Menu

Prajagalam: ఇది ప్రజాగళం కాదు.. భజనగళం.. సన్మాన సభో బహిరంగ సభో అర్థంకాలేదు!

Praja Dhwani Desk
prajagalam chilakaluri peta

BJP-TDP-JANASENA Meeting: ప్రజాగళం అంటే ప్రజలకు ఏం చేస్తారో.. ప్రజాగళాన్నే తమ గళంగా మార్చి ఎలా ప్రసంగిస్తారో అని టీవీ పెడితే అక్కడ జరిగింది వేరు. బీజేపీ-జనసేన-టీడీపీ అధికారిక పొత్తు తర్వాత జరిగిన తొలి బహిరంగ సభ ఇది. చిలకలూరిపేటకు ప్రధాని మోదీ హెలికాఫ్టర్‌లో వచ్చారు. పదేళ్ల తర్వాత మోదీ-పవన్‌-చంద్రబాబు ఒకే వేదికపై కనిపించారు. నాడు తిరుపతి వెంకన్న సాక్షిగా ఓట్లు అడిగితే ఈసారి విజయవాడ దుర్గమ్మను ప్రసంగంలో ఇరికించి మరీ గెలిపించమని అడిగారు. ఏదో ఒక దేవుడులే.. అందరి దేవుళ్లు ఒకటేలే అని సర్థి చెప్పుకుందామనుకుంటే అక్కడ జరిగింది వేరు. పవన్‌, చంద్రబాబు స్పీచులు వింటే అసలు దేవుడు వెంకన్న, దుర్గమ్మ కాదు మన మోదీగారేనని అర్థమైంది. భజన ఏ విధంగా సాగిందంటే మోదీని చంద్రబాబు ‘మోదీజీ గారు’ అని పిలిచేంతలా. ఎంతైనా చంద్రబాబు చంద్రబాబే.. ఆయనో క్లాసిక్‌ చమెలియన్‌. అంటే సూటు బూటు వేసుకునే ఊసరవెల్లి అన్నమాట!

ముగ్గురు మహానటుల సభ:
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరన్నది అందరూ చెప్పే మాట. ఇది నిజమే కావొచ్చు. ఎస్పీ-బీఎస్పీ ఒకటైనప్పుడు.. కాంగ్రెస్‌-టీడీపీ కలిసి పని చేసినప్పుడు మోదీ-చంద్రబాబు మళ్లీ ఒకటిగా అడుగులు వెయ్యడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు కూడానూ! ఎందుకంటే రోజులెప్పుడు ఒకేలా ఉండవు.. పరిస్థితులు నిత్యం మారుతుంటాయి..దానికి తగ్గట్టుగానే రాజకీయ పార్టీల స్ట్రాటజీ కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ఇక్కడ నైతిక, అనైతికలకు చోటు లేదు. అయితే ‘అతి’ అనర్థాలకు మూలం. ఈ అతే గతంలో చంద్రబాబు కొంపముంచింది. 2019లో మోదీని అనకూడని మాటలు అనేసిన చంద్రబాబు ఈసారి ప్రధానిని పొగడ్తలతో ముంచేశారు. మోదీ వ్యక్తి కాదు శక్తి అంటూ 2014 క్యాసెట్‌ను విడుదల చేశారు. చంద్రబాబు మాటలు మార్చడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు కానీ మోదీ నుంచి తిరిగి అదే స్థాయిలో పొగడ్తలు, ప్రశంసలు లేవు. ఆయన ఎప్పటిలాగే హూందాగా నటించారు. ఎంతైనా ఆస్కార్‌ రేంజ్‌ నటన ఆయనది!

వైసీపీ-బీజేపీ ఒకటేనా?
ఇంతకీ ప్రజాగళం సభ ద్వారా ఈ త్రిమూర్తులు ఏం చెప్పాలనుకున్నారు? పవన్‌ సినిమా డైలాగులు ఈ సారి పెద్దగా పేలలేదు. ఎందుకంటే ఆయన మోదీని పొగుడుతుంటే జనాలకు పాచిపోయిన లడ్డూలే గుర్తొచ్చాయి. ఎందుకంటే ఆ డైలాగ్‌ ఇప్పటికీ, ఎప్పటికీ ఫేమస్‌. అటు చంద్రబాబు స్పీచ్‌ గురించి ఏం చెప్పాలో తెలియని పరిస్తితి. బండ్లగణేశ్‌ గుర్తొచ్చాడు. అటు మోదీ డబుల్‌ ఇంజిన్‌ అంటూ ప్రతీరాష్ట్రాంలో పాడిన పాటే పాడారు. ఇదంతా చూస్తుంటే బీజేపీ వెనుక నుంచి వైసీపీకి సపోర్ట్‌గా టీడీపీని వెన్నుపోటు పొడిచే విధంగా ప్లాన్‌ చేసినట్టుగా అర్థమవుతోంది. అందుకే మోదీ జగన్‌ జోలికి పోలేదు.. అటు వైసీపీ కూడా పవన్‌, చంద్రబాబుపైనే పడ్డాయి. ఎందుకో బీజేపీ-వైసీపీ ఎప్పటికీ ఒకటే అనిపించేలా ఏపీ రాజకీయం సాగుతోంది. ఐదేళ్ల జగన్‌ పాలనలో ప్రభుత్వ సంస్థలు నీరుగారిపోయాయి. జేబుల్లోకి స్కీమ్‌ల ద్వారా డబ్బులు వచ్చి పడ్డాయి కానీ అభివృద్ధి మాత్రం అర్యభట్ట నంబర్‌కు అంకితమైంది. అందుకే ప్రజలు కూడా ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ అవకావాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన చంద్రబాబు పోయి పోయి బీజేపీకి 10 ఎమ్మెల్యే సీట్లు అంటగట్టారు. ఎంతైనా జగన్‌కు ఉన్నట్టే చంద్రబాబుకు కూడా కేసుల భయం పట్టుకుంది కాబోలు.. అందుకే ఈ మితిమీరిన భజన!

Also Read: ఎలక్టోరల్‌ బాండ్ల ఊసే లేదు.. బీజేపీ కోసం మీడియా మౌన వ్రతం!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *