Menu

ముచ్చటగా మూడో సమరం! పైచేయి కోసం ఇరు జట్ల ప్రయత్నాలు.

Sumanth Thummala

  • రాజ్ కోట్ వేదికగా మరొక రసవత్తరమైన ఆట మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఇండియా vs ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో చరో మ్యాచ్ గెలిచి మూడో టెస్ట్ కోసం ఆసక్తికరంగా ఇరు జట్లు ఎదురుచూస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్లో విజయం సాధించిన ఇంగ్లాండ్, వైజాగ్ లో జరిగిన మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించి సిరీస్ ను ఆసక్తికరంగా మార్చారు.

వేధిస్తున్న గాయాలు! దూరమైన ఆటగాళ్ళు;

సిరీస్ ప్రారంభం అవ్వకుండానే గాయం కారణంగా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ, వ్యక్తిగత కారణాలతో “కింగ్ “విరాట్ కోహ్లీ దూరమవ్వడంతో పెద్ద దెబ్బ పడింది. తాజాగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లైన శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ గాయాలతో దూరమయ్యారు. మొదటి టెస్ట్ తర్వాత గాయంతో రెండో టెస్ట్ ఆడలేకపోయిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకుని తన సొంత మైదానంలో జరిగే మ్యాచ్ కి అందుబాటులోకి రానున్నాడు.

యువ ఆటగాళ్ల సత్తాకు మొదటి పరీక్ష! 

శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ గాయాలతో దూరమవడంతో వారి స్థానాలలో దేశవాళి సంచలనం సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అరంగ్రేటం చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

సర్ఫ’రాజ్’

గత మూడేళ్లుగా రంజీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన సర్ఫరాజ్ ఖాన్ మొత్తానికి తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు. 12 ఏళ్ళ వయసులోనే ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసి దిగ్గజ సచిన్ టెండుల్కర్ రికార్డ్ ని తుడిచేసి ప్రపంచానికి తన ఉనికి తెలియజేశాడు. ఇక అడపాదడపా ఐపిఎల్ ప్రదర్శనలు, అండర్ 19 ప్రదర్శనలు ఇచ్చినా, 2019-20 రంజీ సీజన్ నుండి తన ప్రతాపం చూపించడం మొదలు పెట్టాడు.

ఆ సీజన్లో 928 పరుగులు చేసాడు. మరుసటి సీజన్లో 937 పరుగులు చేసి తద్వారా రంజీలో వరుస సీజన్లలో 900 పైచిలుకు పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. కనీసం 2000 పరుగులు చేసిన బ్యాటర్లలో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ తర్వాత అత్యధిక సగటు కలిగిన వాడిగా రికార్డు నమోదు చేశాడు. 2022-23 సీజన్లో 982 పరుగులు చేసి ఆకాశమే హద్దుగా చెలరేగడు. ఈ ఓవరాల్ గా 45 మ్యాచ్లలో 69.85 సగటుతో 3912 పరుగులు చేసి రికార్డులను తిరగ రాశాడు.

మురిపించని తెలుగోడు. 

అరంగ్రేట బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో, ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా విఫలమవుతున్న ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ స్థానంలో ఉత్తర ప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అరంగ్రేటం చేసే అవకాశం ఉంది. ఇచ్చిన అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకొని భరత్ ను పక్కన పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జురెల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో, 15 మ్యాచ్లలో 46.47 సగటుతో 790 పరుగులు చేశాడు.

 

ఇక తన 500వ వికెట్ సాధించి దిగ్గజాల సరసన నిలవాలని తాపత్రయపడుతున్న సీనియర్ రవిచంద్రన్ అశ్విన్, ఇక సొంత గడ్డపై ఆడుతున్న జడేజా తోపాటు అక్సర్ లేదా కుల్దీప్ లో ఎవరో ఒకరిని స్పిన్నర్ల జాబితాలో ఆడించే అవకాశం ఉంది.‌బుమ్రా,సిరాజ్ పేసర్లుగా ఉండనున్నారు.

 

ఓడినా ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతున్న ఇంగ్లీష్!

 

రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓడినప్పటికీ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతుంది. మొదటి మ్యాచ్ ఎలాగైతే విజయం సాధించారు అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని చూస్తుంది.

మూడో టెస్ట్ కోసం జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్ కేవలం ఒకే ఒక్క మార్పుతో బరిలో దిగుతుంది. ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో పేస్ బౌలర్ మార్క్ వుడ్ తిరిగి జట్టులోకి వచ్చాడు.

ఇక ఈ మ్యాచ్ తో ఇంగ్లాండ్ కెప్టెన్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 100వ టెస్ట్ ఆడబోతున్నాడు. 100వ టెస్ట్ ఆడటం సంతోషమే అయినా 100 అనేది కేవలం ఒక సంఖ్య అని, ప్రతీ టెస్ట్ ముఖ్యమైనదే అని వ్యాఖ్యానించాడు .

తను 2013-14 ఆషెస్ లో అరంగేట్రం చేసాడు. ఇంగ్లాండ్ జట్టుకు విలువైన ఆల్ రౌండర్ గా టెస్టుల్లో చిరస్మరణీయ విజయాలు అందించాడు స్టోక్స్.

ప్రస్తుత డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ లో ఇండియా 3వ స్థానంలో ఇంగ్లాండ్ 8వ స్థానంలో ఉన్నాయి.

ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్) జాక్ క్రాలీ, బెన్ డకెట్,ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్ (wk), రీహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.

ఇండియా జట్టు ( అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్ శుభమాన్ గిల్, రజత్ పటిదార్ , సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జోరెల్/ కే.ఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్/ కుల్దీప్,బుమ్రా, మహ్మద్ సిరాజ్.


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *