ప్రతిరోజూ 3,000 మంది.. ప్రతి గంటా 125 మంది.. ప్రతి పది మందిలో ఆరుగురు క్యాన్సర్‌కు బలైపోతున్నారని తెలుసా? మన రక్తంలో, మన శరీరంలో, మన ఊపిరిలో నిశ్శబ్దంగా క్యాన్సర్‌పై పోరు జరుగుతోంది. 2050 నాటికి ఇండియా క్యాన్సర్‌గా అడ్డాగా మారనుంది. వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ ప్రతి ఐదుగురులో ముగ్గురు క్యాన్సర్‌కు చనిపోతున్నారని ICMR నివేదిక ప్రకారం చెబుతోంది. 2012 నుంచి 2022 మధ్య క్యాన్సర్ కేసులు 36శాతం పెరిగాయి. 2012లో 10 లక్షల కేసులు ఉండగా, 2022 నాటికి 13.8 లక్షలకు పెరిగాయి. మరణాల సంఖ్య 6.8 లక్షల నుంచి 8.9 లక్షలకు పెరిగింది. అంటే.. ప్రతి రోజూ దాదాపు 2,500 మంది క్యాన్సర్‌తో చనిపోతున్నారు!
ICMR నివేదిక ప్రకారం 2022 నుంచి 2050 మధ్య క్యాన్సర్ మరణాల రేటు 109.6శాతం పెరగనుంది. అంటే ఇప్పుడు రోజుకు 2,500 మంది మరణిస్తే, 2050 నాటికి రోజుకు 5,000 మంది మరణిస్తారు. ఇక ఎక్కువగా క్యాన్సర్‌కు బలైపోతున్న వారిలో మహిళలే ఉన్నారు. Breast Cancer మహిళలను బలితీసుకుంటోంది. అటు గర్భాశయ క్యాన్సర్ నిశ్శబ్దంగా జీవితాలను తుడిచి పెట్టేస్తోంది. హార్మోన్ మార్పులు, రసాయన ప్రభావాలు మహిళలను మరణపు తలుపు ఎదుట నిలబెడుతున్నాయి. ఇక దేశంలో క్యాన్సర్ కేసులు పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
ఇండియాలో 70శాతం క్యాన్సర్ కేసులు మధ్యవయస్కులు, వృద్ధుల్లో రికార్డవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కాలుష్యం. ఫ్యాక్టరీలు, వాహనాల పొగ క్యాన్సర్ కేసులకు పరోక్ష కారణంగా నిలుస్తున్నాయి. ఇటు జీవనశైలి మార్పులు మనిషికి అనేక రోగాలను తెచ్చిపెడుతోంది. రాత్రుళ్లు నిద్ర లేకుండా ఫోన్, కంప్యూటర్ స్క్రీన్ల ముందు గంటల పాడు గడపడం, కెమికల్స్ నిండిన ఆహారం తినడం, ఒత్తిడిలో బతకడం.. ఇవన్నీ మనిషిని మరణానికి దగ్గర చేస్తూ ఉంటాయి. అటు గ్రామీణ ప్రాంతాల్లో 70శాతం క్యాన్సర్ కేసులు ప్రాథమిక దశలో గుర్తించలేకపోవడం వల్ల మరణాలు పెరుగుతున్నాయి.
అందుకే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతున్నారు వైద్యులు. నిత్యం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. స్త్రీలలో బ్రెస్ట్, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పనిసరి. ఇటు జీవనశైలిని మార్చుకోవాల్సిందే. ఫాస్ట్ ఫుడ్‌కు గుడ్‌బై చెప్పాలి. వ్యాయామం చేయాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇటు కాలుష్యాన్ని నియంత్రించాలి. పరిశ్రమలు, ట్రాఫిక్ పొగను తగ్గించేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక ప్రభుత్వం ప్రత్యేక క్యాన్సర్ ఆసుపత్రులను పెంచాలి. గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీనింగ్ సెంటర్లు ఎక్కువగా ఏర్పాటు చేయాలి. పేదలకు మెరుగైన వైద్యం అందించాలి. ఇక క్యాన్సర్ చికిత్స చాలా ఖరీదైనది. ప్రభుత్వం ఆరోగ్య బీమా విధానాలను బలోపేతం చేయాలి. క్యాన్సర్ గురించి ఆలోచించాల్సిన సమయం రేపు కాదు.. ఇప్పుడే అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి! లేదంటే 2050 నాటికి ఇండియా మరణపు చితిలో తగలపడిపోవాల్సి రావొచ్చు.
ALSO READ: ఈ జీవితం ఎవరి కోసం? ఎందుకోసం? అసలు ఈ బతుక్కి అర్థమేమైనా ఉందా? ఏమో..ఏంటో.. మేధావులే సమాధానం చెప్పాలి