Menu

Union Budget 2025: మందుబాబులకు నిర్మలమ్మ షాక్‌ ఇస్తారా? సిగరేట్‌, మద్యం రేట్లు భారీగా పెరగనున్నాయా?

Praja Dhwani Desk 1 year ago
sin tax in india, union budget 2025, nirmala sitharaman budget, india sin tax hike, tobacco tax in india, alcohol tax india, who sin tax recommendation, budget predictions 2025, cigarette tax india, public health tax policies, taxes on tobacco india, alcohol death toll india, tobacco usage statistics india, alcohol consumption india, union budget sin taxes, union budget 2025 telugu, telugu explainers, alcohol addiction, cigaratee addiction

లంచ్‌ బ్రేక్‌లో తాగుతారు.. టీ బ్రేక్‌లో ఉఫ్‌ ఉఫ్‌ అని ఊదుతారు.. సాయంత్రం ఫ్రెండ్స్‌తో కలిసి ఓ దమ్మేస్తారు.. ఆఖరికి రాత్రి పడుకునే ముందు కూడా సిగరేట్‌ పీల్చకుండా నిద్రపోరు.. అంతేందుకు వాష్‌రూమ్‌లోనూ ఇది కావాల్సిందే..! అందుకే దీన్ని వ్యసనం అంటారు. అటు మందుబాబుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. ఆనందమొచ్చినా బాధొచ్చినా ఏ కారణం ఉన్నా అసలు కారణమే లేకున్నా కొంతమందికి మందుముట్టనదే రోజు గడవదు. ఇది కూడా అడిక్షన్. మరికొంతమంది ఉంటారు.. సిగరేట్‌, మద్యపానం మాత్రమే హానికరమని అనుకుంటారు. కానీ అదేపనిగా సాఫ్ట్‌డ్రింక్స్‌ తాగిపడేస్తుంటారు. ఈ మూడు క్యాటగిరిల ప్రజలు ఇండియాలో చాలా చాలా ఎక్కువ. ఎందుకో తెలుసా? భారత్‌లో ఈ అడిక్షన్‌ ప్రొడక్ట్స్‌ అన్నీ చీప్‌గా దొరుకుతాయి. వాటిపై ట్యాక్స్‌(Tax) తక్కువగా ఉంటుంది. అందుకే ఉన్నోడు.. లేన్నోడు.. ఇలా ఎవరైనా వ్యసనాల బారిన పడుతున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కరమేంటి? ఒకటి ఉంది..! సిన్‌ ట్యాక్స్‌(SinTax) గురించి ఎప్పుడైనా విన్నారా?

సిన్‌ ట్యాక్స్‌ మాత్రం తక్కువ ఎందుకో

సిన్ ట్యాక్స్ అంటే ఆరోగ్యానికి హానికరమైన లేదా సమాజానికి నష్టం కలిగించే ఉత్పత్తులు, సేవలపై ప్రభుత్వాలు విధించే పన్ను. ముఖ్యంగా పొగాకు, మద్యం, సాఫ్ట్‌ డ్రింక్స్‌ లాంటి ఉత్పత్తులపై ఈ పన్ను విధిస్తారు. ఈ ట్యాక్స్‌ ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంత ఆరోగ్యంగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇండియాలో మాత్రం మిగిలిన దేశాలతో పోల్చితే ఈ హానికరమైన ఉత్పత్తులపై ట్యాక్స్ తక్కువగా ఉంది. పాప్‌కార్న్‌పై త్రీ లేయర్‌ ట్యాక్స్‌ విధించే ఇండియాలో, ఆఖరికి మెడిసన్స్‌పై కూడా పన్నులు ఉండే భారత్‌లో సిన్‌ ట్యాక్స్‌ మాత్రం హెల్త్ స్టాండెర్డ్స్‌కి తగ్గట్టుగా లేదన్న విమర్శలున్నాయి.

WHO ఏం చెబుతోంది

ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO ప్రకారం పొగాకు ఉత్పత్తులపై కనీసం 75శాతం పన్ను విధించాలి. ఇది వినియోగాన్ని తగ్గించడానికి, ఆరోగ్య సమస్యలకు కూడా చెక్‌ పెట్టడానికి ఉపయోగపడుతుంది. అయితే కేవలం 41 దేశాలు మాత్రమే WHO గైడ్‌లైన్స్‌ను పాటిస్తున్నాయి. అంటే ప్రపంచంలోని 80శాతం దేశాలు ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడంలేదని అర్థం. 20శాతం దేశాలు మాత్రమే పొగాకు ఉత్పత్తులపై 75శాతం కంటే ఎక్కువ పన్నులు విధించాయి. ఈ దేశాలలో ఫిన్‌ల్యాండ్ 89.4శాతం, ఫ్రాన్స్ 83.8శాతం, యునైటెడ్ కింగ్‌డమ్ 83.7శాతం, న్యూజిలాండ్ 82.8శాతం, గ్రీస్ 81.2శాతంతో సిన్‌ ట్యాక్స్‌లో అందరికంటే ముందున్నాయి. మీరు గమనిస్తే ఈ దేశాల్లో ప్రజల ఆరోగ్యం మిగిలిన దేశాలతో పోల్చితే మెరుగ్గా ఉంది.

లివర్‌ను చంపేస్తున్న మద్యం

ఇటు ఇండియా విషయానికి వస్తే భారత్‌లో సిగరెట్లపై పన్ను 57.6శాతంగా ఉంది. ఇది WHO సిఫార్సు చేసిన 75శాతం కంటే చాలా తక్కువ. ఇండియాలో 150 రూపాయల విలువైన సిగరెట్‌ ప్యాకెట్‌లో 92రూపాయలు ఉత్పత్తి విలువగా ఉంటుంది. మిగిలిన 58 రూపాయలు పన్నులు, ఇతర సుంకాల రూపంలో విధించి ఉంటాయి. GST, కాంపెన్సేషన్ సెస్, నేషనల్ కాలమిటీ కాంటిజెంట్ డ్యూటీ, బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని కలిగి ఉంటాయి. ఇక ఈ సిన్‌ ట్యాక్స్‌ను భారీగా పెంచాలని 2024లో గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ ఆర్థికశాఖకు సూచించారట. పొగాకు ఉత్పత్తులు, కూల్‌డ్రింక్స్‌ ఉత్పత్తులపై GST రేటును 28శాతం నుంచి 35శాతానికి పెంచాలని సిఫార్సు చేసినట్టగా సమాచారం. ప్రజా ఆరోగ్య సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడున్న సిన్‌ ట్యాక్స్‌తో ప్రజలెవరూ మారే అవకాశం లేదన్న వాదన ఉంది. ఇండియాలో పొగాకు వినియోగం కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 10 లక్షల మంది మరణిస్తున్నారు. అటు మద్యం వినియోగం కారణంగా ప్రతి ఏటా సుమారు 2లక్షల 60 వేల మంది చనిపోతున్నారని లెక్కలు చెబుతున్నాయి. 2016లో మద్యం కారణంగా లివర్‌ సిరోసిస్ వ్యాధితో 1,40,600 మంది మృతిచెందారు. మద్యం, దాని సంబంధిత మరణాల రేటు ప్రతి లక్షమంది జనాభాకు 38.5గా ఉంది. అంటే కేవలం ఆల్కహాల్‌ కారణంగానే ఇండియాలో ప్రతి లక్ష మందిలో సుమారు 39మంది మరణిస్తున్నారు. అటు చైనాలో ఈ సంఖ్య 16గా ఉంది.

వ్యసనాలకు ఇలా దూరం చేయవచ్చు

ప్రతీ ఏడాది మద్యం సేవించేవారి సంఖ్య, సిగరేట్‌ తాగే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. భారత్‌లో 15ఏళ్ల దాటిన వారిలో 28.6శాతం మంది పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అంటే సుమారుగా 27కోట్ల మందికి పొగ పీల్చే అలవాటు ఉంది. ఇటు 15-49 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న పురుషులలో 29శాతం మందికి మద్యం అలవాటు ఉందని నివేదికలు చెబుతున్నాయి. అందుకే ఈ సంఖ్యలను తగ్గించడానికి సిన్ ట్యాక్స్ పెంపు లాంటి చర్యలు అవసరమన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడున్న సిన్‌ ట్యాక్స్‌ విధానంతో వ్యసనాలకు ఎవరూ దూరం కారని.. ఆరోగ్య దెబ్బతిని ఫార్మా లాభపడడం తప్ప ఇంకేమీ ఉపయోగం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఏ దేశమైనా అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలంటే ఆ దేశ ప్రజల ఆరోగ్యం అన్నిటికంటే అవసరం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. మరి గత కేంద్ర ప్రభుత్వ మంత్రుల సూచనల మేరకు నిర్మల సీతారామన్‌(Nirmala Sitharaman) సిన్‌ ట్యాక్స్‌ను పెంచుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

ఇది కూడా చదవండి: మీ దేశభక్తిని మడిచి…! చంపేస్తున్న పనివేళలు.. వెట్టిచాకిరి చేయించుకుంటున్న కార్పొరెట్లు.. పరిష్కారం ఏది?

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *