Menu

Swiss Glacier Collapse: నిన్న స్విట్జర్లాండ్‌.. రేపు ఇండియా.. ఈ పాపం ఎవరిది?

Lakshmi Aruna 8 months ago
Swiss glaciologists warn that rising temperatures are destabilising permafrost, which typically holds rocks and glaciers in place.

ఒక ఊరు… పర్వతాల మధ్యలో, మంచుతో ముసురు కప్పిన అందమైన స్వర్గం..! ఎప్పటిలాగే పిల్లలు చిరునవ్వుతో ఆడుకుంటున్నారు… తల్లి వంటింట్లో పిల్లలకు ఏం కావాలో రెడీ చేస్తోంది. అమ్మమ్మ, తాతయ్య కబుర్లతో ఆ ఊరి జీవితమంతా శాంతంగా ప్రయానిస్తోంది. కానీ ఇంతలోనే అంతా తారుమారు అయ్యింది. భూమి ఒక్కసారిగా శ్వాస ఆపేసినట్టుగా అనిపించింది… ఆకాశం దిగి వచ్చిందా అనే అనుమానం కలిగింది. కొండలు గర్జించాయి… మంచు ఎగసిపడింది… ఊహించని ఆ క్షణంలో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరిగెత్తారు. ఓ 40 సెకన్లలో ఆ ఊరి ముఖచిత్రమే మారిపోయింది. కళ్లముందే ఆ ఊరు మాయమైపోయింది. పిల్లల నవ్వులు ఆగిపోయాయ్.. ఇంట్లో వెలిగిన అగ్ని రాలిపోయింది… మాటలు గాలిలో కలిసిపోయాయి. ఇది ప్రమాదం కాదు…ఇది శాపం… ఇది నిద్రలో వచ్చే భయంకర కల కాదు… ఇది జరిగిన వాస్తవం… ఎక్కడో కాదు.. స్విట్జర్లాండ్‌లోని బ్లాటన్‌లో..! ఎవరూ ఊహించలేదు… ఎవ్వరూ ఆపలేకపోయారు… ప్రకృతి తన పగ తీర్చుకుంది… కానీ ఈ పగ ఎందుకు? ఎవరు చేసిన పాపం? ఈ పాపం ఎవరిదో కాదు.. మనదే..! అవును..! మనదే..! మన జీవనశైలి… ఈ భూమిని రక్తంతో అలంకరిస్తోంది. ఇప్పుడు బ్లాటన్‌లో జరిగింది.. రేపు ఇండియాలోనే జరగొచ్చు.. ఎందుకంటే భారత్ కూడా అదే నిర్లక్ష్యపు నీడలో నిద్రపోతోంది. ఇప్పుడు గట్టిగా శ్వాస తీసుకో… గట్టిగా ఆలోచించు… ఎందుకంటే… అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది.

బూడిదగా మిగిలిపోయిన చరిత్ర

బ్లాటన్ ఊరిలో కొండపై ఉన్న బిర్చ్ గ్లేసియర్.. కిందకు జారిపోతుందనీ, ఎప్పుడైనా అది కూలిపోవచ్చనీ సైంటిస్టులు ఎప్పటినుంచే హెచ్చరిస్తున్నారు. అయితే ఎవ్వరూ ఊహించలేదు ఇది ఎంతటి విపత్తును తెచ్చిపెడుతుందో. సుమారు 1.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల మంచు, రాళ్ళు, మట్టి ఒక్కసారిగా కొండలపై నుంచి కూలింది. బ్లాటన్‌ను మింగేసింది. దీని కారణంగా లొన్జా నది దారి మళ్లిపోయింది. ఇటు వందల ఏళ్ల నాటి ఇళ్లు, తాతముత్తాతల జ్ఞాపకాలు, జనాల కలలన్నీ నిమిషాల్లో మట్టిలో కలిసిపోయాయి. పైనుంచి వచ్చిన ఆ మిశ్రమం భీకరమైన శక్తితో దూసుకొచ్చింది. అది భూకంపాన్ని తలపించింది. ఆ ఊరి మధ్యలో ప్రవహించే నది దారి మళ్లడంతో ఒక భారీ తాత్కాలిక సరస్సు ఏర్పడింది. అది మరింత ప్రమాదాన్ని సూచిస్తోంది. ఆ నీరు ఎప్పుడైనా ఒక్కసారిగా దూసుకొచ్చి దిగువ గ్రామాలను ముంచే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఊరిలో 90 శాతం భవనాలు పూర్తిగా కూలిపోయాయి. మట్టిపొరల కింద చిన్న పిల్లల బొమ్మలు, పుస్తకాలు బయట పడుతున్నాయి. వాటిలోని మౌనం… నిజంగా చెదిరిపోయిన ఆశల అరుపులా వినిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక ఊరు, ఒక సమాజం, ఒక చరిత్ర… బూడిదగా మిగిలిపోయింది. ఇదంతా ఎందుకు జరిగిందో నేను మీకు క్లియర్‌గా చెబుతా వినండి.

హిమాలయాల వద్ద సేమ్ సీన్?

క్లైమేట్ ఛేంజ్.. వాతావరణ మార్పు…! అవును..! వాతావరణ మార్పుల కారణంగానే ఈ విపత్తు సంభవించింది. ప్రకృతిలోని సహజ సమతుల్యతను మనం నాశనం చేయడమే ఈ బ్లాటన్ విషాదానికి మూలకారణం. స్విట్జర్లాండ్‌లోని పర్వతాల్లో వేలాది ఏళ్లుగా ఉండే మంచు నిదానంగా కరిగిపోతోంది. ఇది వేగంగా, నియంత్రణలేకుండా కరిగిపోవడానికి కారణం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో గత శతాబ్దంలోనే సుమారు 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇది ప్రపంచ సగటు కంటే రెట్టింపు వేగం. ఈ వేడి ప్రభావం అక్కడి భూమిలో దాగిన మంచును కూడా కరిగిస్తోంది. దీన్ని ‘పెర్మాఫ్రాస్ట్’ అని పిలుస్తారు. ఇది కొండల చీలికల మధ్యలో ఉండే మంచు లాంటి పదార్థం. ఇది శతాబ్దాలుగా ఆ కొండలను ఒకే చోట ఉంచుతుంది, అదే పెర్మాఫ్రాస్ట్ ఇప్పుడు కరిగిపోతోంది. దీంతో కొండలు జారిపోతున్నాయి.. రాళ్ళు ఊడిపడుతున్నాయి. మనం ఊహించని విధంగా, ప్రకృతి తలకిందులవుతుంది. శాస్త్రవేత్తల ప్రకారం.. స్విస్ గ్లేసియర్‌లు కేవలం 2022 నుంచి 2023 మధ్యకాలంలోనే 10శాతం వాల్యూమ్ కోల్పోయాయి. మరో 2.5శాతం నష్టం 2024లో నమోదైంది. అంటే మూడేళ్లలోనే మూడొంతుల గ్లేసియర్ మాయమైంది. ఇది కేవలం మంచు కరిగిపోవటం కాదు… ఇది భవిష్యత్తు మాయమవటం. పెర్మాఫ్రాస్ట్ కరిగితే, కొండలు నిలబడలేవు. పర్వతాలు మనపై పడిపోతాయి. భూమి కింద నిలిచే నీటి నిల్వలు తక్కువవుతాయి. వేసవిలో వచ్చే ఆ నీటి ధారలే మన జీవనదుల మూలం. అవి తగ్గిపోతే వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి లాంటివి ప్రమాదంలో పడతాయి. ఇది కేవలం స్విట్జర్లాండ్ సమస్య కాదు.. ఇది హిమాలయాల సమస్య కూడా…! భవిష్యత్తులో ఇండియా కూడా ఇలాంటి ఘోరాలు చూడొచ్చు.

ఏం చేయాలి?

హిమాలయాలు కూడా ఇప్పుడు అదే ప్రమాదపు నీడలో నిలబడి ఉన్నాయి. ఇవి కేవలం పర్వతాలు మాత్రమే కాదు… ఇవి మన దేశానికి జీవనదులైన నదులకు మూలం. ఇక్కడ ఉన్న మంచు పర్వతాలు.. గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్ లాంటి భారీ నదులకు జన్మనిచ్చాయి. ఈ నదులు 200 కోట్ల మందికి పైగా తాగునీరు, వ్యవసాయానికి అవసరమవుతున్నాయి. ఇటు హైడ్రోపవర్‌కూ మూలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ హిమాలయాలు వేడెక్కుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఇక్కడ కూడా వేగంగా పని చేస్తోంది. 2000 నుంచి 2023 మధ్యలో హిమాలయాలలోని మంచు సగటున 5 నుంచి 21 శాతం వరకు తగ్గిపోయింది. పరిస్థితి ఇలానే కొనసాగితే.. హిమాలయాలు మృత్యు ప్రవాహాలకూ దారితీస్తాయి. హిమాలయాల్లో ఏర్పడే గ్లేసియల్ లేక్స్.. కరిగిన మంచుతో నిండి, ఒక్కసారిగా పగుళ్లు తెరుచుకుంటే భారీ వరదలు వస్తాయి. 2013లో కేదార్నాథ్ విషాదం గుర్తుందా? అదే తరహాలో 2023లో సిక్కింలోని గ్లేసియర్ పగిలి, భారీ వరదలతో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే ఈ విషయాన్ని హెచ్చరిస్తున్నాయి. ఇది కేవలం నీటి సమస్య కాదు.. ఇది ఆహారం, విద్యుత్, జీవితం అన్నింటినీ తాకే విపత్తు. మనం ఈ భయంకర విపత్తును ఇప్పుడే ఎదుర్కొవాలి. లేదంటే మన భవిష్యత్తు మంచులో కరిగిపోయిన జ్ఞాపకాలుగా మిగిలిపోతుంది. స్విట్జర్లాండ్‌లో బ్లాటన్ ఊరు మాయమైంది… రేపు మన ఊరే మాయమవుతుంది. నిజానికి ప్రకృతి ఓ మాతృమూర్తిలా ఉంటుంది… కానీ మన దురాచారాలతో ఆమెను రాక్షసిగా మార్చుకుంటే… మనల్ని కాపాడేవారే ఉండరు. ఇప్పటికైనా మేలుకోండి… మిగిలింది మన చేతుల్లోనే ఉంది.

ALSO READ: కళ్ళ ముందు పెనుభూతం,చోద్యం చూస్తున్న పాలకులు ప్రజలు.. తర్వాత జరిగేది ఇదే!

 


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *