‘ఒక్కొక్కడికి ఉంటదిరా మీకు.. గుర్తు పెట్టుకోండి… ఒక్కొక్కడికి ఉంటది.. మడత పెట్టి మడత పెట్టి మడతపెట్టి ఉంటది..’
ఇదేదో బోయపాటి సినిమాలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ అనుకుంటే మీరు మరుగుతున్న సాంబర్లో ముఖం పెట్టినట్టే! ఇది ఓ యూట్యూబ్ ఛానెల్లో యాంకర్ చెప్పిన డైలాగ్. ఆయన కూడా బాలయ్య బాబుకు ఏం తక్కువ కాదులేండి..! ఈ యాంకర్ గారు ఏం మడతపెడతారో తెలియదు కానీ.. ఆ డైలాగ్ విన్న తర్వాత మూర్ఛ వచ్చి మంచంమీద పడ్డ వారి సంఖ్య చాలా ఎక్కువే. కోలుకోవడానికే రెండు రోజులు పట్టింది. కశ్మీర్ ఉ*గ్రదాడి లాంటి సున్నితమైన అంశాన్ని ఎంతో బాధ్యతగా, విద్వేషాలు రెచ్చగొట్టకుండా రిపోర్ట్ చేయాల్సిన మీడియా.. ఆ పని చేయకపోగా.. అడ్డమైన థంబ్‌నెయిల్స్ పెట్టి వెగటు పుట్టిస్తోంది. ఆ ఛానెల్ థంబ్‌నెయిల్స్ చూస్తే మరింత ఘోరం..
కొడుకులు చ*చ్చారు
కుక్కల్లారా.. రండిరా చూసుకుందాం
చ*చ్చారు నా కొడుకులు
కొడకా.. పాక్‌కు జై కొడతావా?
ఎందుకో.. ఏమో..! తెలుగులో కొడుకు, కొడకా తప్ప ఎలాంటి పదాలు లేవేమో..! లేకపోతే పది థంబ్‌నెయిల్స్ పెడితే అందులో ఐదు ఇలానే ఉంటున్నాయ్..! పాకిస్థాన్ని తిడితే ఓట్లు వస్తాయని రాజకీయ పార్టీలు భావించినట్టే.. పాకిస్థాన్‌ను ‘అమ్మ నా’ అంటూ బూతులు తిడితే వ్యూస్ వస్తాయ్ అని ఆ ఛానెల్ పెద్దలు భావించడం అత్యంత దుర్మార్గం. ఇప్పటికే ఆ ఛానెల్‌పై బూతు ముద్ర పడింది. చూసే యూజర్లలో ఎక్కువగా ఆ బాపతే..! ఇది సరిపోదన్నట్టు పాకిస్థాన్ ఉ*గ్రవాదులపై స్టూడియో నుంచే యుద్ధం ప్రకటించారు. వాళ్లు చేస్తున్న ఓవరాక్షన్ చూస్తుంటే పాక్‌పై యుద్ధానికి ఆర్మీ అక్కర్లేదనిపిస్తోంది. ఈ ఉన్మాద థంబ్‌నెయిల్స్ పెట్టే సబ్‌ఎడిటర్లను, దాని అప్రూవ్ చేస్తున్న వారిని బార్డర్ దగ్గరకు పంపిస్తే సరిపోతుందనిపిస్తోంది. ఇంతగా ‘R’otha పుట్టిస్తున్న ఆ ఛానెల్ వ్యూస్‌లో నంబర్-1 అట. వీడియోలకు ఎన్ని బూస్టులు కొట్టుకున్నారో తెలియదు కానీ.. ప్రజలకు మాత్రం విద్వేష విషాలు ఎక్కించడంలో మాత్రం ఆ ఛానెల్‌ను మించినది ఈ భూమండలంపై మరొకటి లేదని చెప్పవచ్చు. అర్ణబ్ గోస్వామి కూడా ఇంత అతి చేయడేమో అనిపించేలా దేశ ప్రజలపై ఉన్మాద భక్త భావజాలాన్ని ఆ ఛానెల్ రద్దుతుండడం చాలా విషాదం. పహల్గామ్ దాడిపై 56 ఇంచుల వీరుడు, సూరుడు, ధీరుడు మోదీ ఎలా రియాక్ట్ అయ్యాడో తెలియదు కానీ.. ఈ ఛానెల్ చేసిన హాడావుడి చూస్తే మాత్రం జర్నలిజంపై జాలి వేస్తోంది. జర్నలిజం అంటే కుర్చీలు మడతపెట్టడం అని తెలిస్తే నాటి రామోజీరావు, దాసరి నారాయణరావు నుంచి నేటి రాధాకృష్ణ, వెంకటకృష్ణల వరకు ఎవరు ఎన్ని కుర్చిలు మడత పెట్టార్రా అనే ప్రశ్న మదిలోకి వస్తోంది.
మేమంతా అంతే బ్రో:
ఇక కేవలం ఈ ఒక్క ఛానెల్ మాత్రం ఇలా లేదు. కుక్కను చూసి నక్క వాతపెట్టుకున్నట్టు దాదాపు ప్రతీ తెలుగు యూట్యూబ్ ఛానెల్ ఇదే పద్ధతిలో చిదరపుట్టిస్తోంది. దీనికి మెయిన్‌స్ట్రీమ్ ఛానెళ్లు, వెబ్సైట్లు మినహాయింపు కాదు. అతనెవరో స్టూడియో నుంచే పాక్‌పై యుద్ధం ప్రకటించాడు. రణమా, శరణమా అంటున్నాడు. పాక్‌ను కరివేపాక్ అంటున్నాడు. అతనేదో ఇండియన్ ఆర్మీ చీఫ్ లెవల్ ఫీల్ అవుతున్నాడు. కానీ వాస్తవానికి ఆయనో ఎల్లో ఆర్మీ చీఫ్. ఆ విషయాన్ని మర్చిపోయి సడన్‌గా ఆక్, పాక్ అని ఏదో అంటున్నాడు. ఇదంతా ఎందుకు? అసలు వీళ్లంతా ప్రొగ్రామ్ హోస్ట్‌లా, ఘోస్ట్‌లా? సున్నితమైన అంశాన్ని ఎలా డీల్ చేయాలో తెలియని జర్నలిజాన్ని నిజంగా మడతపెట్టి, మడతపెట్టి పాతిపెట్టాలి.
ఏం కో*స్తారో ఏమో
కశ్మీర్ ఉ*గ్రఘటన మొదలైన నాటి నుంచి తెలుగు మీడియాలో ఎక్కువగా బోయపాటి డైలాగులే కనిపిస్తున్నాయి. యాంకర్ల నోటి నుంచి, వీడియో థంబ్‌నెయిల్స్‌తో పాటు బ్యాగ్రౌండ్ టైటిల్స్‌లో ఎక్కువగా చం*పుతాం, నరు*కుతాం, కోసి కారం పెడతాం లాంటి హింసను ప్రేరేపించే ఉన్మాద పదాలే కనిపిస్తున్నాయి. ఏం కోస్తారో.. ఎవరిని నరు*కుతారో తెలియదుకానీ.. వీళ్లందరికి నిజంగా అంత ఆవేశమే ఉంటే వెళ్లి కశ్మీర్ బోర్డర్లో యుద్ధం చేయవచ్చు కదా? స్డూడియో నుంచే తోడలు కొట్టడం దేనికి? అసలు వీళ్లంతా జర్నలిస్టులా, యాక్టర్లా? లేదా టెర్ర*రిస్టులను మించిన ఉన్మాదులా? కచ్చితంగా వారికి వారుగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. మీరు చేసే అతి సమాజానికి మంచి చేయకున్నా పర్వాలేదు కానీ.. ఇప్పటికే మీ బూతు కంటెంట్‌తో ప్రజలను మరింత నీచ ఆలోచనా స్థితికి చేరుకునేలా చేస్తున్నారు.
వారిని చూసి బుద్ధి తెచ్చుకోండి:
ఏ వీడియో కింద చూసినా హింస, ఉన్మాదం, వివక్ష, ఓ మతంపై ద్వేషం వెళ్లగక్కే కామెంట్లే కనిపిస్తున్నాయి. అవి కామెంట్లతోనే ఆగవు కదా..! మీ కంటెంట్ వారి నరనరానా ఎక్కుతుంది. అది రేపటి సమాజాన్ని ఛీద్రం చేస్తుంది. అసలు మీడియా ఈ స్థాయికి దిగజారడానికి కేవలం ఇప్పటి యూట్యూబ్ బూతు బ్యాచ్ మాత్రమే కారణం కాదు. కంటెంట్‌లో ఉండే తెలుగు అక్షరదోషాలను భూతద్దంలో చూసి వెతుకుతూ.. నైతిక విలువలను ఏ మాత్రం బోధించని తెలుగు జర్నలిజం స్కూళ్ల నుంచే ఈ దిగజారుడుతనం మొదలైంది. అసలు ఓ ఘటనలను రిపోర్ట్ చేసేటప్పుడు లేదా రాసేటప్పుడు సదరు జర్నలిస్టులకు ఎలాంటి ఐడెంటిటి ఉండకూడదు. మతం, కులం, ప్రాంతం మాత్రమే కాదు.. దేశం పట్ల కూడా ‘మనం’ అనే భావన ఉండకూడదు. BBC లాంటి ఏ ఇతర దేశానికి చెందిన మీడియాను చూసినా వారి రిపోర్టింగ్, రైటింగ్‌లో ఎక్కడా కూడా ‘మనం’ అనే భావన ఉండదు. ‘Britain ruthlessly exploited India..’ ఈ పదాలు బీబీసీ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌లోవే! బ్రిటన్ నుంచే ఈ ఆర్టికల్ పబ్లీష్ అయ్యింది. ఇందులో ఎక్కడా కూడా we,us లాంటి పదాలు లేవు. ఎందుకంటే ఆ వ్యాసాన్ని ఏ దేశస్థుడు చదివినా బ్రిటన్ ఇండియాను ఎలా దోచుకుందనే అర్థమే వస్తుంది. మన ఇండియన్ మీడియా మాత్రం వేరు. అసలు ఇలా ఇండియాను తిట్టే ఇండియన్ జర్నలిస్టులే తక్కువనుకోండి..తిట్టినా ఏ చట్టమో నెత్తిన వేసి జైల్లో పెడతారనుకోండి.. ఇదంతా రాజకీయం.. ఇటు మీడియా విషయానికి వస్తే.. ముఖ్యంగా తెలుగు మీడియాలో ‘మనోళ్లు’ అనే పదం ఎక్కువగా వాడుతుంటారు. మనోళ్లు అంటే ఎవరు? మన కులపోళ్లా? మన మతంవాళ్లా? మన దేశస్థులా? తిరుమల లడ్డూ కల్తీ ఎపిసోడ్లో ఓ తెలుగు మీడియా యాంకర్ అతనో హోస్ట్ అనే విషయాన్ని మర్చిపోయాడు. మన హిందువులకే ఇలా ఎందుకు జరుగుతుందని గెస్టును ప్రశ్నించాడు. ఎపిసోడ్ అంతా అతనో హిందువు ప్రతినిధిగా మాట్లాడాడు. ‘మా లడ్డూనే కల్తీ చేస్తారా’ అంటూ ఊగిపోయాడు. ఇదేదీ ఎవరికీ తప్పుగా అనిపించకపోవచ్చు. కానీ ఆస్ట్రేలియన్ మీడియా భారత్ క్రికెటర్లపై ఏదైనా నెగిటివ్ కామెంట్ చేస్తే మాత్రం ఆ సమయంలో ప్రతీ ఒక్కడికి జర్నలిజం గుర్తొస్తుంది. ప్రేక్షకులకు మిడిల్ ఫింగర్లు చూపించే మా ప్లేయర్లనే అంటావా అంటూ అంతా ఊగిపోతారు. మేం ఏ ఫీంగర్ అయినా చూపిస్తాం అని కౌంటర్లు ఇస్తారు. జర్నలిజం విలువలు తెలియవా అని ప్రతీ ఒక్కడూ ఉపన్యాసాలు దంచుతాడు. నిజానికి ఏ దేశంలో ఉన్న మీడియా అయినా కూడా మనం అనే భావనను విడిచిపెట్టి రిపోర్ట్ చేయాల్సిందే. మతమరపమైన లేదా ఇతర అంశానికి చెందిన సున్నితమైన వార్తలపై కచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే. ఈ విలువలేవీ బోధించకుండా స్పెల్లింగ్ తప్పులు వెతుకుతూ కూర్చోడానికి మీరైమైనా తెలుగు టీచర్లా? అసలు కొన్నిసార్లు వార్తలు రాస్తున్నామో, తెలుగు పరీక్ష రాస్తున్నామో అనే అర్థంకానీ దుస్థితి రైటర్లకు ఉంటుంది. అక్షరదోషలు ఉండకుండా రాయడం మంచి విషయమే.. కానీ దానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన విలువలను హూస్సెన్ సాగర్‌లో కలిపి, నిమజ్జనం చేసి, అమూల్యమైన నీటిని(జర్నలిజాన్ని) విషంతో నింపుతామంటే ఎలా కుదురుతుంది?
తమ్ముళ్లూ… ప్లీజ్ మారండి:
ఇక ఇలా ఎందుకు రెచ్చగొడుతున్నావ్.. ఇలా ఎందుకు థంబ్‌నెయిల్స్ పెడుతున్నారని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రజలకు అదే కావాలని.. అందుకే అలా పెడతామని వింతవాదనకు దిగుతారు. ప్రజలు గడ్డి తింటే మనం వారికి ఆ గడ్డే పెట్టాలా? అన్నం పెట్టకూడదా? వారిని గడ్డి తినకుండా ఆపలేమా? మెజార్టీ ప్రజలు ఎలాగో గడ్డే తింటారు..అందుకే సున్నితమైన విషయాల పట్ల కూడా నోటికి వచ్చింది మాట్లాడతారు.. కానీ వారు తినే గడ్డికి మీ అదనపు గడ్డి అవసరమా? పైగా మీడియా పెట్టే గడ్డికి ఇంపాక్ట్ ఎక్కువ. అది తియ్యగుంటుంది. ఇదిగో న్యూస్‌లో కూడా వచ్చింది చూడు అని ఆనందంతో గడ్డిమెసే ప్రజలు చాలా ఎక్కువే ఉంటారు. సినిమాలు చూసి జనాలు మారుతారా అని ఆర్జీవీ లాంటి సామాజిక శాస్త్రవేత్తలు ప్రశ్నించినట్టే.. న్యూస్ చూసి జనాలు మారుతారా అని వీళ్లు కూడా ప్రశ్నించవచ్చు. నిజానికి మారుతారు.. అక్షరాలకు, మాటలకు ఆ శక్తి ఉంది. సినిమాలో హీరో చెప్పే ఒక్క డైలాగ్ ఎంతోమందిపై ప్రభావంచూపుతుంది. ఇది బూతు సినిమాలు తీసే వంగా,దొంగా లాంటి డైరెక్టర్లకు తెలియకపోవచ్చు.. కానీ జర్నలిస్టులకు తెలియాలి.. తెలిసి తీరాలి..! లేదంటే రేపటి ఉన్మాద ఘటనలకు, అల్లర్లకు మీ వార్తలే కారణం కావొచ్చు.. మీ థంబ్నెయిల్సే ప్రేరణ కావొచ్చు.. అందుకే మీ మాటలను, రాతలను మడతపెట్టి, మడతపెట్టి, మడతపెట్టి అదుపులో పెట్టుకోవాల్సిందే!
ALSO READ: టార్గెట్ల ముసుగులో జర్నలిజం ఏనాడో చ*చ్చిపోయింది.. కాదు కాదు యాజమాన్యాలు చం*పేశాయి!

Rationalist Files: ‘ఆమెను మోసం చేశారు..’ నిజమైన హేతువాదం సోషల్‌మీడియాలో కాదు.. నిజ జీవితంలో కనిపించాలి..! సిద్ధాంతాల వెనుక దాక్కునే పిరికితనం!
Adenoids: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!
Marriage System: ఇది పెళ్లి కాదు..దోపిడి..! ఇదేం సన్నాసి సంత.. ఇంతటి నీతిమాలిన వివాహ వ్యవస్థ ఎక్కడా ఉండదు!
Middle Class Dreams: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!
Life Lessons: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?
Business Ideas: ఈ 6 బిజినెస్ ఐడియాస్తో మీరు లక్షలు సంపాదించవచ్చు.. పెట్టుబడి కూడా చాలా తక్కువ!