What are Donkey Routes Explained: ఓ రాత్రి అంధకారంలో కన్నీటిని దాచుకుంటూ, ఒక తల్లి తన పసిబిడ్డ చేతిని బిగువుగా పట్టుకుంది. ఆమె గుండె లోతుల్లో కలలున్నాయి.. కొత్త జీవితం, మెరుగైన భవిష్యత్తు, తాను ఎప్పుడూ చూడని స్వేచ్ఛతో కూడిన ప్రపంచంలో బతకాలన్న ఆశలున్నాయి. కానీ ఈ ప్రయాణం కష్టాల సుడిగుండంలో ఆమెను పడేస్తుందని ఊహించలేకపోయింది. పంజాబ్(Punjab)కు చెందిన 30 ఏళ్ల లవ్‌ప్రీత్ కౌర్(Lovepreet kaur), తన 10 ఏళ్ల కుమారుడికి మెరుగైన జీవితం ఇవ్వాలనే తపనతో అమెరికా వెళ్లాలనుకుంది. ఆమె కుటుంబం మొత్తం కలసి, ఓ ఏజెంట్ మాటలు నమ్మి అతని చేతికి కోటి రూపాయలు ఇచ్చారు. నేరుగా అమెరికా విమాన టికెట్ ఇస్తామని ఏజెంట్ నమ్మబలికాడు. కానీ అక్కడ జరిగింది మాత్రం పూర్తిగా భిన్నం. లవ్‌ప్రీత్ కౌర్, ఆమె కుమారుడిని ముందుగా కొలంబియాకు పంపారు. అక్కడ వారాల పాటు ఇద్దరు ఓ చీకటి గదిలో నరకంలా గడిపారు. ఆ తర్వాత అంతులేని అడవులు, చల్లటి పర్వతాలు, కళ్ల కింద తిరిగే పాముల మధ్య వారిని ఎల్ సాల్వడర్, గ్వాటెమాలా దేశాల మార్గాలు దాటించారు. ఆ తర్వాత మెక్సికో నుంచి అమెరికాకు చేరడమే మిగిలి ఉంది. అది కూడా డాంకీ మార్గంలో వెళ్లాల్సి ఉంది. అడవుల్లో భయపడి, సముద్రాల్లో తడిసి, దాదాపు మరణాన్ని ఎదుర్కొని ఈ దారిలో 25 రోజుల పాటు లవ్‌ప్రీత్ తన కొడుకుతో కలిసి ప్రయాణించింది. అడవులలో మనుషుల కంటే మృగాలే ఎక్కువగా ఉన్నాయి. నడుస్తుంటే కళ్లముందు శవాలు కూడా కనిపించేవి. ఏ రోజుకు ఆ రోజు, ఏ రాత్రికి ఆ రాత్రి.. చావు ప్రతి మూలలో దాక్కుని ఉండేది. చివరకు ఆమె మెక్సికో సరిహద్దు దాటి, అమెరికాలో అడుగు పెట్టగానే అక్కడి పోలీసులు లవ్‌ప్రీత్, ఆమె కుమారుడిని పట్టుకున్నారు. కాళ్ల నుంచి నడుము వరకూ లవ్‌ప్రీత్‌ను గొలుసులతో కట్టేశారు. చేతులు వెనక్కి లాగి సంకేళ్లు వేశారు. ఆమె కొడుకు భయంతో లవ్‌ప్రీత్‌ను బిగువుగా హత్తుకోని ‘నా అమ్మను వదిలేయండి’ అని బతిమాలాడాడు. ఏడుస్తున్న ఆ పిల్లాడి వేదనను ఎవరూ పట్టించుకోలేదు.. ఆ పిల్లాడి మాటలు అక్కడి చల్లగాలిలో నిశ్శబ్దంగా మిగిలిపోయాయి. ఇది కేవలం లవ్‌ప్రీత్ కథ కాదు.. ఇండియా నుంచి ఏజెంట్ల చేతిలో మోసపోయి అమెరికాకు వెళ్లిన ఎంతో మంది కన్నీటి గాధలు ఇవి. వలసల పేరుతో మోసపోయిన వేలాది మంది భారతీయుల బాధలు ఇవి.. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అసలు డాంకీ రూట్స్ అంటే ఏంటి?
మరణాల మార్గం..
డాంకీ రూట్స్‌ను కొంతమంది డంకీ అని పిలుస్తుంటారు. పంజాబ్‌లో కొన్ని సముహాలు డాంకీని డంకీ అని పిలుస్తాయి. ఈ డంకీ పేరుమీదే ఓ సినిమా కూడా వచ్చింది. డాంకీ రూట్స్ అంటే అక్రమ మార్గం అని అర్థం. ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు లేకుండా దేశాల మధ్య ప్రయాణం చేసే దారులు ఇవి. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాంటి దేశాల నుంచి వేలాది మంది అమెరికాకు ఈ దారుల ద్వారానే వెళ్లేలా చేస్తారు ఏజెంట్లు. ఈ మార్గాలు కొలంబియా, పెరూ, ఎక్వడార్, బ్రెజిల్, బోలీవియా, చిలీ, అర్జెంటీనా, గ్వాటెమాలా, మెక్సికో లాంటి లాటిన్ అమెరికా దేశాల గుండా సాగుతాయి. అక్కడ నుంచి మెక్సికో సరిహద్దు దాటి, అమెరికాలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. అయితే, ఈ మార్గం సాధారణ మార్గం కాదు. రక్తంతో నిండిన నేల అది. కన్నీటితో తడిసిన భూమి అది. దట్టమైన అడవుల మధ్య, చీకటిని ఛేదిస్తూ ముందుకు సాగే చిన్న చిన్న గుంపులే ఇక్కడ కనిపిస్తాయి. ఆకలితో అలమటించే శరీరాలు, భయంతో తడిసి ముద్దైన మనసులు, ప్రతి అడుగులో మరణం ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ఈ దారుల ద్వారా ప్రయాణించడం చాలా భయంకరమైనది. ప్రయాణికులు 15 గంటల పాటు పడవ ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత 40 నుంచి 45 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అక్కడ 17-18 పర్వతాలను దాటాల్సి ఉంటుంది. ఈ అడవుల్లో చిరుతపులులు, పాములు, కీటకాలు మాత్రమే కాదు.. మానవ మృగాలు కూడా ఉన్నాయి. బందిపోట్లకు, మాఫియాలకు అడ్డా ఈ రూట్లు. ముఖ్యంగా మెక్సికో సరిహద్దుల్లో మాఫియాలు ప్రయాణికులను దోచుకుంటాయి. స్త్రీలను మానవ అక్రమ రవాణాకు గురి చేస్తాయి. ఆడపిల్లలను వేలానికి పెడతాయి, మగవాళ్లను కొట్టి చంపేస్తాయి. కొన్నిసార్లు మనం నమ్మిన ఏజెంట్లే మనుషులను చంపి, వారి అవయవాలను మాఫియాలకు అమ్మేస్తారు. ఈ దారుల్లో నీరు, తిండి లేక మృత్యువును చూసిన భారతీయులు ఉన్నారు. గడ్డకట్టే చలిలో శరీరాలు గడ్డకట్టుకుపోయి చనిపోయిన వారూ ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా డాంకీ రూట్స్ అంటే. ఒక్క మాటలో చెప్పాలంటే చావు తలుపు తట్టే ఒక ప్రయాణం ఈ మార్గం.
ప్రభుత్వం పూర్తిగా విఫలమైందా?
అటు భారతీయులను ఈ మార్గాల ద్వారానే పంపుతారు ఏజెంట్లు. ప్రతి వ్యక్తి నుంచి సగటున 30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు తీసుకుంటారు. నకిలీ వీసాలు, నకిలీ పత్రాలు చూపించి మోసం చేస్తారు. సాధారణ విమాన ప్రయాణం అని చెప్పి, వారికి తెలియకుండానే డాంకీ మార్గాల్లో పంపిస్తారు. వారి జీవితాలను, కుటుంబాలను నాశనం చేసి, చివరకు వారికి కనీస భద్రత కూడా అందించరు. ముఖ్యంగా పంజాబ్, గుజరాత్‌తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అక్రమవలసదారులను గుర్తించి ఇంటికి పంపుతున్నారు. ఫిబ్రవరి 5న అమెరికా నుంచి మిలటరి విమానంలో 104 మంది భారతీయులను అమృత్‌సర్‌లో దింపారు. ఇందులో లవ్‌ప్రీత్ కూడా ఒకరు. తనను మోసం చేసిన వాళ్లను శిక్షించాలని.. తమ డబ్బు తమకివ్వాలని లవ్‌ప్రీత్ ప్రభుత్వాన్ని కన్నీటితో వేడుకుంటోంది. అసలు ఇండియాకు తనను వెనక్కి పంపిస్తున్నారన్న విషయం కూడా తనకు తెలియలేదని వాపోతోంది. అటు ప్రభుత్వం ఏజెంట్లను అరెస్టు చేస్తున్నామని చెబుతున్నా, ఇంకా వేలాది మంది మోసపోతూనే ఉన్నారు. అటు ఏజెంట్లను శిక్షలు పడిన సందర్భాలు కూడా తక్కువగా ఉండడం ప్రభుత్వాల వైఫల్యాలను కళ్లకు కడుతోంది. ఈ వ్యవస్థ, అసమర్థత ఇలానే కొనసాగితే లవ్‌ప్రీత్ లాగా భవిష్యత్‌లోనూ ఎంతోమంది మోసపోవాల్సి ఉంటుంది. అందుకే జీవితాన్ని ఓ జూదంగా మార్చే ఈ తరహా ఏజెంట్లకు కచ్చితంగా శిక్ష పడాల్సిందే!
ALSO READ: దుఃఖం చిమ్మిన ప్రదేశం.. ముంచేసిన మూఢత్వం.. ఏంటీ నోజ్ స్పాట్?