Menu

World Water Day: కళ్ళ ముందు పెనుభూతం,చోద్యం చూస్తున్న పాలకులు ప్రజలు.. తర్వాత జరిగేది ఇదే!

Sumanth Thummala 11 months ago
An aerial view of a glacier melting into a river, symbolizing the theme of World Water Day 2025: Glacier Preservation. The image highlights the importance of glaciers as vital freshwater resources for billions of people.

చెత్త వేస్తాం.. మృతదేహాలను విసిరిపారేస్తాం.. మలమూత్రాలను అందులోనే కానిచ్చేస్తాం… పూజా వస్తువులను విసిరికొడతాం… దేవుడి విగ్రహాలను ముంచేసి మొత్తం కంపు చేస్తాం..! నీటిని నీటిలాగా కాకుంగా దేవుడి లాగా, దెయ్యంలాగా, భూతంలాగా చూస్తే ఏం జరుగుతుంది? నీరు తాగడానికి పనికిరాకుండా పోతాయి. కోట్లాది మంది ప్రాణాలను బలి తీసుకుంటాయి. ఇదేదో నోటి మాట కాదు. నివేదికలు చెబుతున్న వాస్తవాలు. ప్రపంచంలో అత్యంత కాలుష్యతమైన నదులు ఇండియాలోనే ఎక్కువగా ఉన్నాయి. అందులో హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గంగా మొదటిస్థానంలో ఉంది. ప్రపంచ నీటి దినోత్సవం(World Water Day) సందర్భంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన భయంకర నిజాలు ఉన్నాయి.

నల్గొండ సమస్యే అతి పెద్ద పాఠం

ఈ సుర్రుమనే ఎండాకాలంలో పని మీద బయటకు వెళ్లి మిట్ట మధ్యాహ్నం శరీరం అంతా చెమటతో తడిచిపోయింది ఒక గుక్కెడు చల్లటి నీళ్ళు గొంతులో పడినప్పుడు ఆ హాయి ఎంత బాగుంటుందో కదా! కానీ తాగే ఆ నీరే విషమై ప్రాణాలనే హరించేస్తే ఎలా ఉంటుంది? ఊహించుకోండి. నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ నీళ్లు తాగి కాళ్లు చేతులు వంకర పోయి, నరకం అనుభవిస్తూ బతుకీడుస్తున్నవారు ఇప్పటికీ ఉన్నారు. ఈ ఫ్లోరైడ్‌ సమస్యకు కొన్ని లక్షల మంది ప్రభావితమయ్యారు. ఊహిస్తేనే భయమేస్తుంది కదా. మంచినీటికి విలువ అలాంటిది. అసలు అనేక నాగరికతలు, మానవ మనుగడ నదులు, సముద్రాల ఒడ్డునే కదా మొదలయ్యాయి. ఆదిమ జాతుల నుంచి ఆధునిక మానవుడైనా, అడవిని ఏలే రాజైనా, బతుకునిస్తున్న పచ్చదనమైనా.. నీటి చుక్క లేనిదే వాటికి ప్రాణం ఉండదు. మరి అలాంటి నీటిని మనం ఏం చేస్తున్నాం?

2002లో నల్గొండ ఫ్లోరైడ్ బాధితులు వాజపేయి ని కలిసి గోడు వెళ్లబోసుకున్న క్షణం..

మంచు పర్వతాలు కరిగిపోతే ఏమౌతుంది?

ప్రతీ ఏడాది మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవం జరుపుకుంటారు. 2025 వరల్డ్‌ వాటర్‌ డేకి థీమ్‌గా ‘Glacier Preservation‘ పెట్టారు. ఈ థీమ్‌ పెట్టడానికి ప్రత్యేకమైన కారణముంది. ప్రపంచంలోని నలువైపులా మంచు కరుగుతోందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 1975 నుంచి ఇప్పటి వరకు 9000 గిగా టన్నుల మంచు కనుమరుగయ్యిందని లెక్కలు చెబుతున్నాయి. జర్మనీని 25 మీటర్ల లోతుతో కప్పేంత స్థాయిలో మంచు కరిగిపోవడం అత్యంత ఆందోళన కలిగించే అంశం. మంచు కనుమరుగై పోవడమంటే.. మన భవిష్యత్తు నేరుగా కరిగిపోవడమే.

ముప్పులో లక్షలమంది..

Arctic నుండి Alps వరకు.. దక్షిణ అమెరికా నుంచి హిమాలయాల వరకూ.. ప్రతీ ప్రాంతంలో మంచు వేగంగా కరుగుతోంది. గత మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా మంచు మాయమైంది. ఒక్క 2024లోనే 450 గిగా టన్నుల మంచు కరిగిపోయింది. ఈ మంచు కొండలు కేవలం మంచుతో నిండిన శిఖరాలు కావు.. ఇవే జీవనదులు. ఇవే సాగు నీటి మూలాలు. ఇవే సమస్త మానవాళికి ప్రాణాధారాలు. ఇవి లేకపోతే సముద్రాలు ఎగిసిపడతాయి. ఆ ఎగిరి పడ్డ సముద్రపు నీరు మన నగరాలను ముంచుతుంది. ఒక్క మిల్లీమీటర్ సముద్రం ఎత్తు పెరిగినా అది విధ్వంసమనే చెప్పాలి. ప్రతీ ఏడాది కేవలం ఒక్క మిల్లీమీటర్ సముద్రపు ఎత్తు పెరగడం కారణంగా 3 లక్షల మంది వరద ముప్పు బారిన పడుతున్నారని తెలుసా?

ఆకస్మిక వరదలకు కారణం ఇదే!

అటు ప్రపంచవ్యాప్తంగా ఇంకా 2.75 లక్షల మంచు గ్లేసియర్లు మిగిలున్నాయి. ఇవి కూడా ప్రమాదపు అంచునే ఉన్నాయి. మనల్ని మింగే వేగంతో అవి కరుగుతున్నాయి. అవి కూడా కరిగిపోతే ఇక మనకు మిగిలేదీ ఏమీ ఉండదు..! ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. వాటర్ డ్యాములు వెలవెలబోతాయి. పల్లెలు నీటి కొరతతో అల్లాడిపోతాయి. నగరాలు వర్షాల కోసం ఏడుస్తాయి. విద్యుత్ కోసం మనుషుల కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగాప్రజలు మంచు పర్వతాలపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి జీవితాల్లో ఈ మార్పులు ఒక్క రోజులోనే నరకాన్ని తెచ్చేస్తున్నాయి. మంచు కొండలలోని హిమ సరస్సులు విరిగిపడుతున్నాయి. వాటి వల్ల వచ్చే ఆకస్మిక వరదలకు ఇల్లు కొట్టుకుపోతున్నాయి. పంటలు ధ్వంసమవుతున్నాయి. ఇండియాలోనూ ఇలాంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. కాలంతో సంబంధం లేకుండా వర్షాలు కురవడం, కొండచరియలు విరిగిపడడం, వరదలు సంభవించడం ఎక్కువగా అనుభవిస్తున్నాం. ఆఫ్రికా నుంచి ఏషియా వరకు ఇదే దుస్థితి కనిపిస్తోంది. ఇదంతా గ్లేసియర్లు కరగడం వల్ల జరుగుతున్న విపత్తు. ఇక కలుషిత నీరు కారణంగా ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలు, రోగాల పాలువుతన్న బాధితుల సంఖ్య తెలుసుకుంటే ప్రజలు ఎంత నేరం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

చివరకు జరిగేది ఇదే:

ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది కలుషిత నీరు వల్ల వచ్చే వ్యాధులతో చనిపోతున్నారు. అంటే రోజుకు 2700 మంది… గంటకి 112 మంది. ప్రతి 2 నిమిషాలకు నలుగురు చనిపోతున్నారని అర్థం. అటు పిల్లలు పుడుతున్నారు కానీ.. పుట్టగానే నీళ్లు తాగి చనిపోతున్నారు. సంవత్సరానికి 4 లక్షల మంది పిల్లలు తాగునీరు కలుషితం కారణంగానే చనిపోతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది తాగడానికి నీరు కూడా లేని జీవితంలో బతుకుతున్నారు. చెరువులు చెత్త కుండీలైపోయాయి. నదులు మురికిచెల్లెల్లా మారాయి. మనం మాత్రం అక్కడ పూజలు చేస్తున్నాం. దానితో ఎవరికైనా పుణ్యం వచ్చిందా? ఒక చిన్నారి ప్రాణమైనా బతికించగలిగామా? అసలు నీటి కొరత అంటే ఏంటో ఊహించగలమా? సంవత్సరం పొడవునా 260 కోట్ల మందికి ఏడాదిలో నెల రోజులు పాటు నీరు దొరకని పరిస్థితులుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే భూమి మెల్లిగా చచ్చిపోతోంది. మంచు కరిగే వేళ, నీరు అందని వేళ మన భవిష్యత్తు శవమౌతుంది. కానీ అగ్రరాజ్యలు ఇంకా దీన్ని గుర్తించలేకపోతున్నాయి. వ్యాపారాల్లో, యుద్ధాల్లో దాదాపు అన్నీ దేశాలు తడిసి ముద్దవుతున్నాయి. కళ్ళ ముందు పెనుభూతం భయపెడతున్నా ప్రజలు, పాలకులు చోద్యం చూస్తుండడం అత్యంత విషాదకరం. ఇక ఈ కథ ఎక్కడ, ఎలా మొదలైందో తెలియదు కానీ.. ముగిసేది మాత్రం చితి మంటల్లోనే.

ALSO READ: సునీతా జీవితం నేర్పిన పాఠం.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కథ!

 


Written By

Sumanth Thummala is aContent Writer and the co-founder of Prajadhwani news. He works passionately toward creating positive change in the world through meaningful, responsible writing.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *