Menu

Pulwama to Pahalgam: ఆర్టికల్‌-370 రద్దు చారిత్రాత్మక తప్పిదం.. ఈ లెక్కలే సాక్ష్యం!

Tri Ten B 10 months ago
jammu kashmir pahalgam

కాలం మారింది.. సంవత్సరాలు గడిచిపోయాయి.. కానీ గుండెల్ని ఛిద్రమయ్యేలా చేసిన కాలకూటం మాత్రం ఇంకా కశ్మీర్‌ గడ్డపై విషం చిమ్ముతూనే ఉంది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఘటన దేశాన్ని వేదనలో ముంచేసిన దుర్మార్గంగా నిలిచిపోయింది. 40 మంది జవాన్ల ప్రాణాల్ని బలిగొన్న ఆ దురంతానికి చెందిన నెత్తుటి గాయాలు ఇంకా మానకముందే.. ఇప్పుడు 2025 ఏప్రిల్ 22న పహల్గాంలో మరోసారి రక్తం పారింది. ఈసారి జవాన్లు కాదు.. అమాయక పర్యాటకులే లక్ష్యం. పహల్గాం ఘటన దేశ గుండెలో గుచ్చుకున్న గాయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఇక పుల్వామా ఘటన జరిగి ఆరేళ్లు గడిచినా కశ్మీర్‌లో ఇప్పటికీ రక్తం కారుతూనే ఉంది. ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? కశ్మీర్ నిజంగా ఎటు పోతోంది?

ఒకే దేశం – ఒకే రాజ్యాంగం

ప్రస్తుత కశ్మీర్‌ సమస్యను అర్థం చేసుకోవాలంటే ఓ సారి 2019లో ఏం జరిగిందో గుర్తుచేసుకోవాలి. ఉగ్రవాదాన్ని తగ్గిస్తామనే కారణంతో 2019, ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేసింది. దీంతో జమ్ముకశ్మీర్‌కు అప్పటివరకు ఉన్న స్వయం ప్రతిపత్తి హోదా పూర్తిగా తొలగిపోయింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో అమలయ్యే నిబంధనలే జమ్ముకశ్మీర్‌కూ వర్తించేలా మోదీ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం దేశ చరిత్రలో ఓ ల్యాండ్‌ మార్క్‌ డెసిషన్‌. ‘ఒకే దేశం – ఒకే రాజ్యాంగం’ సిద్ధాంతంతో తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత జమ్ముకశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఒకటి లడఖ్, రెండోది జమ్మూకశ్మీర్. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వమే కాదు.. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు స్వాగతించారు. కానీ కశ్మీరీల మనసులో ఏముందో మాత్రం తెలుసుకునే ప్రయత్నమే చేయలేదనే విమర్శలున్నాయి. ఇక ఈ నిర్ణయం తర్వాత అభివృద్ధికి బదులు బందోబస్తు, రాజకీయ హక్కులకంటే ముందు ఆంక్షలు వచ్చాయి. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత లాంటివి మొదలైపోయాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌లో ఉగ్రవాదం తగ్గిందని, భద్రత బలపడిందని ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చింది.

ఎక్కడ అదుపులోకి వచ్చిన్నట్టు?

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయన్నది ప్రభుత్వ మాట కానీ గణాంకాలు చూస్తే వాస్తవిక చిత్రం భిన్నంగా కనిపిస్తుంది. 2018లో 597 ఉగ్ర సంబంధిత ఘటనలు నమోదయ్యాయి. ఆ ఏడాది 91 మంది భద్రతా సిబ్బంది, 55 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత 2019లో ఈ సంఖ్య 369కి తగ్గింది. కానీ ఈ తగ్గుదల తర్వాతి సంవత్సరాల్లో కనిపించలేదు. 2020లో 415, 2021లో 460 ఘటనలు నమోదయ్యాయి. 2022 తర్వాతే కొంత తగ్గుదల కనిపించింది. 2023లో 267, 2024లో 210 ఉగ్ర సంబంధిత ఘటనలు మాత్రమే రికార్డయ్యాయి. పౌరుల మరణాల్లో కూడా పెద్దగా మార్పులు కనిపించలేదు. 2019లో 42 మంది పౌరులు ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోగా, 2020లో 33, 2021లో 36 మంది మరణించారు. 2023లో ఇది 12కి పడిపోయినా, 2024లో మళ్ళీ 31కి చేరింది. 2025లో ఏప్రిల్ 22న పహల్గాం దాడిలో ఒక్కరోజే 28 మంది పర్యాటకులు చనిపోవడం ఈ సంఖ్యను మళ్ళీ భీకరంగా పెంచింది. భద్రతా సిబ్బందిపై దాడుల పరంగా కొంత తగ్గుదల కనిపించినా.. ఇది ఉగ్రవాదం పూర్తిగా అదుపులోకి వచ్చిందని చెప్పే స్థాయిలో లేదు.

ఎడతెగని కశ్మీర్ రక్తకథ

ఇటు ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో శాంతి నెలకొందని కేంద్రం చెప్పినా.. ఇటీవల కశ్మీరీ పండితులపై జరిగిన వరుస దాడులు చూస్తే భయం పుట్టక మానదు. 1990నాటి ఘోర అనుభవాన్ని మళ్ళీ గుర్తుకుతెచ్చేలా 2021 నుంచి దాడులు మళ్లీ మొదలయ్యాయి. ప్రత్యేకించి 2022లో బుద్గాం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న రాహుల్ భట్‌ను కార్యాలయంలోనే కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అదే ఏడాది ఇతర ప్రాంతాల్లోనూ కశ్మీరీ హిందువులపై దాడులు జరిగాయి. ఇవన్నీ ‘ది రేసిస్టెన్స్ ఫ్రంట్’ అనే సంస్థ పేరు మీద జరుగుతున్నాయి. ఇక ఇదే సమయంలో.. ఉగ్రవాద కార్యకలాపాలు కశ్మీర్ నుంచి జమ్ము వైపు మళ్లినట్లు 2023, 2024 సంవత్సరాల్లో కనిపించింది. గత రెండేళ్లలో జమ్ము ప్రాంతంలో దాదాపు 60కు పైగా దాడులు నమోదయ్యాయి. ఇటు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లాంటి పాక్ ప్రేరిత టీమ్‌లు కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. అటవీ ప్రాంతాలుగా మారిన రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోకి ముష్కరులు చొరబడుతున్నారు. ఈ పరిణామాలతో కశ్మీర్‌ లాగే జమ్మూ ప్రాంతాలు కూడా కొత్త ఉగ్రవాద కేంద్రంగా మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలా మొత్తంగా చూస్తే కేంద్ర పాలన, ఆర్టికల్ 370 రద్దు, భద్రతా బలగాల విస్తరణ, నిఘా వ్యవస్థల పెంపు… ఇవన్నీ కశ్మీర్‌లో శాంతిని తీసుకొస్తాయన్న ఆశలతో మొదలైన ప్రయాణం గందరగోళంగా సాగుతోంది. దాడులు తగ్గినా, ముప్పు తగ్గలేదు. పుల్వామాలో మొదలైన ఈ రక్తకథ.. ఆరేళ్ల తర్వాత పహల్గాంలోనూ కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: మతాల మంటల నడుమ, దేవుడినే ధిక్కరించిన భావజాలం; నాస్తికత్వం!

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *