Menu

IND vs ENG: బాజ్ బాల్ వర్సెస్ స్పిన్‌ బాల్‌ పోటీలో బాస్‌ ఎవరు? తుది జట్టు ఇవే!


భారత జట్టు బలంగా కనిపిస్తుంది. కానీ ఇంగ్లాండ్ లాంటి జట్టును ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు.


Sumanth Thummala

INDIA VS ENGLAND PLAYING 11: టీమిండియాకు మరొక కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు మరి కొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. దశాబ్ద కాలంలో స్వదేశంలో సిరీస్ ఓటమే ఎరుగని టీమిండియా ఓ వైపు.. దుందుడుకు విధానంతో ఈసారైనా సిరీస్ కొల్లగొట్టాలని చూస్తున్న ఇంగ్లాండ్ జట్టు మరోవైపు. జనవరి 25న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది.


బాజ్ బాల్ వర్సెస్ భారత బౌలర్లు:
ఇంగ్లాండ్ కోచ్ గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ వచ్చాక టెస్టుల్లో బ్యాటింగ్ చేసే శైలినిఇంగ్లాండ్ బ్యాటర్లు పూర్తిగా మార్చుకున్నారు. బాజ్ బాల్ అని దూకుడు విధానంతో బ్యాటింగ్ చేస్తూ దూసుకెళ్తున్నారు. 2022లో పాకిస్థాన్ తో టెస్టులో ఒకే రోజు 506/4 పరుగులు చేసి తమ సత్తా చూపించారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ గత ఏడాది 40 పైగా సగటు తో 600 పైచిలుకు పరుగులు చేశారు. ఇక ఇంగ్లీష్ వెన్నుముక ఫాబ్ ఫోర్ బ్యాటర్లలో ఒకడైన జో రూట్ పైనే అందరి కళ్ళు ఉన్నాయి. తన టెస్ట్ అరంగ్రేటం భారత్‌లోనే జరిగింది. ప్రస్తుత బ్యాటర్లలో ఎంతో గొప్ప టెక్నిక్ ఉన్న బ్యాటర్‌గా, స్పిన్, పేస్ రెండు బాగా అడగల సమర్థుడు అతను. భారత బౌలర్లను ఎదుర్కొని ఇంగ్లాండ్ సిరీస్ గెలవాలంటే జోరూట్ పాత్ర చాలా కీలకం. ఇక హారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్ కు దూరం అయ్యాడు.జానీ బెయిర్‌స్టో, కెప్టెన్ బెన్ స్టోక్స్ , ఓల్లీ పోప్ తో బ్యాటింగ్ లైనప్ ఉంది. వికెట్ కీపర్ గా బెన్ ఫోక్స్ ఆడనున్నాడు . జాక్ లీచ్ ప్రధాన స్పిన్నర్ గా ఆడుతుండగా, రీహాన్ అహ్మద్ రెండో స్పిన్నర్ గా, ఇక మరో స్పిన్నర్ టామ్ హార్ట్లీ టెస్టుల్లో మొదటి గేమ్ ఆడబోతున్నాడు. ఏకైక పేసర్ గా మార్క్ వుడ్ ఆడనున్నాడు.


మన బౌలర్లదే పైచేయి:
ఇటు భారత బౌలర్లు అందరూ కూడా మంచి ఫామ్ లో ఉండడం కలిసొచ్చే అంశం. గత పదేళ్ళలో స్వదేశంలో జరిగిన అన్ని టెస్టుల్లో పర్యాటక జట్టు కంటే కూడా భారత స్పిన్నర్లు
,పేసర్లు ఎక్కువ వికెట్లు తీసుకున్నారు. గత పది ఏళ్లలో సాధారణంగా స్పిన్ కు అనుకూలించే స్వదేశీ పిచ్ లలో పర్యాటక స్పిన్నర్లు 41 సగటుతో 347 వికెట్లు తీసుకోగా మన స్పిన్నర్లు 21 సగటుతో 594 వికెట్లు తీసుకున్నారు. ఇక పర్యాటక పేసర్లు 42 సగటుతో 224 వికెట్లు తీసుకోగా మన పేసర్లు 25 సగటుతో 258 వికెట్లు తీసుకున్నారు. దీన్నిబట్టి మన బౌలర్లు ఎంత బలంగా ఉన్నారో అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ప్రధాన స్పిన్నర్ అయిన అశ్విన్, జడేజా, అక్సర్ పటేల్ త్రయం ఇంగ్లాండ్ బాజ్‌ బాల్ విధానాన్ని తునకలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల జరిగిన బీసీసీఐ అవార్డుల్లో కూడా అశ్విన్ బాజ్ బాల్ విధానాన్ని ఎదుర్కోవడానికి ఎదురుచూస్తున్నానని చెప్పాడు. ఇక భారత పేస్ దళపతి జస్ప్రీత్ బుమ్రా, సొంత మైదానంలో మొదటి టెస్ట్ ఆడుతున్న మహ్మద్ సిరాజ్ తో బౌలింగ్ దుర్భేద్యంగా ఉంది.


విరాట్ గైర్హాజరు:
టీమిండియా ప్రధాన బ్యాటర్ విరాట్ కోహ్లీ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లకు వ్యక్తిగత కారణాలతో దూరమవడం అభిమానులకు ఒకింత నిరాశకు గురిచేస్తోంది. మొదటి రెండు టెస్టులు తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్, వైజాగ్ లో జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్ లలో తను ఆడట్లేదు. తన స్థానంలో రజత్ పటిదార్ ను ఎంపిక చేశారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ రెండో ఓపెనర్ గా ఆడనున్నాడు. మూడో స్థానంలో శుభమన్ గిల్ ఆడుతుండగా, 4,5 స్థానాలలో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఆడనున్నారు. వికెట్ కీపర్ గా కేఎస్ భరత్ ఉన్నాడు. లోయర్ ఆర్డర్ లో జడేజా, అశ్విన్,అక్సర్ తో లోతైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇంగ్లాండ్ తమ‌ జట్టును ప్రకటించింది.


ఇంగ్లాండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్,ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (wk), రీహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్.

ఇండియా జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్ శుభమాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్,జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

మొత్తంగా చూస్తే భారత జట్టు బలంగా కనిపిస్తుంది. కానీ ఇంగ్లాండ్ లాంటి జట్టును ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు. అభిమానులకు అయితే ఒక మంచి టెస్టు సిరీస్ అవుతుందని ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు.

 


Written By

1 Comment

1 Comment

  1. Bhargav says:

    Wow very detailed explanation 👏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *