హార్వర్డ్ యూనివర్సిటీ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్..! ఇప్పుడిదే వరల్డ్ వైడ్ బిగ్ టాపిక్. అమెరికా విద్యా వ్యవస్థలో అత్యున్నత శిఖరంగా నిలిచిన ఈ సంస్థ.. ఇప్పుడు అగ్రరాజ్య అధ్యక్షుడితో తాడోపెడో తేల్చుకుంటోంది. జాన్ అడమ్స్ నుంచి బరాక్ ఒబామా వరకు.. ఏకంగా 8మంది అమెరికా అధ్యక్షులు ఈ విద్యాలయం నుంచే డిగ్రీలు పొంది ప్రపంచాన్ని శాసించారు. అమెరికా సుప్రీంకోర్టుకు 22 మంది న్యాయమూర్తులను అందించిన ఘనత హార్వర్డ్ లా స్కూల్‌కే దక్కుతుంది. ఈ యూనివర్శిటీకి చెందిన వారిలో ఇప్పటివరకు 161 మంది నోబెల్ బహుమతి గ్రహీతలున్నారు. ఇది ప్రపంచంలో ఏ ఇతర విశ్వవిద్యాలయం సాధించని ఘనత. ఇంతటి ట్రాక్ రికార్డున్న హార్వర్డ్ యూనివర్శిటీ ఇప్పుడు ట్రంప్‌కు లక్ష్యంగా మారింది. అమెరికా విద్యా వ్యవస్థలో ఈ యుద్ధం పెను ప్రకంపనలకు కారణమైంది. ఇంతకీ హార్వర్డ్ టార్గెట్‌గా ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? వీటిని హార్వర్డ్ ఎలా తిప్పికొట్టాలనుకుంటోంది? ఈ ఘర్షణ అమెరికా భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపనుంది?
హార్వర్డ్ ఓ జోక్!
అధికారంలోకి రాకముందు విమర్శలుగా మొదలైన ట్రంప్ వ్యాఖ్యలు… ఇప్పుడు ప్రభుత్వ స్థాయిలో చర్యలుగా మారాయి. అధ్యక్షుడిగా తిరిగి అధికారం చేపట్టిన వెంటనే..హార్వర్డ్ లాంటి ఐవీ లీగ్ యూనివర్సిటీలపై తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు ట్రంప్. ఐవీ లీగ్ అంటే అమెరికాలోని ఎనిమిది అత్యున్నత ప్రైవేట్ యూనివర్సిటీల సమూహమని అర్థం. ఇటు హార్వర్డ్ అమెరికాకు అవసరం లేదని..అది ఒక జోక్ అయిపోయిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు ట్రంప్. యూనివర్సిటీ తీరుపై, పాలనపై, విద్యార్థుల ఎంపిక ప్రక్రియలపై ప్రశ్నలు వేశారు. తన పాలనలో ఇకపై హార్వర్డ్ పద్ధతులు సాగవని.. తానే నిబంధనల్ని విధించనున్నట్టు స్పష్టం చేశారు. అంతేకాదు.. ఇటీవల ఫెడరల్ నిధుల పేరిట హార్వర్డ్‌కు దక్కే సుమారు 18వేల కోట్ల రూపాయల ఫండింగ్‌ను ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది. ఇక యూనివర్శిటీకి ఇప్పటివరకు ఉన్న పన్ను మినహాయింపు హక్కును కూడా రద్దు చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అటు ట్రంప్ విధించిన షరతులు చూస్తే.. వాటి వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం స్పష్టమవుతుంది. యూనివర్సిటీ పాలనలో మార్పులు, మెరిట్ ఆధారిత ఉద్యోగ నియామకాలు, ప్రవేశ ప్రక్రియల్లో మార్పులు, అంతర్జాతీయ విద్యార్థుల ఎంపికపై నియంత్రణ లాంటి అంశాలపై ట్రంప్ కామెంట్స్ చేశారు. ఇక DEI..అంటే డైవర్సిటీ, ఇక్విటీ, ఇంక్లూజన్ కార్యక్రమాల రద్దు లాంటి డిమాండ్స్‌ను ముందుకుతెచ్చారు ట్రంప్. ఈ షరతులు పూర్తిగా అమలైతే, హార్వర్డ్ లాంటి స్వతంత్రంగా పనిచేసే విద్యాసంస్థ ఒక ప్రభుత్వ శాఖలా మారిపోతుంది. విద్యా, పరిశోధన అంశాలు ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చేస్తాయి. ట్రంప్ ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.
అభిప్రాయ స్వేచ్ఛపై ఉక్కుపాదం
అటు ట్రంప్ నిర్ణయాలకు హార్వర్డ్ తలవంచడంలేదు. అమెరికా ప్రభుత్వానికి సవాలు విసురుతోంది. ఇది కేవలం నిధుల కోత మాత్రమే కాదని.. తమ స్వాతంత్ర్యంపై దాడి అంటూ కౌంటర్ ఇస్తోంది. యూనివర్శిటీ ప్రెసిడెంట్ నుంచి అధ్యాపకులు, పరిశోధకులు వరకు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. ఇప్పటికే హార్వర్డ్ ఫ్యాకల్టీకి చెందిన 800 మంది పైగా సిబ్బంది.. ఒక లీగల్ పిటిషన్‌కు సహకరించారు. ప్రభుత్వ చర్యలు చట్ట విరుద్ధమని కోర్టును ఆశ్రయించారు. మరోవైపు హార్వర్డ్ యూనివర్శిటీ తన ఆర్థిక వ్యూహాల్లో కూడా కీలక మార్పులు చేస్తోంది. నిధుల రాక ఆగిపోవడంతో.. ఈ ఏడాది ఇప్పటికే 3500 కోట్ల రూపాయల విలువలైన బాండ్లను అమ్మకానికి పెట్టింది. అయితే.. హార్వర్డ్‌కు ఉన్న 4 లక్షల కోట్ల రూపాయల్లో 80శాతం వరకు ప్రత్యేక ప్రయోజనాలకు కేటాయించిన నిధులే ఉన్నాయి. అంటే వాటిని యూనివర్శిటీ సాధారణ ఖర్చుల కోసం ఉపయోగించకూడదు. ట్రంప్ చర్యలు ఇలానే కొనిసాగితే.. ఉద్యోగాల తొలగింపులు, ల్యాబ్ మూతపడటం, పరిశోధనల నిలిచిపోవడం లాంటి పరిణామాల్ని హార్వర్డ్ ఎదుర్కొవాల్సి రావచ్చు. అందుకే హార్వర్డ్ న్యాయాన్ని, న్యాయస్థానాలనే నమ్ముకుంటోంది. అటు మిగిలిన యూనివర్శిటీలు సైతం హార్వర్డ్‌కు మద్దతుగా ముందుకొస్తున్నాయి. ఎందుకంటే ఈ సమస్య కేవలం హార్వర్డ్ది కాదు.. ఇది మొత్తం యూనివర్శిటీల అభిప్రాయ స్వేచ్ఛకు సంబంధించిన సమస్య. ఇవాళ హార్వర్డ్‌కు వచ్చిన సమస్యే.. రేపు ఇతర యూనిర్శిటీలకూ రావొచ్చు కదా!
విద్యార్థుల గళాన్ని అణచివేయడమే లక్ష్యమా?
ఇలా హార్వర్డ్‌తో పాటు ఇతర యూనిర్శిటీలు మొదలుపెట్టిన ఈ తిరుగుబాటు.. అమెరికా విద్యా వ్యవస్థలోనే కాదు.. దేశ రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో, స్వేచ్ఛా భావనల్లోనూ ఒక పెద్ద అలజడి తీసుకురానుంది. ఇది కేవలం ఒక్క యూనివర్శిటీ పోరాటం కాదు. దీని వెనుక ఉన్న భావం స్పష్టంగా అర్థమవుతోంది. విద్యాసంస్థలు ప్రభుత్వాల ఒత్తిడికి లోనవ్వకూడదు. అవి స్వతంత్రంగా ఆలోచించగలగాలి. పరిశోధనలు ఎలాంటి భయంలేకుండా జరగాలి. ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే.. ఈ ఉద్యమం మరో రకమైన చీకటి శక్తిని ఆపేందుకు జరుగుతోంది. అదే.. భావ ప్రకటనా స్వేచ్చా! ఇటు రాజకీయ అభిప్రాయాల ఆధారంగా విద్యార్థులను అణచివేయడమో, అకడమిక్ స్వేచ్ఛపై కంట్రోల్ వేయడమో మొదలైతే.. అది డెమొక్రసీకి ప్రమాదమే. అందుకే హార్వర్డ్ ఎత్తిన ఈ గళం.. అమెరికాలో అభిప్రాయ స్వేచ్ఛను కాపాడేందుకు కీలకంగా మారనుంది.
అమెరికా భవిష్యత్తు అయోమయం
నిజానికి ఈ యుద్ధాన్ని కేవలం హార్వర్డ్ వర్సెస్ ట్రంప్‌గా చూస్తే అది పెద్ద పొరపాటే. ఎందుకంటే హార్వర్డ్, MIT, స్టాన్‌ఫర్డ్ లాంటి యూనివర్శిటీల ఆవిష్కరణలే… ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. కరోనా టైంలో వచ్చిన RNA వ్యాక్సిన్లతో పాటు.. ఇంటర్నెట్, ఏఐ టెక్నాలజీ లాంటి అనేక ఆవిష్కరణలకు అమెరికా యూనివర్శిటీలే కేంద్రంగా నిలిచాయి. ఇవి లేకపోతే మానవాళి ఎంత వెనక్కి వెళ్లేదో ఊహించలేం. అందుకే ఇవాళ హార్వర్డ్‌పై ట్రంప్ చేసే ఈ దాడి…మొత్తం ప్రపంచ విద్యావ్యవస్థపై దాడిగానే చూడాల్సి ఉంటుంది. వాస్తవానికి అమెరికా ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా మారడానికి హార్వర్డ్ లాంటి యూనివర్శిటీలు కూడా కారణం. కానీ ట్రంప్ ఆలోచన మాత్రం వేరేలా ఉంది. భిన్న భావజాలన్ని ట్రంప్ భరించలేరని..అందుకే వివిధ సమూహాలకు అడ్డాగా ఉండే యూనివర్శిటీలపై ఈ తరహా దాడులు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే హార్వర్డ్‌పై ట్రంప్ చూపుతున్న ఈ ద్వేషం…అమెరికా భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే చరిత్రాత్మక తప్పిదంగా మిగిలిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది.
ALSO READ: టార్గెట్ల ముసుగులో జర్నలిజం ఏనాడో చ*చ్చిపోయింది.. కాదు కాదు యాజమాన్యాలు చం*పేశాయి!

USA WEAPONS: అమెరికా రాజకీయాల నీడలో నలిగిన మరో దేశం.. ఇది చాలా దారుణం!
Balochistan: బలూచిస్థాన్ రక్తపాతం.. పాక్ ఆరోపణలను ఖండించిన భారత్.. అసల కథేంటి?
Jeffrey Epstein Files: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్.. కొత్త లీక్‌లో బయటపడిన సంచలన విషయాలు..!
Donald Trump Tariffs: ట్రంప్ తలతిక్క పనులు.. అమెరికాకే ఎసరు..ఈ లెక్కలే సాక్ష్యం!
Social Media Vetting: స్వేచ్ఛకు సంకెళ్లు.. సోషల్‌మీడియా పోస్టులను చెక్ చేస్తున్న ట్రంప్.. నెక్ట్స్ ఏం జరగనుంది?
Careers: ట్రంప్ గారి నిర్వాకం.. అమెరికా వెళ్లాలంటేనే జంకుతున్న భారతీయులు!