‘Just Ordered a new set of 3d glasses to watch the world cup..’
ఏప్రిల్ 16, 2019 తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) చేసిన ఈ ట్విట్ ఎంత పెద్ద దుమారానికి కారణమైందో సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికీ మర్చిపోడు. నాడు వన్డే ప్రపంచకప్ జట్టు సెలక్షన్ నాటికి ఫామ్‌లో ఉన్న రాయుడిని కాదని విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. విజయ్ శంకర్‌కు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడు వచ్చు అని.. అతను 3D ప్లేయర్ అని.. అందుకే రాయుడు స్థానంలో అతడిని ఎంపిక చేశామని నాటి చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ వివరణ ఇచ్చాడు. అయితే ఈ వివరణ నాడు టీమిండియా అభిమానులతో పాటు రాయుడికి కోపాన్ని తెప్పించింది. వరల్డ్ కప్ చూడడానికి 3డీ కళ్లజోడును ఆర్డర్ చేసుకున్నానని MSKపై రాయుడు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. ఇక చాలా సందర్భాల్లో MSK ఈ విషయంలో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నాడు. అయితే ఈ ఎపిసోడ్ గురించి మరో ఆసక్తికర అంశం ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది.
ఇది చాలా బాధాకరం : ఊతప్ప
రాయుడిని 2019 వన్డే వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయకపోవడానికి కారణం కోహ్లీనేనని చెప్పాడు టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప. కోహ్లీకి ఇష్టం లేకపోతే టీమ్‌లోకి ఎవరిని రానివ్వడని చెప్పాడు. అందుకు ఉదాహరణగా రాయుడుని పాయింట్ అవుట్ చేశాడు ఊతప్ప. రాయుడి కెరీర్ అర్ధాంతరంగా ముగియడం తనను ఎంతగానో బాధపెట్టిందన్న ఉతప్ప… ప్రతీ కెప్టెన్‌కి కొందరు నచ్చిన ప్లేయర్లు ఉంటారని.. అందులో తప్పు లేదు కానీ.. కెరీర్‌లో చాలా లేటుగా ఎదుగుతున్న రాయుడిని అలా టీమ్ నుంచి తప్పించడం మాత్రం అన్యాయమని వాపోయాడు. అంబటి రాయుడికి వరుసగా అవకాశాలు ఇచ్చి, నాలుగో స్థానంలో ఆడిస్తూ వచ్చారని.. సడెన్‌గా వరల్డ్ కప్‌లో ప్లేస్ లేకుండా చేయడం అందరిలాగే తనని కూడా షాక్‌కు గురి చేసిందన్నాడు. రాయుడి దగ్గర వరల్డ్ కప్ జెర్సీ ఉందని.. వరల్డ్ కప్ కిట్ బ్యాగ్ కూడా ఉందని.. వరల్డ్ కప్ ఆడాలని ఎన్నో కలలు కన్నాడని.. అయితే అన్నీ ఇంటి దగ్గరే పెట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్‌లో ఆడతానని ఫిక్స్ అయిపోయిన వ్యక్తిని సడెన్‌గా టీమ్‌కి పనికి రావని పక్కనబెట్టేయడం చాలా దారుణమని ఫైర్ అయ్యాడు ఊతప్ప. ఇప్పుడు ఉతప్ప కామెంట్స్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
Just Ordered a new set of 3d glasses to watch the world cup 😉😋..
— ATR (@RayuduAmbati) April 16, 2019
రాయుడు ఉండి ఉంటే బాగుండేది
ఎందుకంటే రాయుడు అప్పుడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నంబర్-4 పొజిషన్‌లో సెట్ అయ్యాడు. అసలు రాయుడిని పక్కనపెడతారని ఏ ఒక్కరూ భావించలేదు కూడా. ఇక రాయుడు స్థానంలో ఎంపికైన విజయ్ శంకర్ టోర్నీలో తుస్సుమన్నాడు. వరల్డ్‌కప్ మధ్యలోనే గాయపడ్డాడు. అయితే శంకర్ గాయపడిన తర్వాత కూడా రాయుడిని పిలవలేదు. ఇక 2019 వరల్డ్‌కప్ సెమీస్‌లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా ఇంటిదారి పట్టిందన్న విషయాన్ని ఫ్యాన్స్ అంత తెలిగ్గా మర్చిపోరు. ఆ మ్యాచ్‌లో రాయుడు ఉండి ఉంటే సీన్ వేరేలా ఉండేదని అప్పట్లోనే ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆపదలో క్రీజులో నిలబడి, పాతుకుపోయే ప్లేయర్‌గా అప్పటికీ రాయుడు తానేంటో నిరూపించుకున్నాడు. అయితే MSKతో పాటు కోహ్లీకి రాయుడు నుంచి మద్దతు లేదని ఊతప్ప కామెంట్స్ చూస్తే అర్థమవుతోంది. నాడు కెప్టెన్‌గా కోహ్లీ ఉన్నాడు. అటు రాయుడికి అన్యాయం జరిగిందన్న విమర్శలు ఎదురైనప్పుడు కోహ్లీ పట్టించుకోలేదు. ఏది ఏమైనా కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రాయుడు చివరకు అన్యాయంగా జట్టుకు దూరమవడం బాధాకరమంటున్నారు ఫ్యాన్స్.
ఇది కూడా చదవండి: హిందీ జాతీయ భాష కాదా? అశ్విన్ ఏం అన్నారు? రాజ్యాంగం ఏం చెబుతోంది?