Menu

Jagan-KCR: ఒకరిది దొరహంకారం.. ఇంకొకరిది అతి విశ్వాసం.. ఇవే ఈ ఇద్దరి పతనానికి కారణం..!

Tri Ten B
YCP lost 2024 elections

‘పవన్ కల్యాణ్‌లా నాలుగు పెళ్ళిళ్లు నేను చేసుకోలేను…’
‘ఒక్కొక్కరు మూడు పెళ్ళిళ్లు చేసుకోవాలా…?’
‘ఆయనలా మనం నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేము …’

ఈ మాటలు ఓ సీఎం పదవిలో ఉండే వ్యక్తి మాట్లాడాల్సినవి కావు. ఓ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పదవిలో ఐదేళ్లూ కొనసాగిన జగన్‌ ఎన్నోసార్లు పవన్‌ కల్యాణ్‌ను పర్శనల్‌గా అటాక్‌ చేశారు. పవన్‌ వ్యక్తిగత జీవితం గురించి జగన్‌కు అనవసరం. బహిరంగసభల్లో జనాలకు చేసిన, చేయబోయే మంచి గురించి మాట్లాడాలి కానీ ఎవరో పెళ్ళిళ్లు చేసుకుంటే పనిగట్టుకోని కామెంట్స్‌ చేయాల్సిన అవసరం లేదు. అటు 2019-24 మధ్య వైసీపీ మంత్రులు చేసిన పనుల కంటే మాటలు, బూతులే ఎక్కువగా జనాల్లోకి వెళ్లాయి. పవన్‌ను తిట్టడమే మంత్రులు పని అన్నట్టుగా జనాలకు కూడా ఓ అభిప్రాయం ఏర్పడింది. ఇది చివరకు పవన్‌కే మేలు చేసింది. వందమంది కలిసి గుంపులు గుంపులుగా అప్పటివరకు అసెంబ్లీలో కాలు పెట్టని.. సింగిల్‌ సీటు కూడా లేని పవన్‌పై వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజల్లో జనసేనాని పట్ల ఓ రకమైన జాలిని క్రియేట్ చేసింది. మంత్రులు అడ్డగొలుగా మాట్లాడితే వారిని దారిలో పెట్టాల్సిన పొజిషన్‌లో జగన్‌ వారి లాగే వ్యక్తిగత మాటల దాడులకు పోయారు. దీంతో అసలు జగన్‌ డైరెక్షన్‌లోనే మంత్రులు బూతులు మాట్లాడుతున్నారన్న ప్రచారం పెరిగి, పెద్దదై వైసీపీ కుప్పకూలడానికి కారణమైంది.

ఓ సారి తెలంగాణ విషయాన్ని చూద్దాం..

దురహంకార భాషకు పెట్టింది పేరు కేసీఆర్‌. బలుపు, అహంకారం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంటాయి. ప్రెస్‌మీట్లు పెడితే రిపోర్టర్లను తక్కువ చేస్తూ నోటికి వచ్చింది మాట్లాడడం ఆయన నైజం. 2018 తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌ పార్టీ గెలిచిన తర్వాత గులాబీ బాస్‌ నోటి దురద చాలా పెరిగింది. ఎవర్ని లెక్కచేయనితనం ఆయన మాటల్లో కనిపించేది. నన్ను ఎవరూ ఏమీ చేయలేరన్న దొరహంకారం, దురహాంకారం ఆయన చేష్టల్లో కళ్లకు కట్టేవి. చివరకు ఏం జరిగింది? లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు.

ఏం మాట్లాడాలో తెలియకపోతే ఇంతే:
మనిషి ఎంత మంచివాడైనా మాట సరిగ్గా లేకపోతే అతడిని సమాజం చెడ్డవాడిగానే చూస్తుంది. అటు కేసీఆర్‌ ఇటు జగన్‌ తమ పాలనలో కొన్ని మంచి పనులు కూడా చేశారు. పాఠశాల విద్య విషయంలో జగన్‌ తీసుకున్న నిర్ణయాలు బలహీనవర్గాల వారికి ఎంతో మేలు చేసేవిగా నిలిచిపోయాయి. ఇటు కేసీఆర్‌ పాలనలో రైతు బంధు లాంటి పథకాలు దేశవ్యాప్తంగా ఉన్నతమైన స్కీమ్స్‌లో ఒకటిగా నిలిచాయి. వీటి గురించి పూర్తి సమాచారం లబ్దిదారులకు తప్ప కొత్త ఓటర్లకు, న్యూట్రల్‌ ఓటర్లకు పెద్దగా తెలియదు. ఎందుకంటే కేసీఆర్‌ మాటలు, జగన్‌ వ్యక్తిగత మాటల దాడులు మాత్రమే ఎక్కువగా హైలేట్ అవుతూ వచ్చాయి. వీటిని ఆపేందుకు ఈ ఇద్దరు ఏం చేయకపోగా అదేదో గొప్ప ఘనకార్యం లాగా తమ పద్ధతులను కంటీన్యూ చేశారు. అటు చేసిన పనులు కంటే మాటలనే జనాలు ఎక్కువ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు.. ఈ విషయాన్ని గ్రహించలేకో ఏమో జగన్‌, కేసీఆర్‌ ఇద్దరూ తమ మాట తీరుతో ప్రజలకు దూరమయ్యారు. 2019లో జగన్‌ ఫేస్‌తోనే 151 సీట్లు సంపాదించిన వైసీపీ 2024లో అదే జగన్‌ ‘మాట’ కారణంగా 164 సీట్లు కూటమికి కట్టబెట్టింది. ఇటు కేసీఆర్‌ అహాంకారంతోనే బీఆర్‌ఎస్‌ మునుపెన్నడూ లేని విధంగా సున్నా లోక్‌సభ స్థానాలకు పరిమితమైంది.

ఈ రెండు ఉంటే ఎవరికైనా పతనమే:
విశ్వాసం, అతి విశ్వాసం రెండు వేరువేరు. ‘WHY NOT 175..’ డైలాగ్‌ అతివిశ్వాసం కిందకే వస్తుంది. జగన్‌ ఐదేళ్ల పాలనలో బటన్‌ నొక్కుడు తప్ప అసలు ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో వైసీపీ కోసం రక్తాలు చిందించే అరవీర భయంకర బులుగు భక్తులు కూడా చెప్పలేకపోతున్నారు. ఓ ప్రాంతం అభివృద్ధి చెందిందో లేదో తెలుసుకోవాలనుకుంటే రోడ్లు చూస్తే సరిపోతుంది. అలాంటి రోడ్లను కూడా జగన్‌ గాలికి వదిలేశారు. ఓ వైపు టీడీపీ, జనసేన కార్యకర్తలు సోషల్‌మీడియాలో ఏపీ రోడ్లపై విపరీతమైన ట్రోలింగ్‌ చేస్తున్న సమయంలోనూ కనీసం మాట వరుసకు కూడా జగన్‌ రోడ్ల గురించి మాట్లాడిన పాపాన పోలేదు. ‘వాళ్లు చెబితే నేను చేయ్యాలా’ అన్న అహాంకారం కావొచ్చు.. లేదా ప్రతీ ఒక్కరి ఇంటికి ఏదో ఒక రూపంలో డబ్బు వెళ్తుంది కదా.. ఇవన్ని ఎందుకులే మనమే గెలుస్తామనే అతివిశ్వాసం కావొచ్చు..! చివరకు ఏమైంది ? 11 సీట్లతో వైసీపీ దుకాణం సర్దుకోవాల్సి వచ్చింది. ఈ 11 సీట్లు సాధించడానికి WHY NOT 175 అంటూ అతి విశ్వాసానికి పోయారు జగన్‌. ఇలా అహంకారం, అతి విశ్వాసం ఎంత చేటు చేస్తాయో, ఎంతటి బలవంతులనైనా బలహీనపరుస్తాయో జగన్‌, కేసీఆర్‌ ఇద్దరూ నిరూపించారు.

Also Read: జర్నలిస్టు విలువలను మంటగలుపుతున్న ‘అతి’వాద యాంకరింగ్‌!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *