Menu

Revanth Reddy on Kamma: కులం మీద ‘కమ్మ’దనం ఎందుకు సీఎం సారూ.. ? ఈ అగ్రకుల భజనలు ఎవరి కోసం?

Praja Dhwani Desk
kamma casteism

‘కమ్మతనంలో అమ్మతనం ఉంటుంది..’

‘పదిమందికి సాయం చేయడం కమ్మవారి లక్షణం..’

‘సాయం చేయడం కమ్మవారి డీఎన్‌ఏలో ఉంటుంది..’

ఇదంతా ఏ కమ్మ మహాసభలో ఎవరో కమ్మోన్మోది చెప్పిన మాటలు అయితే అది అసలు మేటరే కాదు.. ఎందుకంటే ‘మా బ్లడ్‌ వేరు.. మా బ్లీడ్‌ వేరు.. మా రక్తం ఎవరికీ ఎక్కించకూడదు..’ అని చెప్పుకునే కమ్మ కులస్తుల మాటలు వినీవినీ విసిగిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా కమ్మవారిపై ఎనలేని ప్రేమ చూపించింది మరెవరో కాదు.. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారన్న విషయం అసలు గుర్తుందో లేదో కానీ ఈ నెల రోజుల్లో కమ్మ సంఘాల సభకు ఆయన వెళ్లడం ఇది రెండోసారి. జూన్ 28న జరిగిన కమ్మ మహా సభలకు హాజరైన రేవంత్‌ ఇప్పుడు కమ్మ గ్లోబల్‌ సమ్మిట్‌కూ విచ్చేశారు. వచ్చి నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోతే సర్లే అనుకోవచ్చు కానీ రేవంత్‌ చేసింది మాత్రం భజన.. విపరీత భజన.. వినలేని భజన.. కమ్మవారికి కూడా సాధ్యం కాని భజన. రేవంత్‌ మాటలకు ఒక్క సారిగా ‘చౌదరి ఏంథమ్‌’ గుర్తొచ్చింది..!


గురుభక్తేనా?
కుల పిచ్చికి కేరాఫ్‌గా నిలిచే చాలా కులాలు ఏపీ, తెలంగాణలో కనిపిస్తాయి. అందులో కమ్మ, కాపు, రెడ్డి ముందువరుసలో ఉంటాయి. వీళ్ల కులపిచ్చి ఏ స్థాయిలో ఉంటుందంటే వేరే దేశం పోయినా అక్కడ కూడా ఇదే కులం కంపులో బతికే అంతలా. అందుకే గతంలో చౌదరి ఏంథమ్‌ పేరుతో ఓ సాంగ్‌ రిలీజ్ చేశారు. ఆ పాటలో పాపం కులాన్ని వదిలేసిన వారిని కూడా తమ కులంగా చెప్పుకోని లిరిక్స్‌ రాసుకున్నారు. పేదల ఆకలి తీర్చేవాడే కమ్మ అంటూ ఆ పాట సాగిపోతుంది.. ఇప్పుడు రేవంత్‌ కూడా అదే పాట చూసి స్టేజీ ఎక్కినట్టు ఉన్నారు. అందుకే అదే డైలాగ్ పదేపదే చెప్పారు. ఎక్కడ సారవంతమైన నేల ఉంటుందో అక్కడ కమ్మవారు వ్యవసాయం చేస్తారట.. అలా పేదల ఆకలి తీర్చుతారట. పచ్చిగా చెప్పాలంటే కమ్మవారు పేదల భూములను ఎలా కబ్జా చేశారో ఈ ఒక్క మాటలో అర్థమవుతుంది. ఎవరికీ లేని వ్యవసాయ భూములు కమ్మవాళ్లకి ఎలా వచ్చినట్టు? వ్యవసాయం పేరుతో వ్యాపారం చేయడం అన్నం పెట్టడం, ఆకలి తీర్చడం ఎలా అవుతుంది? ఏమో నోరు ఉంది కదా భజన చేస్తే పోయేదేముందిలే అని రేవంత్‌ భావించి ఉండొచ్చు. ఖమ్మం ఎలాగో క్లీన్‌ స్వీప్‌ చేశారు కదా.. అయినా కూడా ఈ రెడ్డిగారికి ఈ కమ్మ భజన ఎందుకో..? బహుశా చంద్రబాబు మీద గురుభక్తి కావొచ్చు..!


ఇంత తీరిక ఎక్కడిది సారూ:
ఇందిరాగాంధీకి ఎదురేలేని కాలంలో నాడు ఎన్టీఆర్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని రేవంత్‌ గుర్తుచేశారు. ఇక్కడ గమనించవల్సిన అంశం ఏంటంటే రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు.. ఈ పార్టీ తరుఫున తెలంగాణకు సీఎంగా ఉన్నారు. కమ్మనైనా స్టేజీ ఎక్కగానే ఈ విషయం మర్చిపోయారో ఏమో కానీ కమ్మకులానికి చెందిన ఎన్టీఆర్‌ను ఎలివెట్ చేయడం కోసం ఇందిరాగాంధీని తక్కువ చేయడానికి కూడా లెక్క చేయలేదు రేవంత్‌. ఎంతైనా కులభిమానం ముందు అండనిచ్చిన పార్టీపై ప్రేమ ఎందుకుంటుంది? మన తెలుగోళ్లకి కులమే ప్రధానం.. కులమే ముఖ్యం.. అందుకే కులాల చుట్టూనే రాజకీయాలు తిరుగుతుంటాయి.. కుల పిచ్చిని పెంచిపోషిండం కోసమే ఇలాంటి నాయకులు కుల సభలకు వెళ్తుంటారు. లేకపోతే ఓ కులానికి చెందిన సభలకు వెళ్లడానికి ఓ రాష్ట్ర సీఎంకు టైమ్ దొరకడం ఏంటి? అంతా ఖాళీగా ఉంటున్నారా?

ఈ కులోన్మాదం నిజం కాదా?
కమ్మవారు అందరిని ఆదరిస్తారని రేవంత్‌ చెప్పడం ఆయన భజన మనస్తత్వానికి నిదర్శనం. కారెంచెడు ఘటన గురించి రేవంత్‌కు తెలియనది కాదు.. ఆయన ఇంతలా ఆకాశానికి ఎత్తేసిన ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్న కాలంలోనే అమాయక దళితులు కమ్మ కర్కశత్వానికి బలపోయింది నిజం కాదా? అగ్రకులాలు మిగిలిన కులాలను చిన్నచూపు చూడవా? దేశంలో అడుగడుగునా దళితులను ఇప్పటికీ వివక్షతోనే చూస్తున్నారు కదా. ఇలా చూసే వారిలో అన్ని అగ్రకులాలతో పాటు కమ్మవారు లేరా? ఇవన్ని రేవంత్‌కు తెలుసు.. అయినా ఎందుకో భజన.. చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్లకే తీరిక దొరకని కాలమిది. సీఎంగా ఉన్న రేవంత్‌కు ఓ కులానికి చెందిన మీటింగ్‌కు వెళ్ళి.. ఇంత భజన చేసుకునే ఓపికా, సమయం ఉండడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.


ఇంత భజన ఎందుకు చేసినట్టు?
ఏపీ తెలంగాణ మీదకు అనేక సముద్రాలను దాటుకుంటూ ఏనాడో ఖండంతరాలు దాటిన తెలుగు తమ్ముళ్ల కులపిచ్చి తెలియనిది. అమెరికా గడ్డపై చిరంజీవి వర్సెస్‌ బాలకృష్ణ ఫ్యాన్స్‌ కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అటు కాపులు ఇటు కమ్మలు రోడ్డుపై ఇతర దేశాల్లో తన్నుకున్న కేసులూ ఉన్నాయి. ఇంతటి కుల పిచ్చి కలిగిన మనసులు, మనుషులను చక్కదిద్దాల్సిన పొజిషన్‌లో ఉన్న ఓ సీఎం ఆ పని చేయకపోగా ఓ కులానికి విపరీతమైన భజన చేయడమేంటి? తనను తాను రెడ్డిగా చెప్పుకునే రేవంత్‌ ఏనాడైనా రెడ్డి-కమ్మ పెత్తందారితనాన్ని నిలదీశారా? తెలుగు రాష్ట్రాల రాజకీయాలను దశాబ్దాలుగా ఈ రెండు కులాలే ఎందుకు శాసిస్తున్నట్టు? ఎస్సీ, ఎస్టీ కులాలవారిని రాజకీయాల్లో ఎందుకు ఎదగనివ్వడంలేదు? వీటన్నిటికి రేవంత్‌ భజనే సమాధానం.. ఆయనలో దాగి ఉన్న అగ్రకుల ప్రివిలేజే సమాధానం.. !

Also Read: మాయమైపోతున్న ఎర్ర మట్టి దిబ్బలు.. వీటి సంరక్షణ నీటి మీద రాతలేనా?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *