Menu

America New Rule: ‘అమెరికాను విడిచిపెట్టి వెళ్లిపోండి..’ వారందరికి ట్రంప్‌ డెడ్‌లైన్!

Tri Ten B 10 months ago
donald trump new rules

అమెరికా…! ఒకప్పుడు ప్రపంచం మొత్తం ఆశగా చూసిన దేశమది. ఇప్పుడు మాత్రం సీన్‌ మొత్తం రివర్స్‌..! అమెరికా(America) గడ్డపై రోజుకో కొత్త కలకలం.. రోజుకో కొత్త ఆదేశం.. ఒక కొత్త హెచ్చరిక..! ప్రతి రోజూ ఒక కొత్త బాంబు అక్కడి వలసదారులపై పడుతుంది. ఈ బాంబు కంటికి కనిపించదు, దాని శబ్దం వినిపించదు.. అది నేరుగా కుటుంబాల గుండెల్లో పేలుతుంది. అందుకే అమెరికాకు వెళ్లాలన్నా.. అక్కడ ఉండాలన్నా ఇతర దేశస్థులకు ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు.. ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న భయం అక్కడి వలసదారుల్లో నిత్యం కనిపిస్తోంది. ఆ భయాలను మరోసారి పెంచేలా అమెరికా ప్రభుత్వం నుంచి మరో బాంబు లాంటి వార్త వచ్చింది. ఇది వలసదారుల ఆందోళనను రెట్టింపు చేసింది. స్వచ్చందంగా అమెరికా విడిచిపెట్టి వెళ్లిపోవాలంటూ ఓ అధికారిక ప్రకటన వెలువడింది. దీన్ని ‘సెల్ఫ్‌ డిపార్చర్‌(Self Departure)’ అని పిలుస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ విధానాన్ని తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటా విధానం..? ఈ విధానం పాటించకపోతే ఎదురయ్యే నష్టాలు ఏంటి..? ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంలో అసలేముంది?

ఇదేం రూల్‌ ట్రంప్‌?

అమెరికాలోకి వచ్చి 30 రోజులు దాటిన ప్రతి విదేశీయుడి తప్పనిసరిగా ఫెడరల్ ప్రభుత్వానికి తమ వివరాలు నమోదు చేసుకోవాలని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీసా సమయంలో ఫింగర్‌ప్రింట్‌ లేదా ఇతర సమాచారం నమోదు చేయని వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిన ట్రంప్‌ సర్కార్‌.. అక్రమవలసల విషయంలో కఠినంగా వ్యవహారిస్తోంది. ఈ కొత్త నిబంధనను పాటించనివారిపై జరిమానాలు మాత్రమే కాదు… జైలు శిక్ష కూడా పడనుంది. ఇదంతా ఒక రిజిస్ట్రేషన్ ప్రక్రియ లాగా కనిపించినా.. దాని వెనక ఉన్న ఉద్దేశం మాత్రం చాలా తీవ్రమనే చెప్పాలి. అమెరికాలో ఎవరున్నారు, వారు ఎక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని సేకరించడమే అమెరికా ప్రభుత్వ లక్ష్యం. ఇలా చేయడం కారణంగా అక్రమంగా ఉన్నవారిపై చర్యలు తీసుకోవచ్చు. నిజానికి ఈ నిబంధన గతంలోనే ఉన్నా.. ఇప్పుడు ఈ ప్రక్రియను తప్పనిసరి అని ప్రకటించడం వలసదారులలో భయాన్ని మరింత పెంచింది. ఇక ఏదైనా డాక్యుమెంట్స్‌ లేవని అనిపిస్తే.. ‘సెల్ఫ్‌ డిపార్చర్‌’ చేసుకోవచ్చని సూచించింది.

సెల్ఫ్‌ డిపార్చర్‌ అవ్వాల్సిందేనా?

‘సెల్ఫ్‌ డిపార్చర్‌’ అంటే.. ఎవరు అక్రమంగా ఉన్నారో, వాళ్లే స్వయంగా నిర్ణయం తీసుకుని అమెరికా విడిచిపెట్టాలి. ప్రభుత్వం వారిని పట్టుకోకముందే, చట్టపరమైన వ్యవహారాల్లో ఇరుక్కోకముందే, స్వయంగా వెళ్లిపోవాలన్నది ఈ ప్రక్రియ ఉద్దేశం. ఇలా చేయడం వల్ల ఇకపై భవిష్యత్‌లో అమెరికాలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయని ట్రంప్‌ ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఇటు తాత్కాలికంగా ప్రాసిక్యూషన్‌ నుంచి కూడా తప్పించుకునే అవకాశముంటుందట. ఈ విధానాన్ని పాటించాలనుకునే వారు ముందుగా ప్రభుత్వ అధికారులను సంప్రదించాలి. తిరుగు ప్రయాణానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలి. స్వయంగా టిక్కెట్లు బుక్ చేసుకుని వెళ్లిపోవాలి. ఒకవేళ సరైన డాక్యుమెంట్స్‌ లేకుండా, సెల్ఫ్‌ డిపార్చర్‌ కూడా చేసుకోకపోతే తర్వాత అంతే సంగతులు. అరెస్టులు, డిటెన్షన్లు, డిపోర్టేషన్ ఉత్తర్వులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి డిపోర్ట్ అయితే.. తిరిగి అమెరికాలో అడుగుపెట్టేందుకు ఏ దారిలేకుండా పోవచ్చు.

డాక్యుమెంట్‌లో జీవితం:

ట్రంప్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంది వలసదారులకు వణుకు పుట్టిస్తోంది. అదేంటి..? అక్రమవలసదారులకే కదా ఈ భయం ఉండాల్సిందని మీరు అనుకుంటే పొరపాటే..! ఎందుకంటే అమెరికాలో ఉన్న ఉన్న ప్రతి వలసదారుడు తప్పుదారిలోనే ఉన్నారని చెప్పలేం. చాలామంది నిబంధనలను గౌరవిస్తూ, అక్కడి జీవితాన్ని నిర్మించుకుంటూ, కుటుంబాల కోసం పోరాడుతూ నిత్యం శ్రమిస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఇంకొకలా ఉంది.. ఓ చిన్న డాక్యుమెంట్‌ కోల్పోయినా.. డాక్యుమెంట్‌ను సరిగ్గా సమర్పించకపోయినా.. టెక్నికల్‌గా ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా.. అది జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేస్తుంది. ఒక డాక్యుమెంట్‌ పొగ్గొట్టుకుఓవడం.. ఏదైనా సమాచారాన్ని సమయానికి అప్‌డేట్ చేయకపోవడం లాంటివి మనిషి చేసే సాధారణ పొరపాట్లే. కానీ ఈ పొరపాట్లే.. ఎన్నో ఏళ్లుగా నిర్మించుకున్న మీ ఆశల భవనాలను నేలమట్టం చేస్తాయి. అందుకే వలసదారుల మనసుల్లో నిస్సహాయత నిండిపోయింది.

ఇది క్రూరమైన నిర్ణయం

మరోవైపు వలసదారులను మరో సమస్య కూడా వెంటాడుతోంది. అది చట్టాల నుంచి కాదు.. సమాజం నుంచి ఎదురవుతోంది. మీకు లీగల్‌ డాక్యుమెంట్స్‌ ఉన్నా లేకున్నా తోటి వారు మాత్రం మిమ్మల్ని ఏదో తప్పు చేసినవారిలానే చూస్తున్నారు. పిల్లలకు స్కూళ్లలో ఎదురయ్యే చిన్న చిన్న ప్రశ్నలు, ఇటు ఉద్యోగులకు వర్క్‌ ప్లేస్‌లో ఎదురయ్యే సందేహాస్పద చూపులతో పాటు అంతకాలం కలిసి ఉన్న స్నేహితులు కూడా అనుమానంగా చూడడం మొదలుపెడుతున్నారు. ఈ అనుమానం ముద్ర మనసులో గాయాన్ని రేపుతోంది. ఒక డాక్యుమెంట్‌ మిస్‌ అయినా కూడా సమాజం మాత్రం బాధితుడిని నిజాయితీ లేనివాడిగా చూస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు వలసదారుల పోరాటం కేవలం వీసాలు, డాక్యుమెంట్స్‌ కోసమే కాదు.. గౌరవం కోసం, సమాజంలో స్థానం కోసం..! ఒక్క డాక్యుమెంట్‌ మిస్‌ చేసుకున్న వారిని నేరస్థుడిలా చూస్తే ఎలా? అమెరికా ప్రభుత్వానికి అసలు మానవతా విలువలు ఉన్నాయా? నిబద్ధతగా జీవిస్తున్నవాళ్లు కూడా భయంతో తల దాచుకోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది?

ALSO READ: టార్గెట్ల ముసుగులో జర్నలిజం ఏనాడో చ*చ్చిపోయింది.. కాదు కాదు యాజమాన్యాలు చం*పేశాయి!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *