కూర్చున్న కొమ్మనే నరుక్కునే వారిని ఏమని పిలవాలి? నడి సముద్రంలో ఒడ్డుకు చేర్చగలిగే ఏకైక ఆధారమైన పడవకి రంధ్రాలు పెట్టుకుంటే చివరకు ఏం జరుగుతుంది?
ఇది ప్రపంచీకరణ యుగం..అంటే Globalization కాలం..! మనం ధరించే బట్టలు.. మనం ఉపయోగించే వాహనాలు.. మనం వినియోగించే కంప్యూటర్లు, మన చేతిలో నిత్యం కనిపించే మొబైల్ ఫోన్లు.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. మన రోజూవారి జీవితంలో భాగమైపోయిన ఎన్నో వస్తువులు ఎవరెవరో కనిపెట్టినవి.. ఎవరెవరో తయారు చేస్తున్నవి..! అయినా అవి లేకుండా రోజు గడవదు! లేదు..కాదు.. నేను కేవలం నా దేశానికి సంబంధించన వస్తువులనే ఉపయోగిస్తాను అంటే మీ జీవితమే ముందుకుపోదు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానంటే జాతీయవాదం తలకెక్కితే ఏం జరగబోతుందో వివరిస్తాను. అమెరికా(America) అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) ఏం చేస్తున్నారో చూస్తున్నారు కదా? H1-b వీసాలపై కండీషన్లు పెట్టబోతున్నారట. అమెరికాలోని వలసదారులను తన్నితరిమేసే ప్లాన్ ఇది. లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నా సరే మీరు అమెరికాలో నివసిస్తున్నట్టు అయితే భయంభయంగా గడపాల్సిందే. అయితే ఇమ్మిగ్రెంట్స్ పట్ల ట్రంప్ వైఖరి కేవలం వలసదారులకే నష్టం చేస్తుందని అనుకుంటే మీరు ట్రంప్ తీసిన గోతిలో కాలేసినట్టే.
వలసదారులు లేకపోతే అమెరికా పతనమేనా?
H1-B వీసాపై ట్రంప్ ఆంక్షలు విధిస్తే ముందుగా అమెరికాలో ఉద్యోగాల కొరత ఏర్పడుతుంది. ట్రంప్ విధానాలు అమలైతే 2026 నాటికి 12 లక్షల టెక్ ఉద్యోగాలు ఖాళీగా ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే అమెరికా వృద్ధి దెబ్బకు దిగజారుతుంది. నిజానికి H1-B వీసాలు నైపుణ్యాలున్న విదేశీయులకు అమెరికాలో పనిచేసేందుకు అనుమతిస్తాయి. భారతీయులు ఈ వీసాల ప్రధాన లబ్ధిదారులని మర్చిపోవద్దు. ఒకవేళ H-1B వీసాలపై ఆంక్షలు పెరిగితే, అమెరికాలో భారతీయుల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. ఇది వారి ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది వాస్తవం..! మరి అమెరికా పరిస్థితేంటి? భారతీయులు, ఇతర వలసదారులను రానివ్వకపోతే వారి ఉద్యోగాలను ఎవరితో భర్తీ చేస్తారు. అమెరికాలో సరిపడ స్కిల్ లేబర్ లేదన్నది జగమెరిగిన సత్యం. ప్రతి సంవత్సరం అమెరికాకు 3 లక్షల 50 వేల మంది టెక్ నిపుణులు అవసరం అవుతారు. ముఖ్యంగా AI, డేటా అనలిటిక్స్, క్లౌడ్ సర్వీస్, సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ రంగాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండే దేశం అమెరికా. ఈ రంగాలపైనే వారి ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. మరి ఖాళీ కుర్చీలతో ట్రంప్ ఏం చేస్తారు ?
నైపుణ్యాలు లేకపోతే ఎదుగుదల ఉండదు కదా
గత ఐదు సంవత్సరాల్లో సాఫ్ట్‌వేర్ స్కిల్ ఉన్న ఉద్యోగుల డిమాండ్ 75శాతం పెరిగింది. ఇప్పుడు వలసదారులపై అడ్డదిడ్డమైన ఆంక్షలు పెడితే, ఈ డిమాండ్‌ను తీర్చడం కష్టం అవుతుంది. అప్పుడు అమెరికా పరిశ్రమల వృద్ధి మందగిస్తుంది. ఇక 1946 నుంచి 1964 మధ్య జన్మించిన వారిని బూమర్స్ అని పిలుస్తారు. ఇప్పుడు ఆ బూమర్స్ రిటైర్మెంట్‌కు దగ్గరిలో ఉన్నారు. అంటే మరిన్ని ఉద్యోగాల ఖాళీ ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగుల అవసరం పెరుగుతోంది. అటు ట్రంప్ మాత్రం అమెరికన్లతోనే అమెరికాను పరుగులు పెట్టిస్తానంటున్నారు. కానీ స్కిల్డ్ లెబర్ ఎక్కడ? వలసదారుల ఆంక్షలను మరింత కఠనం చేస్తే అమెరికాలో అనేక పరిశ్రమలు దెబ్బతింటాయి. సాంకేతిక ఆవిష్కరణలు కూడా మందగిస్తాయి. అంటే టెక్నాలజీ పరంగానూ అమెరికా వెనక్కి పోతుంది.. ఆర్థిక ఉత్పాదకత తగ్గుతుంది. అమెరికా మార్కెట్‌కు కావలసిన నైపుణ్యాలున్న కార్మికుల కొరత వల్ల కొత్త పరిశోధనలు, అభివృద్ధి ఆలస్యమవుతాయి.
H-1Bపై ఆంక్షలు కఠినం చేస్తే ఏం జరుగుతుంది?
అటు ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యాలు ఉన్న వర్కర్లు దొరకడం కూడా కష్టంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. సుమారు 66శాతం నుంచి 90శాతం మంది యజమానులు అవసరమైన నైపుణ్యాలున్న కార్మికులను రిక్రూట్ చేసుకోలేపోతున్నారట. ఇటు వలసదారులపైనే బండిని నడిపే అమెరికాకు ఈ విషయాలు తెలియనవి కావు. అయినా ట్రంప్‌కు అమెరికానే ఫస్ట్.. అమెరికన్లే ఫస్ట్.. నేషనలిజమే ఇంపార్టెంట్. నిజానికి అమెరికాలో నివాసముంటున్న భారతీయ వలసదారులు ఆ దేశం టెక్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కీలక పదవుల్లోనూ కొనసాగుతున్నారు. వీరంతా H-1B వీసాల ద్వారానే అమెరికాలో రాణిస్తున్నారు. భారతీయ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు అమెరికా కంపెనీల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. 2021లో భారతీయ వలసదారులు అమెరికా జీడీపీకి సుమారు 41 లక్షల కోట్ల రూపాయల విలువైన సేవలు అందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ నడుస్తున్నది ఎక్కువగా వలసదారుల పని తీరు కారణంగానే..! మరి ట్రంప్ ఎందుకిలా ఆలోచిస్తున్నారు? ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలోని పరిశ్రమల ప్రొడక్టవిటీ మందగించడం ఖాయంగానే కనిపిస్తుంది కదా..! అమెరికా ఆర్థిక వ్యవస్థ నష్టపోయే ప్రమాదం కూడా ఉందని అర్థమవుతుంది కదా..? ఇప్పుడు చెప్పండి.. కూర్చున్న కొమ్మనే నరుక్కునే వారిని ఏమని పిలవాలి? ట్రంప్ అని పిలవచ్చా!?
ఇది కూడా చదవండి: పుతిన్ స్వార్థానికి బలైపోతున్న భారతీయులు.. ఇదేం యుద్ధనీతి? మోదీ ఏం చేస్తున్నట్టు?