Cricket News: వాడితో గొడవ.. వీడితో గొడవ.. అందరితోనూ గొడవ..! గొడవ.. గొడవ.. గొడవ.. ఇదే గంభీర్(Gautham Gambhir)తో వచ్చిన గొడవ..! టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఏ ముహూర్తనా జట్టుతో కలిశాడో కానీ భారత్ జట్టుకు ఏదీ కలిసిరావడం లేదు. శ్రీలంకతో వన్డే సిరీస్ ఓటమి, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్, ఇక ఆస్ట్రేలియా గడ్డపై ఘోర పరాజయాలు.. ఇదంతా గంభీర్ ఆల్‌టైమ్ చెత్త రికార్డులుగా చెప్పవచ్చు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో అందరిని కలుపుకోని జట్టును ఓ తాటిపై నడిపించాల్సిన బాధ్యతగల పొజిషన్లో ఉన్న గంభీర్ ఆ పని చేయకపోగా.. సెలక్టర్లతోనూ, రోహిత్ శర్మ(Rohit Sharma)తోనూ కయ్యానికి కాలు దువ్వుతున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
కొత్త కెప్టెన్‌పై సస్పెన్స్
టీమిండియా కొత్త కెప్టెన్ ఎంపిక బీసీసీఐకి పెద్ద సవాల్‌గా మారిందనే చెప్పాలి. ఎందుకంటే రోహిత్ శర్మ కెరీర్ దాదాపు చివరి దశకు చేరుకున్నట్టే లెక్కా! దీంతో కొత్త సారథి కోసం బీసీసీఐ తీవ్రంగా ఆలోచిస్తోంది. అయితే ఈ అంశం బీసీసీఐలో అంతర్గత విభేదాలు సృష్టించిందన్న వార్తలు గుప్పుమన్నాయి. గొడవలేమీ లేవని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా క్లారిటీ ఇచ్చినా ప్రచారం మాత్రం ఆగడంలేదు. నిజానికి రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు బుమ్రాకే అప్పగిస్తారని అంతా అనుకున్నారు. అయితే బుమ్రా(Bumrah)కు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. జట్టు బౌలింగ్ భారాన్ని అతనే మోస్తుండడం అతడిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఈ సమయంలో బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే ప్రెజర్ మరింత పెరగడం ఖాయం. అందుకే ఇతర ప్రత్యామ్నాయాలపై బీసీసీఐ తర్జనభర్జన పడుతోంది.
జైస్వాల్ కావాలట
టెస్టు ఫార్మెట్కు కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్‌ని కెప్టెన్ చేస్తే మంచిదని సెలక్టర్ అగార్కర్(Ajit Agarkar) అభిప్రాయపడ్డాడట. అయితే గంభీర్ మాత్రం టీమిండియా యువ సంచలనం యశస్వీ జైస్వాల్‌కు కెప్టెన్సీ ఇవ్వాలని వాదించాడట. దీనికి అగార్కర్ ఒప్పుకోలేదని సమాచారం. ఎందుకంటే జైస్వాల్ ఇప్పుడిప్పుడే మంచి ప్లేయర్‌గా ఎదుగుతున్నాడు. ఈ సమయంలో కెప్టెన్సీ లాంటి అదనపు బాధ్యతలు ఇస్తే మొదటికి మోసం వస్తుందని అగార్కర్ గంభీర్‌కు చెప్పిన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. జైస్వాల్ కెరీర్ నాశనం అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని గంభీర్ ప్రపోజల్‌ను అగార్కర్ తిరస్కరించాడని తెలుస్తోంది. అటు గంభీర్ మాత్రం జైస్వాల్ కోసమే పట్టు పట్టినట్టు సమాచారం. ఈ విషయంలో మాటామాటా పెరిగి గంభీర్, గవాస్కర్ ఒకరిపై ఒకరు నోరు పారేసుకున్నారని కొన్ని ఇంగ్లీష్ వెబ్‌సైట్స్ కథనాలు ప్రచురించాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. నిన్నమొన్నటివరకు రోహిత్ శర్మ-గంభీర్ మధ్య విభేదాలపై వార్తలు చక్కర్లు కొట్టగా.. ఇప్పుడు గంభీర్-అగార్కర్ మధ్య వార్ జరిగినట్టు న్యూస్ రావడం టీమిండియా ఫ్యాన్స్‌ను చికాకు పెట్టేలా ఉంది. ఈ గంభీర్ ఎందుకు ఎప్పుడు చూసినా ఎవరో ఒకరితో గొడవలు పడుతుంటాడని కొందరు ఫ్యాన్స్ తలకొట్టుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: అంబటి రాయుడిని తొక్కేసింది కోహ్లీయేనా? రాబిన్ ఊతప్ప కామెంట్స్‌తో దుమారం! ఇందులో నిజమెంత?