హిందీ(Hindi) రాకపోతే పాస్ కాలేమా? ఇప్పటికే రెండు భాషలు రాయలేక చచ్చిపోతున్నాం..ఇప్పుడు ఇంకో భాషా? ఇది ఒక విద్యార్థి సమస్య మాత్రమే కాదు.. ఇది ఒక ప్రజా సమస్య.. ఇది ఒక భాషా స్వాతంత్ర్య యుద్ధం..! అవును..! ఇండియా మళ్లీ భాషల యుద్ధానికి వేదిక అవుతోంది. తమిళనాడు- కేంద్రం మధ్య మొదలైన భాషా వివాదం ముదురుతోంది. త్రి-భాషా విధానం అమలుపై కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. ఇటు తమిళనాడు మాత్రం త్రి-భాషా విధానం అమలకు అంగీకరించడంలేదు. దీంతో కేంద్రం ప్రతీకారానికి దిగింది. సమగ్ర శిక్షా అభియాన్ కింద ఇచ్చే నిధులను నిలిపివేసింది. త్రి-భాషా విధానం అమలు చేస్తేనే నిధులు ఇస్తామని షరతు పెట్టింది. ఈ నిర్ణయంతో తమిళనాడు(Tamilnadu) ప్రభుత్వాన్ని ఆగ్రహానికి గురి చేసింది. ఇంతకీ ఏంటి త్రి-భాషా విధానం? తమిళనాడు ప్రభుత్వం దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తోంది?
ఎందుకీ విపరీత హిందీ పైత్యం?
భారత రాజ్యాంగం ప్రకారం ఇండియాకు జాతీయ భాష లేదు. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు కొన్ని అధికారిక భాషలు ఉన్నాయి. అయినా కూడా 1968లో త్రి-భాషా విధానాన్ని ప్రవేశపెట్టారు. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని తప్పనిసరి చేశారు. అదే సమయంలో, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో మాత్రం మరో భారతీయ భాషను నేర్పించాలనే నిబంధన పెట్టారు. అయితే ఇది పెద్దగా అమలు కాలేదు. అటు హిందీని తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ అప్పట్లో తమిళనాడులో ఘర్షణలు జరిగాయి. విద్యార్థుల ప్రాణాలనే బలి తీసుకున్న ఆ ఉద్యమం తరువాత కేంద్రం వెనక్కి తగ్గింది. తమిళనాడుకు మాత్రం ద్విభాష విధానాన్ని అమలు చేస్తూ వచ్చింది. తమిళం, ఇంగ్లీష్ మాత్రమే అక్కడి విద్యార్థులు చదువుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు మళ్లీ సీన్ రివర్స్ అయ్యింది. జాతీయ విద్యా విధానం-NEP 2020 కింద మళ్లీ హిందీని తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఇది మరోసారి పాత గాయాలను గుర్తుచేస్తోంది.
ఇవి బెదిరింపులు కావా?
1960 దశకంలో హిందీని బలవంతంగా రుద్దాలన్న నాటి కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు తమిళ గుండెల్లో మంటలు రేపాయి. సరిగ్గా 1965లో దేశ చరిత్రలో అతి తీవ్రమైన భాషా పోరాటం చెలరేగింది. తమిళ యువత, విద్యార్థులు రోడ్లెక్కారు. హిందీ వ్యతిరేక ఉద్యమం దావానలంలా వ్యాపించింది. ప్రాణాలర్పించాల్సిన స్థితికి వచ్చింది. తమిళ యువత తమ భాష కోసం బలయ్యారు. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఇప్పుడు మళ్లీ అదే యుద్ధం.. అదే గాయం.. అదే నష్టం.. కానీ కొత్త రూపంలో ముంచుకొచ్చింది. త్రి-భాషా విధానం అంటూ మళ్లీ హిందీని లాక్కొచ్చారు. ఈసారి కేంద్రం కొత్త ఆయుధాన్ని ఉపయోగిస్తోంది.. అదే నిధుల కత్తి..! త్రి భాషా విధానం పాటించకపోతే సమగ్ర శిక్షా అభియాన్ నిధులను ఇచ్చేదే లేదని కేంద్రం ఖరాఖండిగా చెబుతోంది. ఇలా ఇటు రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాల వివాదంలో అమాయక పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
పేద విద్యార్థులకు మరింత భారం?
తమిళనాడు మాత్రమే కాదు గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు త్రి-భాషా విధానం మరింత భారం. ప్రైవేట్ స్కూళ్ల పిల్లలు సరే.. వాళ్లకు టీచర్లు ఉంటారు కానీ.. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లే లేరు. ఇప్పుడు మూడో భాష కూడా చదవాలా? అది కూడా హిందీ మాత్రమే ఎందుకు చదవాలి? ఇంకో భాష భారంగా మారితే పేద విద్యార్థులు స్కూలుకే రావడం మానేస్తారేమో? Annual Status of Education Report-ASER 2023 రిపోర్ట్ ప్రకారం ఐదో తరగతి పిల్లల్లో 60శాతం మంది రెండో తరగతి స్థాయి పుస్తకాలను కూడా చదవలేని స్థితిలో ఉన్నారు. 14 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న యువతలో 25శాతం మంది తమ ప్రాంతీయ భాషలో సరిగ్గా చదవలేకపోతున్నారు. 40శాతం మంది ఇంగ్లీష్ వాక్యాలను చదవలేరు! ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో భాషను బలవంతంగా నేర్పిస్తే.. ఫలితం ఏంటో ఊహించగలరా? పేద విద్యార్థులు స్కూలుకే వెళ్లే ఆసక్తిని కోల్పోతే అది మొదటికి మోసం వస్తుంది.
మూడో భాష హిందీనే ఎందుకవ్వాలి?
ఇక ఇండియాలో 2011 జనగణన ప్రకారం రెండు భాషలు మాట్లాడేవారి సంఖ్య 26శాతంగా ఉంది. 7శాతం మంది మాత్రమే మూడు భాషలు మాట్లాడగలరు. పట్టణాల్లో 44శాతం మంది బైలింగ్వల్, 15శాతం మంది ట్రైలింగ్వల్ ఉన్నారు. గ్రామాల్లో 22శాతం మంది రెండు భాషాలు మాట్లాడగలగుతున్నారు. అక్కడ మూడు భాషాలు మాట్లాడే వారి సంఖ్య 5శాతం మాత్రమే ఉంది. ఈ లెక్కలు చూస్తే దేశంలో చాలా మంది రెండు భాషలే నేర్చుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. మరి మూడో భాష నెత్తికెక్కించడం ఎందుకన్న వాదన బలంగా వినిపిస్తోంది.
హిందీ రుద్దుడు ఇంకెంతకాలం?
అటు కేంద్రం 2022లో విద్యపై ఖర్చు చేసిన మొత్తం 23 లక్షల కోట్లు. అందులో 85శాతం రాష్ట్రాలే భరిస్తున్నాయి. కేంద్రం కేవలం 15శాతం మాత్రమే భరిస్తోంది. ఇప్పుడు ఆ 15శాతం నిధుల్ని కూడా బంద్ చేస్తానంటోంది! దీన్ని తమిళనాడు గట్టిగా వ్యతిరేకిస్తోంది. నిజానికి తమిళనాడుతో పాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాలు కూడా ఎప్పటి నుంచో ప్రాంతీయ భాషా స్వతంత్రాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా హిందీని బలవంతంగా రుద్దుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇంగ్లీష్ కంటే హిందీని ఎక్కువగా ప్రోత్సహించడాన్ని కూడా చాలా మంది తప్పుపడుతున్నారు. గ్లోబల్ మార్కెట్లో పోటీ పడే భారత విద్యార్థులకు హిందీతో ఉపయోగం ఉండదు. ఇంగ్లీష్‌తోనే ఉంటుంది. కారణాలు ఏవైనా ఇప్పుడు ప్రతి విద్యార్థికి బెసిక్ ఇంగ్లీష్ మాట్లాడడం, రాయడం అవసరంగా మారింది. కానీ కేంద్రం ఆలోచనా తీరు దినికి విరుద్ధంగా ఉందన్న అభిప్రాయాలు వినపిస్తున్నాయి. మరి చూడాలి ఈ త్రి-భాషా యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో..!
ALSO READ: ‘నరక ద్వారాలు తెరుచుకుంటాయి..’ ఇజ్రాయెల్ బరితెగింపు చర్యలు.. నెతన్యాహు నెక్ట్స్ టార్గెట్ ఇరాన్?