Menu

Speaker Elections: లోక్‌సభ స్పీకర్‌ కుర్చీకి పోటి.. దేశచరిత్రలో ఇలా జరగడం నాలుగోసారి!

Praja Dhwani Desk
speaker elections 2024

లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఎప్పుడూ ఏకగ్రీవమే.. మెజార్టీ సీట్లు గెలిచిన పార్టీ నుంచే స్పీకర్‌ ఉంటారు. వారే లోక్‌సభకు అధ్యక్షత వహిస్తారు. అయితే ఈసారి(2024) మాత్రం స్పీకర్‌ పోస్టుకు కూడా ఓటింగ్‌ జరగనుండడం ఆసక్తి రేపుతోంది. స్పీకర్‌ ఎన్నిక విషయంలో అధికార ఎన్డీఏ-ప్రతిపక్ష INDIA మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 2019-24 మధ్య స్పీకర్‌గా ఉన్న ఓం బిర్లాను మరోసారి స్పీకర్‌గా ఎన్డీఏ ప్రతిపాదించగా.. INDI కూటమి ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. అంతటితో ఆగలేదు. స్పీకర్‌ పదవికి ఓ అభ్యర్థిని కూడా నిలబెట్టింది. కేరళం-మావెలిక్కర నుంచి ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికైన కే.సురేశ్‌ను పోటీకి దింపాలని కాంగ్రెస్‌ నిర్ణయించడం సంచలనం రేపింది. ఇలా లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగడం స్వాతంత్ర్య భారతంలో ఇది నాలుగోసారి. గతంలో మూడుసార్లు స్పీకర్‌ పదవి కోసం పోటి జరిగింది.

తొలిసారి ఎప్పుడంటే…:
దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికల(1952) తర్వాత తొలిసారి పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. గుజరాత్‌కు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మాల్వంకర్‌ను స్పీకర్‌గా ఎన్నుకోవాలని ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిని అప్పటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సత్య నారాయణ్ సిన్హా, దర్భంగా సెంట్రల్ ఎంపీ దాస్, గుర్గావ్ ఎంపీ పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ బలపరిచారు. అయితే మాల్వంకర్‌కు పోటిగా కమ్యూనిస్ట్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టింది.

దేశంలో కమ్యూనిస్టు ఉద్యమ స్థాపకుడు, సభలోని 16 మంది సీపీఐ ఎంపిలలో ఒకరైన కన్ననూర్ ఎంపి గోపాలన్ శంకర్‌ మోర్‌కు అనుకూలంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఓటింగ్‌లో మాల్వంకర్ విజయం సాధించారు. మాల్వంకర్‌కు 394 ఓట్లు వచ్చాయి. 55 మంది ఎంపీలు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు.

ఇక్కడ విచిత్రం ఏంటంటే రేపు(జూన్ 25)న ఓం బిర్లాపై పోటికి దిగుతున్న సురేశ్‌ లాగానే శంకర్‌ మోర్‌ కూడా కేరళం-మావెలిక్కరకు ప్రాతినిధ్యం వహింస్తున్న ఎంపీనే! ఇక మరో విశేషం ఏంటంటే 1952లోనూ డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్ష నేతకు ఇవ్వాలన్న చర్చ జరిగింది. 2024లోనూ అదే జరుగుతోంది.

రెండోసారి ఎప్పుడంటే..:
1967లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో రెండోసారి స్పికర్ల కుర్చీ కోసం పోటి జరిగింది. ప్రొటెం స్పీకర్ గోవింద్ దాస్ రెండు తీర్మానాలు చేశారు. ఒకటి కాంగ్రెస్‌కు చెందిన నీలం సంజీవ రెడ్డికి అనుకూలంగా చేయగా.. మరొకటి స్వతంత్ర ఎంపీ తెన్నేటి విశ్వనాథంకు అనుకూలంగా చేశారు. విశ్వనాథానికి CPI (M) సహా ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చాయి. అయితే నీలం సంజీవ రెడ్డికే విజయం దక్కింది. ఆయనకు అనుకూలంగా 278 ఓట్లు వచ్చాయి. తెన్నేటి విశ్వనాథంకు 207 మంది సభ్యులు ఓటు వేశారు.

మూడోసారి ఎప్పుడుంటే:
1976లో కాంగ్రెస్ ఎంపీ భగత్‌ను స్పీకర్‌గా ఎన్నుకునే తీర్మానాన్ని నాటి PM ఇందిరా గాంధీ ప్రవేశపెట్టారు. అయితే జగన్నాథరావు జోషిని నిలబెడుతూ భావ్‌నగర్ ఎంపీ మెహతా (కాంగ్రెస్‌ ‘O’ పార్టీ) తీర్మానం ప్రవేశపెట్టారు. జనసంఘ్ సభ్యుడు జోషిని హాజీపూర్ ఎంపీ డీఎన్ సింగ్ బలపరిచారు. ఇక భగత్‌కు అనుకూలంగా 344, వ్యతిరేకంగా 58 ఓట్లు వచ్చాయి. దీంతో భగత్‌ ఎంపిక లాంభనమైంది.

Also Read: దేశచరిత్రలోఅతి పెద్ద హిపోక్రైట్‌.. ఒవైసీ ‘జై తెలంగాణ’ నినాదం అసలు కథ ఇదే!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *