అదో చీకటి గది. ఇనుము గడి తలుపులు… ఎప్పుడూ మూసుకుపోయే వాతావరణం. వెలుగుకే అరుదైన ప్రదేశం. ఇది ముంబైకి అతి సమీపంలో.. మానవ హక్కులు మసకబారిపోయిన తలోజా జైలు(Taloja Jail) పరిస్థితి. వేలాదిమంది ఖైదీలతో నిండిన ఈ బందిఖానా గదుల్లో జరిగే ఘోరాలను కళ్లకు కట్టారు జైలు యాక్టివిస్టులు. భారత్ రాజ్యాంగాన్ని(Indian Constituition), చట్టాలను కాలరాస్తున్న జైలు అధికారుల భాగోతాన్ని మరోసారి బయటపెట్టారు. ఏదైనా కేసులో అరెస్ట్ అయిన వారు తలోజా జైలుకు వెళ్తే కోర్టు ముఖం చూసే అవకాశం దక్కనివ్వకుండా చేస్తారు అధికారులు. నవీముంబైలో ఉండే ఈ జైలు సామర్థ్యం 2,124 మంది. కానీ వాస్తవానికి ఇక్కడ 2,600 మందికి పైగా ఖైదీలు ఇబ్బందులు పడుతూ గడుపుతున్నారు. అక్కడి కారాగార గదుల్లో చీకటి తిష్టవేసుకోని ఉంటుంది. ఏదో ఒక రోజు కోర్టుకు వెళ్లాలి కదా అనే ఆలోచనను కూడా వారు మర్చిపోతారు. కొంతమంది ఏడాది, మరికొంతమంది రెండేళ్లు ఇంకొంతమంది ఏకంగా 14 ఏళ్లు పాటు కోర్టు గడప తొక్కకుండా అసలు తామేం పాపం చేశామో తెలియక నరకంలో మగ్గుతుంటారు.
14ఏళ్లకు ఒకసారి బయటకు తీసుకొస్తారా?
సాధారణంగా ఎవరు అరెస్టైనా కోర్టులో నిర్ణీత సమయాల్లో హాజరుపరిచేందుకు చట్టంలో నిబంధనలు ఉన్నాయి. కానీ తలోజా జైలులో అలా జరగడం లేదు. ఒకరి విషయంలో మూడేళ్లుగా కోర్టుకే తీసుకురాలేదనే అభియోగాలు… ఇంకొకరి విషయంలో ఐదేళ్ల తర్వాత ఒక్కసారే కోర్టుకు తీసుకొచ్చారనే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఈ అంశాల గురించి గతంలోనూ అనేక వార్తలు గుప్పుమన్నాయి. ఈ ఆరోపణల గురించి వివరణ కోరిన ప్రతీసారి జైలు అధికారులు ఒకటే మాట చెబుతుంటారు. తమకు ఎస్కార్ట్ చేయడానికి మానవ వనరులు లేవని.. పోలీసు బలగాలు తక్కువగా ఉన్నాయని.. VIP భద్రత, ఫెస్టివల్స్, ఎలక్షన్లకు తమని పంపించేస్తుంటారని అక్కడి అధికారులు వివరణ ఇస్తుంటారు. అయితే ప్రభుత్వం గ్రాంట్ చేసిన రిజర్వ్ గార్డ్స్‌ను కోర్టు డ్యూటీకి వీలుగా ఉంచాలన్న ఉత్తర్వులు ఉన్నాయి. వాటిని జైలు అధికారులు పాటిండచం లేదన్న విమర్శలూ ఉన్నాయి.
అణగారిన వర్గాలే బాధితులు
ఈ పరిస్ధితులపై మానవ హక్కుల కార్యకర్తలు కోర్టులో పిటిషన్లు వేశారు. వేలాదిమంది ఖైదీలను సంవత్సరాల పాటు కుటుంబాలకు దూరంగా ఉంచుతున్నారని.. పూర్తిగా మానవత్వాన్ని ముంచేస్తున్నారని హక్కుల నేతల ఆరోపిస్తున్నారు. తలోజా ఖైదీల కేసులు ముంబై, థానే, రాయగడ్, పల్ఘర్ లాంటి వివిధ కోర్టుల్లో నడుస్తుంటాయి. ఇక ఈ ఖైదీల్లో ఎక్కువ శాతం మంది దళితులు, ఆదివాసీలు, మైనారిటీ మతాలకు చెందినవారు ఉంటారు. అటు వలసకు మహారాష్ట్ర వెళ్లిన పేదవారు కూడా ఉంటారు. వీళ్లంతా తప్పు చేశారో లేదో తెలియదు.. కానీ జైల్లోనే సంవత్సరాల పాటు గడుపుతారు. న్యాయమూర్తి ముఖాన్ని కూడా చూపించకుండా జైల్లోనే వీరిని బందీ చేస్తారు. ఇక తలోజా జైలులో కొన్నిసార్లు వీడియో కాన్ఫరెన్సింగ్ పేరుతో కోర్టులో హాజరుపరుస్తారు. కానీ వాస్తవానికి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ సరైన ఆప్షన్ కాదన్న విమర్శలు ఏనాటి నుంచో ఉన్నాయి. ఎందుకంటే వీడియో కాన్ఫరెన్సింగ్ సమయంలో వాదనలు స్పష్టంగా వినిపించవు. ఇంటర్నెట్ సమస్యలు ఉంటాయి, పైగా జైలు సిబ్బంది అటూ ఇటూ తిరుగుతుంటారు. దీంతో నిందితుడికి తన లాయర్‌తో మాట్లాడే ప్రైవసీ ఉండదు. నిజానికి ఏ ఖైదీకైనా న్యాయవాదితో ఒంటరిగా మాట్లాడుకునే హక్కు కల్పించాలి. ఇది రహస్యంగా ఉండాలి. తలోజా జైలులో మాత్రం అది సాధ్యం కాదు.
బాధిత కుటుంబాల కన్నీటి వేదన
ఇక్కడి సమస్య ఖైదీలకే పరిమితం కాదు. ఖైదీల కుటుంబాలదీ మరో విషాద చిత్రం. పరుగులు పెడుతూ దూర ప్రాంతాల నుంచి తమ వారిని కలవడానికి కోర్టుకు వస్తే అక్కడికి ఎవరూ రారు. తన కొడుకును కోర్టుకు తీసుకొస్తారని.. కనీసం పది నిమిషాలు మాట్లాడాలని వచ్చిన తల్లికి నిరాశే మిగులుతుంది. వయసు మళ్లిన తండ్రికి మరింత వేదన ఉంటుంది. భార్యకు కన్నీరు ధారలు కడతాయి. నడకంటూ తెలియని పిల్లలకు తండ్రి చెప్పే మూడు ముచ్చట్లు కూడా వినిపించవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకరి అరెస్టు బాధ ఆ వ్యక్తిది మాత్రమే కాదు ఆ మొత్తం కుటుంబానిది. ఎంతటి నేరం చేసినా.. ఎంతటి ఘోరం చేసినా చట్టం ప్రకారం ప్రతిఒక్కరికీ న్యాయం పొందే హక్కుంది. అసలు నిందితుడు నేరం చేశాడో లేదో ముందు తెలియలి కదా.. వాటికి సంబంధించిన ప్రక్రియ ముందుకు నడవాలి కదా.. అవేవీ జరగకపోతే అసలు న్యాయం ఎక్కడ ఉన్నట్టు?
ఇది కూడా చదవండి: శ్రామికులపై కార్పొరేట్ల మథం. నిర్మాణ కార్మికులపై ఎస్ఎన్ సుబ్రహ్మణియన్ కక్కిన విషం

Kukatpally Incident: పిల్లల బ్యాగ్‌ల్లో కత్తులు, రాడ్లు.. పసిమనసులను హంతకులగా చేస్తుంది ఎవరు?
Gaza Famine: గాజాపై కరువు కాటు.. పేగులను పెకిలించే కన్నీటి కథ
LGBTQ: అణచివేతల చీకట్లో నిలబడ్డ వెలుగులు.. ప్రేమకు పరిధులుంటాయా? ఇది వినిపించని గొంతుల గర్జన!
South Africa Massacre: కార్మికులను ఆకలితో మాడ్చి చంపేసిన ప్రభుత్వం.. సొరంగంలో కుళ్ళిన శవాలకుప్పలు!