తొక్కిసలాట(Stampede)..! ఈ పదం చాలా భయంకరమైనది.. చాలా విషాదకరమైనది కూడా. నాటి కుంభమేళ(Kumbhmela) తొక్కిసలాట నుంచి ఇప్పటి తిరుపతి(Tirupati stampede) తొక్కిసలాట వరకు స్వాతంత్ర్య భారతంలో వేలాది మంది మతపరమైన ఉత్సవాలు, వేడుకల్లో ప్రాణాలు వదిలారు. ఇండియాలో తొక్కిసలాట ఘటనలు వేలాది కుటుంబాలను అగాధంలోకి నెట్టాయి. వారి జీవితాలను ఛిన్నాభిన్నాం చేశాయి. ఇంతకీ ఇండియాలో మతపరమైన కార్యక్రమాల్లో తరుచుగా తొక్కిసలాటలు ఎందుకు జరుగుతున్నాయి? తప్పెవరిది?
కాళ్ల కింద నలిగి నలిగి చనిపోయారు
1954 కుంభమేళాలో 800 మందికిపైగా భక్తులు తొక్కిసలాటలో మరణించారు. ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద మతపరమైన స్టాంపీడ్‌గా నిలిచింది. 1954 ఫిబ్రవరి 3న ప్రయాగ్‌రాజ్‌లోని గంగానదిలో స్నానం చేసేందుకు భక్తులు భారీగా చేరుకున్నారు. అయితే తీవ్ర రద్దీతో పాటు భక్తుల మధ్య జరిగిన ఘర్షణ తొక్కిసలాటకు కారణమైంది. ఇక 2005 మహారాష్ట్రలోని మంధర్ దేవి ఆలయంలో జరిగిన తొక్కిలసాటలో 340 మందికి పైగా మరణించారు. 2008లో రాజస్థాన్‌లోని చాముండ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. 2011 సబరిమల ఆలయంలో జరిగిన స్టాంపీడ్‌లో 100 మందికి పైగా చనిపోయారు. 2015 రాజమండ్రీలో జరిగిన గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. నిజానికి మతపరమైన తొక్కిసలాటలు ఇండియాలో మాత్రమే కాదు.. ప్రపంచంలో చాలా చోట్లా, చాలాసార్లు జరిగాయి. 2015లో మక్కాలో జరిగిన స్టాంపీడ్‌లో 2,411 మంది మరణించారు. అటు 2005లో ఇరాక్ అషురా వేడుకల్లో 953 మంది తొక్కిసలాటకు బలయ్యారు. మక్కా- హజ్ యాత్రలో రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగి వేలాది మంది చనిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఎన్నో మరణాలకు మతపరమైన కార్యక్రమాలు కేంద్రంగా నిలుస్తున్నాయి. దీనికి అనేక కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు.
పాప-పుణ్యాల కోసం..
ఇందులో ప్రధానమైనది అధికారుల వైఫల్యం. భక్తుల సమూహాలను నియంత్రించడంలో అధికారుల వైఫల్యం ఎక్కువగా కనిపిస్తుంటుంది. సమర్ధవంతమైన ప్లానింగ్ లేకపోవడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడుతుంటారు. అటు వేడుకలు, ఉత్సవాలు జరిగే స్థలాలు కొండలు, నది తీరాల్లో ఉండడం కూడా తొక్కిసలాటకు కారణంగా చెప్పవచ్చు. ఇక భక్తుల సంఖ్య ఆ స్థల పరిమితిని మించి ఉన్నా పట్టించుకోకుండా సంబంధిత ప్రదేశానికి అనుమతించడం కూడా స్టాంపీడ్స్‌కు దారి తీస్తాయి. 2024 జూన్ 2న యూపీ హథ్రాస్‌లో సరిగ్గా ఇలానే జరిగింది. భోలేబాబా నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమానికి 80 వేల మంది భక్తులు హాజరవుతారని నిర్వాహకులు పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్నారు. అయితే 2 లక్షల 50 వేల మందిని కార్యక్రామంలోకి అనుమతిచ్చారు. బాబా పాదాల కింద మట్టి కోసం ఎగబడ్డ భక్తులు చివరికు ఆ మట్టిలోనే కలిసిపోయారు. నాటి ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక భక్తులు క్యూలైన్‌లో ఉన్నప్పుడు అగ్నిప్రమాదాలు జరగడం, లేదా బారికేడ్లు కూలిపోవడం లాంటివి జరిగితే తొక్కిసలాటలు జరిగే అవకాశాలు ఎక్కువ. ఇక కొంతమంది లైన్‌లో నిలబడి పుకార్లు వ్యాప్తి చేస్తుంటారు. అది నిజం అనుకోని భక్తులు అటు ఇటు పరుగులు తీసి చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. ఇక భక్తుల విషయానికి వస్తే వారికి ఉండే నమ్మకాలు కూడా వారి ప్రాణాలను బలిగొంటున్నాయని పలువురు చెబుతుంటారు. మొదటి రోజు నదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు పోతాయని నమ్మేవారు కూడా ఉంటారు. అందరికంటే ముందుగా దర్శించుకుంటేనే ఎక్కువ పుణ్యం వస్తుందని.. అదే రోజు అదే సమయంలో గుడికి వెళ్తేనే దేవుడు కరుణిస్తాడని నమ్మేవారు ఎక్కువగా ఉంటారు. తొక్కిసలాట ఘటనలకు ఇలాంటి ఆలోచనా తీరు కూడా ఒక కారణంగానే చెప్పవచ్చు.
ఊపిరి ఆడక.. ట్రోమాలోనే..!
ఇక తొక్కిసలాట జరిగినప్పుడు బాధిత వ్యక్తులు ట్రామాటిక్ అస్ఫిక్షియాకు గురవుతారు. అంటే మెదడులో తీవ్ర ఒత్తిడి కారణంగా ఊపిరి ఆడకపోవడమని అర్థం. ఇదే స్టాంపీడ్ మరణాలకు ప్రధాన కారణంగా డాక్టర్లు చెబుతుంటారు. తొక్కిసలాట సమయంలో భయంతో బాధితులు ఏ నిర్ణయం తీసుకోలేరు. ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో తన కుటుంబసభ్యులు గురించి ఆలోచన మొదలవుతుంది. ఇదంతా ఆలోచించేలోపు ఎవరో ఒకరు వారికి కిందకు పడేస్తారు. ఇక పైకి లెగలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రాణభయంతో ఇతర భక్తులు కిందపడిన వ్యక్తిని తొక్కుకుంటూ పోతారు. ఈ కారణంగా మెదడులో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. అలా ప్యానిక్ మోడ్‌లోనే బాధితులు తుదిశ్వాస విడుస్తారు.
Also Read: దేశం కోసం.. ధర్మం కోసం.. కార్పొరేట్ల కోసం..! ఎవరి కోసం సారూ 90 గంటలు పని చేయాలి?