ఇలాంటి ఘటన తమిళనాడులోని కుంభకోణంలోనూ జరిగింది. 2004 జూలైలో కృష్ణా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వంటగదిలోని మంటలు పైకప్పు మీద ఉన్న తాటి ఆకులకు తగిలి పెద్ద అగ్నిగా మారాయి. క్లాస్‌రూముల్లో చిక్కుకున్న 94మంది పిల్లలు బయటకు రావడానికి మార్గం లేక చనిపోయారు. ఆ చిన్నచిన్న బల్లలు, బుక్స్, బ్యాగులు దహించుకుపోయాయి.
ఇటు 2016లో కేరళ-కొల్లంలో ఉన్న పుట్టింగల్ దేవాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఉగాది సందర్భంగా జరిపిన భారీ పటాకుల ప్రదర్శన నియంత్రణ తప్పి మంటల రూపంలో మారింది. ఒక్కసారిగా ఆకాశం అగ్నిజ్వాలలతో నిండిపోయింది. ఉత్సవంగా ప్రారంభమైన రాత్రి క్షణాల్లో విపత్తుగా మారింది. 111 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంతం కన్నీళ్లలో మునిగిపోయింది.
ఇక 1997లో ఢిల్లీలోని ఉపహార్ సినిమా హాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సినిమా ప్రదర్శన మధ్యలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్రేక్షకులు బయటకు రావడానికి మార్గం సరిగా లేకపోవడంతో 103మంది పొగలో ఊపిరాడక చనిపోయారు. ఆ రోజు ఆనందం కోసం థియేటర్‌కి వచ్చిన కుటుంబాలు కన్నీటి కథలుగా మిగిలిపోయాయి.
మరో ఘటన బెంగళూరులోని వినస్ సర్కస్‌లో 1981లో జరిగింది. పిల్లలతో వచ్చిన ప్రేక్షకులు టెంట్ కింద కూర్చుని ప్రదర్శన చూస్తుండగా, ఒక్కసారిగా అగ్ని చెలరేగి చుట్టుపక్కల వరకూ వ్యాపించింది. బయటకు పరుగెత్తే మార్గం లేక 92మంది అక్కడికక్కడే చనిపోయారు. ఆ ఘటన తర్వాత సర్కస్‌లలో భద్రతా నియమాలపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఇక ఇలాంటి అనేక ఘటనలు దేశ చరిత్రలో చెరగని మంటల ముద్రలు వేశాయి. ఒక్కో ఘటన ఒక్కో నొప్పి. ఒక్కో అగ్ని ఒక్కో గాథ. వాటి వెనుక ఉన్న బాధ, కోల్పోయిన ప్రాణాలు, విరిగిపోయిన కలలు ఎప్పటికీ మరిచిపోలేం. ఈ ఘటనలు ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయ్. అగ్ని మనకు స్నేహితుడు కాదు.. అలాగని శత్రువూ కాదు. దాన్ని మనం ఎలా చూసుకుంటామన్నదే ముఖ్యం. లేదంటే వెలుగును ఇచ్చే అదే అగ్ని.. ఒక క్షణంలోనే చీకటిని శాశ్వతంగా తెచ్చేస్తుందని గుర్తుపెట్టుకోండి.
ALSO READ: కన్నీటి చుక్కలో దాగిన శాంతి.. ఈ సమాజంపై ఓ మహిళ ఒంటరిగా గెలవగలదా?

Major Fire Accidents: మంటల్లో కాలిపోయిన లక్షల బతుకులు.. విశాఖ ఫార్మా సెజ్ నుంచి హర్యానాలోని మండి వరకు..!