Menu

Work Life Imbalance: మీ దేశభక్తిని మడిచి…! చంపేస్తున్న పనివేళలు.. వెట్టిచాకిరి చేయించుకుంటున్న కార్పొరెట్లు.. పరిష్కారం ఏది?

Tri Ten B 1 year ago
work-life imbalance in India, toxic work culture, Indian employees mental health, work stress in India, overworking in Indian companies, corporate exploitation India, long working hours effects, anxiety among Indian employees, mental health awareness, work culture comparison, burnout in India, solutions for work stress, telugu explainers

వర్క్‌-లైఫ్‌ Imbalance…! ఈ అంశం చుట్టూ ఇండియాలో డిబెట్లు జరుగుతాయి. మేధావులుగా చెప్పుకునేవారు పెద్ద పెద్ద డిస్కషన్లు పెడతారు. సోషల్‌మీడియాలో హై రేంజ్‌ బజ్‌ క్రియేట్ అవుతుంటుంది. అయినా ఏం ఉపయోగం? ఏం మారింది? అసలు మారాల్సింది ఏంటి? మార్పు రావాల్సింది ఎవరిలో? ఈ work-life imbalance వల్ల ఎక్కువగా నష్టపోతుంది ఎవరు? మీకు కొన్ని లెక్కలు చెబుతా? తర్వాత పైన ప్రశ్నలకు సమాధానమిస్తా..!

భయంకర లెక్కలు

21 నుంచి 25ఏళ్లు.. ఈ టైమ్‌ పీరియడ్‌ మనిషి జీవితానికి ఎంత అమూల్యమైనదో కదా? అంతే విలువైనది కూడా. జీవితమంటే ఏంటో తెలుసే కాలమది. చాలా మంది ఉద్యోగాల్లో చేరే వయసు అది. కానీ ఇదంతా కొందరికి మాత్రమే. 100లో 10 మందికి మాత్రమే. ఏంటి అర్థంకాలేదా..? భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకునే ఈ నాలుగేళ్ల కాలం భారతీయ ఉద్యోగులకు ముళ్లదారిగా మారుతోంది. వర్క్‌ స్ట్రెస్‌ కారణంగా మానసిక సమస్యలతో కౌన్సిలింగ్‌ సెంటర్లకు క్యూ కడుతున్న ప్రతి 10 మందిలో 9మంది 25ఏళ్లలోపు ఉద్యోగులే ఉంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. స్టేట్ ఆఫ్ ఎమోషనల్ వెల్-బీయింగ్ రిపోర్ట్ ప్రకారం 25 సంవత్సరాల లోపు ఉన్న ఉద్యోగుల్లో 90శాతం మందికి మానసిక సమస్యలున్నాయి. 45 సంవత్సరాల పైబడిన వారిలో ఇది 67శాతంగా ఉంది. కౌన్సిలింగ్‌ కోసం సెంటర్లకు, సైకాలజిస్టుల వద్దకు క్యూ కట్టే ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీరిలో 59శాతం మంది ఉద్యోగులు వారికి వారే హాని తలపెట్టుకుంటున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు తీసుకుంటున్నారు.

డిప్రెషన్‌ బారిన పడుతున్న ఉద్యోగులు

2022లో నిర్వహించిన మరో సర్వే ప్రకారం ఇండియాలో 38శాతం మంది ఉద్యోగులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇందులో 70శాతం మందికి పైగా పురుషులే ఉంటున్నారు. చాలిచాలని జీతాలతో కుటుంబాన్ని, తమ జీవితాలని నెట్టుకురావడం వీరందరికి భారంగా మారుతోంది. ఈ ప్రెజర్‌ అంతా బ్రెయిన్‌పై పడుతోంది. ఇక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ 2022-23 సర్వే ప్రకారం, భారత్‌లో సుమారు 21 కోట్ల మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటివలి డెలాయిట్ సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, 80శాతం మంది భారతీయ ఉద్యోగులు మానసిక ఆరోగ్య సమస్యలను అనుభవిస్తున్నారు. వీటిలో డిప్రెషన్‌, anxiety అన్నిటికంటే ప్రధానమైన సమస్యలు.

దేశభక్తి

ఈ లెక్కలు విన్నారుగా.. ఇప్పుడు ఒకసారి మిగిలిన దేశాల సంగతి చూద్దాం. నార్డిక్ దేశాలు తెలుసు కదా..! స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్ లాంటి దేశాల్లో Work-Life Imbalance ఉండదు.. work-life balance ఉంటుంది. ఈ దేశాల్లో సగటు పని గంటలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు కుటుంబంతో పాటు తమ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ దేశాల్లో మానసిక ఆరోగ్య సమస్యల శాతం తక్కువగా ఉంటుంది. స్వీడన్‌లో రోజుకు 6 గంటల పని చేస్తే చాలు. ఫిన్‌ల్యాండ్‌లో వారానికి 4గంటలు పని చేస్తే సరిపోతుంది. ఎంత సేపు పని చేశామన్నది కాదు.. ఎంత అవుట్‌పుట్ ఇచ్చామన్నది ముఖ్యం. ఇది ఓవరాల్‌గా కంపెనీ ప్రొడక్టవిటీని కూడా పెంచుతోంది. ఇటు ఇండియాలో మాత్రం దేశం కోసం వారానికి 80,90,100 గంటలు పని చేయాలని ఉచిత సలహాలు ఇచ్చే CEOలు, చైర్మన్లు ఎక్కువ అవుతున్నారు. లెక్కల ప్రకారం చూస్తే ఇండియాలో ఉద్యోగులు సగటున వారానికి 46.7 గంటలు పని చేస్తున్నారు. అంతేకాకుండా 51శాతం మంది ఉద్యోగులు వారానికి 49 గంటల కంటే ఎక్కువ పని చేస్తున్నారు. ఈ పని గంటలు ముఖ్యంగా ఐటీ , కార్పొరేట్ రంగాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. International Labour Organisation-ILO ప్రకారం వారానికి 44గంటలు కంటే ఎక్కువ పని చేయకూడదు. కానీ భారతీయ కంపెనీలు మాత్రం ఉద్యోగులను చచ్చిన చేపలను బండకేసి రుద్దినట్టు రుద్దుతుంటాయి. తర్వాత ముక్కలు ముక్కలగా హింసించి ఆస్పత్రిపాలయ్యేలా చేస్తాయి. ఇంత చేస్తే పోని దానికి తగ్గట్టుగా జీతం వస్తుందా అంటే లేదు. మరి అంత చాకిరి పని ఎందుకు చేయాలి? ఎవరి కోసం చేయాలి? ఈ రెండు ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారనే కావొచ్చు.. ఇటివలి కొందరు అడ్డగోలుగా దేశభక్తి ఫ్యాక్టర్‌ను తీసుకొస్తున్నారు. పెట్టుబడిదారి సిద్ధాంతాలతో శ్రమదోపిడికి కేరాఫ్‌గా నిలిచే అలాంటివారి గురించి వదిలేద్దాం.

మరి ఉద్యోగుల కోసం నిలబడాల్సింది ఎవరు? ప్రజలకు అండగా నిలవాల్సింది ఎవరు? ఉద్యోగులు మానసిక సమస్యలతో అల్లాడిపోతుంటే దానికి పరిష్కరం చూపాల్సింది ఎవరు? ప్రభుత్వాలు కాదా? పని గంటలను నియంత్రించే కఠినమైన కార్మిక చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత వారిది కాదా? ILO సూచించినట్టు వారానికి 44 గంటలకు పైగా పని చేయనివ్వకుండా చట్టాలు చేసే హక్కు వారి దగ్గరే ఉంటుంది. ఉద్యోగుల ఆరోగ్యంపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులపై వేగంగా స్పందించే హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు అవసరం. అధిక పని ఒత్తిడితో ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే కంపెనీలకు జరిమానాలు విధించాలి. ఓవర్‌టైమ్ వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలు తీసుకురావాలి. నైట్ షిఫ్ట్స్ చేసే ఉద్యోగుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించే సంస్థలను గుర్తించి ప్రోత్సహించాలి. ఇదంతా నేను చెబుతున్నది కాదు.. ILO గైడ్‌లైన్స్‌ చెబుతున్న నిజాలు! పాటించాల్సింది ఎవరో, పాటించేలా చేయాల్సింది ఎవరో, ప్రశ్నించాల్సింది ఎవర్నో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందిగా!

ఇది కూడా చదవండి: దేశం కోసం.. ధర్మం కోసం.. కార్పొరేట్ల కోసం..! ఎవరి కోసం సారూ 90 గంటలు పని చేయాలి?

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *