‘శత్రువుల కన్నా స్నేహితులే ప్రమాదకరంగా మారారు..’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పేల్చిన ఈ ఒక్క డైలాగ్‌కి ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ వస్తోంది. రెండోసారి అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్ ప్రధాని మోదీ(Narendra Modi)తో తొలిసారి భేటీ అవ్వడానికి గంట ముందు ట్రంప్ ఈ తరహా కామెంట్స్ చేయడం ఆయన టెంపరితనానికి పరాకాష్ట. ఇక అంతటితో ఆగారా అంటే అదీ లేదు. చెప్పిందే చేశారు. ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీన్నే రెసిప్రోకల్ టారిఫ్స్(Reciprocal Tariffs) అని పిలుస్తారు. అంటే పరస్పర సుంకాలు. కానీ పరస్పర సుంకాలు అని పిలిచే కంటే ప్రతీకార సుంకాలు అని అనడం బెటర్. ఎందుకంటే ట్రంప్ దీన్ని అలానే ఫీల్ అవుతున్నారు. tit for tat విధానాన్ని గట్టిగా పాటించే ట్రంప్ ఇండియాపైనా ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు కుండబద్దలు కొట్టారు. తన ప్రసంగంలో ప్రత్యేకించి మరీ భారత్ పేరును ప్రస్థావించడం సంచలనం రేపుతోంది. ఇంతకి ఏంటీ రెసిప్రోకల్ టారిఫ్స్? ట్రంప్ నిర్ణయంతో నెక్ట్స్ ఏం జరగబోతుంది?
రెసిప్రోకల్ టారిఫ్‌లు అంటే ఏమిటి?
రెసిప్రోకల్ టారిఫ్ అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తెలుసుకుందాం. అమెరికాలో తయారైన హార్లే డేవిడ్సన్ బైకులపై ఇండియా 100శాతం దిగుమతి సుంకం విధిస్తోంది. ఇటు భారత్‌లో తయారైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులపై అమెరికా కేవలం 2.4శాతం టారిఫ్ మాత్రమే వసూలు చేస్తోంది. ఇప్పుడు ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ విధించాలని నిర్ణయించుకున్నారు కదా.. అంటే ఇకపై అమెరికా కూడా ఇండియా నుంచి దిగుమతయ్యే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులపై 100శాతం సుంకం విధిస్తుంది. ఒకే రకమైన ఉత్పత్తులపై, సమానంగా టారిఫ్‌లు అమలు చేయడమే రెసిప్రోకల్ టారిఫ్ అర్థం. అంటే సమానమైన పన్ను విధానం. అమెరికా దిగుమతులపై ఏ దేశం ఎంత పన్ను విధిస్తే, అదే స్థాయిలో అమెరికా కూడా ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై పన్ను విధిస్తుందన్నమాట. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ట్రంప్ ఇండియాపై నేరుగా విమర్శలు గుప్పించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఉన్నా టారిఫ్ వడ్డింపుల విషయంలో మాత్రం భారత్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు ట్రంప్. హార్లే డేవిడ్సన్ తన మోటార్ బైక్స్‌ను భారత్‌లో విక్రయించలేకపోతుందని.. ఎందుకంటే, ఇండియాలో టారిఫ్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇది పూర్తిగా అన్యాయమైన విధానమని మండిపడ్డారు.
రెసిప్రోకల్ టారిఫ్‌లు ఎలా పని చేస్తాయి?
ఇక ట్రంప్ ఇలా చేయడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. పరస్పర టారిఫ్‌ల విధింపు అమల్లోకి వచ్చిన తర్వాత అమెరికా ఉత్పత్తులకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇతర దేశాలు టారిఫ్‌ను తగ్గించేందుకు ప్రయత్నిస్తాయి. అమెరికా పరిశ్రమలు ఇతర దేశాల పరిశ్రమల కంటే లాభపడతాయి. ఎందుకంటే విదేశీ కంపెనీలు ఇప్పుడు అమెరికా మార్కెట్లో అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. ముఖ్యంగా భారత్, చైనా, యూరోప్ లాంటి దేశాలకు ఇది సమస్యగా మారొచ్చు. ఎందుకంటే అమెరికా వారి దిగుమతులపై అధిక పన్ను విధిస్తే, వారి వ్యాపారం దెబ్బతింటుంది. ఇదే ట్రంప్ మాస్టర్ ప్లాన్.
అమెరికా దిగుమతులపై ఇండియా విధించే టారిఫ్ ఎంత?
డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా భారత్ పేరును ప్రస్థావించడానికి బలమైన కారణముంది. అమెరికా దిగుమతులపై ఇండియా భారీగా టారిఫ్‌లు విధిస్తోంది. ఇందాక చెప్పుకున్న హార్లే డేవిడ్సన్ బైకులపై టారిఫ్ విధానం దీనికి పెద్ద ఉదాహరణ. అటు కేవలం ఈ బైకుపైనే కాదు ఇతర వస్తువుల విషయంలోనూ అమెరికా నుంచి ఇండియా గట్టిగానే వసూలు చేస్తోంది. అమెరికా నుంచి భారత్‌కి దిగుమతి అయ్యే iPhones, Macbooks లాంటి ఉత్పత్తులపై 20శాతం టారిఫ్ ఉంది. అమెరికా మాత్రం భారతీయ స్మార్ట్‌ఫోన్లపై ఇప్పటివరకు 2శాతం మాత్రమే టారిఫ్ విధిస్తోంది. అందుకే ఈ సుంకాలను సమానంగా వడ్డించాలని ట్రంప్ నిర్ణయించుకోని ఉండవచ్చు.
ట్రంప్ నిర్ణయం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ట్రంప్ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే ఉత్పత్తుల ధర పెరుగుతుంది. ఎందుకంటే అమెరికా భారత్‌పై అధికంగా టారిఫ్ విధించనుంది. భారతీయ ఎగుమతిదారులు అమెరికాలో తమ మార్కెట్ పోగొట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ అధిక ధరల వల్ల విక్రయాలు తగ్గుతాయి. ఇటు భారత ఐటీ సేవలు, టెక్స్‌టైల్ ఉత్పత్తులు, ఫార్మా కంపెనీలు బాగా నష్టపోతాయి. భారత స్టాక్ మార్కెట్‌పైనా దీని ప్రభావం కనిపించవచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా అమెరికాపై ఎక్కువగా ఆధారపడ్డ కంపెనీలు నష్టపోవచ్చు. ఇక భారత్ వాణిజ్య సమస్యలను ఎదుర్కొంటే, ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉంటుంది. ఎగుమతులు తగ్గితే, కంపెనీలు ఆదాయం కోల్పోతాయి. దీని ప్రభావం నేరుగా ఉపాధిపై పడుతుంది. ఇప్పటికే ఇండియాను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య నిరుద్యోగం.
భారత్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలి?
ట్రంప్ నిర్ణయం తర్వాత ఇండియా ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. టారిఫ్‌లను తగ్గించేందుకు ట్రేడ్ ఒప్పందాలు తప్పనిసరి. భారత్ అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ట్రేడ్ డీల్ ద్వారానే రెండు దేశాల మధ్య టారిఫ్‌లను తగ్గించుకోవచ్చు. ఇదే సమయంలో భారత్ యూరప్, చైనా, జపాన్ లాంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు స్ట్రాంగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అమెరికా వాణిజ్య ఆంక్షల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇటు స్వదేశీ ఉత్పత్తులను మరింత ప్రోత్సహించాల్సి ఉంటుంది. భారత తన మార్కెట్‌ను బలంగా ఉంచుకోకపోతే ట్రంప్ నిర్ణయం ప్రభావం చాలా గట్టిగా పడుతుంది.
రేసిప్రోకల్ టారిఫ్‌లు ట్రేడ్ వార్‌కు దారితీస్తాయా?
మరోవైుపు ట్రంప్ తీసుకున్న రెసిప్రోకల్ టారిఫ్‌ల విధానం వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయా అనే భయాలు సర్వత్రా నెలకొన్నాయి. ట్రంప్ ప్రకటించిన ఈ టారిఫ్ విధానం ప్రపంచ వ్యాపార రంగంలో పెద్ద భూకంపాన్నే సృష్టించనుంది. ఒకవైపు అమెరికా ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతుండగా, మరోవైపు భారత్, చైనా, యూరప్, మెక్సికో, కెనడా లాంటి దేశాలు ఈ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ట్రంప్ ఇప్పటికే చైనా, కెనడా, మెక్సికోపై ట్యాక్స్‌లు పెంచారు. దీనిపై ఆ దేశాలు కూడా అదే స్థాయిలో స్పందించాయి. ఇప్పుడు ట్రంప్ మరింత రెచ్చగొట్టేలా రెసిప్రోకల్ టారిఫ్ విధానాన్ని ప్రకటించారు. దీంతో ఇతర దేశాలు కూడా అమెరికా దిగుమతులపై అధిక పన్నులు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల చివరకు నష్టపోయేది సామాన్యుడే. ఎందుకంటే పరస్పర పన్ను వడ్డింపులతో నిత్యావసర ధరలు పెరుగుతాయి.. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. దీని ప్రభావం ఉపాధి, వృద్ధిరేటు, స్టాక్ మార్కెట్లపై పడుతుంది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో దేశాల మధ్య తీవ్ర వాణిజ్య పోటీ ప్రారంభమవుతుంది. 2018లోనూ చైనా ఇలానే చేసింది. అమెరికా విధించిన పన్నులకు ప్రతిస్పందనగా అదే స్థాయిలో పన్ను విధించింది. ఆ నిర్ణయం ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్‌కు కారణమైంది. అయితే ఇప్పుడు మాత్రం ఇది కేవలం చైనాతోనే ఆగేది కాదు..యూరోపియన్ యూనియన్ నుంచి ఆసియాలోని ఇతర దేశాల వరకు ట్రంప్‌పై ప్రతీకార చర్యలకు దిగవచ్చు.
ఇది కూడా చదవండి: శ్రామికులపై కార్పొరేట్ల మథం. నిర్మాణ కార్మికులపై ఎస్ఎన్ సుబ్రహ్మణియన్ కక్కిన విషం