అది చీకటి గది.. టిక్ టిక్ అంటూ గడియారం మెల్లిగా శబ్దం చేస్తోంది.. అర్థరాత్రి 2:30.. అతను మంచంపై పడుకున్నాడు కానీ మెదడు నిద్రకు సిద్ధంగా లేదు. బంధించలేని ఆలోచనల వలయంలో చిక్కుకున్నాడు. తలనొప్పి, గుండెల్లో బరువు, కళ్లకింద నల్లటి వలయాలు.. ఇదంతా ఒక్క రాత్రి జరిగిన విషయం కాదు.. నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఏ మార్పూ లేదు.. ఎన్నో నిద్రలేని రాత్రులు..అంతులేని వేదన..! ఈ పరిస్థితి కోట్లాది మంది భారతీయులది. సంగీత ప్రపంచంలో వెలుగొందిన గాయని కల్పన(Kalpana)ది కూడా ఇదే సమస్య. తన పాటలతో టాలీవుడ్(Tollywood)ను మైమరపించిన ఆమెకు నిద్ర మాత్రం బద్ధ శత్రువు. అందుకే డాక్టర్ సూచించినదాని కంటే నిద్ర మాత్రలు ఎక్కువగా మింగేశారు. అవి ఆమె శరీరాన్ని మత్తులో ముంచేశాయి. ఆస్పత్రి వరకు తీసుకెళ్లాయి. ఇంతకీ కల్పనతో పాటు దేశంలో కోట్లాది మంది అనుభవిస్తున్న ఈ నిద్రలేని రాత్రుల కథల వెనుక ఉన్న రుగ్మత పేరేంటి? నిద్రమాత్రలు అధిక మోతాడులో తీసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలేంటి?
మహిళలను ఎక్కువగా ఈ సమస్య వేధిస్తోందా?
ఏదో ఒక సమయంలో నిద్రలేమి సమస్య చాలా మందికి ఉంటుంది కానీ అది నెలలు, సంవత్సరాలు కొనసాగితే దాన్ని Insomnia అంటారు. ఇది ఒక వ్యాధి కాదు.. రుగ్మత. అంటే Disorder అన్నమాట. భారత్‌లో 46 కోట్ల మంది ఇన్‌సోమ్నియాతో పోరాడుతున్నారు. మహిళలే ఈ రుగ్మతకు అతి పెద్ద బాధితులు. ఇన్‌సోమ్నియాతో బాధపడేవారిలో 68శాతం మంది మహిళలే ఉన్నారు. 35 ఏళ్లకు పైబడిన వారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. నిద్ర మన శరీరానికి అందంచే ఓ శక్తివంతమైన ఔషధంలా పనిచేస్తుదం. అది తక్కువైతే మన జీవితం నిశ్శబ్దంగా విచ్ఛిన్నమవుతుంది. నిద్రలేమి వల్ల మానసిక, శారీరక ఆరోగ్యంపై ఎన్నో విధాలుగా ప్రభావం పడుతుంది. ఇన్‌సోమ్నియాతో బాధపడుతున్న వారిలో 30శాతం మంది అల్జీమర్స్, డిమెన్షియాకు గురవుతున్నారు. మతిమరుపు 2 రెట్లు పెరుగుతుంది. ఆలోచనా శక్తి 40శాతం తగ్గిపోతుంది. చేసే పొరపాట్లు 30శాతం పెరుగుతాయి.
చాలా డేంజర్
50శాతం మంది మధుమేహ రోగులకు నిద్రలేమి ప్రధాన సమస్యగా ఉంది. అటు 40శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడే వారు నిద్రలేమి బాధితులే. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం 45శాతం పెరుగుతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే మెటబాలిజం మందగిస్తుంది, కొవ్వు పెరుగుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించినా ఇన్‌సోమ్నియా ఉంటే బరువు తగ్గడం అసాధ్యం. నిద్రలేమి ఉన్నవారిలో డిప్రెషన్ రేటు 3శాతం ఎక్కువగా ఉంటుంది. ఆత్మహత్యా ఆలోచనలు 20శాతం పెరుగుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సరిగ్గా నిద్రపట్టక చాలా మంది వ్యసనాలకు బానిసలవుతున్నారు. మద్యం, డ్రగ్స్ సేవించేవారిలో 60శాతం మందికి తమకు ఇన్‌సోమ్నియా సమస్య ఉందనే విషయం కూడా తెలియదట.
యాక్సిడెంట్లు కూడా వాళ్లే చేస్తున్నారు:
ఇదంతా ఒక కోణం అయితే మరో కోణం చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు. రోడ్డు ప్రమాదాల్లో 20శాతం కేసులు నిద్రలేమితో ముడిపడినవే అంటే నమ్మగలరా? నిద్రలేమితో డ్రైవింగ్ చేసే వ్యక్తుల వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. అంటే ఒక వ్యక్తి ఇన్‌సోమ్నియాతో బాధపడుతుంటే దాని ప్రభావం ఇతరులపైనా పడుతుంది. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో కేవలం నిద్రలేమీతో బండి నడిపిన వ్యక్తి మాత్రమే చనిపోడు కదా.. అంటే పరోక్షంగా ఏటా లక్షల మంది ప్రాణాలను హరిస్తున్న రుగ్మత ఇన్‌సోమ్నియా.
కార్పొరేట్ల హింస
ఇటు నిద్రలేమి సమస్య పెద్దలకు మాత్రమే కాదు. ఇండియాలో 20శాతం మంది పిల్లలు, విద్యార్థులు ఈ రుగ్మతతో బాధపడుతున్నారు. స్క్రీన్ టైమ్ పెరగడమే దీనికి అతి పెద్ద కారణంగా డాక్టర్లు చెబుతున్నారు. మరికొందరి విద్యార్థులకు మాత్రం పరీక్షల ఒత్తిడితో అసలు నిద్ర పట్టదట. ఎగ్జామ్స్ ఉన్నంత కాలం ఇదే పరిస్థితి ఉంటుంది. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా కొంతమందికి ఇదే కొనసాగుతూ పోతోంది. చివరకు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కానీ ట్రీట్‌మెంట్ తీసుకోని దుస్థితి దాపరిస్తోంది. మొత్తంగా చూస్తే 35శాతం మంది విద్యార్థులకు నిద్రలేమి కారణంగా చదువులో రాణించలేకపోతున్నారు. దీనికి కార్పొరేట్ కాలేజీల వ్యవస్థ కూడా కారణంగా ఉంది. బట్టి చదువులు, గ్యాప్ ఇవ్వకుండా పిల్లలను చదవాలంటూ హింస పెట్టడం, లేట్ నైట్ స్టడీ లాంటి అంశాల కారణంగా పిల్లలు నిద్రలో దాదాపు 2 గంటల సమయాన్ని కోల్పోతున్నారు. ఉదయాన్నే కాలేజీ బస్సుల్లో నిద్రపోతూ.. తరగతి గదుల్లో ఇబ్బందిపడుతున్నారు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఇన్‌సోమ్నియాకు కారణమౌతోంది.
మత్తు.. చిత్తూ.. దయచేసి వద్దు!
ఇలా విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు నిద్రలేమితో బాధపడుతూ చివరకు ఆస్పత్రి గడపతొక్కుతున్నారు. వారిలో కొంతమందికి డాక్టర్లు నిద్రమాత్రలను సూచిస్తారు. అవి కూడా మందులే. అవి మెదడుపై పని చేస్తాయి. నిద్రలోకి జారుకునేలా చేస్తాయి. అయితే డాక్టర్ చెప్పినదానికంటే ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు తీసుకోవడం చాలా ప్రమాదం. నిద్ర మాత్రలు మెదడులోని GABA రిసెప్టర్స్‌ను ప్రేరేపించి మత్తును కలిగిస్తాయి. ఓవర్‌డోస్ తీసుకుంటే ఈ మత్తు మరింత బలంగా మారి మెదడు స్పందన మందగిస్తుంది. శరీర అవయవాలు నిదానంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. కొన్నిసార్లు మెదడు పూర్తిగా స్పందించదు.. ఆ సమయంలో కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. నిద్ర మాత్రలు నాడీ వ్యవస్థను కూడా పూర్తిగా నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతే ఎంతో డేంజర్. నిద్ర మాత్రల ఓవర్‌డోస్ తీసుకుంటే శరీరం పూర్తిగా ఆ మందుల ప్రభావానికి లోనైపోతుంది. కాలేయం దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో ఊపిరి ఆగిపోయి మరణం కూడా సంభవించవచ్చు. మత్తుగా ఉండటం, స్పష్టంగా మాట్లాడలేకపోవడం, గుండె స్పందన రేటు తగ్గినట్టు అనిపించడం, కాళ్లు-చేతులు వణకడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ సూచించిన మోతాదులోనే మాత్రలు వాడాలి. సింగర్ కల్పన ఓవర్‌డాస్ కారణంగానే ఈ పరిస్థితిని తెచ్చుకున్నారు. దేశంలో చాలా మంది డాక్టర్‌ను సంప్రదించకుండానే నిద్రమాత్రలు వాడుతున్నారని పలు నివేదికల్లో తేలింది. ప్రతి ఐదుగురిలో ఒకరు నిద్ర మాత్రలు మింగుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కలన్నీ గమనిస్తే ఇండియా ఓ భారీ విపత్తులో మునిగి ఉందని అర్థం చేసుకోవచ్చు. మన జీవితానికి నిద్ర అవసరం కానీ విలాసం కాదు. శరీరానికి, మెదడుకు నిత్ర అవసరమైన ఔషధం కానీ ఓవర్‌డాస్‌గా నిద్రమాత్రలు తీసుకోవడం.. అసలు డాక్టర్ చెప్పకుండానే ఆ మాత్రలు వేసుకోవడం ఎంతో ప్రమాదం!
ఇది కూడా చదవండి: ప్రతి ఐదుగురులో ముగ్గురు.. ఇండియాను చంపేస్తున్న మహమ్మారి!