సుదీర్ఘ నీరిక్షణకు తెరపడింది.. 12ఏళ్ల తర్వాత టీమిండియా ఐసీసీ వన్డే టోర్నమెంట్ విజేతగా నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) 2025లో భాగంగా దుబాయ్(Dubai) వేదికగా న్యూజిలాండ్‌పై జరిగిన ఫైనల్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 252పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మొదటి నుంచి కివీస్‌పై ఆధిపత్యం చెలాయించింది. మధ్యలో తడపడినట్టు అనిపించినా చివరకు మాత్రం అద్భుత విజయాన్ని అందుకుంది. చివరిలో clutch situationsలో ఇరగదీసే పాండ్యాతో పాటు కేఎల్ రాహుల్ బాధ్యతతో బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించారు. ఇక ఈ మ్యాచ్‌తో పాటు టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.
వారెవ్వా ద్వయం:
ఈ టోర్నీలో టీమిండియాను బ్యాటింగ్ పరంగా ముందుకు నడిపించిన ఘనత కోహ్లీ(Virat Kohli), శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)కే దక్కుతుంది. తన పనైపోయిందని విమర్శించిన వారికి కోహ్లీ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై కోహ్లీ చేసిన సెంచరీ టోర్నీకే హైలేట్‌గా నిలిచింది. ఫైనల్‌లో తక్కువ పరుగులకే ఔటైనా అసలు ఇండియా ఫైనల్‌కు చేరుకోవడానికి కోహ్లీ పాత్రే కీలకం. అటు శ్రేయస్ అయ్యర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. నంబర్-4 పొజిషన్‌లో టీమిండియాకు నమ్మదగిన ప్లేయర్ అయ్యర్. గతంలో సెంట్రాల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయి ఎన్నో కష్టాలు పడ్డ అయ్యర్ టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతూ చాంపియన్స్ ట్రోఫీ గెలుపుకు ప్రధాన కారణాల్లో ఒకడిగా నిలిచాడు. ఫైనల్‌లోనూ ఎంతో పరిణితి కనబర్చాడు.
దటీజ్ హిట్‌మ్యాన్
టీమిండియా గెలుపుకు ప్రధాన కారణం రోహిత్ శర్మ(Rohit sharma) కెప్టెన్సీ అండ్ ఫైనల్‌లో బ్యాటింగ్. నిజానికి ఓపెనర్‌గా రోహిత్ శర్మ బ్యాటింగ్ అప్రోచ్ చాలా అగ్రెసీవ్‌గా ఉంటుంది. రోహిత్ ఫస్ట్ నుంచి అటాకింగ్ గేమ్ ఆడడం కారణంగా మిగిలిన బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతుంది. అందుకే వారంతా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసుకుంటారు. రోహిత్ తక్కువ పరుగులే చేసినా విన్నింగ్‌లో అతని ఇంపాక్ట్ ఎక్కువే ఉంటుందని చెప్పడానికి ఇదే కారణం. ఇక ఫైనల్‌లో రోహిత్ అదే చేశాడు. మొదటి నుంచి అటాకింగ్ గేమ్ ప్లే చేశాడు. ఫైనల్‌లో టీమిండియా గెలవడానికి రోహిత్ చేసిన 76 పరుగులే ప్రధాన కారణం. ఇటు కెప్టెన్‌గానూ రోహిత్ సత్తా చాటాడు. కీలకమైన సమయాల్లో బౌలర్లను మార్చి సక్సెస్ అయ్యాడు.
ఇద్దరికి ఇద్దరే
మరోవైపు టీమిండియాకు గెలుపుకు ప్రధాన కారణాల్లో షమీ, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉన్నారు. ఐసీసీ టోర్నమెంట్లలో షమీకి ఉన్న రికార్డులు మరే ఇతర టీమిండియా బౌలర్‌కు లేరు. నిజానికి 2023 వరల్డ్‌కప్‌లో షమీ టీమిండియాను ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. అప్పుడు ఇండియా తుది మెట్టుపై బోల్తా పడింది. అదే టోర్నమెంట్‌లో గాయపడ్డ షమీ మళ్లీ ఇన్నాళ్లకు రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకమైన వికెట్లు తీసిన షమీ ప్రత్యర్థులకు వణికించాడు. అటు వరుణ్ చక్రవర్తి ద్వారా టీమిండియా ఓ మిస్టరీ స్పిన్నర్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. కీలక వికెట్లు తియ్యడం, పార్టనెర్‌షిప్స్ బ్రేక్ చేయడంతో వరుణ్ సీనియర్ స్పిన్నర్లను తలపించాడు.
గంభీర్ మార్క్ నిర్ణయాలు
అటు మిగిలిన స్పిన్నర్లు సైతం భారత్ జట్టు గెలుపులో అద్భుత పాత్ర పోషించారనే చెప్పాలి. ముఖ్యంగా జడేజాతన అనుభవాన్ని చూపిస్తూ ప్రత్యర్థుల వెన్ను విరిచాడు. మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్లును తక్కువ పరుగులకే కట్టడి చేశాడు. అటు అక్షర్ పటేల్ స్పిన్నర్‌గా, బౌలర్‌గా సత్తా చాటాడు. ఇటు కుల్దీప్ యాదవ్ కీలకమైన ఫైనల్ న్యూజిలాండ్ టాప్ బ్యాటర్ల భరతం పట్టి జట్టు గెలుపుకు దారులు వేశాడు. ఇటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే జట్టు సెలక్షన్ సమయంలో గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. నలుగురు స్పిన్నర్లు ఎందుకని వెటకారంగా మాట్లాడినవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ 4-స్పిన్నర్ ఫార్ములా వర్కౌట్ అవుతుందని గంభీర్ నిరూపించాడు.
అనుకూలించిన పిచ్
ఇక చివరిగా చెప్పుకోవాల్సింది దుబాయ్ పిచ్, పరిస్థితుల గురించి. నిజానికి ఈ టోర్నమెంట్‌లో మరే జట్టుకు లేని అడ్వేంటేజ్ టీమిండియాకు దక్కింది. సెక్యూరిటీ కారణాలతో పాకిస్థాన్‌లో అడుగుపెట్టని టీమిండియా దుబాయ్ వేదికగా అన్నీ మ్యాచ్‌లు ఆడింది. దీంతో అక్కడి పిచ్, పరిస్థితులు ఇండియాకు బాగా అలవాటు అయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దుబాయ్ పిచ్ టీమిండియాకు మరో హౌం గ్రౌండ్.. ఇలా టీమిండియా గెలుపుకు ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.
ALSO READ: ‘ది స్వీట్ కిస్..’ ముద్దుతో చిచ్చును ఆర్పేసిన రోహిత్!