రోజుకు 14 వార్తలు ఎందుకు రాయడంలేదు?
కనీసం 12 కూడా రాయలేవా?
ఆ వెబ్‌సైట్‌లో టార్గెట్ 15ఆర్టికల్స్ అంట తెలుసా?
ప్రతీ ఆర్టికల్ 250 పదాలు ఉండాల్సిందే..!
ఇంటికెళ్లి ఏం చేస్తావ్? నీకేం పని ఉంటుంది?
నీకు వ్యూస్ ఎందుకు రావడంలేదు?
ఈ మాటలన్నీ సామాన్య మానవులకు అర్థంకాకపోవచ్చు కానీ.. తెలుగు మీడియాలో వెబ్‌సైట్లకు పని చేస్తున్న కంటెంట్ రైటర్లకు(script writers)కు చాలా బాగా అర్థమవుతాయి. నిజానికి ఇప్పుడున్న కంటెంట్ రైటర్లు ఎవరూ జర్నలిస్టులు కాదు.. కేవలం ట్రాన్స్‌లేటర్లు, కాపీ రైటర్లు, సబ్‌ఎడిటర్లు అంతే! వాళ్లని అలా తయారు చేసింది మీడియా సంస్థలే. ఓవైపు భరించలేని ఒత్తిడి.. మరోవైపు చాలి చాలనీ జీతాలతో జీవితాన్ని అతికష్టం మీద నెట్టుకొస్తున్న వారికి నిత్యం టార్గెట్ల గోల తప్పడంలేదు. షిఫ్ట్ ముగిసిన తర్వాత కూడా పనిచేయాల్సిన దారుణమైన దుస్థితి. టార్గెట్ ఆర్టికల్స్ రాయకపోతే ఇంటికి వెళ్లి మళ్లీ పనిచేయాల్సిన పరిస్థితి. ఆఫీస్‌లోనూ, ఇంట్లోనూ పని తప్ప మరే ప్రపంచం తెలియని సబ్‌ఎడిటర్లు ప్రతీ సంస్థలోనూ కనిపిస్తారు. వారి ఆరోగ్యం సర్వనాశనమై చాలా కాలమే గడిచి ఉంటుంది.. కానీ లక్షణాలు బయటపడడంలేదు. బయటపడినా వాటిని గుర్తించే ఓపీక, తీరిక ఉండడంలేదు. శరీరంలో ఏ అవయవం పాడైందో తెలుసుకునేలోపు పుణ్యకాలం వచ్చేస్తోంది. సంపాదించిన కొంత ఆస్పత్రులకు ఎలాగో సరిపోదు.. మళ్లీ ఏ అప్పోసప్పో చేసుకోవాల్సి వస్తుంది. ఇంతటి దీనమైన దుస్థితిలో బతికే సబ్‌ఎడిటర్లు ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌కు గురవుతుండడం అత్యంత విషాదకరమైన విషయం. ఈ మధ్య ఓ వెబ్‌సైట్‌లోని ఆర్టికల్ టైటిల్‌ని పట్టుకోని మీడియాలోని ‘ఓ మేధావి’ వర్గం విపరీత ట్రోలింగ్ చేసింది. ఆ టైటిల్ పెట్టినవారిపై అడ్డమైన కామెంట్లు కూడా పెట్టింది. ఆ టైటిల్ భావదారిద్ర్యంగా ఉందట. నిజమే.. అసలు భావాలు, పర్యయపదాలు, సంధులు, సమాసాలు లాంటి కనీస విలువలు ఏ వెబ్‌సైట్‌లోనూ లేవు. ఇవన్నీ బయట ప్రజలకు తెలియకపోవచ్చు.. కానీ మీడియాలో పని చేస్తున్న తోటివారికి ఇవి తెలియదంటే అది నిజంగా విడ్డూరమే అవుతుంది. ఒకవేళ తెలియకపోయినా తెలుసుకునే ప్రయత్నమే చేయకపోతే అదే నిజమైన భావదారిద్ర్యం. కంటెంట్ రైటర్లు పెట్టే టైటిల్స్‌కు పూర్తి బాధ్యత యాజమాన్యాలదే. వాళ్లకి నచ్చినట్టే పెట్టాలి.. లేదంటే తీసిపడేయాలి..! అలా తియ్యనివారిని జాబ్ నుంచి తీసిపడేస్తారు. ఇదేమీ గవర్నమెంట్ ఉద్యోగం కాదు..! పనిచేసేవారంతా కూలీకే చేస్తారు..పూట గడవడానికే చేస్తారు..అంతేకానీ బిల్డింగ్‌లు, బొలేరాలు కొనుక్కోవడానికి కాదు.
ఆ రెండే శుద్ధపూస సంస్థలా?
ఇతర భాషల వెబ్‌సైట్ల సంగతి పక్కనపెడితే తెలుగు మీడియాలో మాత్రం టార్గెట్ల కోసం అడ్డమైన టైటిల్స్ పెట్టించే సంస్థలే ఎక్కువ. వ్యూస్ రావాలంటే జనాలను వెర్రొళ్లను చేయాల్సిందే అని ఫార్ములా ఎప్పటినుంచో ఉంది. కొన్నిసార్లు అది శృతి మించుతుంది. అలా లిమిట్ దాటినప్పుడు అడ్డుచెప్పాల్సిన సంస్థల పెద్దలు కనీసం నోరెత్తరు. ఈ జనాలు కూడా ఉన్నది ఉన్నట్టుగా టైటిల్ పెడితే చూడరు. వారికి కూడా మంచి మసాలా టైటిల్స్ కావాలి. లేనిది ఉన్నట్టు చెప్పే టైటిల్స్‌కే వ్యూస్ ఎక్కువగా వస్తాయి. మరీ వ్యూస్ టార్గెట్ రీచ్ అవ్వడానికి కంటెంట్ రైటర్లు ఏం చేయాలో వారికి తెలుసు. ఇక్కడ తప్పు ఎగబడి చూసేవాడిదా లేదా మిస్‌లీడింగ్ టైటిల్ పెట్టేవాడిదా అన్నది అనవసరం. ఆర్టికల్‌లో ఏదో ఉందని ఆశించి, తర్వాత ఏమీ లేకపోతే శుద్ధపూస మాటలు మాట్లాడడం జనాలకు కూడా అలవాటే.. వారిని తప్పుబట్టడం కూడా కరెక్ట్ కాదు. కానీ మీడియాలో ఉన్న కొందరు మేధావి వర్గాలు ఈ విషయాన్ని గ్రహించలేకపోవడం నిజంగా దుర్మార్గం. పేరు మోసిన రెండు వెబ్‌సైట్లను చూపించి ‘వీళ్ల దాంట్లో టైటిల్స్ మీకు లాగా లేవుగా’ అని కొందరు అడ్డంగా వాదిస్తుంటారు. ఆ రెండు వెబ్‌సైట్లకు బ్రాండ్ తప్ప కంటెంట్ ఉండదు. అందులో ఒక సంస్థ AI టూల్స్ ఉపయోగించి కొంతమంది సబ్‌ఎడిటర్లతో కనీసం 30వార్తలు రాయిస్తుందని తెలుసా? AIతో వచ్చే అవుట్‌పుట్ స్క్రిప్ట్ ఎంత నాసిరకంగా ఉంటుంటో అర్థంకాని మేధావులకు ఈ విషయం తెలియకపోవచ్చు. ఇక మరో పేరు గొప్ప ఊరు దిబ్బ వెబ్‌సైట్లో ఎక్కువగా ట్రాన్సలేషన్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా గూగుల్ ట్రాన్స్‌లేషన్. వారి సంస్థకు చెందిన ఇంగ్లీష్ కాపీని అచ్చుగుద్దినట్టు తెలుగులోకి అనువాదిస్తారు. కానీ వింత ఏంటంటే.. ఈ రెండే కొంతమంది మేధావులకు అద్భుతమైన వెబ్‌సైట్లు. అదే రియల్ జర్నలిజం కూడా!
అరగంటకు ఒక మంచి వార్త ఎలా రాయాలి?
నిజానికి పనివేళలకు మించిన టార్గెట్లు ఉన్న చోట అవుట్‌పుట్ సరిగ్గా ఉండదు. 8గంటల పని సమయంలో 7 నుంచి 7:30 గంటలే పనిచేసే అవకాశం ఉంటుంది. రోజుకు 14 ఆర్టికల్స్ అంటే అరగంటకు ఒక ఆర్టికల్ పబ్లీష్ చేయాలి. ఈ అరగంటలో అసలు తాము రాస్తుంది నిజమో కాదో కూడా తెలుసుకునే అవకాశం లేకుండాపోతుంది. చివరకు ఆర్టికల్ పబ్లిష్ అయిన తర్వాత ఏదైనా తప్పు ఉంటే దానికి పెద్ద పంచాయతీనే ఉంటుంది. పోలీసులకు దొరికిపోయిన ఉ*గ్రవాదిలా ప్రశ్నలు భరించాల్సి ఉంటుంది. ఇక్కడ తప్పు ఉ*గ్రవాదిదా.. లేదా ఉ*గ్రవాదులను తయారు చేసే సంస్థలదా అన్నది.. విమర్శించే వారి విజ్ఞతకే తెలియాలి. ఇది చాలదన్నట్టు ఇంఛార్జులు పెట్టే టార్చర్ మరో ఎత్తు. ఏ సంస్థలో అయినా ఫేవరెటిజం ఉన్నట్టే మీడియా ఫీల్డ్‌లోనూ ఉంటుంది. ఆ ఫేవరెటిజం వర్క్ ఆధారంగా ఉంటే సర్లే అనుకోవచ్చు కానీ.. ఇక్కడ ప్రాంతం, కులం ఆధారంగా కూడా కొన్నిసార్లు ఉంటాయి. సమాన పనికి సమాన వేతనం ఉండదన్నట్టే, సమాన తప్పుకు సమాన శిక్షలు కూడా ఉండవు. పైగా టార్గెట్ ఫినీష్ చేయకపోతే టీమ్ లీడ్ నుంచి వినిపించే మాటలు భరించలేనివిగా ఉంటాయి. వారంలో ఒక్క రోజు అటో ఇటో అయినా అంతే సంగతి. పనిచేస్తుంది మనిషే కదా? మెషీన్ కాదు కదా? మరీ ప్రతీరోజూ ఒకేరకమైన అవుట్‌పుట్ ఇవ్వడం ఎలా సాధ్యమనే ఇంగితం కూడా కొంతమందికి ఉండకపోవడం నిజంగా బాధాకరం. పనిచేసేవాడి నొప్పి పని ఇచ్చేవాడికి కూడా అర్థంకావాలి. కానీ ఇక్కడ అలాంటి నిజమైన లీడర్లు ఉండరు. ‘పైవారి’ మెప్పు కోసం తోటి కోలిగ్స్‌ను రాచి రంపాలు పెట్టే లీడర్లే ఉంటారు. ఒకవేళ ఏదైనా అద్భుత వార్త రాస్తే ఆ క్రెడిట్లు కూడా ‘సార్ గారికే’ దక్కుతాయి. ఎందుకంటే ఆయనే రాయించినట్టు చెప్పుకుంటాడు. కానీ ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం ఆ నిందంతా రాసినవాడిదే! తన టీమ్‌మేట్ చేసిన తప్పును తనపై వేసుకునే ఇంచార్జులు చాలా తక్కువ మందే ఉంటారు. వారి దగ్గర పనిచేయడం అందరికి సాధ్యం కాదు కదా..! ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడే పనిచేయాలి. ఇంచార్జుల ఈగో శాటిస్ఫై చేయడానికే బతుకుతున్నామేమో అనే ఆలోచన కూడా చాలామందికి వస్తుంటుంది. ఆ ఆలోచన వచ్చినా.. ఎంత బాధ వచ్చినా కుటుంబం కోసం, కూటి కోసం మనసు చంపుకోని పనిచేయాలంతే!
జర్నలిజానికి సమాధి:
వాస్తవానికి ఎవరూ కూడా జనాలను మభ్యపెట్టాలని వార్తలు రాయరు. రాసి ఆనందపడరు కూడా. సంస్థలే ఇలా రాయిస్తాయి.. ఇలా చేయిస్తాయి.. వారికి డబ్బులే ప్రధానం. ఇతర సంస్థలతో పోటి పడడానికి ఉన్న మార్గాల్లో జర్నలిస్టులను ప్రయాణించమంటారు. ఒక వెబ్‌సైట్ రోజుకు 200వార్తలు పబ్లీష్ చేస్తుందనుకుంటే అందులో జనాలకు ఉపయోగపడే వార్త లేదా రీసెర్చ్ ఆర్టికల్ కనీసం ఒకటి కూడా కనిపించదు. ఎందుకంటే మంచి వార్త రాయాలంటే సమయం ఎక్కువ పడుతుంది. టైమ్ ఎక్కువ తీసుకోని ఒక్కటే ఆర్టికల్ రాస్తే టార్గెట్ ఫినీష్ కాదు. మరి ఇక్కడ తప్పెవరిది? పోని అంత కష్టపడి రాసిన తర్వాత వ్యూస్ రాకపోతే ఇతరులతో అడ్డమైన కంపారిజన్స్‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ గోలంతా ఎందుకని..చెప్పిందే చేస్తే పోతుందిలే అని కాంప్రమైజ్ అయ్యే రైటర్లు పెరిగిపోయారు. కానీ బయటవాళ్లకి లోపల విషయాలేవీ తెలియవు కదా.. రాసినోడికి ఏమీ రాదని అనుకోవడం తప్ప! ఇక్కడ దిగజారిపోయింది రైటర్లు కాదు.. సంస్థలు! టార్గెట్ల ముసుగులో వారంతా జర్నలిజాన్ని ఏనాడో చం*పేశారు.. ఇప్పుడు జర్నలిస్టులు లేరు.. నిజానికి గతంలో కూడా లేరు.. అప్పటిపరిస్థితులకు తగ్గట్టుగా పనిచేశారంతే.. ఇప్పటితో పోల్చితే అప్పటి పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉండేవి. వారందరికి ఇప్పటి పరిస్థితులపై అవగాహన లేకా ఇప్పటితరం రైటర్లపై నోరు పారేసుకుంటున్నారు. కొన్నాళ్లు పోతే ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయి.. వాటిని అర్థం చేసుకోని పోరాడాల్సింది సంస్థ పెద్దలపైనా లేదా ఏకంగా మొత్తం వ్యవస్థపైనా అన్నది మేధావులగా చెప్పుకునే వాళ్లే ఆలోచించుకోవాలి..!
ALSO READ: మతాల మంటల నడుమ, దేవుడినే ధిక్కరించిన భావజాలం; నాస్తికత్వం!

Rationalist Files: ‘ఆమెను మోసం చేశారు..’ నిజమైన హేతువాదం సోషల్‌మీడియాలో కాదు.. నిజ జీవితంలో కనిపించాలి..! సిద్ధాంతాల వెనుక దాక్కునే పిరికితనం!
Adenoids: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!
Marriage System: ఇది పెళ్లి కాదు..దోపిడి..! ఇదేం సన్నాసి సంత.. ఇంతటి నీతిమాలిన వివాహ వ్యవస్థ ఎక్కడా ఉండదు!
Middle Class Dreams: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!
Life Lessons: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?
Asia Climate Change: 2 కారణాలు.. గాల్లో లక్షల ప్రాణాలు..సైంటిస్టుల షాకింగ్ స్టడీ!