Menu

Shivaji Jayanti: చరిత్ర వక్రీకరణ.. శివాజీని చూసి నేటి పాలకులు నేర్చుకోవాల్సిందిదే!

Tri Ten B
Was Shivaji anti-Muslim?

History O\f Shivaji Maharaj: భూభాగాల కోసం యుద్ధాలు జరిగేవి. ఒక రాజుపై ఇంకో రాజుపై దండెత్తెవాడు. తలలు తెగిపడేవి.. నదులు ఎర్రగా మారేవి.. ఊర్లకు ఊర్లు మరుభూమిని తలపించేవి. ఏ దేశ చరిత్ర చూసినా ఇదే కనిపిస్తుంది. నిజానికి కొన్ని ప్రాంతాలను దేశాలగా విభజించి, గుర్తించి ప్రజాస్వామ్యబద్దంగా పాలించుకోవడం అన్నది కొత్త చరిత్ర. వేల ఏళ్ల నాటి చరిత్రలో దేశాలు ఉండేవి కావు.. రాజ్యాలు ఉండేవి.. మరో రాజ్యంపై విరుచుకుపడే రాజులుండేవారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఇండియాలోనూ పేరుగాంచిన రాజులున్నారు. ప్రజల సేవ కోసం రాజ్యాధికారం దక్కించుకున్న పాలకులున్నారు. అలాంటివారిలో మరాఠ రాజు ఛత్రపతి శివాజీ ముందు వరుసలో ఉంటాడు. అయితే ఆయన పేరును కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. చరిత్రను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి అధికారంలోకి వస్తున్నారు.

ఇది శివాజీనీ అవమానించడమే:
ఫిబ్రవరి 19,1630లో శివాజీ పుట్టాడు. ఆయన జయంతిని ప్రతిఏడాది ఘనంగా చేసుకునే రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు మెచ్చిన రాజు శివాజీ. ఆయన జయంతిని ఇతర రాష్ట్ర ప్రజలు చేసుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు. అయితే ఆయన జయంతి సందర్భంగా మసీద్‌ల వద్దకు వెళ్లి.. అక్కడ ర్యాలీని కాసేపు ఆపి.. పెద్ద ఎత్తున నినాదాలు చేయడమేంటో అర్థంకావడం లేదు. ఇది ఎక్కడో జరిగింది కాదు.. తెలంగాణలోని పటాన్‌చేరు ప్రాంతంలోనే జరిగింది. అటు విజయవాడలో వీహెచ్‌పీ కార్యకర్తలు బీఆర్‌టీఎస్‌ రోడ్డులో నానా హంగామా చేశారు. ఎక్కడ చూసినా శివాజీని హిందూల కోసం పుట్టిన రాజుగా అభివర్ణిస్తున్నారు. శివాజీ ముస్లీంల వ్యతిరేకిగా చిత్రకరించడం ఏనాడో జరిగిపోయింది. ఇది ముమ్మాటికి శివాజీని అవమానించడమే.

సైన్యంలో మూడోవంతు ముస్లింలే:
తన పాలనలో అన్ని మతాలను సమానంగా చూసిన అరుదైన రాజుల్లో శివాజీ ఒకరు.ఆయన దళంలో 60వేల మంది ముస్లింలు ఉండేవారు. తన ముస్లిం సైనికులపై అచంచల విశ్వాసం ఉండేది. ఆయన నౌకాదళం ముస్లింల చేతుల్లో ఉండేది. రుస్తుమోజ్‌మన్, హుస్సేన్ ఖాన్, ఖాసిం ఖాన్ లాంటి అనేక మంది ముస్లిం యుద్ధ యోధులు బీజాపూర్ సంస్థానాన్ని విడిచిపెట్టి 700 మంది పఠాన్ సైనికులతో పాటు శివాజీ సైన్యంలో చేరారు. శివాజీ బాడీగార్డుల్లో సిద్ధి ఇబ్రహీం ఒకరు. అఫ్జల్ ఖాన్‌తో జరిగిన యుద్ధంలో సిద్ధి ఇబ్రహీం తన ప్రాణాలను పణంగా పెట్టి శివాజీను కాపాడాడు.శివాజీకి ఆయన ముస్లిం సహచరులకు మధ్య ఉన్న సన్నిహిత బంధానికి ఈ వాస్తవాలన్నీ నిదర్శనం.

సర్వమతాలను గౌరవించిన అరుదైన రాజు:
శివాజీ కుటుంబం సూఫీ సాధువులను ఎంతగానో గౌరవించింది. ఆయన తాత తన ఇద్దరు కుమారులకు ముస్లిం పీర్ బాబా షా షరీఫ్ పేరు మీద షాజీ, షరీఫ్ జీ అని పేర్లు పెట్టారు. శివాజీకు సూఫీ సాధువు బాబా యాకుత్ అంటే ఎంతో గౌరవం ఉండేది. యుద్ధానికి బయలుదేరే ముందు బాబాను దర్శించి ఆశీస్సులు తీసుకునేవాడు.

చరిత్ర వక్రీకరణ:
సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం ఆధారంగా స్వరాజ్యాన్ని స్థాపించిన వారిలో శివాజీ ఒకరు. తన పాలనలో ఎలాంటి వివక్ష లేకుండా ప్రజాసంక్షేమం కోసం పనిచేశాడాయన. ఇంతటి ఘన చరిత్ర కలిగిన శివాజీను రాజకీయ పార్టీలు, కొన్ని మత సంస్థలు ఆయన్ను హిందూ పాలకునిగా చిత్రీకరించింది. శివాజీ, అఫ్జల్ ఖాన్‌ల మధ్య వైరాన్ని హిందూ-ముస్లిం యుద్ధాల గొడవగా చూపిస్తున్నారు. అఫ్జల్ ఖాన్ మరణించిన తర్వాత శివాజీ ఆయన మృతదేహాన్ని ఇస్లామిక్ ఆచారాలతో ఖననం చేయాలని ఆదేశించాడు. అఫ్జల్ ఖాన్ కోసం కాంక్రీట్ సమాధిని నిర్మించారు. అతని కుమారులకు క్షమాభిక్ష ప్రసాదించాడు. ఒక పాలకుడు తన శత్రువును ఇంతలా గౌరవించడం చరిత్రలో అరుదుగా కనిపిస్తుంది. శివాజీకు, మొఘలులకు మధ్య జరిగిన యుద్ధం రాజకీయ ప్రయోజనాల కోసమే. అది రాజుల మధ్య పరస్పర సంఘర్షణలో భాగమే తప్ప మతాధిపత్యం కోసం కాదు. ఈ ఘటనలన్నీ ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అయినా బతికున్న కాలంలో శివాజీని శుద్రుడిగా లెక్కగట్టి.. ఇప్పుడు హిందువుల రాజుగా కీర్తించడమేంటో అంతుపట్టడంలేదు.

సమానత్వానికి పెద్దపీట వేసిన శివాజీ నుంచి మన పాలకులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అందులో ప్రధానమైనది వర్గాల మధ్య చిచ్చుపెట్టకుండా పని చేయడం. అలా చేయడమే శివాజీకి నేటి రాజులు ఇచ్చే ఘనమైన నివాళి.

Also Read: వివాహాలు కావు.. వ్యాపారాలు..! ఇక్కడ అమ్మకానికి పెళ్లికొడుకులు!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *