Menu

Digital Protection Rules: టీనేజర్స్ జీవితాన్ని పెకలిస్తున్న సోషల్ మీడియాకు ఇక ముకుతాడు! రాబోతున్న కొత్త సోషల్ మీడియా నియంత్రణ చట్టంలో ఏముంది?

Praja Dhwani Desk 1 year ago
data protection rules

Social Media Addiction: ఆ పిల్లాడికి 15ఏళ్లు.. హైదరాబాద్‌లో నివసించే ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు.. టెన్త్‌ క్లాస్‌ పూర్తయ్యేవరకు అతను చదువులో టాపర్‌.. డాక్టర్‌ కావాలన్నది అతని కల. అయితే పదో తరగతి పాస్‌ అయిన తర్వాత స్మార్ట్‌ ఫోన్‌ కావాలని తండ్రిని అడిగాడు. మంచి మార్కులు రావడంతో కొడుకు కోరికను కాదనలేకపోయిన తండ్రి ఓ 10 వేల పెట్టి స్మార్ట్‌ ఫోన్‌ కొన్నాడు..! అక్కడే ఆ కుటుంబం కథ అడ్డం తిరిగింది. ఒక చిన్న స్మార్ట్‌ఫోన్ ఆ కుటుంబాన్ని అల్లకల్లోలం చేసింది. రాత్రి, పగలు తేడా లేకుండా తన రూమ్‌లో స్మార్ట్‌ ఫోన్‌ పట్టుకోని వేలాడేవాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్స్‌తో అదేపనిగా కనెక్ట్ అవ్వడం, ఇన్‌స్టా Influencers లైఫ్‌స్టైల్ చూసి అలానే ఉండాలని భావించడం చేసేవాడు. చివరకు సరైన ఫుడ్‌ తినడం కూడా మానేశాడు. రెండేళ్లు తిరిగే సరికి ఇంటర్‌లో ఫేల్ అయ్యాడు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో సైబర్ బుల్లీయింగ్‌ను ఎదుర్కొన్నాడు. దీంతో డిప్రెషన్‌కు గురయ్యాడు. ఆ బాధను తట్టుకోలేక తనువు చాలించాడు..! ఇదంతా ఎందుకు జరిగిందని ఆలోచించారా? అలాంటి పిల్లలు మన చుట్టూ కనిపించడంలేదా? మరి వాళ్లకి ప్రొటెక్షన్‌ ఏది? తల్లిదండ్రులు ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేస్తోంది?

ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ కారణంగా ఆత్మహ*త్య చేసుకునే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి.

ముందు ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చేస్తుందో తెలుసుకుందాం! ఇక మీదట పిల్లలు సోషల్‌ మీడియా ఖాతా తెరవాలంటే వారి తల్లిదండ్రుల సమ్మతిని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఈ మేరకు కొత్త నిబంధనలు తీసుకువస్తోంది. ప్రజల డిజిటల్‌ డేటా దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్రం 2023 ఆగస్టులో డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ చట్టాన్ని చేసింది. 16 నెలల తర్వాత ఈ చట్టం అమలుకు అవసరమైన ముసాయిదా నిబంధనలను కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ శాఖ జారీ చేసింది. ఇందులో పిల్లల డేటా పరిరక్షణకు కీలక నిబంధనలు ఉన్నాయి. వీటి ప్రకారం.. పిల్లల డేటాను ప్రాసెస్‌ చేసే ముందు కంపెనీలు తల్లిదండ్రుల సమ్మతిని తీసుకోవాలి. ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డులు లేదా డిజిటల్‌ లాకర్‌ ద్వారా పిల్లల తల్లిదండ్రులను కంపెనీలు ధ్రువీకరించుకోవాలి.

మరోవైపు డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ చట్టం అమలుకు డేటా ప్రొటెక్షన్‌ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. డిజిటల్‌ కార్యాలయంగా ఈ బోర్డు పని చేస్తుంది. చట్ట ఉల్లంఘనలపై విచారణ జరిపే, జరిమానాలు విధించే అధికారాలు ఈ బోర్డుకు ఉంటాయి. గరిష్టంగా కంపెనీకి 250 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.

ఆస్ట్రేలియా ఇప్పటికే 16ఏళ్లలోపు పిల్లలను సోషల్‌మీడియా వినియోగించకుండా నిషేధం విధించింది.

ఇదంతా కేంద్ర ప్రభుత్వం సోషల్‌మీడియాతో పాటు ఇతర డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లో పిల్లల సేఫ్టీ కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగం..! మరి తల్లిదండ్రులు ఏం చేయాలి? నిజానికి సోషల్‌మీడియాను ఎక్కువగా ఉపయోగించే దేశాల్లో ఇండియా ఒకటి. భారత్‌లో సుమారు 40 కోట్ల మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. వీరిలో ఎక్కువగా పిల్లలు, టీనేజర్లే ఉంటున్నారు. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, టీనేజర్లు రోజుకు సగటున 2 నుంచి 3 గంటలు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫారమ్‌లలో గడుపుతున్నారు. వీరిలో కొంతమంది తమ తల్లిదండ్రులకు తెలియకుండా సోషల్‌మీడియా ఉపయోగిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇంట్లో తెలిసే యూజ్ చేస్తారు. అయితే ఎలా వాడాలి, ఎంత వరకు వాడాలి అన్నదానిపై ఇండియన్ పేరెంట్స్‌ ఎక్కువగా చర్చించరు. అసలు పెద్దగా పట్టించుకోని వారే ఉంటారు. ఎందుకంటే ఇండియాలో డిజిటల్‌ లిటరసీ తక్కువ. ఎక్కువమంది పేరెంట్స్‌కు అవగాహన ఉండదు. ఇది వారి తప్పుకాకున్నా తమ పిల్లలు ఫోన్‌లో ఏం చేస్తున్నారో ఓ కన్నేసి ఉంచడం మాత్రం వారి చేతుల్లో ఉండే పనే. లిమిటెడ్‌గా ఫోన్‌ వాడేలా చేయడం కూడా వారి చేతుల్లో ఉన్నదే!

సోషల్‌మీడియాలో వచ్చే లైకులు, కామెంట్స్‌, షేర్ల కోసం చాలా మంది ఎంతో టైమ్‌ వేస్ట్ చేస్తున్నారు. తమది కానీ ప్రపంచంలో బతుకుతూ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

ఉదాహరణకు మీ పిల్లాడు రోజుకు 6 గంటలు సోషల్‌మీడియా యూజ్ చేస్తుంటే ఆ పరిమితిని అరగంట గంటకు తగ్గించమని చెప్పి చూడండి. సోషల్ మీడియా అడిక్షన్ కారణంగా వచ్చే మానసిక, శారీరక సమస్యలను సహనంతో వివరించండి. ఎలాంటి సమస్యలు ఎదురైనా, ముఖ్యంగా సైబర్ బుల్లీయింగ్ లాంటి వాటిని మీతో షేర్ చేయమని చెప్పండి. స్పోర్స్‌, మ్యూజిక్, డాన్స్‌, పెయింటింగ్ లాంటి హాబీలను ప్రోత్సహించండి. వారంలో ఒక రోజు లేదా రోజుకు కొన్ని గంటల పాటు ‘డిజిటల్ డిటాక్స్’ ఫార్ములాను పాటించండి. ఆ సమయంలో మొబైల్ ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండండి. వాటికి బదులుగా పుస్తకాలు చదవేలా పిల్లలను ఎంకరేజ్ చేయండి. బుక్స్‌ అంటే స్కూల్‌, కాలేజీ బుక్స్‌ కాదు.. ఏదైనా కథలు లేదా నాలెడ్జ్‌బుల్‌ బుక్స్‌ అని అర్థం! వారి సోషల్‌మీడియా ఖాతాలపై ఓ లుక్కేసి ఉంచండి. పిల్లలు ఆన్‌లైన్‌ అడిక్షన్‌ను తగ్గించడానికి తల్లిదండ్రుల మద్దతు అందరికంటే అవసరమని గుర్తు పెట్టుకోండి.

Also Read:


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *