Menu

Bermuda Triangle Mystery: మిస్టరీ లేదు.. పడవలు మునిగిపోవడానికి కారణం ఇదే!

Lakshmi Aruna 6 months ago
bermuda triangle mystery

అంతులేని సముద్రపు నీలి వలయం… ఎక్కడ చూసినా అలల ఘోష, ఎగిసే గాలుల గర్జన. ఆకాశం ముసురుకుంటే, నీటిమీద ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికీ గుండెల్లో ఒక వణుకు. ఆ ప్రాంతం పేరు వినగానే మనసు గడ్డకడుతుంది. మియామి, బెర్ముడా, రికో మధ్య ఉన్న ఆ త్రిభుజాకారం ప్రాంతాన్ని ప్రపంచం ‘బెర్ముడా ట్రయాంగిల్’ అంటుంది. అక్కడి కథలు విన్నవారికి రాత్రిళ్ళు నిద్ర పోవడం కష్టమని చెబుతారు. నౌకలు వెళ్లి తిరిగి రాకపోవడం, దానిపైన ఎగిరిన విమానాలు ఎలాంటి సంకేతం లేకుండా అదృశ్యం కావడం లాంటివి మనిషి ఊహలకు మించిన రహస్యాలు అనిపించేవి. కానీ ఇప్పుడా మిస్టరీని ఛేదించినట్టుగా చెబుతున్నారు సైంటిస్టులు.

సైంటిస్టులు చెబుతున్న మాటల ప్రకారం ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఎలాంటి మంత్ర శక్తుల గాని, అన్యలోక శక్తుల గాని, ఏలియన్ శక్తుల గాని వేదిక కాదని స్పష్టమవుతోంది. ఆ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే నౌకా మార్గాల్లో ఒకటి, అలాగే వందలాది విమానాలు దానిపైన ఎగిరిపోతుంటాయి. ఇంతటి రద్దీ ఉన్న చోట ప్రమాదాలు జరగకపోవడం అసాధ్యం. అక్కడి ప్రమాదాల సంఖ్య వాస్తవానికి ఇతర సముద్రాలకంటే ఎక్కువగా లేవని గణాంకాలు చెబుతున్నాయి. అక్కడ ప్రయాణించే నౌకలు విమానాలు ఎక్కువగా ఉండడం వల్లే ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని.. అసలు నిజం మాత్రం గణాంకాల్లోనే దాగి ఉందని సైంటిస్టులు నొక్కి చెబుతున్నారు.

ఇక వాతావరణం గురించి చెబితే, గల్ఫ్ స్ట్రీమ్ అనే శక్తివంతమైన సముద్ర ప్రవాహం అక్కడ ఉంది. ఆ ప్రవాహం ఒక్కసారిగా గాలులను మారుస్తుంది.. వర్షపు మేఘాలను తెస్తుంది.. తుఫాన్లను పుట్టిస్తుంది. ఈ మార్పులు చాలా వేగంగా జరిగిపోతాయి కాబట్టి నావికులు, పైలట్లు జాగ్రత్తగా లెక్కలు వేయకపోతే క్షణాల్లోనే దారి తప్పిపోతారు. భారీ అలలు ఒక్కసారిగా పడవను మింగేయగలవు.. గాలివాన ఒక్కసారిగా విమానాన్ని అదుపు తప్పించగలదు. ఈ పరిస్థితుల్లో చిన్న తప్పిదం జరిగినా అది ప్రాణాంతకమవుతుంది. మరో ముఖ్యమైన విషయం.. అదే మనిషి చేసే పొరపాటు. కెప్టెన్ ఒక చిన్న లెక్క తప్పినా, పైలట్ ఒక చిన్న నిర్ణయం తప్పుగా తీసుకున్నా, పరికరాలు సరిగా పనిచేయకపోయినా, అది నేరుగా ప్రమాదానికి దారితీస్తుంది. అప్పట్లో రేడియో సిగ్నల్స్ బలంగా లేవు.. సమాచారం లేదా సాయం త్వరగా చేరేది కాదు. అందుకే సముద్రంలో మధ్యలో చిక్కుకున్న నౌక ప్రమాదాన్ని తప్పించుకోలేకపోయేది. అయితే నేటి ఆధునిక కాలంలోనూ పరిస్థితి కొంచెం అలాగే ఉంది. ఎంత ఆధునిక టెక్నాలజీ వచ్చినా ఒక యంత్రం సడన్‌గా పనిచేయకపోతే, ఆ క్షణం తుఫాన్ దాడి చేస్తే, పెద్ద ప్రమాదం తప్పదని సైంటిస్టులు గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈ బెర్ముడా ట్రయాంగిల్ రహస్యానికి భూతప్రేతాలకు, ఏలియన్స్‌కు సంబంధం లేదు. ఇది ప్రకృతి శక్తుల ఆటలతో పాటు మనుషుల పొరపాట్లు, పరికరాల లోపాలు కలిసి సృష్టించిన భయంకర దృశ్యం మాత్రమేనని సైంటిస్టులు కుండబద్దలు కొడుతున్నారు.

ALSO READ: Ticket rate Hike in AP & Telangana: సినిమా పేరుతో ప్రేక్షకుడి పై దోపిడీ, దగ్గరుండి వడ్డిస్తున్న ప్రభుత్వాలు!!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *