ప్రతి రోజూ నా ఉదయం న్యూస్ యాప్‌తో మొదలవుతుంది. కళ్లు తెరవగానే వార్తలవైపు చూసే అలవాటుంది. ఎప్పటిలాగే ఇవాళ కూడా అలానే న్యూస్‌తో నా రోజు మొదలైంది. ఎన్ని పేజీలు తిరగేస్తున్నా..ఎన్ని వెబ్‌సైట్లు చూస్తున్నా చాలా చోట్లా నిమిషప్రియా పేరే కనిపించింది. ఆమెకు ఉరి తీస్తారంటూ ఓ వార్త.. ప్రస్తుతానికి వాయిదా వేశారని మరో వార్త..! ఇలా చదువుతుండగానే నా కళ్ల ముందుకు ఓ ఊహ వచ్చింది. ఒక చిన్న గది. గాలి కూడా రానివ్వనంత ఇరుకుగా గోడలున్నాయ్. ఆమె ఒంటరిగా నిలబడి ఉంది. ఒక్క నిమిషం తర్వాత ఆమె కాళ్లు నేలపై ఉండవు. ప్రాణం గిలగిలా కొట్టుకుంటున్న సమయంలో కాళ్లు గాల్లో విలవిలలాడిపోతాయ్. మెడ చుట్టూ బిగిసిన ఆ తాడు.. మనిషిగా ఉన్న అస్తిత్వాన్ని చంపేసే ఆ తాడు.. ఆమెను బతికి ఉండగానే నరకంలోకి నెడుతుంది. ఊపిరి ఆగటానికి నాలుగు నిమిషాల వరకూ పడుతుంది. ఇలా ఊహల సుడిగుండలో చిక్కుకున్న నేను.. వెంటనే భయంతో న్యూస్ పోర్టల్స్‌ను క్లోజ్ చేశాను. ఒక్కసారి గాఢంగా ఊపిరి పీల్చుకున్నా…! నా మనసంతా ప్రశ్నల వలలో చిక్కుకుంది. ఒక హత్యకు శిక్షగా మనం ఇంకో హత్య చేస్తున్నామా? చట్టం ముసుగులో ప్రభుత్వాలే హింసకు పాల్పడుతున్నాయా? మనిషిని చంపితే హింసాత్మక ఆలోచనలను చంపినట్టు కాదు కదా? ఒక మనిషిని చంపినవాడిని… చంపడమే న్యాయం అయితే ఇకపై భవిష్యత్‌లో నేరాలే జరగవని గ్యారెంటి ఉందా? అదే నిజమైతే వేల సంవత్సరాలగా కొనసాగుతూ వస్తున్న ఈ శిక్షలతో నేరాలరేటు తగ్గిందా? నేరాలు ఘోరంగా ఉండాలని శిక్షలు కూడా అంతే ఘోరంగా ఉండాలా? ఇలా ఎన్నో ప్రశ్నలు నా లోలోపల మోగడం ప్రారంభించాయ్!
ప్రాణాలను వెనక్కి తీసుకురాలేం కదా:
వెంటనే నా పుస్తకాల ప్రపంచంలోకి అడుగుపెట్టాను.. అక్కడే నాకు జవాబులు దొరుకుతాయని నమ్మకంతో మరణశిక్షల గురించి ఉన్న పుస్తకాలను, కథలను చదవడం ప్రారంభించాను. చరిత్ర లొతుల్లోకి తొంగిచూశాను. అక్కడ కనిపించిన కొన్ని పదాలు నా గుండెను బరువెక్కించాయి. న్యాయం పేరిట కోర్టులు ఇచ్చిన ఘోరమైన తీర్పులు… వేలాది కథలను పుట్టించాయి. హిట్లర్, ముసోలిని, స్టాలిన్, మావో.. ఇలా చాలామంది కంటికి కన్ను, పంటికి పన్ను అనే సూత్రాన్నే ఫాలో అయ్యారు. కేవలం నేరం చేసినవాళ్లను మాత్రమే కాదు… నేరం చేశారని అనుమానం ఉన్నవాళ్లను, తమకు ఎదురు నిలిచినవాళ్లనూ మరణశిక్షలతో చంపేశారు. ఆధారాలు లేకుండా.. కేవలం నమ్మకాలే ఆధారాంగా ఈ రాజ్య హత్యలు జరిగాయి. నిజానికి మరణశిక్ష ఓ శిక్షలా అనిపించలేదు నాకు. అది పాత కాలం నాటి ప్రతీకార నీతికి ఆఖరి అవశేషంలా కనిపించింది. ఈ శిక్షలు మనిషి వెనుక ఉన్న కుటుంబాలను శిక్షించేవి. ఓ కుటుంబం జీవితాంతం ఆ విషాదాన్ని మోస్తూ బతకడం ఎంత నరకమో అనుభవించేవారికే తెలుస్తుంది. ఓ మనిషిని నేరం చేశాడని మరణశిక్ష విధించిన తర్వాత అతను నిర్దోషిగా తేలితే ఏంటి పరిస్థితి? ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. నేరం చేశాడని మరణశిక్ష విధిస్తారు.. కొన్నాళ్లకు అతను ఏ తప్పూ చేయలేదని తెలుస్తుంది. కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. శిక్షవేసే ప్రమాదం ఉన్నపుడు ఆ పొరపాటును గ్రహించిన తర్వాత శిక్షని వెనక్కు తీసుకునే అవకాశమూ ఉండాలి. కాని ఉరితీసిన ప్రాణాన్ని వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదు.
మరణశిక్షతో నేరాలు ఆగుతాయా?
ఇలా ఎన్నో ఆలోచనలు నా మదిలో రేగాయి. నేను ఒకరి ప్రాణం తీస్తే తర్వాత నా ప్రాణం కూడా పోతుందన్న భయం మనుషులలో ఉంటే తప్ప హత్యా నేరాలు ఆగవని కొందరు చెబుతుంటారు. ఇది పైకి కరెక్ట్‌గానే అనిపిస్తుంది కాని.. ఇది ప్రాక్టికల్‌గా వర్కౌట్ అయ్యిందా అని ఇతర దేశాల చరిత్రను చదవడం ప్రారంభించాను. ప్రపంచంలో చాలా దేశాలు మరణదండనను పూర్తిగా రద్దు చేశాయి. చాలామంది భయపడుతున్నట్లు మరణదండనను నిషేధించిన ఈ దేశాల సమాజాలు అతలాకుతలం అయిపోలేదు. అభద్రతతో విలవిలలాడడం లేదు. హత్య చేసిన తర్వాత ఏ శిక్షలు విధించాలని ఆలోచించడం కంటే అసలు హత్యే చేయకుండా వారి మానసిక స్థితి మెరుగ్గా ఉండాలన్న సంకల్పమే యూరప్ సహా కొన్ని దేశాల్లో కనిపిస్తున్నాయి. ఇటు మరణశిక్షలు నిజంగా నేరస్తులను భయపెడతాయా అంటే కాదేమో అనిపించింది. 1948లో బ్రిటన్ రాయల్ కమిషన్ ఉరిశిక్ష పడిన 168 మందిని ప్రశ్నించింది. వారిలో 164 మంది గతంలో ఒక బహిరంగ ఉరిని కళ్లారా చూసిన వారే. అయినా కూడా వాళ్లు మళ్లీ మరణదండనకు గురయ్యే నేరమే చేశారు. నిజానికి నేరాలు జరగడానికి, జరగకపోవడానికి అనేక కారణాలుంటాయి. మనిషి మానసిక స్థితి నుంచి ఆర్థిక, సామాజిక ఒత్తిడుల వరకు అనేక కారణాలుంటాయి. వాటినన్నిటిని పక్కన బెట్టి శిక్ష క్రూరత్వాన్ని బట్టి నేరాల పరిమాణం ఉంటుందని వాదించడం అశాస్త్రీయమైన వాదనగా నాకు అనిపించింది.
ప్రశ్నించండి..తలవంచకండి:
మరింతగా తెలుసుకునేందుకు చరిత్ర పుస్తకాల్లోకి ఇంకా లోతుగా దిగి చదవడం మొదలుపెట్టాను. ఇప్పటివరకు నేను ఊహించనిది, చూడనిది నా కళ్ల ముందు కనిపించింది. ఇది మానవుని చరిత్ర కాదు…ఇది బలవంతపు మరణాల చరిత్ర. ప్రాచీన రోమ్ నుంచి మధ్యయుగ యూరప్ వరకూ రాజశక్తి గర్వం మరణదండనలకు కారణమైంది. మతం పేరుతో ప్రజలను వేధిస్తూ చంపే ఘటనలు కనిపించాయి. మతాన్ని ప్రశ్నించినవారిని మంటల్లో కాల్చారు.. చెరసాలలో చంపారు. ఆశ్చర్యం ఏంటంటే.. ఇలాంటి ఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయ్. 21వ శతాబ్దంలోనూ ‘బ్లాస్‌ఫెమీ’ అనే పదం ఒక మనిషిని చంపడానికి చట్టబద్ధమైన కారణంగా నిలుస్తోంది. ఒక్కోసారి శిక్షలు మన కోపానికి రూపం మాత్రమే అయిపోయినట్టు అనిపిస్తుంది. నా కోపం తీరాలి అని కాదు, సమాజం మారాలి అనే తపనతో నేను ఆలోచించాను. నేరస్తుల్ని శిక్షించకుండా వదిలేయాలన్నది కాదు నా ఉద్దేశం. సమాజంలోని హింసాత్మక ఆలోచనలకు ఆకర్షితుడైన వ్యక్తి..అదే హింసను న్యాయంగా భావించి హత్య చేస్తే మరి సమాజం మొత్తానికి శిక్ష ఎందుకు వెయ్యడంలేదు. హింసను హీరోయిజంగా చూపించే సినిమాలు, కొన్ని పుస్తకాలు మనిషిని క్రూరంగా మారుస్తున్నాయన్నది నిజం కాదా? మరి వాటికి శిక్షలుండవా? ఇటు ఇప్పటికే ఎన్నో తప్పుడు తీర్పులు చరిత్రలో కనిపిస్తాయ్. న్యాయమూర్తులు, కోర్టులు తప్పులకు అతీతమేమీ కాదు కదా! ఒక తప్పుని సరిదిద్దే అవకాశం ఉండాలి కానీ మరణశిక్ష అంటే ఆ అవకాశానికే తలుపు మూసేసినట్టే అనిపించింది. తప్పు చేసినవాడి శ్వాస ఆగిన తర్వాత, చేసిన తప్పు సరిదిద్దాలన్న ఆశ కూడా చస్తుంది. ఒక మనిషిని చంపడం కన్నా అతని ఆలోచనను మార్చడం గొప్ప విజయంగా నా దృష్టిలో నిలిచింది. ఒక్కోసారి శిక్ష ఓ నిర్ణయంగా కాకుండా… ఓ ప్రతీకారంగా మారిపోతుంది. ప్రతీకారమే న్యాయం అయితే.. న్యాయాన్ని ఎవరు కాపాడతారు? నేరస్తులను చంపే శిక్షలు కాదు..అసలు నేరాలే జరగకుండా చేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిలో ఉండాలి. కారకుణ్ని శిక్షించే సమాజం కాదు.. కారణాన్ని ప్రశ్నించే సమాజం కావాలి.
ALSO READ: నా సముద్రపు కన్నీటి కథ..రహస్య ప్రపంచంలో తేలియాడుతున్న రాకాసి ప్లాస్టిక్ కవర్లు!

Rationalist Files: ‘ఆమెను మోసం చేశారు..’ నిజమైన హేతువాదం సోషల్‌మీడియాలో కాదు.. నిజ జీవితంలో కనిపించాలి..! సిద్ధాంతాల వెనుక దాక్కునే పిరికితనం!
Adenoids: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!
Marriage System: ఇది పెళ్లి కాదు..దోపిడి..! ఇదేం సన్నాసి సంత.. ఇంతటి నీతిమాలిన వివాహ వ్యవస్థ ఎక్కడా ఉండదు!
Middle Class Dreams: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!
Life Lessons: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?
Business Ideas: ఈ 6 బిజినెస్ ఐడియాస్తో మీరు లక్షలు సంపాదించవచ్చు.. పెట్టుబడి కూడా చాలా తక్కువ!