Menu

World Suicide Prevention Day: మీరు ఒంటరి కాదు!.. కలిసి ప్రాణాలను కాపాడుకుందాం!

Praja Dhwani Desk
indian suicide rate

“అమ్మా.. నాన్న.. నన్ను క్షమించండి.. మార్కుల కోసం మా టీచర్లు వేధిస్తున్నారు.. ఈ ఒత్తిడి నేను తట్టుకోలేపోతున్నా.. ఇదే నా చివరి రోజు..” హైదరాబాద్‌-మాదాపూర్‌ నారాయణ కాలేజీ విద్యార్థి సూసైడ్ నోట్ ఇది!

అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట.. ఓ దళిత SIని కులం పేరుతో పదేపనిగా తోటి పోలీసధికారులే వేధించారు. అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ఆ ఎస్సై చావుబతుకుల్లో కొట్టుమిట్టాడి చివరికి చనిపోయాడు..

అది తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామం.. ఓ ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో ఇద్దరి కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించకపోవడంతో తనువు చాలించారు..!

ఇవి ఆత్మహత్యలా? హత్యలా? పైకి ఆత్మహత్యల లాగనే కనిపిస్తున్నాయి.. కానీ ఇవి ముమ్మాటికి హత్యలే..! అటు చాలామంది పోరాడలేక తమ జీవితాలను అర్థంతరంగా ముగించుకుంటూ ఉండొచ్చు.. అయితే ఈ తరహా ఆత్మహత్యల వెనుక ఉన్న కారణాలను విస్మరిస్తే అది ముమ్మాటికి తప్పే అవుతుంది. ఎందుకంటే ఇవి చట్టప్రకారం శిక్షలు లేని హత్యలే…! వీటికి ప్రభుత్వం, కుటుంబం, విద్యా వ్యవస్థ ఇవన్నీ కలగలి‌సిన సమాజం అందరూ బాధ్యులే!

ఇవాళ( సెప్టెంబర్ 10) ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం..!ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ (IASP) మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) చొరవతో మొదటి ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సెప్టెంబర్ 10, 2003న స్టాక్‌హోమ్‌లో ప్రారంభించబడింది. ఆత్మహత్యల ప్రపంచ సమస్యపై దృష్టిని ఆకర్షించడానికి మరియు ఆత్మహత్యలు నివారించదగిన ముఖ్యమైన సందేశాన్ని బలోపేతం చేయడానికి ఇది స్థాపించబడింది.

ప్రతీ ఒక్కరు ఆత్మహత్యను పిరికిపంద చర్యగా అభివర్ణిస్తుంటారు. అయితే ఇది నిజం కాదు.. ఆత్మహత్య ఆలోచన మెదడుకు సంబంధించిన అంశం. మానసిక సమస్యలకు సంబంధించి విషయం. అంతేకాని పిరికి చర్య కాదు..!

suicide state wise india

ఇండియాలో సూసైడ్ కేసులు (తొలి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు)

తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యల సంఖ్య (NCRB Data)

ఒత్తిడి.. చదువు..

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం భారత్‌లో ఆత్మహత్యల రేటు ఏటా 2శాతం పెరుగుతోంది. ఇందులో విద్యార్థుల ఆత్మహత్యల రేటు 4శాతం పెరుగుతోంది. ఇండియాలో 15-24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ప్రతీ ఏడుగురు యువకులలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఇక 2021లో 13,089 మంది విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకోగా 2022లో 13,044 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. పిల్లలు పుట్టినప్పటి నుండి, వారి మానసిక స్థితిని అర్థం చేసుకొని తల్లిదండ్రులు విద్యాసంస్థలు.. వారిని పోటీ ప్రపంచం పేరుతో తీవ్ర ఒత్తిడిలో నెడుతున్నారు. ఒకరికొకరు పోల్చుతూ ఆత్మన్యూనతకు, భారానికి లోనవుతున్నారు. ర్యాంకులు – రిజల్ట్ అంటూ వారి జీవితానికి లేకపోతే అర్థమే లేదన్నట్టు మార్చేశారు.

ఇండియాలో వయసుల వారీగా సూసైడ్ కేసులు

ప్రతీఏటా పెరుగుతున్న మరణాలు

అటు మొత్తం రాష్ట్రాలపరంగా ఆత్యహత్యల డేటా చూస్తే అత్యధిక మంది సూసైడ్ చేసుకుంటున్న రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది. NCRB డేటా ప్రకారం 2021లో మహారాష్ట్రలో 22,207 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. అటు మహారాష్ట్ర తర్వాత ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రాల్లో తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ ఉన్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సూసైట్ రేట్ ప్రతీఏటా పెరుగుతూ పోతోంది.

indian dowry system

ప్రతీకాత్మక చిత్రం

ఇష్టం లేని పెళ్ళిళ్లు

అటు ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో ఇండియాలో అత్యధికంగా మాహిళలు ఉండడం అత్యంత బాధకారమైన విషయం. లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌ ప్రకారం ప్రపంచంలో ఆత్మహత్య చేసుకుంటున్న ప్రతీ ముగ్గురులో ఒకరు మహిళ భారతీయురాలే. ప్రపంచ ఆత్మహత్య మరణాలలో మహిళలు శాతం 37గా ఉంది. ఇండియాలో ఆత్మహత్య మరణాల్లో వివాహిత మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఇష్టంలేని పెళ్ళి, బాల్య వివాహాలు, గృహ హింస, ఆర్థికంగా ఇతరులపై ఆధారపడటం లాంటి వాటి వల్ల మహిళలు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మరణాల పరంగా మొదటి 20 ప్రధాన కారణాలలో ఆత్మహత్య ఒకటి. మలేరియా, రొమ్ము క్యాన్సర్, యుద్ధం లాంటి వాటి కంటే ఆత్మహత్య కారణంగా ఎక్కువ మరణాలు నమోదువుతున్నాయి. WHO 2019 డేటా ప్రకారం ప్రతీఏడాది 8లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

కారణాలేంటి?

ఆత్మహత్యల రేటు ఇండియాలో పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఆర్తిక కారణాలు ప్రధానమైనవి. పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అస్థిరత లాంటి సమస్యలతో సతమతమవుతూ ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారు. అటు పేదరికానికి సామాజిక కారణాలు తోడైతే పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ఈ ఆర్థిక కారణాలు అనేక సందర్భాల్లో ఆరోగ్యం- వైద్యం మీద కూడా ప్రభావం చూపి ఆ పరిస్థితిలో ఏమి చేయలేక చనిపోతున్నారు. కులం, లింగభేదం, మతం మొదలైన వివక్షలతో పాటు కుటుంబ వివాదాలు, సామాజిక ఒంటరితనం చాలా మందిలో మానసిక రుగ్మతలకు కారణం అవుతున్నాయి. దీని కారణంగా డిప్రెషన్‌కు గురయ్యే వారి సంఖ్య ఎక్కువే.

suicide helpline number

మెడికల్‌ హెల్ప్‌లైన్ కోసం ఈ నంబర్‌కు కాల్ చేయండి

వీటిని ఆపేదెలా?

ఆత్మహత్యల నివారణ కంటే ముందు దానిపై అవగాహన కలిగి ఉండటం అవసరం. మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన ఉండడం అన్నిటికంటే ముఖ్యమైన విషయం. కొంతమంది ఇతరులతో చనిపోవాలని ఉందని పదేపదే చెబుతుంటారు. అలాంటి వారిని అసలు తేలికగా తీసుకోకూడదు. . మీపై ఎంతో నమ్మకం ఉంటే కానీ చాలా మంది ఆత్మహత్య విషయాన్ని పంచుకోరు..వారితో విలైనంత సమయం గడపడం ఉత్తమం. అలాంటి వారిని తీవ్రతను బట్టి సంబంధిత డాక్టర్(సైకాలజిస్ట్/సైకియాట్రిస్ట్) దగ్గరకు తీసుకెళ్లడం కూడా అత్యవసరం.

అటు ఆత్మహత్యల నివారణతో పాటు దానికి సంబంధించిన కారణాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా ఒత్తిడిని అధిగమించడం అత్యవసరం. అటు సామాజీక, ఆర్థిక సమస్యలను పరిష్కరించడం చాలా అవసరం.

ముఖ్యగమనిక: ఆత్మహత్య ఆలోచనలు, ఇతర మానసిక సమస్యలు ఉన్న వారు మానసిక ఆరోగ్య మద్దతుతో పాటు కౌన్సిలెంగ్ కోసం ఎమర్జెన్సీ : 112, ఐకాల్‌- 9152987821, ఇక 24×7 టోల్-ఫ్రీ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్ హెల్ప్‌లైన్ KIRAN (1800-599-0019) కు కాల్ చేయవచ్చు. కచ్చితంగా మెడికల్‌ హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది!

ఇది కూడా చదవండి: నిలువెల్లా విషం నిండిన తేలు ‘ఇజ్రాయెల్‌..’ మరోసారి బరితెగించిన బెంజమిన్ బలగాలు!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *