ఒక్కసారి ఊహించండి… అంతా చిమ్మచీకటి.. ఒక 23 ఏళ్ల యువకుడు అడవిలో మూడు రోజులుగా కాలినడకన… ఆకలితో అలమటిస్తూనడుస్తున్నాడు! ఎదురుగా మృతదేహాలు… కుళ్లిన శవాలు.. చుట్టూ గట్టిగా వినిపించే అడవి జంతువుల అరుపులు… అయినా గమ్యంవైపు తన అడుగులు ఆగలేదు. ఎలాగైనా అమెరికా వెళ్లాలనే కలతో.. కళ్లల్లో భయమున్నా అదే దారిలో నడిచాడు. ఎంతో నమ్మకం పెట్టుకున్న దళారి మధ్యలో వదిలేసి పారిపోయాడు. ఆ దళారికి డబ్బులు ఇవ్వడానికి ఆ యువకుడి కుటుంబం భూమిని అమ్మింది.. ఆభరణాలు తాకట్టు పెట్టింది.. గత తరం సంపాదించినదంతా వదులుకుంది. ఇన్ని ఆలోచనల మధ్య అమెరికా సరిహద్దుల్లోకి ప్రవేశించిన అతడిపై పోలీసులు దాడి చేశారు. నిర్బంధ శిబిరంలోకి లాక్కెళ్లారు. అతని తల మీద తలపాగాను బలవంతంగా ఊడగొట్టి, అవమానంగా చెత్త కుండీలో పడేశారు. భయం.. అవమానం.. నిరాశ.. ఆకలి అతన్ని చుట్టుముట్టాయి. ఇదంతా దళారుల చేతిలో మోసపోయి ఇండియా నుంచి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన జతీందర్ కథ. చెప్పరాని మానసిక యాతన… శరీరాన్ని పీడించే హింస… కాళ్లు, చేతులు బేడీలతో 36 గంటలు… విమానంలో కూడా కదలలేని విధంగా కాళ్లు, చేతులు కదపలేని పరిస్థితి…
అంతా దళారులే చేస్తున్నారా?
AC ఉష్ణోగ్రతను అమాంతం పెంచి కొన్ని గంటలపాటు మానసికంగా, శారీరకంగా అమెరికా అధికారులు నరకం చూపించారు. రోజుకు కేవలం రెండు పూటలు లేస్ చిప్స్, ఫ్రూటీ జ్యూస్ ఇచ్చి ఆకలితో అల్లాడిపోయేలా చేశారు. స్వేచ్ఛగా ఊపిరి పీల్చే పరిస్థితి లేదని.. తమని పశువుల్లా చూశారని చెబుతున్నాడు పంజాబ్‌కు చెందిన జతీందర్. ఇక ఇలాంటి వ్యథే..మరో ఇద్దరు గోవా యువకులది. మానవ అక్రమ రవాణాదారుల వలలో చిక్కి, డాంకీ రూట్లలో ప్రాణాలతో గట్టెక్కినా, అమెరికాలో వాళ్లను క్రిమినల్స్‌లా చూశారు. కాళ్లు, చేతులు కట్టేసి 36 గంటలపాటు ప్రయాణం. విమానంలో కూడా చేతులకు బేడీలు, కాళ్లకు గొలుసులు! ఏ చిన్న తప్పు చేసినా అమెరికా అధికారుల చేతిలో దారుణ హింస! ఇదంతా వింటుంటే మీకేం అనిపిస్తుంది? అసలు అమెరికా నిజంగా మానవత్వం కలిగిన దేశమా? మానవ హక్కుల పరిరక్షణ తమ దేశ బాధ్యత అని గొప్పలు చెప్పుకునే అమెరికా వాస్తవంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. వలసదారులను, నిరుపేద కుటుంబాల కలలను ముక్కలుగా చీల్చేస్తుంది. అమెరికా డాంకీ మార్గాల్లో వలస వెళ్లేవారు మృత్యు ఒడిలోకి జారుకుంటున్నారు. అమెరికా నిర్బంధ శిబిరాల్లోకి వెళ్లినవారు హింస అనుభవిస్తున్నారు. ఇక ఇంతటి ఘోరానికి కారణం ఏంటో తెలుసా? నిందంతా అమెరికా అధికారులపైనే వేసేస్తే మనం సమస్య మూలాలను పట్టించుకోనట్టే లెక్క. అసలు ఈ ఘోరాలకు పునాదులు ఇండియా గడ్డపైనే ఉన్నాయి. మోసం చేసేదంతా భారతీయు దళారులే. పంజాబ్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో దళారుల మోసాలకు హద్దే లేకుండా పోతోంది.
పేదరికమే అసలు సమస్య:
గుజరాత్‌లోని సూరత్, వడోదరా, రాజ్‌కోట్, కచ్ ప్రాంతాల్లో దళారుల సామ్రాజ్యం భారీగా ఉంది. అందుకే గుజరాత్ యువత ఎక్కువగా మోసపోతోంది. అటు హర్యానా యువకులు ఎక్కువగా కెనడా, అమెరికాలో స్థిరపడాలని కలలు కంటారు. ఇక్కడ అక్రమ వలస ముఠాలు భారీగా పని చేస్తున్నాయి. ఇటు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి కూడా యువత డాంకీ మార్గాల్లో అమెరికా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వీరంతా ముంబై, ఢిల్లీలో ఉండే దళారుల సహాయంతో బయలుదేరుతున్నారు. అటు పంజాబ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, కొత్త తరం యువత విదేశాలకు వెళ్లాలని ఆశపడటం ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్ల కలలను దళారులు క్యాష్ చేసుకుంటున్నారు. దళారుల చేతికి నమ్మకంగా 10 లక్షలు, 20 లక్షలు ఇస్తున్నారు. బాధితులు అమెరికా డాంకీ రూట్‌కి వెళ్లేవరకు దళారులు వారితోనే టచ్‌లో ఉంటారు. తర్వాత ఫోన్లు స్వీచ్ ఆఫ్ అయిపోతాయి. ఆ అడవుల్లోకి వెళ్లిన తర్వాత కానీ మోసపోయిన విషయం బాధితులకు అర్థంకాదు. దీంతో ఏం చేయాలో తెలియక.. చీకటిలో నడుస్తూ.. ఒంటరిగా ఏడుస్తూ.. ఆకలితో అలమటిస్తూ ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా ముందుకు నడుస్తారు. మరి ఇంతటి ఘోరం జరుగుతుంటే భారత ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? ఇంకా ఎంత మంది మోసపోతే ప్రభుత్వం మేల్కొంటుంది? ఈ దళారుల ముఠాలను పట్టుకోవడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేసింది? అటు భారతీయ అక్రమవలసదారులను అమెరికా ఇంతలా వేధిస్తుంటే ఏం ప్రశ్నించదా? ఇంతకీ ఈ మొత్తం ఎపిసోడ్‌పై మీరేం అంటారు? అసలు తప్పు ఎవరిది? ఆ తప్పు ఎక్కడ జరుగుతుంది?
ALSO READ: మానవత్వం మరిచిన ట్రంప్.. డబ్బుల కక్కుర్తితో పేద దేశాల ప్రజల కడుపు మాడ్చుతున్న ప్రెసిడెంట్!