ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దివ్య ఆఫీసు నుంచి ఒక్కసారిగా పరిగెత్తింది. బైక్ తీసింది. కీ తిప్పింది. హ్యాండిల్ కదిపింది. ఇంజిన్ గర్జన ప్రారంభమైంది. రోడ్డు పొడవునా ట్రాఫిక్. వాహనాల హారన్లు. రెడ్, గ్రీన్ లైట్లు. పక్కన పరిగెత్తే జనాలు. కానీ ఆమెకు ఏమీ కనిపించలేదు. ఏమీ వినిపించలేదు. చేతులు ఆటోమేటిక్లా హ్యాండిల్‌ని తిప్పుతూనే ఉన్నాయి. 15 కిలోమీటర్ల ప్రయాణం. కానీ ఆమెకే తెలియదు ఎంతదూరం నడుపుతుందో. గాలి తాకుతూ పోతోంది. కానీ గుండెకు ఉపశమనమే రాలేదు. చెమట చిందింది.. కానీ శరీరం దాన్ని పట్టించుకోలేదు. మనసులో ఒక్కటే ఆలోచన. ఇంట్లో కూతురు. ఆమె చిన్నదే. మొదటిసారి రుతుచక్రం. ఆమెకు కొత్త శరీరానుభవం. కొత్త భయం. కొత్త ప్రశ్నలు. కూతురు పేరు మౌనిక. మౌనికకు ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో దివ్యకు తెలియని పరిస్థితి. రోడ్డుపై కదులుతున్న వాహనాల కన్నా, లోపల పరిగెత్తుతున్న ఆలోచనలే వేగంగా ఉన్నాయి. ‘ఎలా చెబుదాం. ఏమని చెబుదాం. ఆమెకు అర్థమవుతుందా. ఆమె భయపడుతుందా.’ ఒక్కో ప్రశ్న ఒక్కో కిలోమీటరుగా ఆమె ముందుకు దూసుకెళ్ళింది.
సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ వెలిగింది. వాహనాలు వరుసగా ఆగిపోయాయి. ఇటు దివ్య కళ్లలో నీళ్లే తిరుగుతున్నాయి. మౌనిక ఎలా పెరిగిందో, తనను ఎంత ప్రేమిస్తుందో తన కళ్లముందే కదలాడుతున్నట్టు అనిపించింది. బైక్‌పై ఉన్నంత సేపు గుండె ఒక్కటే పేరు పలికింది..మౌనిక! సిగ్నల్ గ్రీన్ లైట్ వెలిగింది. వాహనాలు కదిలాయి. ఆమె బైక్ మళ్లీ ముందుకు దూసుకెళ్లింది. రోడ్డుపై వెళ్తుంటే అదేపనిగా హారన్ సౌండ్లు. పక్కన వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నాయి. కానీ దివ్యకు ఇదంతా శూన్యంలా అనిపించింది. ఎందుకంటే ఆమెకు ఆ సమయంలో ఉన్నది ఒక్కటే గమ్యం.. అదే ఇల్లు. చివరికి ఇంటి గుమ్మం దగ్గర ఆగింది. బైక్ నిలిచింది. కానీ ఆమె గుండె మాత్రం ఇంకా పరుగెత్తుతూనే ఉంది.
ఇంటి గుమ్మం దాటింది. లోపల అడుగు పెట్టగానే కూతురు దగ్గరకు వెళ్లాలనుకుంది. కానీ ఇంతలోనే ఫోన్ మోగింది. ఒక కాల్ ఆగక ముందే మరోకటి. బంధువులు ఒక్కొక్కరుగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఎవరో ఒకరు పండుగలా జరపమన్నారు. వేరొకరు మౌనికకు కొన్ని రోజులు నిబంధనలు పెట్టమన్నారు. ఇంకొకరు వేరే ఆచారం చెప్పారు. ఒక్కో మాట ఒక్కో రీతిగా వినిపించింది. దివ్య చేతిలో ఫోన్ ఉంది. కానీ కళ్లల్లో మాత్రం మౌనికే. ఆమె ముఖం, ఆమె భయం, ఆమె ప్రశ్నలు. మాట్లాడటానికి కూడా పెద్దగా సమయం రాలేదు. కూతురితో సాధారణంగానే మాట్లాడింది. ప్రపంచం మొత్తం ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది. ఆచారాలు, నమ్మకాలు, సంప్రదాయాలు. ఒక చోట ఒక రీతిగా, మరొక చోట ఇంకో రీతిగా ఉంటాయి. ఒక మతం ఒకటి చెబితే ఇంకో మతం మరొకటి చెబుతుంది. దివ్యకు ఇదంతా తెలియనది కాదు. కానీ ఏం చేయాలో నిజంగా తట్టలేదు. ఇంతలోనే తన గుండె ఓ నిజాన్ని పలికింది. రుతుస్రావం వల్లే జీవితం ముందుకు సాగుతుంది. అది అంటు కాదు. వారిని ముట్టుకోవడం పాపమూ కాదు. కానీ ఎందుకో ఎవరికీ ఇవేవీ పట్టవు.

దివ్య మనసు మాత్రం ఆ ఒక్క నిజాన్నే పట్టుకుంది. రుతుచక్రం అంటే జీవన చక్రం. ఇది అపవిత్రం కాదు. ఇది శరీరం రీసెట్ అయ్యే క్షణం. మానవులకైనా, జంతువులకైనా ఇదే జరుగుతుంది. పద్ధతులు వేరు. కానీ ఉద్దేశం ఒక్కటే. జీవం ముందుకు కదలాలి. ఈ రక్తాన్ని కొందరు అంటు అంటారు. కొందరు తాకవద్దంటారు. కొందరు వేరుగా కూర్చోమంటారు. మాటలు వేరైనా, పద్ధతులు వేరైనా ఒక నిజం మాత్రం మారదు. శరీరం ప్రతి నెల ఇలా మాట్లాడుతూనే ఉంటుంది. కొత్త జీవితానికి తలుపులు తెరిచి, మళ్ళీ మూసుకుంటూ, మళ్ళీ తెరుస్తూ ఉంటుంది. దివ్య ఈ ఆలోచనల్లో మునిగిపోయింది. తన కూతురు మౌనిక ఇంకా ఎంత చిన్నదో గుర్తొచ్చింది. ఆ అమాయకమైన ముఖం, ఆ బుజ్జిబుజ్జి ప్రశ్నలు, ఆ కళ్లలో తిరిగే అయోమయం దివ్యను కలిచివేశాయి. మౌనిక ఏం అనుకుంటుందో? ఏం అనుభవిస్తుందో? ఏమైనా భయపడుతుందో? అని ఆమె గుండె తడబడింది. బయట ప్రపంచం ఆచారాలు చెబుతోంది, కానీ దివ్య హృదయం మాత్రం మౌనిక మనసు చుట్టూనే తిరుగుతోంది. తన కూతురి భయం తీరాలి. ఆమె ధైర్యం పొందాలి. సమాజం చెప్పే విషయాలు పాటించినా, పాటించకపోయినా.. పెద్ద ఎత్తున ఫంక్షన్ చేసినా, చేయకపోయినా అదంతా తాత్కాలికమే. కానీ శరీరం చెప్పే నిజం శాశ్వతం. దాన్నే మౌనిక అర్థం చేసుకోవాలి. కానీ ఎలా? లోపల ఒక్కటే ప్రశ్నే తిరుగుతోంది..’నా కూతురికి నేను ఏం చెప్పాలి?’ ఇంతలోనే మౌనిక వైపు చూసింది. ‘అమ్మా, నాకు ఏమవుతోంది?‘ అని అడిగినట్టే ఆ చూపు కనిపించింది. ఆ చూపు దివ్య మనసులోని గోడల్ని చీల్చేసింది. మాటలు రావట్లేదు. శబ్దం రావట్లేదు. కానీ ఆ తల్లి గుండె మాత్రం రక్తంలా కారుతోంది. దివ్య కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. కానీ వెంటనే ఆగిపోయాయి. ఎందుకంటే మౌనిక తనను చూస్తే ఇంకా ఎక్కువగా భయపడుతుంది. ఆమెకు తల్లి బలంగా కనిపించాలి. ధైర్యంగా కనిపించాలి. ఆలోచనలలో వణుకుతూ ఉన్నా, బయట మాత్రం ఓదార్చే కరగని శక్తిలా నిలవాలి.
ఆమెకు తెలుసు.. పిరియడ్స్ గురించి నిజం చెప్పకపోతే, సమాజపు మాటలు మౌనిక మనసులో ముద్రవేస్తాయి. ‘అపవిత్రం, తాకవద్దు, ఇది పాపం‘ అనే మాటలు ఆమె గుండెలో గాయం చేస్తాయి. ఆ గాయం జరగనీయకూడదని దివ్య సంకల్పించింది. మౌనిక ఇంకా చిన్నదే. కానీ ఆమె భవిష్యత్తు పెద్దది. ఆ భవిష్యత్తు ధైర్యంగా, గౌరవంగా నిలవాలంటే ఇప్పుడు నేర్పాల్సింది నిజమే.
రుతుస్రావం అంటే అపవిత్రం కాదు. అది శాపం కాదు. అది జీవనానికి సంకేతం. ప్రతి నెలా శరీరం కొత్త జీవం కోసం తలుపులు తెరుస్తుంది. అది మూసుకుంటుంది. మళ్లీ తెరుస్తుంది. ఈ చక్రం వల్లే ఈ ప్రపంచం తిరుగుతోంది. ఈ చక్రం ఉన్నంత కాలం జీవం ముందుకు సాగుతుంది. మౌనికకు ఇది భయం కాదు, ఇది శక్తి అని చెప్పాలి. ఇది అడ్డంకి కాదు, ఇది ఆరంభం అని చెప్పాలి. ఈ రక్తమే జీవానికి వంతెన. ఈ రక్తమే మానవత్వానికి మూలం. దివ్య హృదయం లోపల ఒక వెలుగు వెలిగింది. ‘నా కూతురికి నేనిది నేర్పుతాను. ఆమె గుండెలో భయాన్ని కాకుండా గర్వాన్ని నింపుతాను. ఈ నిజమే ఆమెకు మొదటి పాఠం.’ ఇక అదే క్షణంలో దివ్యకు ఓ విషయం స్పష్టంగా అర్థమైంది. సమాజం చెప్పే మాటలు మారిపోతాయి, ఆచారాలు మారిపోతాయి, మతాలు మారిపోతాయి. కానీ ప్రకృతి చెప్పే నిజం మాత్రం మారదు. రుతుస్రావమే జీవన ప్రవాహం. అదే పవిత్రం. అదే నిజం. అదే శాశ్వతం..!
Inputs From #LakshmiAruna
ALSO READ: కట్నం తీసుకునేవాడు గాడిద కాదు మగాడిద.. పెళ్లంటే వ్యాపారమేనా?

Women’s Life: ఆఫీస్ తర్వాత మరో డ్యూటీ..! మౌనంగా భరిస్తూ.. అంతులేని బాధ్యతల మధ్య అలసిపోతున్న మహిళల మనసులు!
Language: ఆ భాష మాట్లాడే మనుషుల మీద సమాజం చిన్నచూపు.. ఎందుకిలా? ప్రతిభకు భాష కొలమానమా?
Helping Hands: అవసరం కోసం రోడ్డెక్కేది ఆడది అయితే.. తన అవసరం కోసం సాయం చేసేవాడు మగాడా?
Right to Die with Dignity: కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన’ మరణ హక్కు’ అంటే ఏంటి? దీనికి కారుణ్య మరణాలకు తేడా ఇదే
Asteroid Hit Earth? ప్రళయ ఘంటికలు..డైనోసార్ల కాలం నాటి సీన్.. ఆ గ్రహశకలం భూమిని తాకితే ఏమౌతుంది?
Pre Term birth Surgery: సీ-సెక్షన్ ఆపరేషన్లకు క్యూ కడుతున్న భారతీయులు.. అమెరికాలో అసలేం జరుగుతోంది?