Menu

CEOs-Employees: పని తక్కువ.. పెత్తనాలు ఎక్కువ..! జీతాలు కూడా దోచుకుంటున్న ఆఫీస్‌ పెద్దలు!

Masked Voice 9 months ago
CEO Salary in india

ఒకడు రాజులా బతుకుతుంటే.. ఇంకొకడు దాసులా జీవిస్తున్నాడు. ఒకడు గంటకు లక్షలు సంపాదిస్తుంటే.. ఇంకొకడు 24 గంటలు కష్టపడినా కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ఉన్నాడు. భారతీయ సమాజంలో ఈ విధమైన అసమానత ఎలా ఏర్పడింది? ఒకరికి కోట్లల్లో జీతాలు వరదలా వస్తుంటే.. ఇంకొకరికి తినడానికి భోజనం కూడా ఎందుకు భారం అవుతోంది? టాలెంట్‌, స్కిల్‌ అనే సమాధానాలు మాత్రం దయచేసి చెప్పద్దు..అది కాయిన్‌ ఒక సైడ్‌ మాత్రమే.. నాణేనికి మరోవైపు ఉండే నిజం చాలా చేదుగా ఉంటుంది. ఆక్స్‌ఫామ్ సంస్థ విడుదల చేసిన నివేదిక చూస్తే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. CEOలకు, సామాన్య ఉద్యోగులకు జీతాల్లో ఉన్న తేడాలను ఈ రిపోర్ట్ ఎత్తిచూపింది. ఇంతకీ ఆ తేడాలు ఎంత? CEOలకు, సాధారణ ఉద్యోగులకు జీతంలో తేడా ఉంటే తప్పెంటని ఆలోచిస్తున్నారా?

వాళ్ల వర్గం, కులం, వాళ్ల కింద చెప్పులా పడి ఉండే వాళ్ల శాలరీలు ఏడాదికి రెండుసార్లు పెరుగుతాయ్..!

ఇంత గ్యాప్‌ ఎందుకు బాసూ?

ఆక్స్‌ఫామ్ సంస్థ విడుదల చేసిన ఓ నివేదిక సమాజంలోని అసమానతలపై కన్నీటి సత్యాన్ని బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కంపెనీలపై అధ్యయనం చేసిన ఈ రిపోర్ట్‌ ప్రకారం, 2019 నుంచి ఇప్పటివరకు CEOల వార్షిక జీతం సగటున 50 శాతం పెరిగింది. అంటే అది సుమారుగా 2 కోట్ల 70 లక్షల నుంచి 4 కోట్ల 50 లక్షలకు చేరింది. ఇదే సమయంలో ఉద్యోగుల జీతాలు పెరిగిన శాతం ఎంతో తెలుసా? కేవలం 0.9 శాతం మాత్రమే. అంటే నెలకు పదివేలు సంపాదించే వాడికి 500రూపాయలు పెరిగినట్టు లెక్కా! ఇక CEOల జీతాల్లో కేవలం నెల జీతం మాత్రమే ఉండదు.. కంపెనీ వాటాలో షేర్లు, లాభాల్లో వాటాలు, బోనసులు కూడా ఉంటాయి. ప్రతి సంవత్సరం వాళ్ల ఖాతాల్లో కోట్లు వచ్చి చేరుతుంటే.. పని చేసే వారి చేతుల్లో మాత్రం నెలాఖరులో డబ్బు మిగలడం కూడా కలలా మారింది. ఇండియాలో సగటు CEO జీతం దాదాపు 2 కోట్ల రూపాయలు. అదే జర్మనీలో 4 కోట్ల 50 లక్షల రూపాయలు. ఐర్లాండ్‌లో అయితే ఏకంగా 6 కోట్ల 70 లక్షల రూపాయలు. ఇక సాధారణ ఉద్యోగుల సంగతైతే దారుణంగా ఉంది. ఇండియాలో ఓ ఉద్యోగి తన కుటుంబాన్ని సాదాసీదాగా పోషించాలంటే నెలకు 32,565 రూపాయలు కావాలి. కానీ ప్రస్తుతం అందుతున్న సగటు జీవన వేతనం 22,696 రూపాయలు మాత్రమే. పన్నులు కట్టిన తర్వాత చేతిలో మిగిలేది 21,411 రూపాయలు మాత్రమే. అంటే నెలకి కనీసం పదివేలు తక్కువగా ఉండే వేతనంతో ఎలా బతకాలి? ఇదే కష్టాన్ని దేశవ్యాప్తంగా లక్షల కుటుంబాలు అనుభవిస్తున్నారు. అకాడమిక్‌ స్థాయిలో గొప్పగా చదివిన విద్యార్థులు ఇప్పటికీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు.. అటు ఉద్యోగం ఉన్నవాళ్లు వేతనం పెరుగుతుందా లేదోనన్న భయంతో బతుకుతున్నారు.. కానీ CEOల వర్గం మాత్రం వార్షికంగా వందల కోట్ల సంపదను పెంచుకుంటోంది. అంతేకాదు ప్రపంచ బిలియనీర్ల సంఖ్య కూడా అమాంతం పెరుగుతోంది. ఇటు పేదవాడు మరింత పేదవాడిగా మారుతున్నాడు. ఇదంతా ఒకప్పటి జమీందారి వ్యవస్థను తలపిస్తోంది.

ఇక్కడ టాలెంట్ తో పని లేదు.. యజమానికి ప్రియమైన వారై ఉండాలి

భూములకు యజమానుల్లా మారిపోయిన CEOలు

ఒకప్పుడు జమీందారులు వ్యవసాయ భూముల యజమానులుగా ఉండేవారు. భూమి వారి పేరు మీద ఉండేది.. కానీ దానిపై పనిచేసే రైతుకు సరైన కూడు కూడా దక్కేది కాదు. రైతు శ్రమించిన తర్వాత వచ్చే లాభమంతా చివరకు జమీందారికే వెళ్లేది. ఇప్పుడు ఇదే తత్వం కార్పొరేట్ ప్రపంచంలోకి వచ్చేసింది. కంపెనీని ఒక పెద్ద భూమిలా భావిస్తే.. CEOలు, ఇతర పెద్దలు ఇప్పుడు ఆ భూములకు యజమానుల్లా మారిపోయారు. ఉద్యోగులు రైతుల్లా రోజూ కష్టపడుతుంటారు. ఉదాహరణకి ఇండియాలో టాప్ ఐటీ కంపెనీల్లో సగటు ఉద్యోగి మధ్యస్థాయి జీతానికి చేరుకోవాలంటే 10–12 ఏళ్లు పడుతుంది. అప్పటికి కూడా వార్షిక వేతనం 15 లక్షల లోపే ఉంటుంది. కానీ అదే సంస్థ CEOకి ఏడాది జీతం 40 కోట్లకుపైగా ఉంటుంది. అంటే ఒక CEO ఆదాయాన్ని ఒక సగటు ఉద్యోగి సంపాదించాలంటే దాదాపు 300 సంవత్సరాలు పడుతుంది.

టాలెంట్ ఉండదు కానీ…

అటు CEOలు బోర్డు మీటింగుల్లో నిర్ణయాలు తీసుకునే హక్కును కలిగి ఉంటారు. వారి నిర్ణయాలతో వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు మారిపోతుంది. ఉద్యోగుల శ్రమతో కంపెనీలు లాభాల్లోకి వస్తే.. ఆ లాభాల్లో ఉద్యోగులవారికి భాగస్వామ్యం ఉండదు. కానీ నష్టాలు వస్తే తొలగింపులు, జీతాల్లో కోతలు, ఒత్తిళ్లు మాత్రం ఉంటాయి. అటు CEOలు అందుకునే వాటాలు, స్టాక్‌ ఆప్షన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి ప్రదర్శనతో సంబంధం లేకుండా ఉంటున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అన్ని చోట్ల ఇలానే జరుగుతుందని కాదు.. కొన్ని సంస్థల్లో మాత్రం పరిస్థితి ఇలానే ఉంటుందన్నది అంగీకరించాల్సిన వాస్తవం. కంపెనీలు నష్టాల్లో ఉన్నా CEOల జీతాలు మాత్రం ఇండియాలో పెరుగుతూనే ఉన్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది చట్టాల మాటున న్యాయంగా కనిపించే ఓ దోపిడీ వ్యవస్థ. అందుకే దీన్ని మోడ్రన్‌ జమీందారీ వ్యవస్థ అని పిలుస్తున్నారు. మనం జీవించే రియాలిటీ ఇదే.

మహిళలకు మరింత అన్యాయం

మరోవైపు ఇండియా చూస్తున్న ఇంకో భయంకర సమస్య నిరుద్యోగం. యువతకు కలగా ఉండే ఉద్యోగం ఇప్పుడు భయంగా మారింది.ప్రతిఏడాది లక్షల మంది యువతులు, యువకులు డిగ్రీ పట్టాలు అందుకుంటున్నారు కానీ.. అందులో చాలా మందికి ఉద్యోగాలు దొరకడం లేదు. కనీసం ఇంటర్న్‌షిప్‌ కూడా దొరకడం కష్టంగా మారింది. ఒకవేళ ఉద్యోగం దొరికినా బాండ్లతో వేధిస్తున్నాయి కంపెనీలు. 15వేల జీతంతో మూడేళ్ల పాటు బాండ్‌ రాయించుకుంటున్న కంపెనీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇటు కంపెనీలు ఏమో ఫ్రెషర్స్‌కు స్కిల్ లేదని డైలాగులు పేల్చుతుంటాయి. ఈ మాటల చెప్పడం చాలా ఈజీనే కావొచ్చు.. కానీ స్కిల్‌ను నేర్చుకునే అవకాశమే లేని అకాడమిక్‌ సిలబస్‌లు ఇండియన్‌ ఎడ్యూకేషన్‌ సిస్టమ్‌లో ఉన్నాయన్న విమర్శలున్నాయి. ఇక ఉద్యోగంలో ట్రైనీగా చేరిన వాళ్లకు సైతం గోల్‌షీట్లు, రివ్యూల పేరుతో ఒత్తిడి పెడుతూ.. ప్రతి రోజు భయంతో గడిపేలా చేస్తున్నారు. అసలు స్కిల్‌ నేర్పించకుండా చాకిరీ చేయించే కంపెనీలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా ఉద్యోగుల పరిస్థితి మరింత బాధాకరం. ఒక్క వేతనంలో తేడానే కాదు.. వారి శ్రమను గుర్తించకపోవడం అత్యంత విషాదం. సమాన పనికి సమాన వేతనం ఇప్పటికీ దక్కడంలేదు. ఉదాహరణకు ఒక వారంలోకి ఐదు రోజుల పని ఉంటే.. పురుషులు ఐదు రోజులకూ జీతం తీసుకుంటారు. అదే మహిళలు ఐదు రోజులు పనిచేసినా కూడా.. వారికి నాలుగు రోజులకు మాత్రమే జీతమే వస్తోంది. ఎందుకంటే పురుషులతో పోలిస్తే మహిళలకు సగటున 20 శాతం తక్కువ జీతం ఇస్తున్నారు. ఇది మహిళలకు ఓ రోజు జీతం మినహాయించినట్టే అవుతోంది. ఇలా సామాన్య ఉద్యోగి, ఇటు మహిళలు ఈ వ్యవస్థకు అతిపెద్ద బాధితులగా నిలుస్తున్నారు. ఎవరో ఒకరు.. ఎదో ఒక సమయంలో తమ ఆత్మగౌరవాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితిలో పడుతున్నారు. అందుకే ఈ వ్యవస్థను మార్చడం కేవలం అవసరమే కాదు.. అత్యవసరం కూడా!

ALSO READ: టార్గెట్ల ముసుగులో జర్నలిజం ఏనాడో చ*చ్చిపోయింది.. కాదు కాదు యాజమాన్యాలు చం*పేశాయి!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *