Menu

L and T controversy Row: నెలసరి సెలవుపై కపట నాటకం.. కంపెనీకి మహిళల పీరియడ్స్‌ పెయిన్‌ కంటే లాభాలే ముఖ్యమా?

Praja Dhwani Desk 11 months ago
L and T controversy Row tokenism

మెన్‌స్ట్రువల్ లీవ్…! నెలసరి సెలవు..! ఇప్పుడీ పదం ఇంటర్‌నెట్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. నెలసరి నొప్పుల సమయంలో మహిళా ఉద్యోగులకు ఒక రోజు అధికారిక సెలవును L and T కంపెనీ ప్రకటించడం దీనికి కారణం. అదేంటి..? మంచి నిర్ణయమే కాదు.. ఇంత Progressive నిర్ణయాన్ని మెచ్చుకోవాలి కానీ కంపెనీని ఎందుకు తిడుతున్నారని ఆలోచిస్తున్నారా? ఉంది… బలమైన కారణమే ఉంది. అసలు కంపెనీ తీసుకున్న నిర్ణయంలోనే అసమానత, వివక్ష దాగి ఉంది. అదేంటో అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చెబుతా వినండి..!

మిగిలిన ఉద్యోగుల సంగతేంటి?

ఒక తండ్రికి ముగ్గురు పిల్లలు ఉన్నారనుకుందాం. ముగ్గురికీ ఆకలేస్తుంది. కానీ తండ్రి వాళ్లలో ఒక్కరికే భోజనం పెట్టాడు. మిగతా ఇద్దరికీ కడుపునిండా భుక్తి పడిందని ఊహించుకోమన్నాడు. ఇదే L and T కంపెనీ కథ. మహిళలకు మెన్‌స్ట్రువల్ లీవ్ ఇచ్చింది నిజమే కాని అది కేవలం పేరెంట్ కంపెనీకి మాత్రమే. L and T అనుబంధ కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తించదు. అదేంటి అనుబంధ కంపెనీల్లో పని చేసే మహిళలు మహిళలే కారా? వాళ్లకు నెలసరి నొప్పులు ఉండవా? లేదా… కంపెనీకి వారి పీరియడ్స్‌ పెయిన్‌ కంటే లాభాలే ముఖ్యమా? ఇప్పుడు ర్థమైందా L and T కంపెనీపై ఎందుకు విమర్శలు వస్తున్నాయని..? కథ ఇంతటితోనే ఆగలేదు.. ఇంకా ఉంది..! L and T కంపెనీలో దాదాపు 60,000 మంది ఉద్యోగులున్నారట. కానీ అందులో మహిళల శాతం ఎంతో తెలుసా? కేవలం 9శాతం..! ఇది సోషల్‌మీడియాలో చాలా మంది యూజర్లు చెబుతున్న మాట. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వని కంపెనీ ఇప్పుడు మహిళల కోసమంటూ, మహిళలే ముఖ్యమంటూ, విమెన్స్‌ డే గిఫ్ట్ అంటూ మెన్‌స్ట్రువల్ లీవ్‌ను ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నది ప్రధాన విమర్శ. దీన్నే టోకెనిజం అని పిలుస్తున్నారు. ఇంతకి టోకెనిజమంటే ఏంటి? ఒక చెట్టు నాటి.. ఇదే అడవి అని చెప్పటమే టోకెనిజం..! ఒక్కరోజు నెలసరి సెలవు ప్రకటించి మహిళా సాధికారత సాధించామనడమే టోకెనిజం! ఇదంతా ఓ గ్లామరస్ PR స్టంట్ అని చెప్పవచ్చు. ఇది ఒక సినిమా పోస్టర్ అని చెప్పవచ్చు… అసలు సినిమా మాత్రం వేరే ఉంటుంది.

భార్య అంటే అంత చులకనా?

ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్దాం.. ఇదే L and T కంపెనీ చైర్మన్ SN సుబ్రహ్మణియన్ జనవరిలో ఏమన్నారో గుర్తుందా? ‘మీ భార్యను ఎంతసేపు చూస్తారు? ఆదివారం కూడా పని చెయ్యండి.. వారానికి 90 గంటలు పని చేయాలి..’! సుబ్రహ్మణియన్ చేసిన ఈ కామెంట్స్‌ గురించి నాడు నటి దీపికా పదుకొనే నుంచి చాలా మంది ఫెమినిస్టుల వరకు అంతా ఫైర్ అయ్యారు. మీ భార్యను ఎంతసేపు చూస్తారని చేసిన కామెంట్‌ వెనుక ఎంతో వివక్ష ఉందన్నది వారి అభిప్రాయం. భార్య అంటే పని విరామాల్లో చూసే వస్తువు మాత్రమేనని అర్థం వచ్చేలా సుబ్రహ్మణియన్ మాట్లాడారన్నది ప్రధాన ఆరోపణ. నెలసరి సెలవు నిర్ణయం ఈ తరహా విమర్శలను కప్పిపుచ్చుకునేందుకు చేసిన చర్యగా వీరంతా అభిప్రాయపడుతున్నారు.

హిపోక్రసీ కింగ్‌

సమాన అవకాశాలు లేకుండా, సమాన వేతనం ఇవ్వకుండా ఒక్కరోజు నెలసరి సెలవుతో మహిళల జీవితం మారిపోతుందా అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. వారానికి 90 గంటల పని చేయాలని ఒత్తిడి చేసే కంపెనీలు ఇప్పుడు ఒక్కరోజు నెలసరి సెలవు ఇస్తున్నామని చెప్పడం నిజానికి టోకేనిజం కూడా కాదు..ఇది ముమ్మాటికి హిపోక్రసీ అని కొందరు వాదిస్తున్నారు. ముందు కత్తిపోటు పెట్టి.. తర్వాత కట్టుకట్టినట్లు నటిస్తున్నారని.. బాధ పెట్టినవాళ్లే, ఉపశమనం కల్పిస్తున్నట్టుగా నటించడం హిపోక్రసీ కాకపోతే ఇంకేంటని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి సుబ్రహ్మణియన్ సూచించిన 90 గంటల పని కల్చర్‌ విధానం సమాజంలో ఎవరికీ సాధ్యం కాదు. అయితే మహిళలకు ఇది మరింత భారం. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు మగవారికంటే ఎక్కువగా మహిళలే మోస్తున్నారు. కుటుంబ జీవితం, ఆఫీస్‌ జీవితం కోసం వ్యక్తిగత జీవితాన్ని వదులుకునే మహిళలు ఎక్కువగా కనిపిస్తారు. ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా పని చేసేది మహిళలే. అలాంటి మహిళలు L and T కంపెనీలో కూడా ఉంటారు కదా..! మరి ఓవైపు వారానికి 90 గంటలు పని చేయాలని చెప్పే కంపెనీలు.. మరోవైపు నెలసరి సెలవు ప్రకటించడం విడ్డూరమే అనిపిస్తోంది!

ALSO READ: ప్రతి ఐదుగురులో ముగ్గురు.. ఇండియాను చంపేస్తున్న మహమ్మారి!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *