Menu

Sunita Williams: సునీతా జీవితం నేర్పిన పాఠం.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కథ!

Tri Ten B 11 months ago
sunita williams back to earth

సముద్రపు అలలు ఒకదానికొకటి తాకుతూ అల్లరిపడుతున్నాయ్.. గాలులు నీ కదలికను ఆస్వాదిస్తున్నాయ్.. భూమి నీ నడకను చూసి పరవశించిపోతోంది.. ఏకంగా తొమ్మిది నెలలు.. అవును..! 287 రోజులు…! క్షణాలు గంటల్లా.. గంటలు రోజుల్లా.. నెలలు యుగాల్లా గడిచిపోయాయి.. అంతరిక్షంలో నువ్వు వెచ్చించిన ఒక్కో క్షణం.. చుట్టూ రేడియేషన్‌ని తట్టుకోని నువ్వు అనుభవించిన మానసిక స్థితి.. నీ మనసుకు, నీ శరీరానికి, నీ ఆత్మకు పరీక్షగా నిలిచాయి. సహనం, పట్టుదల నీ ఆయుధాలుగా నిలిచి పోరాడాయి.. ఈ సాహస ప్రయాణం వెనుక నీ గుండె ధైర్యం ఉంది.. అంతులేని ఆత్మస్థైర్యముంది..! సెల్యూట్‌ టు సునీతా..! ఇప్పుడంతా సునీతా విలియమ్స్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. స్వాగతం సునీతా అంటూ ఆమె గగన విహారం గురించి.. ఆమె జీవిత ప్రయాణం గురించి లోతుగా తెలుసుకుంటున్నారు!

భారతీయ మూలాలు:


1965 సెప్టెంబర్ 19.. అమెరికా-ఓహాయోలోని యూరెక్లిడ్ అనే చిన్న పట్టణంలో సునీతా లిన్ విలియమ్స్ పుట్టింది. సునీతా తండ్రి గుజరాత్‌కు చెందిన ప్రముఖ న్యూరోలాజిస్ట్. ఆమె తల్లి స్లొవేనియన్ స్త్రీ. తండ్రి సైంటిస్ట్‌ కావడం వల్ల శాస్త్రియ ఆలోచనలు.. తల్లి వల్ల సాంప్రదాయ ఆచారాలు ఆమెకు చిన్నతనం నుంచే అలవాటు. చిన్నప్పటి నుంచే నీటితో ఆమెకు విడదీయలేని అనుబంధం ఉంది. సునీతా విలియమ్స్‌ ఓ స్విమ్మర్‌. ఎప్పుడూ పోటీల్లో ముందుండే సునీతా ఏనాడూ కూడా ఆకాశాన్ని తన జీవితంలో భాగం చేసుకోవాలనే అనుకోలేదట. స్కూల్‌ జీవితంలోనూ ఓ సాధారణమైన విద్యార్థిగానే గడిపింది. పోటీల్లో మాత్రం పాల్గొనేది. ఫ్రెండ్స్‌తో షికార్లకు వెళ్తుండేది. అయితే స్కూల్‌ నుంచి కాలేజీకి మారిన తర్వాత సునీతా ఆలోచనా విధానంలో మార్పులొచ్చాయి. కళాశాలలో చేరిన తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచన మొదలైంది. ఇంజనీరింగ్‌ చదవాలనుకుంది. ఆ సమయంలో తండ్రి చెప్పిన మాట ఆమె లైఫ్‌ను టర్న్‌ చేసింది. సైన్యంలో చేరితే నీకు నిజమైన జీవిత పాఠాలు దొరుకుతాయని తండ్రి చెప్పిన మాటను నమ్మింది సునీతా. ఆ మాట ఆమెను నౌకాదళ అకాడమీకి తీసుకెళ్లింది. ఈ ఒక్క నిర్ణయం ఆమె జీవితాన్ని అనూహ్యంగా మలుపుతిప్పింది!

సెల్యూట్‌ సునీతా విలియమ్స్

నేవీలో చేరిన మొదటి రోజే ఆమెకు ఒక విషయం మాత్రం అర్థమైంది. నేవీలో రాణించడం అంత ఈజీ కాదన్న విషయం ఆమెకు ప్రారంభంలోనే తెలిసివచ్చింది. అయితే పోరాటాన్నే అస్త్రంగా మలుచుకున్నారు సునీతా. అందులోనూ మహిళ కావడంతో ఆమె పట్ల చిన్నచూపు చూపించేవారు. పురుషాధిక్య వాతావరణంలో శిక్షణ తీసుకుంటున్న ఆమెను తోటి ట్రైనీలు అనేక సార్లు అనేక మాటలు అనేవారట. నువ్వు నేవీకి సరిపోవనే మాట సునీతా ఎన్నోసార్లు విన్నారు. నేవీ తరుఫున పైలట్‌ కావాలనే డ్రీమ్‌ సునీతది. United States Naval Aviator అంటే చిన్న విషయం కాదు కూడా. అనేక సాహసాలు చేయాల్సి ఉంటుంది. ప్రకృతి విపత్తుల సమయాల్లో ప్రజలను ఆదుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాలు సునీతాకు తెలియనవి కావు. ఓ మహిళ ఆ స్థాయికి వెళ్లాలని ఆలోచించడమే పెద్ద సాహసంగా భావించే రోజుల్లో ఆమె చేయాల్సింది చేశారు. నేవీ తరుఫున పైలట్‌ స్థాయికి వెళ్లారు. 30 రకాల పైలట్‌ విమానాలను నడిపే స్థాయికి ఎదిగారు. యుద్ధ విమానాలను 3,000 గంటలకు పైగా ఆకాశంలో నడిపిన రికార్డు సునీతా సొంతం.

పైలెట్‌ టు ఆస్ట్రోనట్:


నేవీలో పైలట్‌గా ఎదిగిన సునీతా.. ఆ తర్వాత అసలైన పోరాటాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. 1987లో యుఎస్‌ నేవీలో అధికారిగా చేరిన సునీతా.. కేవలం నేవల్‌ పైలట్‌గానే పరిమితం కాలేదు. దేశం కోసం ఎక్కడైనా, ఎప్పుడైనా సేవ చేయాలనే తపన ఆమెలో కనిపించేది. నేవీ హెలికాప్టర్ పైలట్‌గా పసిఫిక్ మహాసముద్రం, రెడ్‌ సీ, పర్షియన్ గల్ఫ్, మెడిటరేనియన్ సముద్రాల్లో కీలక మిషన్లలో సునీతా పాల్గొన్నారు. 1991 గల్ఫ్ వార్ సమయంలో, Operation Desert Shield, Operation Provide Comfort మిషన్లలో కీలకంగా వ్యవహరించారు సునీతా. హెలికాప్టర్‌ను అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో నడిపిన సునీతా వార్‌ సమయంలో సహాయ కార్యక్రమాల్లో యాక్టివ్‌ రోల్‌ ప్లే చేసింది. యుద్ధ క్షేత్రంలో సేవ చేయడం ఏ మాత్రం చిన్న విషయం కాదు. అటు ప్రకృతి విపత్తుల సమయంలోనూ సునీతా చూపించిన ధైర్యం అద్భుతమనే చెప్పాలి. 1992లో ఫ్లోరిడాలో హరికేన్ సమయంలో సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు సునీతా. శరణార్థులను రక్షించడం, ఆహారం అందించడం, సహాయ కార్యక్రమాలు నిర్వహించడం లాంటి ఘటనలు ఆమె నేవీ జీవితంలో మర్చిపోలేని అనుభవాలనే చెప్పాలి. ఓవైపు అమెరికా నేవీ కోసం పనిచేస్తూనే.. మరోవైపు భవిష్యత్తులో తన దారిని గగనతల వైపు మళ్లించుకోవాలనే ఆలోచన సునీతా గుండె లోతుల్లో పుట్టింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం-ISSలో ఒంటరితనాన్ని, భారరహిత జీవితాన్ని తట్టుకోవడానికి నేవీ పైలట్‌గా ఆమె సాధించిన విజయాలు సునీతాను మానసికంగా సిద్ధం చేశాయి. ఇక 1993లో US Naval టెస్ట్‌ పైలట్‌ స్కూల్‌లో చేరిన సునీతా అక్కడ పైలట్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా మారింది. ప్రముఖ టెస్ట్ పైలట్‌గా అనేక కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లను పరీక్షించి నౌకాదళానికి తన సేవలను అందించింది. ఆ తర్వాత 1998లో NASA కొత్త వ్యోమగాముల ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. వెంటనే దరఖాస్తు చేసుకున్న సునీతా నాసా వ్యోమగామిగా ఎంపికైంది. అప్పటి నుంచి అంతరిక్ష యాత్ర కోసం కలల కన్న సునీతాకు 8ఏళ్లు తిరిగేలోపే ఆ అవకాశం వచ్చింది.

మారథాన్‌ పూర్తి తర్వాత ఏం జరిగింది?

2006 డిసెంబర్ 9.. ఈ తేదీ సునీతా జీవితంలో ఎప్పటికీ గుర్తుండే రోజు. ఆమె ISS ప్రయాణం మొదలైన రోజు అది. స్పేస్ షటిల్‌ డిస్కవరీలో భూమిని విడిచి.. అంతరిక్షం వైపు పయనించిన తొలి క్షణం.. ఆమె శరీరం తేలిపోతుంటే గుండె మాత్రం ధైర్యంతో నిండిపోయింది. NASA ఆమెను Expeditions 14,15లో భాగంగా ISSకి పంపింది. భూమిని తొలిసారి అంతరిక్షం నుంచి చూసిన సునీతకు కన్నీళ్లు ఆగలేదు. ఈ ప్రయాణంలో తన తొలి స్పేస్‌వాక్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. అయితే.. స్పేస్‌వాక్ చేస్తున్నప్పుడు, ఆమె హెల్మెట్‌కు అమర్చిన కెమెరా ఊడిపోయి అంతరిక్షంలో తేలిపోయింది. ఆ క్షణాన్ని ఇప్పటికీ మర్చిపోలేనని చెబుతారు సునీతా. అంతరిక్షంలో ఏదైనా ఊడిపోతే.. అది తిరిగి కనిపించడం అసాధ్యమని… కానీ తనకు అది ఒక గొప్ప అనుభవంగా మారిందని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. ఇక సునీత జీవితంలో 2007 బోస్టన్ మారథాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతరిక్షంలో మారథాన్ పరిగెత్తిన తొలి మహిళగా 2007 ఏప్రిల్‌ 16న రికార్డు సృష్టించింది. ISSలోని ట్రెడ్‌మిల్‌పై 4 గంటల 24 నిమిషాల్లో బోస్టన్ మారథాన్‌ను సునీతా పూర్తి చేశారు

ఆ ఫొటోని ఇప్పటికీ మర్చిపోలేం

ఇక 2012లో ISSకు రెండోసారి ప్రయాణమయ్యారు సునీతా. కానీ ఈ సారి కమాండర్‌ హోదాలో స్పేస్‌ స్టేషన్‌ గడపతొక్కారు. నిజానికి ISSలో కమాండర్‌ స్థాయికి చేరుకున్న రెండో మహిళ సునీతనే. 2012 జూలై 15న.. రష్యా సోయుజ్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా రెండోసారి ISSకి వెళ్లారు సునీతా. ఈ ప్రయాణంలో సునీతా స్పేస్‌వాక్ సంచలనం సృష్టించింది. ఆమె చేతిని ముందుకు చాపిన ఫొటో హైలెట్‌గా నిలిచింది. ఎందుకంటే ఆ ఫొటోలో సునీత సూర్యుడిని తాకినట్టుగా కనిపించింది. ఇక ప్రపంచపు తొలి అంతరిక్ష ట్రైయాథ్లాన్ కూడా సునీతా ఈ మిషన్‌లోనే పూర్తి చేశారు. ట్రైయాథ్లాన్ అంటే మూడు కఠినమైన ఆటల కలబోత. పరుగెత్తడం, సైక్లింగ్, ఈత చేయడాన్ని ట్రైయాథ్లాన్‌ అంటారు. సునీతా ముందుగా ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తారు. ఆ తర్వాత స్టేషనరీ బైక్‌పై సైక్లింగ్ చేశారు. ఇక ఆ తర్వాత రోబోటిక్ రెసిస్టెన్స్ డివైజ్ సహాయంతో స్విమ్మింగ్‌ చేశారు.

అలా ఎంపికైన తొలి వ్యోమగామి:


ఇటు 2015లో నాసా భవిష్యత్‌లో అంతరిక్ష ప్రయాణాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం Commercial Crew Programను ప్రారంభించింది. బోయింగ్ , స్పేస్‌ఎక్స్ సంస్థలతో కలిసి ప్రైవేట్ అంతరిక్ష ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. నాసా ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా అత్యంత అనుభవం ఉన్న వ్యోమగాములను ఎంపిక చేసింది. ఈ ప్రయోగంలో మొదటి వ్యోమగామిగా సునీతా విలియమ్స్‌ను ఎంపిక చేయడం ఆమెకు దక్కిన గొప్ప గౌరవంగా చెప్పవచ్చు.

సునీతా జీవితం అందరికి పాఠం

ఇక ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న నాసా మిషన్‌ 2024 జూన్ 5న ప్రారంభమైంది. బోయింగ్ స్టార్‌ లైనర్ వ్యోమనౌకలో సునీతా విలియమ్స్‌, బారీ విల్మోర్ ISSకి బయల్దేరారు. మొదట ఏడురోజుల ప్రయాణమని చెప్పారు. కానీ అది చివరికి తొమ్మిది నెలల ప్రయాణంగా ముగిసింది. అంతరిక్షంలో నివసించడమంటే గగనతలంలో తేలిపోతూ జీవించడమని కాదు.. అది వ్యోమగాములకు భౌతికంగా, మానసికంగా ఓ కఠిన పరీక్ష. ఎందుకంటే అక్కడ గ్రావిటీ ఉండదు. అందుకే ISSలో ఎక్కువ కాలం గడిపిన వ్యోమగాముల శరీరాలు క్రమంగా మారిపోతుంటాయి. బరువు తగ్గిపోతుంటారు. ఎముకలు బలహీనపడిపోతాయి. శరీరాన్ని బలంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ గంటల కొద్దీ వ్యాయామం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇంత వేదన అనుభవించిన సునీతా ISS నుంచి విడిపోయే క్షణంలో 9 నెలల జ్ఞాపకాలను కచ్చితంగా గుర్తు చేసుకోని ఉంటారు. అక్కడ గడిపిన రోజులు, అనుభవించిన క్షణాలు, కష్టపడ్డ సమయాలు అన్నీ ఒక క్షణంలో మనసులోకి వచ్చి ఉంటాయి. అంతరిక్షం ఆమెకు ఎన్నో నేర్పింది.. ఆమె అంతరిక్ష ప్రయాణం మావవాళికీ ఎంతో నేర్పింది. సహనం, విజ్ఞాన దాహం ఎంత అవసరమో ప్రపంచానికి మరోసారి తెలిసి వచ్చింది. దటీజ్‌ సునీతా..!

ALSO READ: సునీతా విలియమ్స్‌ భూమికి చేరుకున్న తర్వాత ఆమె శరీరంలో ఏం మార్పులు జరుగుతాయి?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *