22ఏళ్ల మోహన్‌కు ఆరోగ్య సమస్యలు లేవు. ప్రతిరోజూ లాగే ఉదయం లేచి రోజువారీ పనులు చేసుకుంటున్నాడు. ఎప్పటిలాగే వాష్‌రూమ్‌కు వెళ్లాడు. అక్కడ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాడు. కానీ, ఎంత ప్రయత్నించినా కాళ్లు కదలలేదు! నిమిషాలు గడుస్తున్నా పరిస్థితి మారలేదు. కష్టంగా గోడకి ఆనుకుని, స్నేహితుల సహాయంతో బయటకొచ్చాడు. ఆ భయం.. ఆ అసహాయం.. అలాంటి అనుభూతి మోహన్ ఎప్పుడూ రాలేదు! ఆ వెంటనే హాస్పిటల్‌కు వెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు ఇది గులియన్ బ్యారీ సిండ్రోమ్-GBS అని తేల్చారు.
GBS అంటే ఏంటి?
మన శరీరం వ్యాధులను ఎదుర్కొనడానికి వ్యాధినిరోధక వ్యవస్థని కలిగి ఉంటుంది. ఇది మన శరీరాన్ని రక్షించే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో, అదే యాంటీబాడీలు సొంత నరాల మీదే దాడి చేయడం ప్రారంభిస్తాయి. అప్పుడు మన నరాలపై ఉండే మైలీన్ అనే పొర తొలగిపోతుంది. మెదడు నుంచి కండరాలకు వెళ్లే సిగ్నల్స్ నిలిచిపోతాయి. కాళ్లు, చేతులు బలహీనపడటం మొదలవుతుంది. నడకలో మార్పు వస్తుంది. క్రమంగా శరీరంలోని అన్ని అవయవాలు ప్రభావితమవుతాయి. దీన్నే GBS అంటారు.
GBS కారణాలు
అటు GBS ఎందుకు వస్తుందో కారణాలు ఇప్పటివరకు స్పష్టంగా తెలియదు. కానీ కొన్ని ముఖ్యమైన వ్యాధుల తర్వాత ఇది అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కరోనా లాంటి వైరస్‌లు, డెంగీ, టైఫాయిడ్, జ్వరం, ఫుడ్ పొయిజనింగ్ లాంటి వ్యాధులు వచ్చిన తర్వాత GBS బారిన పడుతుండడాన్ని వైద్యులు గుర్తిస్తుంటారు. ఇది కొంతమందిలో వైరల్ ఇన్ఫెక్షన్ రూపంలో ఉంటుంది. మరికొందరిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రూపంలో ఉంటుంది. చాలా మంది దీన్ని వైరస్ అని పిలుస్తున్నారు కానీ ఇది వైరస్ కాదు. ఇది వైరస్ లేదా బ్యాక్టిరియా కారణంగా వచ్చే సిండ్రోమ్. కొన్ని వ్యాక్సిన్లు కూడా ఈ వ్యాధికి కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO అంచనా వేసింది. అయితే చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే అలా జరిగింది.
GBS లక్షణాలు
ఇక జీబీఎస్ బారిన పడిన వారి నడకలో మార్పు, కాళ్లు బలహీనత ఉంటుంది. చేతులు, కాళ్లు కదలకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఉండవచ్చు. హృదయ స్పందనలో మార్పులు, రక్తపోటులో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. GBS తీవ్రమైతే ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే కాళ్లు బలహీనపడితే నిర్లక్ష్యం చేయకండి. నడకలో మార్పు వచ్చినా, తక్షణమే వైద్యులను సంప్రదించండి. GBS అనుమానం ఉంటే, వెంటనే పరీక్షలు చేయించుకోండి.
#WATCH | Visakhapatnam: On the two deaths in Andhra Pradesh due to Guillain Barre Syndrome, Dr Sivananda, Superintendent of KGH Hospital, says, ” Guillain Barre Syndrome is a post-viral infection that leads to the autoimmune system derangement in the presence of own body. It will… pic.twitter.com/4cgOmlwTA7
— ANI (@ANI) February 17, 2025
GBS చికిత్స
GBSకు రెండు రకాల ముఖ్యమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అందులో మొదటిది ఇమ్యూనోగ్లోబ్యులిన్-IVIG చికిత్స. బాధితుడి బరువు ఆధారంగా ఐదు రోజుల పాటు ఇంజెక్షన్లు ఇచ్చే ప్రక్రియ ఇది. ఇలా ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా యాంటీబాడీల దాడిని తగ్గిస్తారు. ఇది నరాల మరింత నాశనం జరగకుండా కాపాడుతుంది. ఈ చికిత్స ఖరీదైనదే అయినా, సమర్థంగా పనిచేసే అవకాశాలు ఎక్కువ. ఇక రెండోది 2. ప్లాస్మా ఎక్స్‌ఛేంజ్ చికిత్స. ఈ చికిత్సలో రక్తం నుంచి ప్రమాదకరమైన యాంటీబాడీస్‌ను తొలగించి కొత్త ప్లాస్మా భర్తీ చేస్తారు. ఇది దాదాపు ఐదు నుంచి ఆరు విడతలుగా చేస్తారు. ఇమ్యూనోగ్లోబ్యులిన్‌తో పోల్చితే తక్కువ ఖర్చుతోనే ఈ చికిత్స పూర్తి చేయవచ్చు.
రోగి కోలుకునే అవకాశాలు
అటు చికిత్స తీసుకున్న వారిలో 70శాతం మంది బాధితులు 2 నుంచి 6 నెలల మధ్య పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. ఇక ఈ సిండ్రోమ్ బారిన పడిన వారిలో 10శాతం మంది వెంటిలేటర్‌పై ఆధారపడే అవసరం ఉంటుంది. 20శాతం మంది వారంలోనే స్వల్ప లక్షణాలతో కోలుకోవచ్చు. చాలా అరుదైన సందర్భాల్లో.. దాదాపు 5శాతం మందికి GBS రెండోసారి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అటు మరణాలశాతం కూడా తక్కువనే చెప్పాలి. ఈ వ్యాధి బారి పడినవారిలో 90శాతం మంది కచ్చితంగా కోలుకుంటారని డాక్టర్లు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఏపీతో పాటు తెలంగాణలోనూ జీబీఎస్ కేసులు నమోదవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సిండ్రోమ్ కారణంగా మరణాలు కూడా సంభవించాయి. అటు మహారాష్ట్రాలోనూ GBS కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే లక్షణాలను ముందుగానే గుర్తించి డాక్టర్‌ను సంప్రదిస్తే ఎలాంటి సమస్యా ఉండదని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘నరక ద్వారాలు తెరుచుకుంటాయి..’ ఇజ్రాయెల్ బరితెగింపు చర్యలు.. నెతన్యాహు నెక్ట్స్ టార్గెట్ ఇరాన్?