Menu

Britain Violence: బ్రిటన్‌లో పడగవిప్పిన జాత్యాహంకారం.. ముస్లింలపై ఈ కోపం ఎందుకు?

Tri Ten B

అది ఆగస్టు 6, 2011.. సాయంత్రం 6 గంటలు.. లండన్ వీధులన్ని జనాలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి.. ఇంతలోనే కొన్ని గుంపులు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియదు కానీ పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించాయి.. షాపుల్లో చొరబడి లూటి చేశాయి.. అందినకాడికి దోచుకున్నాయి.. వలసదారుల దుకాణాలే టార్గెట్‌గా జాత్యాహంకారులు రెచ్చిపోయిన రోజులవి.. ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకోని దాడులకు తెగబడ్డ కాలమది.. నాలుగు రోజుల పాటు లండన్‌ అంతటా ఒకటే అశాంతి.. ముగ్గురు ముస్లింలను ఈ దాడుల్లో చంపేశారు. ఈ అల్లర్లకు సంబంధించి ఇంగ్లండ్‌ అంతటా 3,000 మందికి పైగా అరెస్టులు జరిగాయి. తర్వాత పరిస్థితి చక్కబడింది..! ఇక సీన్‌ కట్ చేస్తే.. 2024 ఆగస్టు.. మరోసారి అదే జాత్యాహంకారం పడగవిప్పింది.. అమాయకులపై విరుచుకుపడుతోంది.. సరగ్గా 13ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ అల్లకల్లోలంగా మారింది.. అయితే 2011లో కేవలం లండన్‌ వ్యాప్తంగా మాత్రమే హింసాత్మక ఘటనలు జరగగా.. ఇప్పుడు దేశంలోని చిన్నచిన్న పట్టణాల్లోనూ అల్లర్లు చెలరేగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఫేక్‌న్యూస్‌తో మొదలైన అల్లర్లు:
జూలై 29న ఇంగ్లండ్‌-సౌత్‌పోర్ట్‌లో జరిగిన ఓ డ్యాన్స్‌ ప్రొగ్రామ్‌లో ముగ్గురు చిన్నారులను 17ఏళ్ల ఆక్సెల్‌ చంపేశాడు. మరో ఎనిమిది మంది పిల్లలను కత్తితో పొడిచాడు. ఈ ఘటన జరిగిన వెంటనే సోషల్‌మీడియాలో ఓ న్యూస్‌ వైరల్‌ అయ్యింది. ముగ్గురు చిన్నారులను చంపేసిన వ్యక్తి ముస్లిం మతానికి చెందినవాడని.. అతను వలసదారుడని పలువురు పోస్టులు పెట్టారు. ఇలా ఫేక్ పోస్టులు పెట్టి ప్రచారం చేసిన వారిలో ఎక్కుమంది బ్రిటన్‌లోని రైట్‌ వింగ్‌కు చెందినవారు. అంటే మత ఛాందసాన్ని నరనరాల్లో ఎక్కించుకున్నావారు..! వీళ్లంతా కలిసి సోషల్‌మీడియా వేదికగా ముస్లిం వర్గంతో పాటు వలసదారులకు వ్యతిరేకంగా విధ్వేషాన్ని చిమ్మారు. ఇవే అల్లర్లకు కారణమయ్యాయి.

అతను అసలు ముస్లిమే కాదు:
నిజానికి చిన్నారులను చంపేసిన ఆక్సెల్ ముస్లిం వలసదారుడు కాదు. అతను కార్డిఫ్‌లో పుట్టి పెరిగిన క్రిస్టియన్‌. అతనికి ఇస్లాం మతానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే సోషల్‌మీడియాలో జరిగిన ఫేక్ ప్రచారం సౌత్‌పోర్ట్‌లో హింసాత్మక ఘటనలకు కారణమైంది. ముస్లిం వ్యతిరేక నిరసనలకు దారి తీసింది. స్థానిక మసీదుపై దాడికి ఉసిగొల్పింది. ఈ ఘటన తర్వాత సౌత్‌పోర్ట్‌ నుంచి అప్పటి నుంచి బ్రిటన్‌లోని మిగిలిన ప్రాంతాలకు అల్లర్లు వ్యాపించాయి. సుందర్‌ల్యాండ్, మాంచెస్టర్, ప్లైమౌత్, బెల్‌ఫాస్ట్‌లతో సహా 20కి పైగా ప్రాంతాలు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఈ అల్లర్లలో వందలాది మంది పాల్గొన్నారు.. వలసదారులు, ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వారి దుకాణాలను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన పోలీసులతో గొడవ పడ్డారు. అంతటితో ఆగలేదు.. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. ఈ ఘర్షణల్లో 50 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. అటు పోలీసు వ్యాన్‌లకు సైతం జాత్యాహంకారులు నిప్పు పెట్టారు.

బ్రిటన్‌ అంతటా టెన్షన్ టెన్షన్:
తమకు తాము దేశభక్తులుగా చెప్పుకుంటూ జాత్యాహంకారులు ఈ దాడులు చేస్తుండడం విడ్డూరం. వలసదారుల కారణంగానే బ్రిటన్‌ నాశనం అయిపోతుందన్నది అక్కడి రైట్‌ వింగ్‌ సంస్థల వాదన. బ్రిటన్‌ పరిపాలనలో వలసదారుల జోక్యం పెరిగిందని ఎప్పటినుంచో ఈ గ్రూప్స్‌ వాదిస్తున్నాయి. నిన్నమొన్నటివరకు భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ ఆ కింగ్‌డమ్‌కు ప్రధానిగా ఉండడాన్ని వారు సహించలేకపోయారు కూడా. అయితే ప్రస్తుతం లెబర్‌ పార్టీ అధికారంలో ఉంది. ఇటివలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ప్రస్తుత పరిస్థితులు అగ్నిపరీక్షగా మారాయి. పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు బ్రిటన్‌ వ్యాప్తంగా ప్రత్యేకంగా అధికారులను మోహరిస్తోంది. 600 అదనపు జైళ్లను కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ దాడులకు సంబంధించి 111 మందిని అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో వెనుక కీలకంగా వ్యవహరించిన 58 ఏళ్ల బ్రిటీష్ వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష కూడా విధించారు.

అటు ప్రధాని స్టార్మర్ ఎప్పటికప్పుడు పరిస్థితులు నిశితంగా గమనిస్తున్నారు. ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో జాతి విద్వేషాన్ని రెచ్చగొడుతున్న వారిపై కొరఢా ఝులిపించేందుకు స్టార్మర్‌ ప్రభుత్వం రెడీ అయ్యింది. టిక్‌టాక్‌, మెటా, గూగుల్‌, ట్విట్టర్‌లో ప్రతినిధులతో ఇప్పటికే లెబర్‌ పార్టీ సభ్యులు సమావేశమయ్యారు. ఫేక్‌ న్యూస్‌ను అరికట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు..!

ALso Read: ఇజ్రాయెల్‌ మారణహోమం.. చిన్నారులను కూడా వదలని కర్కశత్వం!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *