ప్రపంచంలో అడుగు పెట్టిన ప్రతి జీవికి…భాష రాకపోయినా… బంధం అర్థం కాకపోయినా ఓ బాధ మాత్రం తెలుసు.. అదే ఆకలి బాధ! పేగులను పెకిలిస్తూ… నరాలను నలుపుతూ… గుండెను గుచ్చేసే బాధ అది. ఒక పూట కడుపుకు ఆహారం అందకపోతే విలవిలలాడే మనసులు మనవి. అలాంటి ఓ దేశం ఆహారం లేక చనిపోయే దుస్థితికి చేరిందంటే ఎంత విషాదమో కదా..! పాలస్తీనా గడ్డపై దాదాపు రెండేళ్లగా నెత్తుటి ప్రవాహాన్ని సృష్టిస్తోన్న యుద్ధం.. ఇప్పుడు అక్కడి ప్రజల కడుపును కొడుతోంది. అక్టోబర్ 7, 2023 తర్వాత నుంచి ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొంటున్న గాజాలో కరువు నెలకొందని ఐక్యరాజ్యసమితి అధికారికంగా ప్రకటించడం అక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. సుమారు 5లక్షల మంది ప్రజలు తీవ్రమైన ఆకలితో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ సంఖ్య సెప్టెంబర్ చివరి నాటికి సుమారు 6,41,000 మందికి పెరుగుతుందని అంచనా. అంటే జనాభాలో సుమారు మూడింట ఒక వంతు ఆకలితో అలమటించాల్సిన దుస్థితి. ఇంతటి ఘోర పరిణామాలు ఎదుర్కుంటున్న గాజాకు ఇప్పుడు కావాల్సింది మీ కన్నీళ్లు కాదు.. గొంతుకడ్డం పడ్డ దుఃఖాన్ని లోనికి దింపుకునే గుక్కెడు నీళ్ళు కావాలి…తినడానికి రెండు పూటలా ఆహారం కావాలి.
లాన్సెట్ ఏం చెబుతోంది?
మరణాల సంఖ్య గురించి కూడా కొన్ని దారుణమైన లెక్కలు కనిపిస్తున్నాయ్. 22 నెలల యుద్ధంలో 62వేల మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నా.. ఈ యుద్ధానికి సంబంధించిన మరణాలు ఇక్కడితో ఆగవని లాన్సెట్ జర్నల్ గతంలోనే కుండబద్దలు కొట్టింది. గాజాలో ఇజ్రాయెల్ బాంబులకు ఇప్పటివరకు చనిపోయింది 62వేల మందే కావొచ్చు.. అయితే రానున్న రోజుల్లో ఈ సంఖ్య 1,86,000కి చేరవచ్చు. అంటే ప్రత్యక్ష యుద్ధ మరణాల కంటే ఈ సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ. రానున్న రోజుల్లో గాజా మొత్తం జనాభాలో 8శాతం మంది మరణించే అవకాశం ఉంది. అయితే ఇవి యుద్ధం తాలుక పరోక్ష కారణాలు.
వ్యాధులమయం.. గాజా గాయం
ఈ యుద్ధం కారణంగా గాజాలో 95శాతం నీటి వనరులు పనికిరాకుండా పోయాయి. యుద్ధ సమయంలో ఆహార సరఫరాలు నిలిచిపోయాయి. సరైన తాగునీరు లేక ప్రజలు విలవిలలాడిపోయారు. ఆస్పత్రులు ధ్వంసమయ్యాయి. మెడిసిన్స్ అందుబాటులో లేకపోవడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భవిష్యత్‌లోనూ ఇది కొనసాగనుంది. ఈ యుద్ధంలో గాయాల పాలైన వారిలో 22,500 పైగా మందికి కాళ్లు లేదా చేతులు లేవు. మరికొంత మంది ఇతర అవయవాలు కోల్పోయారు. అటు వేలాది మంది పిల్లలకు పడాల్సిన టీకాలు సరైన సమయంలో అందకపోవడంతో వారంతా వ్యాధుల బారిన పడుతున్నారు. పుట్టిన పిల్లలకు సరైన వైద్య సేవలు అందడంలేదు. వీరి మరణాల రేటు పెరుగుతోంది. గాజాపై ఇజ్రాయెల్ ప్రయోగించిన వేల టన్నుల బాంబుల పేలుడు పదార్థాలు గాజాలో భూభాగాన్ని దారుణ స్థితికి తెచ్చాయి. విషపూరిత గాలులు అనేక వ్యాధులకు దారితీస్తున్నాయి. శుభ్రత లేకపోవడంతో మలేరియా, డయేరియా లాంటి వ్యాధులు తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్నాయి. పిల్లలు, గర్భిణీలు ప్రధానంగా ఈ వ్యాధులకు బలవుతున్నారు. ముందుముందు కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గాజాలో 50శాతం మందికి పైగా వైద్య సేవలు అందడం లేదు.
విషాదం.. వినాశనం..విధ్వంసం
నిత్యం గాజా గడ్డపై పడిన బాంబుల కారణంగా విషపూరిత గాలులు ఎలాంటి వ్యాధులకు దారితీస్తాయో అంతుబట్టని దుస్థితి. ఇక యూనైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం 42 మిలియన్ టన్నుల ఇసుక, రాళ్లు గాజాలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటిని తొలగించడానికి పాలస్తీనా దగ్గర తగిన టెక్నాలజీ లేదు. ఈ లెక్కన చూస్తే గాజా యుద్ధం ముందునాటి స్థితికి రావడానికి 10ఏళ్లు పైనే పడుతుంది. ఇది ఐక్యరాజ్యసమితి వేసిన అంచనా. అటు యుద్ధం మొదలైన తర్వాత గాజాలో 70శాతం జనాభా ఉపాధిని కోల్పోయిందంటే నమ్మగలరా? ఇటు వ్యాపారస్తుల దుకాణాలు నాశనమై వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్న దయనీయ పరిస్థితి ఉంది. యుద్ధం మొదలైన తర్వాత 19 లక్షల మంది తమ ఇళ్లను విడిచిపెట్టారు. గాజా జనాభాలో 80శాతం మంది తాత్కాలిక టెంట్లలో నివసిస్తున్నారు. అంటే వారికి ఇల్లు లేదు. ఒక వేళ వారి ఇళ్లు మిగిలే ఉన్నా బాంబుల దాటికి అవి ఎలా ఉంటాయో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఇప్పుడు అర్థమైందా లక్షా 86 వేల మరణాల లెక్క. అందుకే యుద్ధమంటే విధ్వంసం, యుద్ధమంటే వినాశనం.. యుద్ధమంటే ఎడతెగని విషాదం!
ALSO READ: మిస్టరీ లేదు.. పడవలు మునిగిపోవడానికి కారణం ఇదే!

నెతన్యాహు UN ప్రసంగానికి దేశాల ప్రతినిధులు నిరసనగా వాకౌట్
అమెరికా ద్వంద్వ నీతి: ఇజ్రాయెల్‌కు వేల కోట్లు, భారత్‌పై ఆంక్షలు… లెక్కలేమి చెబుతున్నాయి?
Kukatpally Incident: పిల్లల బ్యాగ్‌ల్లో కత్తులు, రాడ్లు.. పసిమనసులను హంతకులగా చేస్తుంది ఎవరు?
Gaza Hunger Crisis: నాలో ఇంకిపోయిన సముద్రాలు.. చితా భస్మమైన ఆకాశాలు.. గాజా గాయబ్!
LGBTQ: అణచివేతల చీకట్లో నిలబడ్డ వెలుగులు.. ప్రేమకు పరిధులుంటాయా? ఇది వినిపించని గొంతుల గర్జన!
Israel Nuclear : దక్షిణాఫ్రికాను ఇజ్రాయెల్ మోసం చేసిందా? సఫారీ దేశమే లేకపోతే ఇజ్రాయెల్‌కు దిక్కే లేదా?