Menu

Art of Questioning: ప్రశ్నించే హక్కు లేనప్పుడు…అది నీ జీవితమెందుకవుతుంది?

Lakshmi Aruna 7 months ago
question and reason lifestyle tips

ఒక చిన్నవాఖ్యం కాదు ఇది.. మన లోపల గట్టిగా ప్రతిధ్వనించాల్సిన ప్రశ్న. ఎందుకంటే… మనం బ్రతికే జీవితం నిజంగా మనదేనా? లేక., ఎవరో మూర్ఖంగా రాసిన స్క్రిప్ట్‌ని సైలెంట్‌గా నటిస్తూ గడిపేస్తున్నామా?

నిజం చెప్పాలంటే..మనలో చాలా మంది జీవించడాన్ని జీవితం అనుకుంటూ.. ప్రశ్నించడాన్ని తిరుగుబాటు అనుకుంటూ బ్రతుకుతున్నాం. చిన్నప్పటి నుంచే…ఇంట్లో తల్లిదండ్రులు ఏదైనా చెప్పినప్పుడు ‘ఇలా ఎందుకు?’ అని అడిగితే ‘నీకెందుకురా ?పెద్ద పుడింగిలా వచ్చాడు అడగటానికి ?’ అని ఎగతాళిగా మాట్లాడేవారు. నాకు తెలిసి ప్రతీ ఇంట్లో అదే జరిగి ఉంటుంది…ఒక ప్రశ్న అడిగితే ఏదో తప్పు చేసినట్టు చూస్తారు.

ఇక స్కూల్‌కి వెళ్తే? టీచర్ చెబుతాడు ‘ఇదిలా నేర్చుకున్నాం, ఇదే సరైన పద్ధతి’అని. అప్పుడు విద్యార్థి అడిగాడు ‘ఇది ఇలా కాకుండా ఇంకోలా చేస్తే?’ అని. సరే ప్రయత్నిద్దాం అనే మాటే రాదు కదా…ఇంకా ఎక్కువ మాట్లాడితే పరీక్షల్లో మార్కులు తగ్గిస్తారు. అక్కడి నుంచే మొదలవుతుంది.. మన గొంతు లోపలే మాట మింగేయడం.

ఆఫీసుకెళ్లాకా ఇంకాస్త ఘోరం…తప్పు జరుగుతుంది. నీ ముందు జరుగుతుంది. నీవు ప్రశ్నిస్తే “నీ పనినువ్వు చూసుకో” అంటారు. వాట్సాప్ గ్రూపుల్లో నోటిదూల అనిపిస్తారు. సైలెంట్ విత్ స్మైల్…అదేనండి ఏం జరిగినా నాకు అనవసరం. నాకు శాలరీవస్తుందా తీసుకుంటున్నామా..అలాగే ప్రమోషన్ వస్తుందా ఇంతే మనకి కావాలి అన్నట్టు ఉంటే
‘ఒక మంచి టీం ప్లేయర్’ అంటారు. కలలు కనాలని చెబుతారు కానీ.. ఆ కలల దారిలో ఉన్న ప్రశ్నల్ని నరికేస్తారు.

ఒక అమ్మాయి తన జీవితాన్ని తానే తీర్చిదిద్దుకోవాలనుకుంటే.. అదే కుటుంబ గౌరవానికి మచ్చ అంటారు. ఒక కుర్రాడు తన జాబ్‌ని వదిలేసి వ్యాపారం చేయాలనుకుంటే.. వేరెవరో చేసిన తప్పుల జాబితాలో అతడ్ని పెట్టేస్తారు. కానీ ఇక్కడే ఒక ప్రశ్న ఉంది..!

మన నిర్ణయాలు మనవి కావాలంటే, మనకు స్వేచ్ఛ ఉండాలి.. ఆ స్వేచ్ఛ ఉండాలంటే, మనకు ప్రశ్నించే హక్కు ఉండాలి. అది లేకుండా బతికే జీవితం పూర్తిగా డబ్బింగ్ లాంటి ఓ నాటకం.మన అణగదొక్కిన మాటలే.. మన ప్రశ్నించని బాధలే.. మన భవిష్యత్తుకి రూపాన్నిస్తుంటాయి. ఒక చిన్న బాలుడు రోడ్డుపై మట్టి తింటుంటే మనం చూస్తాం.. సెల్ఫీ తీస్తాం.. కానీ ఎందుకు తింటున్నావ్? మీ అమ్మగారు ఎక్కడ? అని అడగం.

ఒక కూలీకి తినేందుకు సరిపడా జీతం రావడం లేదు..కానీ అతని యజమాని బంగారు కార్లో వెళ్తాడు. ఆ వ్యత్యాసాన్ని మనంచూస్తాం అయినా కూడా ప్రశ్నించం. ఎందుకంటే మనకు అలవాటు కాలేదు ప్రశ్నించడానికి! అదే బాధ. ప్రశ్నించమని ఎవరు నేర్పించలేదు మనకు…కానీ నిజమైన మార్పు అక్కడే మొదలవుతుంది.ఒక మాస్టర్ చెప్పిన పాఠం కన్నా..
ఒక విద్యార్థి అడిగిన “ఎందుకు?” అనే ప్రశ్నలోనే నిజమైన విద్య ఉంటుంది.

ఒక ఉద్యోగి మేనేజర్‌ని అడిగిన “ఈ విధానం అవసరమా?” అన్న ప్రశ్నలోనే సమర్థత ఉంటుంది. ఒక మహిళ “ఇది నా జీవితం… ఎందుకు డిసైడ్ చెయ్యాలి?” అని అడిగే ప్రశ్నలోనే స్వేచ్ఛకు ఆవిర్భావం ఉంటుంది. ప్రశ్నించడం అనేది వాగ్దానం కాదు…వ్యతిరేకత కాదు…అది మనిషిగా ఎదగాలనే నిబంధన.

మనం ప్రశ్నించాలి.. ప్రతి చోట.. ప్రతి విషయంపై.. ప్రశ్నించాలి..ఎందుకంటే మనం బాధపడుతుంటే,ఆ బాధకు సమాధానం కావాలి.
ప్రశ్నించాలి..ఎందుకంటే మన కళ్లముందే జరిగిన అన్యాయం మౌనంగా ఊహించలేం.
ప్రశ్నించాలి.. ఎందుకంటే మన బుద్ధికి, మన గళానికి విలువ ఉండాలి.

ఇంతకీ.. ప్రశ్నించలేని జీవితానికి అర్థమేంముంది?

అందుకే.. నీ గొంతును వినిపించు.నీకు అసహ్యంగా అనిపించిన చోట ప్రశ్నించు.
నీకు తృప్తి లేకపోయిన చోట నిలబడి ప్రశ్నించు.ఎందుకంటే.. ప్రశ్నించే హక్కు లేనప్పుడు.. అది నీ జీవితం కాదు. అది ఎవరో రాసిన కథ, నువ్వు తప్పనిసరిగా నటిస్తున్న చేస్తున్న పాత్ర మాత్రమే. ఇప్పటికైనా బదులు కాదు ప్రశ్నను ఎంచుకో. ప్రశ్నించు.. మారుతుంది.ప్రశ్నించడమే మొదటి అడుగు. మిగిలిన ప్రయాణం.. నీదే.

ALSO READ: భయం మధ్య బతికిన ధైర్యం… ఇద్దరు పిల్లల కోసం ప్రపంచంతో పోరాడిన ‘నిర్భయ’!

 


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *